దౌసా: ప్రజలకు న్యాయం చేకూర్చాలన్నదే తన ధ్యేయమని, అందుకోసం పోరాటం కొనసాగిస్తానని రాజస్తాన్ కాంగ్రెస్ అసంతృప్త నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వెల్లడించారు. తన డిమాండ్లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ప్రజా విశ్వాసమే తన ఆస్తి అని తేల్చిచెప్పారు. వసుంధర రాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని సచిన్ పైలట్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
దీనిపై అశోక్ గహ్లోత్ ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన మండిపడుతున్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా న్యాయం జరిగి తీరుతుందని సచిన్ పైలట్ అన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన రాజస్తాన్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను పునర్వ్యస్థీకరించాలని కోరారు. పేపర్ లీకుల వల్ల నష్టపోయిన అభ్యర్థులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. దౌసా పట్టణంలోని గుర్జర్ హాస్టల్‌లో తన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి రాజేశ్ పైలట్ విగ్రహాన్ని సచిన్ పైలట్ ఆదివారం ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment