
న్యూఢిల్లీ: తమిళనాడు మంత్రి పదవికి రాజీనామా చేయకపోతే బెయిల్ రద్దు చేస్తామని డీఎంకే నేత వి.సెంథిల్ బాలాజీని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పదవి కావాలో? స్వేచ్ఛ కావాలో? తేల్చుకోవాలని సూచించింది. ఉద్యోగాల కోసం నగదు కుంభకోణానికి సంబంధించిన కేసులో బాలాజీకి సెప్టెంబర్ 26న బెయిల్ మంజూరు చేశారు.
అయితే.. బెయిల్ మంజూరైన కొద్ది రోజులకే బాలాజీని తిరిగి తమిళనాడు మంత్రిగా నియమించారు. బాలాజీ విడుదలైన తర్వాత మంత్రి అయినందున, ఈ కేసులోని సాక్షులను బెదిరిస్తున్నారని, కోర్టు ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం చేపట్టింది. బెయిల్ మంజూరు చేయడం అంటే సాక్షులను ప్రభావితం చేసే అధికారం ఇచ్చినట్లు కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘మీరు సాక్షులను ప్రభావితం చేస్తారని తీవ్ర భయాందోళనలు ఉన్నాయి. పదవి (మంత్రి), స్వేచ్ఛ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో మాకు చెప్పండి’అని పేర్కొంది. మనీలాండరింగ్ కేసుల్లో కోర్టు రూపొందించిన ఉదార బెయిల్ చట్టాన్ని రాజకీయ నాయకులు దురి్వనియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కొంత సమయం కావాలంటూ బాలాజీ తరపు న్యాయవాది కపిల్ సిబల్ చేసిన అభ్యర్థనను అంగీకరించిన అత్యున్నత న్యాయస్థానం విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది.