జైపూర్: కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. రాజస్థాన్ ఇన్‌ఛార్జ్ అజయ్ మాకెన్ తన పదవికి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించడానికి సరిగ్గా రెండు వారాల ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అజయ్ మాకెన్ రాజీనామాతో పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడినట్లయింది.
అయితే మాకెన్ రాజీనామాకు బలమైన కారణమే ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు. సెప్టెంబర్లో సీఎం అశోక్ గహ్లోత్ వర్గానికి చెందిన నేతలు కొందరు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న గహ్లోత్‌ను సీఎం పదవి నుంచి తప్పిస్తే అంగీకరించే ప్రసక్తే లేదని వారు తిరుగుబావుటా ఎగురవేశారు. దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని స్పీకర్ దగ్గరకు వెళ్లడం అప్పట్లో కలకలం రేపింది. వీరి కారణంగానే అశోక్ గహ్లోత్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష బరి నుంచి తప్పుకున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలు చేసిన పనికి క్షమాపణలు కూడా చెప్పారు.
అయితే రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు వ్యవహారంలో ముఖ్యంగా ముగ్గురు నేతలు శాంతి ధరివాల్, మహేశ్ జోషి, ధర్మేంద్ర రాఠోడ్ కీలకంగా వ్యవహరించారు. వీరే సెప్టెంబర్ 25న కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశానికి డుమ్మాకొట్టి తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయంపైనే కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఈ ముగ్గురికి నోటీసులు కూడా పంపింది. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న అజయ్ మాకెన్ కూడా పార్టీ అధిష్ఠానికి ఇప్పటికే స్పష్టం చేశారు.
చర్యలు లేకపోవడంతో..
కానీ ఇన్ని రోజులు గడుస్తున్నా.. ఆ ముగ్గురు నేతలపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అజయ్‌మాకెన్ కలత చెందారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఇక ఇన్‌ఛార్జ్‌గా ఉండి ఏం ప్రయోజనం అని భావించి రాజీనామా చేసినట్లు చెప్పారు. నవంబర్ 8నే రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారని వెల్లడించారు.
అయితే ఖర్గే ఆయన రాజీనామాను అమోదించలేదని, పదవిలో కొనసాగాలని సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం అజయ్ మాకెన్ వారం రోజులు వేచిచూసినప్పటికీ గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు సచిన్ పైలట్ కూడా రెండు వారాల క్రితమే రాజస్థాన్ కాంగ్రెస్‌లో అనిశ్చితికి తెరదించాలని డిమాండ్ చేశారు. పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కానీ అధిష్ఠానం నుంచి ఆ దిశగా ఎలాంటి అడుగు పడకపోవడంతోనే అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. ఈ కారణంగానే ఆయన రాహుల్ భారత్ జోడో యాత్రకు సంబంధించిన సమీక్ష సమావేశాలకు కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: గుజరాత్‌లో ట్విస్ట్.. నామినేషన్ వేసేందుకు వెళ్లిన అభ్యర్థి కిడ్నాప్.. ఆ తర్వాత..
Comments
Please login to add a commentAdd a comment