జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయ ప్రతిష్టంభన ముదురుపాకాన పడింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోసం కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రయత్నం కాస్తా బెడిసికొట్టి సంక్షోభంగా మారింది. పార్టీ అధ్యక్ష ఎన్నిక వేళ తలనొప్పులను మరింతగా పెంచుతోంది. అధ్యక్ష బరిలో దింపాలని భావించిన సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ రాజస్తాన్ సీఎం పీఠం వదులుకోవడానికి సుముఖంగా లేకపోవడంతో పార్టీ పెద్దలకు ఎటూ పాలుపోవడం లేదు. సీఎంగా కొనసాగుతూనే అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని గెహ్లాట్ భీష్మించుకున్నారు.
ఒకరికి ఒకే పదవి నిబంధన ఈ విషయంలో వర్తించదని ఆయన వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితాలు వచ్చేదాకా గెహ్లాట్‌నే సీఎంగా కొనసాగించాలన్న డిమాండ్‌పై వెనక్కు తగ్గేందుకు ఆయన వర్గం ఎమ్మెల్యేలు కూడా ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో వారంతా అధిష్టానాన్నే ధిక్కరించేలా వ్యవహరించి గట్టి షాకిచ్చారు! గెహ్లాట్ స్థానంలో ఆయన రాజకీయ ప్రత్యర్థి సచిన్ పైలట్‌ను సీఎం చేయాలన్న అధిష్టానం యోచనను వ్యతిరేకిస్తూ 108 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏకంగా 82 మంది ఆదివారం స్పీకర్‌కు రాజీనామా సమర్పించడం తెలిసిందే.
పరిస్థితిని చక్కదిద్దేందుకు మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్‌లను ఆదివారం రాత్రి హుటాహుటిన రాజస్తాన్‌కు పరిశీలకులగా పంపిన అధిష్టానానికి మింగుడు పడని రీతిలో మరిన్ని షాకులు తగిలాయి. ఎమ్మెల్యేలు కనీవినీ ఎరగని స్థాయిలో ధిక్కార స్వరం విన్పించారు. దీనిపై బీజేపీ కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరింది. పార్టీ నుంచి నేతల నిష్క్రమణ, వరుసగా ఓటములు తదితరాలతో ఇప్పటికే కుదేలైన కాంగ్రెస్ అధిష్టానం ఈ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ పరిణామాలతో గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలోకి దిగడం అనుమానంగా మారింది. అధిష్టానానికి విశ్వాసపాత్రులైన మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్‌సింగ్, కమల్‌నాథ్, సుశీల్‌కుమార్ షిండే, ముకుల్ వాస్నిక్, కుమారి సెల్జా పేర్లు విన్పిస్తున్నాయి. తాను పోటీ చేయబోనని దిగ్విజయ్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. కమల్‌నాథ్ కూడా సోమవారం అదే మాట చెప్పారు.
పరిశీలకులకు గెహ్లాట్ వర్గం షాకులు
సీఎం గెహ్లాట్ నివాసంలో ఖర్గే, మాకెన్ ఆదివారం రాత్రి అత్యవసరంగా సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. కానీ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలంతా దాన్ని బహిష్కరించడంతో వారు దిమ్మెరపోయారు! చాలాసేపు ఎదురు చూసినా ఎమ్మెల్యేలు రాకపోవడంతో భేటీని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. చివరికి ఒక్కొక్కరిగా వచ్చి తమతో సమావేశం కావాల్సిందిగా ఆదేశించినా ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. పైగా అదే సమయంలో వారంతా కలిసి ఓ మంత్రి ఇంట్లో విడిగా సమావేశమయ్యారు!
‘‘గెహ్లాట్‌ను తప్పిస్తే ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో పడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా చిక్కుల్లో పడుతుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీని తాలూకు వీడియో కూడా మీడియాకు లీకైంది! అనంతరం నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉందంటూ ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాలకు వెళ్లిపోయారు! అనంతరం ఎమ్మెల్యేల తరఫున మంత్రులు శాంతి ధరీవాల్, మహేశ్ జోషి, ప్రతాప్‌సింగ్ పరిశీలకులతో భేటీ అయ్యారు. ‘‘సీఎం ఎవరనే దానిపై అక్టోబర్ 19 తర్వాత కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడే నిర్ణయం తీసుకోవాలి.
రెండేళ్ల క్రితం పైలట్ తిరుగుబాటు సమయంలో ప్రభుత్వానికి విధేయులుగా నిలిచిన ఎమ్మెల్యేల నుంచే సీఎంను ఎన్నుకోవాలి. ఒక్కో ఎమ్మెల్యేలతో విడిగా కాకుండా అందరితో కలిసే మీరు భేటీ అవాలి’’ అంటూ షరతుల చిట్టాను వారి ముందుంచారు. ముందుగా ఎమ్మెల్యేల అనుమానాలను అధిష్టానం నివృత్తి చేయాలని చీఫ్ విప్ మహేశ్ జోషి కూడా డిమాండ్ చేశారు. ఎవరిని సీఎం చేసినా అభ్యంతరం లేదంటూనే, అది తమకు అంగీకారయోగ్యంగా ఉండాల్సిందేనంటూ కుండబద్దలు కొట్టారు. దాంతో విస్తుపోవడం ఖర్గే, మాకెన్ వంతయింది.
ఈ వరుస భంగపాట్ల నేపథ్యంలో వారిద్దరూ సోమవారం ఉదయమే హస్తినకు తిరుగుముఖం పట్టారు. అధినేత్రి సోనియాగాంధీ నివాసానికి వెళ్లి జరిగిందంతా వివరించారు. దాంతో ఆగ్రహించిన సోనియా మొత్తం ఉదంతంపై లిఖితపూర్వక మంగళవారానికల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గెహ్లాట్‌తో సన్నిహిత సంబంధాలున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌ను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించారు. ఆయన సోనియాతో గంటపాటు భేటీ అయ్యారు. గెహ్లాట్‌ను రాజీకి రప్పించేందుకు కమల్‌నాథ్‌ను నియోగించవచ్చంటున్నారు.
తీర్మానంలో షరతులా: మాకెన్
గెహ్లాట్ వారసున్ని నిర్ణయించే అధికారాన్ని పార్టీ చీఫ్‌కు కట్టబెడుతూ సీఎల్పీ భేటీలో ఏకవాక్య తీర్మానం ఆమోదింపజేయాలని ఖర్గే, మాకెన్ తలపోయగా, అధ్యక్షునిగా ఎన్నికయ్యేదాకా గెహ్లాట్ సీఎంగా కొనసాగుతారంటూ అందులో చేర్చాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఇది క్రమశిక్షణ రాహిత్యమేనంటూ మాకెన్ మండిపడ్డారు. సోనియాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘తీర్మానమంటే కేవలం ఏకవాక్యంతో ఉంటుంది. అంతే తప్ప షరతులతో కూడిన తీర్మానాలు కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేవు. సీఎల్పీ భేటీకి డుమ్మా కొట్టి విడిగా సమావేశం కావడం క్షమించరాని విషయం’’ అంటూ ఆగ్రహించారు. ‘‘సీఎంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సింది గెహ్లాటే. తర్వాత అధ్యక్ష పదవికి పోటీ పడేదీ ఆయనే. గెలిస్తే తను సీఎంగా కొనసాగాలో లేదో నిర్ణయించేదీ ఆయనే. ఇది కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవదా?’’ అంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment