రాజస్తాన్‌లో వేడెక్కిన రాజకీయం | Political crisis in the Rajasthan cm vs dyt cm | Sakshi
Sakshi News home page

రెబల్‌ పైలట్‌

Published Mon, Jul 13 2020 2:56 AM | Last Updated on Mon, Jul 13 2020 8:23 AM

Political crisis in the Rajasthan cm vs dyt cm - Sakshi

జైపూర్‌/న్యూఢిల్లీ:  రాజస్తాన్‌లో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. యువ నాయకుడు, ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు చేశారు. 30 మంది ఎమ్మెల్యేలు తనకు తోడుగా ఉన్నారన్నారు. కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతిస్తున్నారన్నారు. ప్రస్తుతం అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం మైనారిటీలో ఉందని స్పష్టం చేశారు. పైలట్‌ వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి ఆదివారం ఈ ప్రకటన వెలువడింది.

నేడు(సోమవారం) జైపూర్‌లో జరగనున్న కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ(సీఎల్పీ) భేటీలో సచిన్‌ పైలట్‌ పాల్గొనబోవడం లేదని ఆ సందేశంలో పేర్కొన్నారు. దీంతో పైలట్‌ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. సోమవారం పైలట్‌ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, సీఎం గహ్లోత్‌ తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, నేతలతో ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారు.

గహ్లోత్, పైలట్‌ మధ్య విభేదాలు తీవ్రమైన నేపథ్యంలో.. సంక్షోభ పరిష్కారం కోసం ఢిల్లీ నుంచి పార్టీ పరిశీలకులుగా సీనియర్‌ నేతలు అజయ్‌ మాకెన్, రణ్‌దీప్‌ సూర్జేవాలాలను కాంగ్రెస్‌ అధిష్టానం రాజస్తాన్‌కు పంపించింది. సమస్య సమసిపోతుందని, పార్టీలో చీలికలు లేవని, ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందని రణ్‌దీప్‌ పేర్కొన్నారు. ‘మొదట మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేలను కొన్నారు. ఇప్పుడు రాజస్తాన్‌లో అదే పని చేయాలనుకుంటున్నారు’ అని బీజేపీని ఉద్దేశించి సూర్జేవాలా ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం తన వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు పైలట్‌ ఢిల్లీలో ఉన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ గహ్లోత్‌ శనివారం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

నోటీసులపై సచిన్‌ సీరియస్‌
రాజస్తాన్‌ పోలీసులు తనకు పంపిన నోటీసులపై సచిన్‌ పైలట్‌ ఆగ్రహంగా ఉన్నారని ఆయన మద్దతుదారులు తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు పక్కా సమాచారం ఉందని స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌(ఎస్‌ఓజీ) శనివారం పైలట్‌కు పంపించిన ఆ నోటీసుల్లో పేర్కొంది. దీనికి సంబంధించి స్టేట్‌మెంట్‌ తీసుకునేందుకు తమకు సమయం ఇవ్వాలని పైలట్‌ను కోరింది. పైలట్‌తో పాటు గహ్లోత్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ మహేశ్‌ జోషి, పలువురు ఇతర ఎమ్మెల్యేలకు కూడా ఎస్‌ఓజీ నోటీసులు పంపించింది.

ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతోందన్న ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. సీనియర్‌ నేతను సీఎంగా ఎంపిక చేసినప్పటి నుంచి పార్టీలో ఈ విభేదాలున్నాయంది. కాగా, పలువురు మంత్రులు, ప్రభుత్వానికి మద్దతిస్తున్న పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆదివారం గహ్లోత్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు సంబంధించిన కేసు విచారణలో భాగంగానే సీఎం, డెప్యూటీ సీఎం, చీఫ్‌ విప్‌ తదితరులకు నోటీసులు పంపించామని ఎస్‌ఓజీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌ రాథోడ్‌ తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, వారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభ పెట్టాలని ప్రయత్నించినట్లు ఆధారాలున్నాయని వెల్లడించారు. ఎస్‌ఓజీతో పాటు అవినీతి నిరోధక విభాగం కూడా ఈ కేసును విచారిస్తోంది. 200 మంది రాజస్తాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మం ది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లోనూ వారు కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటేశా రు. అయితే, వారిలో ఎందరు గహ్లోత్‌కు మద్దతిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

అన్ని హద్దులు దాటారు
విచారణకు వచ్చి తమ ప్రశ్నలకు సమాధానాలివ్వాలని ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌కు నోటీసులు ఇవ్వడం ద్వారా అన్ని హద్దులు దాటారని పైలట్‌ మద్దతుదారులు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో గహ్లోత్‌ నాయకత్వంలో పనిచేయలేమని తేల్చిచెప్పారు.  పార్టీ రాష్ట్ర చీఫ్‌ కూడా అయిన ఉపముఖ్యమంత్రికి ప్రభుత్వ విభాగం నుంచి నోటీసులు రావడం గతంలో ఎన్నడూ జరగలేదన్నాయి. కాగా, పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని పైలట్‌ వర్గంగా భావిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు రోహిత్‌ బోహ్రా, దనీశ్‌ అబ్రార్, చేతన్‌ డూడి స్పష్టం చేశారు. గహ్లోత్‌ నాయకత్వంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను పార్టీ చీఫ్‌ సోనియాగాంధీకి వివరించామన్నారు. ఢిల్లీ నుంచి జైపూర్‌ తిరిగివచ్చిన అనంతరం ఎమ్మెల్యేలు వారు ఆదివారం సీఎం గహ్లోత్‌ నివాసంలో నిర్వహించిన ప్రెస్‌మీట్లో ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌లో గుర్తింపు తక్కువ: సింధియా
రాజస్తాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సంక్షోభం నెలకొన్న సందర్భంగా పార్టీ మాజీ నేత, ప్రస్తుత బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో శక్తి, సామరŠాధ్యలకు గుర్తింపు తక్కువని వ్యాఖ్యానించారు. సీఎం గహ్లోత్‌ డెప్యూటీ సీఎం పైలట్‌ను పక్కన పెట్టడమే కాకుండా, వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని నెలల క్రితం సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. 20 మందికి పైగా ఎమ్మెల్యేలను తనతో పాటు తీసుకువెళ్లడంతో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నేతృత్వం లోని కాంగ్రెస్‌ సర్కారు కూలిపోయి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సీఎంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.

మరో రాష్ట్రాన్ని కోల్పోలేం
ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్‌లను కో ల్పోయిన కాంగ్రెస్‌.. మరో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేదని పార్టీవ ర్గాలు తెలిపాయి. సంక్షోభ నివారణకు సీనియర్‌ నేతలు రంగంలోకి దిగారని వెల్లడించాయి. మొ త్తం 107 మంది ఎమ్మెల్యేలు పార్టీ తోనే ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపాయి. పైలట్, బీజేపీ భవిష్యత్‌ వ్యూహాలను అంచనా వేసే పనిలో ఉన్నాయన్నాయి.  కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం ఈ విషయంలో పెదవి విప్పడం లేదు.

వేచి చూద్దాం
బీజేపీ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి సబబైనదని భావిస్తోంది. సీఎల్పీ భేటీలో గహ్లోత్‌ బలమెంతో తెలుస్తుందని, గైర్హాజరీలపై స్పష్టత వచ్చిన తరువాత భవిష్యత్‌ కార్యాచరణపై ఆలోచించాలని భావిస్తోందని పార్టీ వర్గాలు తెలిపా యి. పైలట్‌ కొందరు బీజేపీ సీనియర్‌ నేతలతో టచ్‌లో ఉన్నారన్న వార్తలపై స్పందించేందుకు బీజేపీ నాయకులు నిరాకరించారు. అయితే, పైలట్‌ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని, గహ్లోత్‌తో రాజీకి ఆయన ఒప్పుకోకపోవచ్చని ఒక బీజేపీ నేత వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement