crisis in state
-
Maharashtra political crisis: షిండే తొలగింపు చెల్లుతుంది!
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతోంది. పాలక మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణానికి సారథ్యం వహిస్తున్న శివసేనలో కీలక నేత అయిన షిండే తిరుగుబాటుతో ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో జరిగిన సమావేశానికి మొత్తం 55 మంది ఎమ్మెల్యేలకు 13 మందే హాజరైనట్టు సమాచారం. గురువారమే ఒక మంత్రితో సహా మరో 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ రెండు గ్రూపులుగా గౌహతి వెళ్లి షిండే గూటికి చేరినట్టు వార్తలొస్తున్నాయి. దాంతో షిండే శిబిరంలో ఎమ్మెల్యేల సంఖ్య 50 దాటిందని చెబుతున్నారు. వీరిలో 40 మంది దాకా సేన ఎమ్మెల్యేలు కాగా 10 మంది స్వతంత్రులని సమాచారం. సేన ఎంపీల్లో కూడా పలువురు షిండేవైపు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షిండేతో పాటు 12 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ డిప్యూటీ స్పీకర్ జిర్వాల్‌ను శివసేన కోరింది. షిండే తొలగింపు చెల్లుతుంది: డిప్యూటీ స్పీకర్ శివసేన శాసనసభాపక్ష నేత పదవి నుంచి షిండే తొలగింపు చెల్లుబాటు అవుతుందని డిప్యూటీ స్పీకర్ జిర్వాల్ ప్రకటించారు. ఆయన స్థానంలో అజయ్ చౌదరి నియామకాన్ని ఆమోదించినట్టు మీడియాకు తెలిపారు. తమదే అసలైన శివసేనగా గుర్తించాలన్న షిండే లేఖపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటానని బదులిచ్చారు. మరోవైపు ఉద్ధవ్ తీరును తప్పుబడుతూ రెబెల్ ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ ఆయనకు లేఖ రాశారు. ఇక రెబల్స్ పేర్లతో పార్టీ నూతన శాసనసభా పక్ష నేత అజయ్ చౌదరి, డిప్యూటీ స్పీకర్ జిర్వాల్‌కు లేఖ రాశారు. బుధవారం నాటి శాసనసభాపక్ష భేటీకి గైర్హాజరవడం ద్వారా వారు విప్‌ను ధిక్కరించారని ఫిర్యాదు చేశారు. దీనిపై షిండే స్పందిస్తూ అనర్హత పేరుతో తమను బెదిరించలేరన్నారు.‘‘మాకూ నిబంధనలు తెలుసు. అసెంబ్లీ సమావేశాలకే తప్ప పార్టీపరమైన భేటీలకు విప్ వర్తించదు’’ అంటూ ట్వీట్ చేశారు. అంతకుముందు రోజంతా పలు పరిణామాలు జరిగాయి. కాంగ్రెస్, ఎన్సీపీలతో సేన పొత్తు అసహజ బంధమని, దాన్ని తెంచుకోవాలని షిండే బుధవారం డిమాండ్ చేయడం, అందుకు ఉద్ధవ్ ఠాక్రే నిరాకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఎంవీఏ నుంచి బయటికొచ్చేందుకు శివసేన ఉన్నట్టుండి సంసిద్ధత వెలిబుచ్చింది. “్ఙమీరే సిసలైన శివ సైనికులమని మీరంటున్నారు. దమ్ముంటే ట్విట్టర్, వాట్సాప్‌ల్లో లెటర్లు రాయడం ఆపి 24 గంటల్లోపు ముంబై తిరిగొచ్చి ఉద్ధవ్‌తో మాట్లాడండి. ఎంవీఏను వీడాలన్నదే రెబల్ ఎమ్మెల్యేలందరి అభిప్రాయమైతే సానుకూలంగా పరిశీలిస్తాం’’అని సేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఏది అసలు సేనో!: కాంగ్రెస్ రౌత్ ప్రకటనపై రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఉద్ధవ్ ఒక్క రోజులోనే వైఖరి మార్చుకుని కూటమికి గుడ్‌బై చెప్తారని అనుకోవడం లేదన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఏది అసలైన శివసేనో కూడా అర్థం కావడం లేదంటూ వాపోయారు. అయితే శివసేనకు, ఉద్ధవ్‌కు తమ సంపూర్ణ మద్దతుంటుందని ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రకటించాయి. సంకీర్ణాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని ఎన్సీపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కాంగ్రెస్‌కు చెందిన మంత్రి అశోక్ చవాన్ అన్నారు. రౌత్ వ్యాఖ్యలపై ఉద్ధవ్‌తో మాట్లాడతామని అజిత్ చెప్పారు. బీజేపీ హస్తముంది: పవార్ పాలక సంకీర్ణం భవితవ్యం సభలోనే తేలుతుంది తప్ప రెబల్స్ క్యాంపు పెట్టిన గౌహతిలో కాదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. సేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి బలపరీక్షతో నెగ్గి మెజారిటీ రుజువు చేసుకుంటుందని ధీమా వెలిబుచ్చారు. రెబల్స్ ముంబై వచ్చి సభలో పరీక్షకు నిలవాలన్నారు. ఈ సంక్షోభంలో బీజేపీ హస్తం కచ్చితంగా ఉందని ఆరోపించారు. ఇందులో బీజేపీ పాత్ర ఉందని చెప్పలేమని ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, ‘‘ఆయనకు బీజేపీ నేతల గురించి తెలియక అలా మాట్లాడుంటారు. వారి గురించి నాకు బాగా తెలుసు. ఓ జాతీయ పార్టీ తనకు అన్నివిధాలా సాయం చేస్తానని హామీ ఇచ్చిందని షిండే స్వయంగా చెప్పారుగా! ఈ సంక్షోభంలో మిగతా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీల పాత్ర లేదన్నది స్పష్టమే. ఇక మిగిలింది బీజేపీయే. షిండే వ్యాఖ్యలు ఆ పార్టీని ఉద్దేశించినవే’’ అన్నారు. ఎన్సీపీ తమను చిన్నచూపు చూస్తోందన్న రెబల్ ఎమ్మెల్యేల అభ్యంతరాలన్నీ సాకులేనన్నారు. గెలుపు మనదే: షిండే మరోవైపు గౌహతిలో రెబల్ ఎమ్మెల్యేలంతా షిండేను తమ నాయకునిగా మరోసారి ప్రకటించారు. తమ తరఫున ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని ఆయనకు కట్టబెట్టారు. వారినుద్దేశించి షిండే మాట్లాడుతున్న వీడియోను ముంబైలోని ఆయన కార్యాలయం విడుదల చేసింది. ‘‘మన బాధలు, ఆనందాలు అన్నీ ఒకటే. ఐక్యంగా ఉందాం. గెలుపు మనదే. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పిన మహాశక్తి అయిన ఓ జాతీయ పార్టీ ఉంది. మనం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని కొనియాడింది. అన్నివిధాలా సాయం చేస్తామని మాటిచ్చింది’’ అని వారినుద్దేశించి అందులో షిండే మాట్లాడుతూ కన్పించారు. -
Maharashtra Political Crisis: శివసేన..సంక్షోభ సేన
కరడు గట్టిన హిందుత్వవాదంతో పుట్టుకొచ్చిన శివసేనకు తిరుగుబాట్లు కొత్త కాదు. పార్టీ గతంలో మూడుసార్లు రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంది. తొలి మూడు పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే హయాంలో జరిగాయి. తాజాగా ఏక్నాథ్ షిండే సంక్షోభం ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ పగ్గాలు చేపట్టాక తొలి తిరుగుబాటు. 1966లో హిందూత్వ పునాదులపైనే బాల్‌ఠాక్రే ఏర్పాటు చేసిన శివసేన 56 ఏళ్ల చరిత్రలో ఎదుర్కొన్న రాజకీయ సంక్షోభాలు, అసంతృప్త నాయకులెరో చూద్దాం... నారాయణ్ రాణే శివసేన అధినేత బాల్ ఠాక్రే ఏరి కోరి 1999 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రకు ముఖ్యమంత్రిని చేసిన నారాయణ రాణె ఆ తర్వాత ఠాక్రేకు పక్కలో బల్లెంలా మారారు. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో పట్టున్న ఈ నాయకుడు పార్టీలో శాఖ ప్రముఖ్ స్థాయి నుంచి అంచెలంచెలుగా సీఎంగా ఎదిగారు. శివసేనని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో బాల్‌ఠాక్రే 2005లో పార్టీ నుంచి ఆయనను బహిష్కరించారు. ఆ తర్వాత రాణె కాంగ్రెస్‌లో చేరి 12 ఏళ్లు కొనసాగి ఎలాంటి ప్రాధాన్యం దక్కక తిరిగి బీజేపీలో చేరారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. చగన్ భుజ్‌బల్ 1991 సంవత్సరంలో శివసేనకి చగన్ భుజ్‌బల్ రూపంలో సంక్షోభం ఎదురైంది. పార్టీలో ఓబీసీ నాయకుడైన భుజ్‌బల్ గ్రామీణ మహారాష్ట్రలో పార్టీ పటిష్టతకు తీవ్రంగా కృషి చేశారు. అప్పట్లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీకి పెద్ద సంఖ్యలో సీట్లు లభించడానికి చగన్ భుజ్‌బల్ అలుపెరుగని కృషి చేశారు. అయినప్పటికీ పార్టీ అధినేత బాల్ ఠాక్రే మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి మనోహర్ జోషిని నియమించారు. మనస్తాపానికి గురైన భుజ్‌బల్ 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ వీడారు. ఠాక్రే మంత్రాంగంతో 12 మంది ఎమ్మెల్యేలు తిరిగి సేన గూటికి చేరుకోవడంతో సంక్షోభం సమసిపోయింది. ఆ తర్వాత కాలంలో ఎన్సీపీలో చేరిన భుజ్‌బల్ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. రాజ్ ఠాక్రే 2006 సంవత్సరంలో తన సొంత కుటుంబం నుంచే బాల్‌ఠాక్రేకు వ్యతిరేకత ఎదురైంది. బాలాసాహెబ్ తదనంతరం పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారన్నదానిపై అంతర్గత పోరు నడిచింది. బాల్‌ఠాక్రే సోదరుడు శ్రీకాంత్ ఠాక్రే కుమారుడైన రాజ్ ఠాక్రే పార్టీ పగ్గాలను ఆశించారు. బాల్‌ఠాక్రే వారసుడిగా తననే ప్రకటించాలని పట్టుపట్టారు. కానీ బాలాసాహెబ్ తన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే వైపే మొగ్గు చూపించారు. రాజ్‌ఠాక్రేకి పార్టీలో ప్రాధాన్యం తగ్గించారు. దీంతో రాజ్‌ఠాక్రే 2005లో పార్టీకి రాజీనామా చేసి , 2006లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. ఏక్నాథ్ షిండే ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కారణమైన ఏక్నాథ్ షిండే చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యాక కుమారుడు ఆదిత్య ఠాక్రేకి అధిక ప్రాధాన్యమిస్తుండటం షిండేకు మింగుడుపడలేదు. చివరికి తన శాఖ వ్యవహారాల్లో కూడా ఆదిత్య ఠాక్రే జోక్యం చేసుకుంటూ ఉండటం అసంతృప్తికి ఆజ్యం పోసింది. శివసేనలో కింద స్థాయి నుంచి ఎదిగిన షిండేకి పార్టీపై మంచి పట్టు ఉంది. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలైన కొన్ని గంటల్లోనే షిండే తిరుగుబావుటా ఎగురవేశారు. 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆయన వెంట నడిచి శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజస్థాన్ రాజకీయాలు
-
గహ్లోత్ గట్టెక్కినట్టే!
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్ రాజకీయ సంక్షోభాన్ని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తట్టుకుని నిలిచినట్లే కనిపిస్తోంది. సోమవారం వేగంగా జరిగిన పరిణామాల్లో... గహ్లోత్ వెనక చాలినంత మంది ఎమ్మెల్యేలుండటం... సచిన్ పైలట్‌కు బాసటనిచ్చిన వారి సంఖ్య పలచనైపోవటం వంటివి కనిపించాయి. దీంతో అశోక్ గహ్లోత్ కాసింత కులాసాగా కనిపించారు. సీఎల్పీ సమావేశానంతరం ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలిస్తూ విజయ చిహ్నాన్ని కూడా చూపించారు. మరోవంక.. తిరుగుబాటు బావుటా ఎగరేసిన పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కూడా మెత్తబడ్డారని సమాచారం. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో పాటు పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పైలట్‌తో చర్చించారని... గహ్లోత్‌పై ఫిర్యాదులేమైనా ఉంటే.. సానుకూలంగా పరిష్కరిస్తామని ఆయనకు హామీ ఇచ్చారని సమాచారం. సీనియర్ నేతలు చిదంబరం, అహ్మద్ పటేల్, కేసీ వేణు గోపాల్ కూడా పైలట్‌తో మాట్లాడటంతో ఆయన కాస్త మెత్తబడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎల్పీ భేటీకి 106 మంది? రాజస్తాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు సంబంధించి స్టేట్మెంట్ కావాలంటూ రాజస్తాన్ పోలీస్ విభాగం తనకు నోటీసులివ్వటంతో పైలట్ ఆగ్రహం చెంది సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు చేయడం తెలిసిందే. తదనంతర పరిణామాల్లో తన వెంట 30 మంది ఎమ్మెల్యేలున్నారని కూడా ప్రకటించారాయన. ఈ నేపథ్యంలో ఉదయం జైపూర్‌లో కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) భేటీ అయింది. దీనికి ఎందరు హాజరయ్యారన్నది స్పష్టంగా తెలియకపోయినా... 106 మంది వరకూ వచ్చినట్లు సీఎల్పీ ప్రకటించింది. అంటే ఒక్క సచిన్ పైలట్ మినహా అందరూ తమతోనే ఉన్నారనే సంకేతాలిచ్చే ప్రయత్నం చేసింది. అయితే దీనికి హాజరైన వారిలో కాంగ్రెస్ సభ్యులే కాక సర్కారుకు మద్దతిస్తున్న ఇతర పార్టీల వారూ ఉన్నట్లు సీఎల్పీ వర్గాలు చెప్పాయి. మొత్తానికి ఈ భేటీకి హాజరైన ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి గహ్లోత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాక ప్రభుత్వాన్ని, పార్టీని బలహీన పర్చేందుకు ప్రయత్నించే సీఎల్పీ సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. పైలట్ పేరును ప్రస్తావించకుండా.. ఓ తీర్మానాన్ని సైతం ఆమోదించారు. ‘సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంపై సీఎల్పీ సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తోంది. ముఖ్యమంత్రిగా గహ్లోత్ నాయకత్వాన్ని ఏకగ్రీవంగా సమర్ధిస్తోంది’అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ బీజేపీపై ఆ తీర్మానంలో ధ్వజమెత్తారు. అనంతరం, ఎమ్మెల్యేలను అక్కడి నుంచి నేరుగా జైపూర్ దగ్గర్లోని ఫెయిర్మాంట్ రిసార్ట్‌కు తరలించారు. వారితో పాటు సీఎం గహ్లోత్ కూడా అక్కడికి వెళ్లారు. తన ప్రభుత్వానికి ఢోకా లేదని, మెజారిటీ ఎమ్మెల్యేలు తన వైపే ఉన్నారని ఈ సందర్భంగా గహ్లోత్ చెప్పారు. విశ్వాసం కోల్పోయింది రాజస్తాన్‌లో అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని, ఆ పార్టీ ఇక అధికారంలో కొనసాగకూడదని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా సచిన్ పైలట్‌కు బయటి నుంచి మద్దతు ఇస్తారా? అని రాజస్తాన్ బీజేపీ చీఫ్ సతీశ్ పూనియాను ప్రశ్నించగా.. అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని, స్థానిక పరిస్థితులను బేరీజు వేస్తూ.. పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్‌లో సమర్ధులైన యువ నాయకులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తుంటారని వ్యాఖ్యానించారు. మెజారిటీని చూపాల్సింది అసెంబ్లీలో.. ఇంట్లో కాదు! సీఎల్పీ భేటీ నిర్వహించి, మెజారిటీ సభ్యుల మద్దతుందని సీఎం గహ్లోత్ పేర్కొనడంపై పైలట్ వర్గం స్పందించింది. మెజారిటీని అసెంబ్లీలో నిరూపించుకోవాలని, ఇంట్లో కాదని వ్యాఖ్యానించింది. అలాగే, పైలట్ బీజేపీలో చేరబోవడం లేదని స్పష్టం చేసింది. 106 మంది ఎమ్మెల్యేల మద్దతుందని గహ్లోత్ వర్గ నేతలు చెప్పడాన్ని పైలట్‌కు సన్నిహితులైన పార్టీ నేతలు తప్పుబట్టారు. మెజారిటీ ఉంటే.. ఎమ్మెల్యేలను గవర్నర్ వద్దకు తీసుకువెళ్లాలి కానీ, రిసార్ట్‌కు కాదని ఎద్దేవా చేశారు. నేడు మళ్లీ సీఎల్పీ కాంగ్రెస్ శాసనసభాపక్షం నేడు మరోసారి భేటీ కానుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్లోనే ఆ సమావేశం జరుగుతుందని సీనియర్‌నేత సూర్జెవాలా వెల్లడించారు. ఆ భేటీకి రావాలని, అన్ని అంశాలపై అక్కడ స్వేచ్ఛగా చర్చించుకోవచ్చని తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు సూచించారు. భేటీకి ఆహ్వానిస్తూ పైలట్‌కు, అసంతృప్త ఎమ్మెల్యేలకు లేఖలు పంపించామన్నారు. పైలట్ వెనుక ఎందరు? 200 మంది సభ్యులున్న రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ సొంత బలం 107. స్వతంత్రులు 13 మంది, సీపీఎం–2 కలిపితే ఇప్పటిదాకా 122 మంది మద్దతుంది. 72 మంది సభ్యులున్న బీజేపీకి ఆరెల్పీ, ఆరెల్డీ నుంచి నలుగురి మద్దతుంది. ఇద్దరు బీటీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి తటస్థంగా ఉన్నారు. సోమవారం నాటి సమావేశానికి సచిన్ పైలట్‌తో పాటు ఆయనకు సన్నిహితులైన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. అయితే వీరి సంఖ్య 10 కూడా ఉండదని, కాబట్టి గహ్లోత్ సర్కారుకు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని సీఎల్పీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు జైపూర్‌లో సీఎల్పీ భేటీకి కొన్ని గంటల ముందు కాంగ్రెస్ నేతలు రాజీవ్ అరోరా, ధర్మేంద్ర రాథోడ్‌లకు సంబంధమున్న పలు వాణిజ్య సంస్థలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. జైపూర్, ఢిల్లీ, ముంబై, కోట నగరాల్లోని ఆయా సంస్థల కార్యాలయాల్లో పన్ను ఎగవేత కేసులకు సంబంధించి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జైపూర్‌లోని ఆమ్రపాలి జ్యువెలర్స్ షోరూమ్‌లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సంస్థ రాజస్తాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాజీవ్ అరోరాకు చెందినదిగా తెలుస్తోంది. ఇదంతా బీజేపీ కుట్ర అని కాంగ్రెస్ ఆరోపించింది. ఐటీ, ఈడీ, సీబీఐ బీజేపీ అనుబంధ విభాగాలుగా మారాయని రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు. -
తారాస్థాయికి చేరిన రాజస్తాన్ రాజకీయ సంక్షోభం
-
రాజస్తాన్‌లో వేడెక్కిన రాజకీయం
-
రాజస్తాన్‌లో వేడెక్కిన రాజకీయం
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. అశోక్ గహ్లోత్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. యువ నాయకుడు, ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ తిరుగుబాటు చేశారు. 30 మంది ఎమ్మెల్యేలు తనకు తోడుగా ఉన్నారన్నారు. కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతిస్తున్నారన్నారు. ప్రస్తుతం అశోక్ గహ్లోత్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని స్పష్టం చేశారు. పైలట్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఆదివారం ఈ ప్రకటన వెలువడింది. నేడు(సోమవారం) జైపూర్‌లో జరగనున్న కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ) భేటీలో సచిన్ పైలట్ పాల్గొనబోవడం లేదని ఆ సందేశంలో పేర్కొన్నారు. దీంతో పైలట్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. సోమవారం పైలట్ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, సీఎం గహ్లోత్ తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, నేతలతో ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారు. గహ్లోత్, పైలట్ మధ్య విభేదాలు తీవ్రమైన నేపథ్యంలో.. సంక్షోభ పరిష్కారం కోసం ఢిల్లీ నుంచి పార్టీ పరిశీలకులుగా సీనియర్ నేతలు అజయ్ మాకెన్, రణ్‌దీప్ సూర్జేవాలాలను కాంగ్రెస్ అధిష్టానం రాజస్తాన్‌కు పంపించింది. సమస్య సమసిపోతుందని, పార్టీలో చీలికలు లేవని, ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందని రణ్‌దీప్ పేర్కొన్నారు. ‘మొదట మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేలను కొన్నారు. ఇప్పుడు రాజస్తాన్‌లో అదే పని చేయాలనుకుంటున్నారు’ అని బీజేపీని ఉద్దేశించి సూర్జేవాలా ట్వీట్ చేశారు. ప్రస్తుతం తన వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు పైలట్ ఢిల్లీలో ఉన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ గహ్లోత్ శనివారం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నోటీసులపై సచిన్ సీరియస్ రాజస్తాన్ పోలీసులు తనకు పంపిన నోటీసులపై సచిన్ పైలట్ ఆగ్రహంగా ఉన్నారని ఆయన మద్దతుదారులు తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు పక్కా సమాచారం ఉందని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) శనివారం పైలట్‌కు పంపించిన ఆ నోటీసుల్లో పేర్కొంది. దీనికి సంబంధించి స్టేట్మెంట్ తీసుకునేందుకు తమకు సమయం ఇవ్వాలని పైలట్‌ను కోరింది. పైలట్‌తో పాటు గహ్లోత్, ప్రభుత్వ చీఫ్ విప్ మహేశ్ జోషి, పలువురు ఇతర ఎమ్మెల్యేలకు కూడా ఎస్ఓజీ నోటీసులు పంపించింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతోందన్న ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. సీనియర్ నేతను సీఎంగా ఎంపిక చేసినప్పటి నుంచి పార్టీలో ఈ విభేదాలున్నాయంది. కాగా, పలువురు మంత్రులు, ప్రభుత్వానికి మద్దతిస్తున్న పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆదివారం గహ్లోత్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు సంబంధించిన కేసు విచారణలో భాగంగానే సీఎం, డెప్యూటీ సీఎం, చీఫ్ విప్ తదితరులకు నోటీసులు పంపించామని ఎస్ఓజీ అదనపు డైరెక్టర్ జనరల్ అశోక్ రాథోడ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభ పెట్టాలని ప్రయత్నించినట్లు ఆధారాలున్నాయని వెల్లడించారు. ఎస్‌ఓజీతో పాటు అవినీతి నిరోధక విభాగం కూడా ఈ కేసును విచారిస్తోంది. 200 మంది రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మం ది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లోనూ వారు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేశా రు. అయితే, వారిలో ఎందరు గహ్లోత్‌కు మద్దతిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అన్ని హద్దులు దాటారు విచారణకు వచ్చి తమ ప్రశ్నలకు సమాధానాలివ్వాలని ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌కు నోటీసులు ఇవ్వడం ద్వారా అన్ని హద్దులు దాటారని పైలట్ మద్దతుదారులు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో గహ్లోత్ నాయకత్వంలో పనిచేయలేమని తేల్చిచెప్పారు. పార్టీ రాష్ట్ర చీఫ్ కూడా అయిన ఉపముఖ్యమంత్రికి ప్రభుత్వ విభాగం నుంచి నోటీసులు రావడం గతంలో ఎన్నడూ జరగలేదన్నాయి. కాగా, పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని పైలట్ వర్గంగా భావిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు రోహిత్ బోహ్రా, దనీశ్ అబ్రార్, చేతన్ డూడి స్పష్టం చేశారు. గహ్లోత్ నాయకత్వంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను పార్టీ చీఫ్ సోనియాగాంధీకి వివరించామన్నారు. ఢిల్లీ నుంచి జైపూర్ తిరిగివచ్చిన అనంతరం ఎమ్మెల్యేలు వారు ఆదివారం సీఎం గహ్లోత్ నివాసంలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో గుర్తింపు తక్కువ: సింధియా రాజస్తాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం నెలకొన్న సందర్భంగా పార్టీ మాజీ నేత, ప్రస్తుత బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో శక్తి, సామరŠాధ్యలకు గుర్తింపు తక్కువని వ్యాఖ్యానించారు. సీఎం గహ్లోత్ డెప్యూటీ సీఎం పైలట్‌ను పక్కన పెట్టడమే కాకుండా, వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని నెలల క్రితం సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. 20 మందికి పైగా ఎమ్మెల్యేలను తనతో పాటు తీసుకువెళ్లడంతో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వం లోని కాంగ్రెస్ సర్కారు కూలిపోయి శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. మరో రాష్ట్రాన్ని కోల్పోలేం ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్‌లను కో ల్పోయిన కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేదని పార్టీవ ర్గాలు తెలిపాయి. సంక్షోభ నివారణకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారని వెల్లడించాయి. మొ త్తం 107 మంది ఎమ్మెల్యేలు పార్టీ తోనే ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపాయి. పైలట్, బీజేపీ భవిష్యత్ వ్యూహాలను అంచనా వేసే పనిలో ఉన్నాయన్నాయి. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈ విషయంలో పెదవి విప్పడం లేదు. వేచి చూద్దాం బీజేపీ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి సబబైనదని భావిస్తోంది. సీఎల్పీ భేటీలో గహ్లోత్ బలమెంతో తెలుస్తుందని, గైర్హాజరీలపై స్పష్టత వచ్చిన తరువాత భవిష్యత్ కార్యాచరణపై ఆలోచించాలని భావిస్తోందని పార్టీ వర్గాలు తెలిపా యి. పైలట్ కొందరు బీజేపీ సీనియర్ నేతలతో టచ్‌లో ఉన్నారన్న వార్తలపై స్పందించేందుకు బీజేపీ నాయకులు నిరాకరించారు. అయితే, పైలట్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని, గహ్లోత్‌తో రాజీకి ఆయన ఒప్పుకోకపోవచ్చని ఒక బీజేపీ నేత వ్యాఖ్యానించారు. -
నేడు మధ్యప్రదేశ్‌లో బలపరీక్ష
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి, బలం నిరూపణ జరపాలని స్పీకర్ ఎన్పీ ప్రజాపతిని ఆదేశించింది. కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాషాయ దళంలో చేరడం, ఆయనతోపాటు 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోకుండా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అసెంబ్లీని 26వ తేదీకి స్పీకర్ వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మరో ఎంపీ పిటిషన్లు వేశారు. గురువారం ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం దాదాపు 8 సూచనలను వెలువరించింది. ‘అనిశ్చిత పరిస్థితులను చక్కదిద్దేందుకు సభలో విశ్వాస పరీక్ష జరపాలని సూచిస్తున్నాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సభ మద్దతు ఉన్నదీ లేనిదీ నిర్ధారించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. సభ్యులు చేతులు ఎత్తి విశ్వాసం ప్రకటించాలి’అని స్పీకర్‌ను ధర్మాసనం ఆదేశించింది. ‘బెంగళూరులో ప్రస్తుతం మకాం వేసి ఉన్న 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఎలాంటి ఒత్తిడులు, అడ్డంకులు లేకుండా చూడాలి. ఇతర పౌరుల మారిదిగానే వారిని స్వేచ్ఛగా ఉండనివ్వాలి’అని మధ్యప్రదేశ్, కర్ణాటక డీజీపీలను ఆదేశించింది. ‘అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలనుకున్న ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలి. సభా కార్యక్రమాలను వీడియో తీయించాలి. నిబంధనలకు లోబడి విశ్వాస పరీక్షను లైవ్‌లో కూడా ప్రసారం చేయవచ్చు. విశ్వాస పరీక్ష సమయంలో సభలో శాంతి, భద్రతలకు విఘాతం కలగరాదు. ఈ కార్యక్రమాలన్నీ మార్చి 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ముగియాలి. ఈ సమాచారాన్ని గవర్నర్‌కు తెలియజేయాలి’అని స్పీకర్‌కు, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. -
విశ్వాస పరీక్షకు సిద్ధం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజకీయాలు రసకందా యంలో పడ్డాయి. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నామంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన గవర్నర్ లాల్జీ టాండన్‌ని కలిసి ఓ లేఖ అందజేశారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ నిర్బంధంలో ఉంచి బేరసారా లాడుతోందని ఆరోపించారు. ఈనెల 3, 4 తేదీల నుంచి 10వ తేదీ వరకు జరిగిన పరిణామాలను ఆ లేఖలో వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పడిందన్నారు. బెంగుళూరులో నిర్బంధంలో ఉంచిన 22 మంది ఎమ్మెల్యేలను విడుదల చేయాల్సిందిగా గవర్నర్‌ని కోరినట్టు వెల్లడించారు. ఏ క్షణంలోనైనా విశ్వాస పరీక్ష జరగొచ్చని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కోరిన మేరకు జ్యోతిరా దిత్య సింధియాకు అనుకూ లంగా రాజీనామా సమర్పించిన 22 మందిలో ఆరుగురు మంత్రులను తొలగించినట్లు గవర్నర్ కార్యాలయం ప్రకటించిం ది. ఇదిలా ఉండగా, మంత్రులతో సహా శాసన సభ్యులు బెంగళూరులోని రిసార్ట్స్‌లో తాము బందీలుగా ఉంచామంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. భోపాల్ బయలుదేరిన ఆరుగురు మంత్రులు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు అందజేసేందుకు బెంగళూరు రిసార్టులో ఉన్న ఆరుగురు మంత్రులు భోపాల్ బయలుదేరారు. వీరి రాక సందర్భంగా భోపాల్, బెంగళూరు విమానాశ్రయాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారంలోగా తన ముందు వ్యక్తిగతం గా హాజరవ్వాల్సిందిగా రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ శాసనసభ్యులకు స్పీకర్ ప్రజాపతి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభకు సింధియా నామినేషన్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, ఉన్నారు. -
పవార్‌తో పవర్ పంచుకుంటారా?
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: రోజుకో రాజకీయం, పూటకో మలుపు, నేతల మధ్య మాటల తూటాలు, కొత్త పొత్తుల కోసం ఆరాటాలు ఇలా మహారాష్ట్ర రాజకీయం రంగులు మారుతోంది. 50:50 ఫార్ములాకే శివసేన పట్టుబట్టడం, అవసరమైతే రాష్ట్రపతిపాలనకైనా సిద్ధపడతామని బీజేపీ తేల్చి చెప్పడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో పీటముడి మరింత బిగుసుకుంది. అధికారం కోసం చావో రేవోకో సిద్ధపడిన శివసేన పవార్‌తో పవర్ పంచుకుంటామనే సంకేతాలు పంపుతోంది. ఇప్పటివరకు ప్రతిపక్షంలోనే కూర్చుంటామన్న ఎన్సీపీ తన రూటు మార్చుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆయన భేటీ అవుతారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించడం కోసమే ఢిల్లీ వెళుతున్నానని పవార్ బయటకి చెబుతున్నప్పటికీ, బీజేపీని అధికారానికి దూరం చేయడం కోసం కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి శివసేనకు మద్దతు ఇవ్వడంపై గల సాధ్యాసాధ్యాలను చర్చించడమే ప్రధాన ఎజెండా అన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ‘నవంబర్ 4, సోమవారం ఢిల్లీలో సోనియాగాంధీతో శరద్ పవార్ భేటీ అవుతారు. ఆయన ఈ మధ్య ఫోన్లో ఆమెతో మాట్లాడారు. వాళ్ల మధ్య ఏయే అంశాలు చర్చకు వస్తాయో ఆ రోజే తెలుస్తుంది’ అని కాంగ్రెస్, ఎన్సీపీ హయాంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన అజిత్ పవార్ చెప్పారు. శివసేన, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చేలా మూడు పార్టీల మధ్య ఒక అవగాహన కుదురుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. శివసేన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటూ ఇప్పటికే కాంగ్రెస్‌లో స్వరాలు పెరుగుతున్నాయి. ఆ పార్టీ నేత హుస్సేన్ దల్వాయ్ పార్టీ అధ్యక్షురాలు సోనియాకు లేఖ రాశారు. సేనకు మద్దతివ్వాలని ఆ లేఖలో ఆయన కోరారు. సంకీర్ణ ధర్మానికే కట్టుబడతాం: సంజయ్ మహారాష్ట్ర ఫలితాలు వెలువడి పది రోజులు దాటిపోయినా ప్రభుత్వ ఏర్పాటు అంశంలో అడుగు కూడా ముందుకు పడకపోవడం ఉత్కంఠకు దారి తీస్తోంది. చివరిక్షణం వరకు తాము సంకీర్ణ ధర్మానికే కట్టుబడి ఉంటామని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. ఈ నెల 9తో 13వ శాసనసభ గడువు ముగిసిపోనుంది. అయినప్పటికీ రెండు పార్టీల మధ్య ప్రభుత్వ ఏర్పాటుపై అధికారిక చర్చలేవీ జరగలేదు. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ, శివసేనలకు కలిపి అధికారాన్ని అప్పగించారని, అందుకోసం తాము ఇద్దరూ కలిసే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వేచి చూస్తామన్నారు. ఉద్ధవ్ సీఎం కావాలి: అథవాలే శివసేన తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆదిత్య ఠాక్రేని ముందుకు తీసుకురావడాన్ని కేంద్ర మంత్రి, ఆర్పీఐ (ఏ) చీఫ్ రామ్‌దాస్ అథవాలే వ్యతిరేకించారు. భవిష్యత్‌లో శివసేనకు ఆ అవకాశం వస్తే ఆదిత్య బదులుగా ఉద్ధవ్ ఠాక్రే ఆ పదవిని చేపడితే బాగుంటుందని సూచించారు. ఈ విషయంలో శివసేన పునరాలోచించాలని అన్నారు. రామ్‌దాస్, ఇతర బీజేపీ మిత్రపక్షాలతో కలిసి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీను శనివారం కలుసుకున్నారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలవాలని ఆయన గవర్నర్‌ని కోరారు. రాష్ట్రపతి మీ జేబులో ఉన్నారా? ఈ నెల 7లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తామన్న బీజేపీ సీనియర్ నేత సుధీర్ మంగన్‌తివార్ వ్యాఖ్యలపై శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో విరుచుకుపడింది. మహారాష్ట్రకే అవమానం, రాష్ట్రపతి మీ జేబులో ఉన్నారా ? అన్న హెడ్డింగ్‌తో రాసిన సంపాదకీయంలో సుధీర్ చేసిన ప్రకటన అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమంటూ ధ్వజమెత్తింది. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాతీర్పునే అవమానించినట్టు అవుతుందని రాష్ట్రపతి అధికార పక్షం జేబులో ఉన్నారా అంటూ ప్రశ్నించింది. కొత్త ఎమ్మెల్యేలను భయపెట్టడానికే రాష్ట్రపతి పాలన అస్త్రాన్ని బయటకు తీశారా? అని∙ ఆ సంపాదకీయంలో బీజేపీని శివసేన నిలదీసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్ హుడాను కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేతగా నియమించారు. కొత్తగా ఎన్నికైన అసెంబ్లీలో హుడా విపక్ష నేతగా వ్యవహరిస్తారని కాంగ్రెస్ నేత ఆజాద్ వెల్లడించారు. -
కన్నడ సంక్షోభం
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలోని జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. శనివారం 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడంతో రాజకీయం కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర అసెంబ్లీలోని 224 మంది సభ్యులకుగాను మెజారిటీకి అవసరమైన 118 మంది సభ్యుల బలం సంకీర్ణానికి ఉంది. తాజా రాజీనామా లను స్పీకర్ అంగీకరిస్తే మాత్రం ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. స్పీకర్ ఆఫీస్‌లో రాజీనామా లేఖలు కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు శనివారం స్పీకర్ కార్యాలయంలో రాజీనామా పత్రాలు సమర్పించారు. అనంతరం వారు రాజ్‌భవన్‌లో గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిశారు. ‘ఇటీవలి రాజీనామా సమర్పించిన ఆనంద్ సింగ్‌తోపాటు కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖలు అందజేశారు’ అని జేడీఎస్ ఎమ్మెల్యే ఏహెచ్ విశ్వనాథ్ గవర్నర్‌తోను కలిశాక మీడియాకు చెప్పారు. ‘ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయడం లేదు’ అని విశ్వనాథ్ అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేలను బీజేపీ మచ్చిక చేసుకుంటోందన్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ కమలం వంటివన్నీ ఊహాగానాలు. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం’ అని అన్నారు. అయితే, ఆనంద్ సింగ్ సహా 13 మంది ఎమ్మెల్యేలే రాజీనామా లేఖలను అందజేసినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ వర్గాలు చెప్పాయి. ఈ పరిణామంపై స్పీకర్ రమేశ్ కుమార్ స్పందిస్తూ.. ‘ఎమ్మెల్యేలు వచ్చిన సమయంలో కార్యాలయంలో లేను. మొత్తం 11 మంది శాసనసభ్యులు రాజీనామా లేఖలు ఆఫీస్‌లో ఇచ్చారు. ప్రభుత్వం కొనసాగేదీ లేనిదీ అసెంబ్లీలోనే తేలుతుంది. మంగళవారం ఆఫీసుకు వెళ్లి రాజీనామా లేఖలను పరిశీలించి, చర్య తీసుకుంటా’ అని తెలిపారు. ఈ పరిణామంతో కాంగ్రెస్‌లో ‘ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. అసంతృప్త ఎమ్మెల్యేల్లో ముఖ్యులైన రామలింగారెడ్డి తదితరులను బుజ్జగించే పనిలో పడ్డారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ బెంగళూరుకు చేరుకోనున్నారు. ముంబై రిసార్టుకు 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించిన కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు చార్టెర్డ్ విమానంలో శనివారం సాయంత్రం ముంబైకి బయలుదేరారు. వీరంతా హోటల్లో బస చేసే అవకాశముందని సమాచారం. ‘ప్రత్యర్థి పార్టీల్లో జరుగుతున్న పరిణామాలతో నాకు గానీ, మా పార్టీకి గాని ఎటువంటి సంబంధం లేదు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. అంతర్గత కుమ్ములాటలే కారణం: బీజేపీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న కాంగ్రెస్ ఆరోపణలపై కమలదళం స్పందించింది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్, జేడీఎస్ అంతర్గత కుమ్ములాటలే కారణమని బీజేపీ మీడియా చీఫ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనీ ఆరోపించారు. ఎమ్మెల్యేల రాజీనామాలతో తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. మా ప్రభుత్వానికి ఢోకాలేదు: కాంగ్రెస్ ధీమా ఎమ్మెల్యేల రాజీనామా వార్తలపై సంకీర్ణ ప్రభుత్వ సమన్వయ కమిటీ అధ్యక్షుడు సిద్దరామయ్య స్పందించారు. ‘మా ప్రభుత్వానికి ఢోకా లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ‘బంతి స్పీకర్ కోర్టులో ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం’ అని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ అన్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ -
రాష్ట్రపతి పాలనలోకి జమ్మూకశ్మీర్
న్యూఢిల్లీ: రాజకీయ సందిగ్ధత కారణంగా గత ఆరు నెలలుగా గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్ తాజాగా రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. బుధవారం అర్ధరాత్రి నుంచి కశ్మీర్‌ను రాష్ట్రపతిపాలనలోకి తెస్తూ రాష్ట్రపతి కోవింద్ అధికార ప్రకటన వెలువరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలని సిఫార్సు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివేదించిన నేపథ్యంలో సోమవారం మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం రాష్ట్రపతిపాలనకు పచ్చజెండా ఊపింది. జూన్‌లో కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని అధికార పీడీపీ సర్కారుకు బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో రాజకీయసంక్షోభం మొదలైంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మద్దతు తమకుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలని ఆ తర్వాత గవర్నర్‌ను పీడీపీ కోరింది. అదే సమయంలో బీజేపీ, మరికొందరు ఇతర సభ్యుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని సజ్జద్ లోన్ నేతృత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్ సైతం గవర్నర్‌ను కలిసింది. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుచేసే సామర్థ్యం రెండు కూటములకు లేవని భావిస్తూ గవర్నర్ అసెంబ్లీని రద్దుచేశారు. -
విభజన జరిగితే చంద్రబాబు చరిత్రహీనుడే!
వినుకొండ, న్యూస్‌లైన్: తెలుగుజాతిని రెండుగా చీల్చాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నన్నపనేని సుధ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద సమైక్యశంఖారావం బహిరంగ సభ జరిగింది. ఈ సభలో మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అధికశాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని, విభజన జరిగితే అందుకు ప్రధాన కారణమైన చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలోని ఎమ్మెల్యేలతో ఒక మాట, సీమాంధ్ర ప్రాంతంలోని ఎమ్మెల్యేలతో మరో మాట చెప్పి ఉద్యమాలు చేయాలని ఉసికొల్పడ ం బాబు నైజమన్నారు. రెండు కళ్ల సిద్ధాంతం పోయి ఇప్పుడు సమన్యాయం అంటున్న బాబుకు రాష్ట్ర ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమైక్యాంధ్ర సాధిస్తానంటూ ప్రగల్బాలు పలుకుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చివరి బంతి వరకు ఆట ఉంటుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆయన అసలు బ్యాట్ ఊపని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. విడిపోతే ఇబ్బందులు తప్పవు.. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి ప్రసంగిస్తూ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని పాటు పడుతున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రం విడిపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్ పాలనలో ప్రవేశపెట్టిన అనేక పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరాయన్నారు. విజయవాడ పార్టీ నాయకులు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేయని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆ పార్టీని ఏవిధంగా బలోపేతం చేస్తారని ప్రశ్నించారు. వైఎస్సార్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు తాను ప్రవేశపెట్టినట్లుగా చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గు చేటన్నారు. ఒంటరిగా వచ్చిన వైఎస్ జగన్ శక్తిగా మారారని పేర్కొన్నారు. నరసరావుపేట సమన్వయకర్త గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్ మర ణానంతరం రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడిందన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా నాటకాలు ఆడుతున్నారని అన్నారు. సమావేశంలో ఎస్సీ సెల్ కన్వీనర్ బండారు సాయిబాబు, మైనార్టీ సెల్ కన్వీనర్ సయ్యద్ మహబూబ్, ఎస్టీ సెల్ కన్వీనర్ హనుమంతునాయక్, పిల్లా ఓబుల్‌రెడ్డి, ఎలిశెట్టి ఆదినారాయణ, ఆర్. శ్రీను, కర్నాటి చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.