ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతోంది. పాలక మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణానికి సారథ్యం వహిస్తున్న శివసేనలో కీలక నేత అయిన షిండే తిరుగుబాటుతో ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో జరిగిన సమావేశానికి మొత్తం 55 మంది ఎమ్మెల్యేలకు 13 మందే హాజరైనట్టు సమాచారం.
గురువారమే ఒక మంత్రితో సహా మరో 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ రెండు గ్రూపులుగా గౌహతి వెళ్లి షిండే గూటికి చేరినట్టు వార్తలొస్తున్నాయి. దాంతో షిండే శిబిరంలో ఎమ్మెల్యేల సంఖ్య 50 దాటిందని చెబుతున్నారు. వీరిలో 40 మంది దాకా సేన ఎమ్మెల్యేలు కాగా 10 మంది స్వతంత్రులని సమాచారం. సేన ఎంపీల్లో కూడా పలువురు షిండేవైపు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షిండేతో పాటు 12 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ డిప్యూటీ స్పీకర్ జిర్వాల్‌ను శివసేన కోరింది.
షిండే తొలగింపు చెల్లుతుంది: డిప్యూటీ స్పీకర్
శివసేన శాసనసభాపక్ష నేత పదవి నుంచి షిండే తొలగింపు చెల్లుబాటు అవుతుందని డిప్యూటీ స్పీకర్ జిర్వాల్ ప్రకటించారు. ఆయన స్థానంలో అజయ్ చౌదరి నియామకాన్ని ఆమోదించినట్టు మీడియాకు తెలిపారు. తమదే అసలైన శివసేనగా గుర్తించాలన్న షిండే లేఖపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటానని బదులిచ్చారు. మరోవైపు ఉద్ధవ్ తీరును తప్పుబడుతూ రెబెల్ ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ ఆయనకు లేఖ రాశారు.
ఇక రెబల్స్ పేర్లతో పార్టీ నూతన శాసనసభా పక్ష నేత అజయ్ చౌదరి, డిప్యూటీ స్పీకర్ జిర్వాల్‌కు లేఖ రాశారు. బుధవారం నాటి శాసనసభాపక్ష భేటీకి గైర్హాజరవడం ద్వారా వారు విప్‌ను ధిక్కరించారని ఫిర్యాదు చేశారు. దీనిపై షిండే స్పందిస్తూ అనర్హత పేరుతో తమను బెదిరించలేరన్నారు.‘‘మాకూ నిబంధనలు తెలుసు. అసెంబ్లీ సమావేశాలకే తప్ప పార్టీపరమైన భేటీలకు విప్ వర్తించదు’’ అంటూ ట్వీట్ చేశారు. అంతకుముందు రోజంతా పలు పరిణామాలు జరిగాయి.
కాంగ్రెస్, ఎన్సీపీలతో సేన పొత్తు అసహజ బంధమని, దాన్ని తెంచుకోవాలని షిండే బుధవారం డిమాండ్ చేయడం, అందుకు ఉద్ధవ్ ఠాక్రే నిరాకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఎంవీఏ నుంచి బయటికొచ్చేందుకు శివసేన ఉన్నట్టుండి సంసిద్ధత వెలిబుచ్చింది. “్ఙమీరే సిసలైన శివ సైనికులమని మీరంటున్నారు. దమ్ముంటే ట్విట్టర్, వాట్సాప్‌ల్లో లెటర్లు రాయడం ఆపి 24 గంటల్లోపు ముంబై తిరిగొచ్చి ఉద్ధవ్‌తో మాట్లాడండి. ఎంవీఏను వీడాలన్నదే రెబల్ ఎమ్మెల్యేలందరి అభిప్రాయమైతే సానుకూలంగా పరిశీలిస్తాం’’అని సేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ఏది అసలు సేనో!: కాంగ్రెస్
రౌత్ ప్రకటనపై రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఉద్ధవ్ ఒక్క రోజులోనే వైఖరి మార్చుకుని కూటమికి గుడ్‌బై చెప్తారని అనుకోవడం లేదన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఏది అసలైన శివసేనో కూడా అర్థం కావడం లేదంటూ వాపోయారు. అయితే శివసేనకు, ఉద్ధవ్‌కు తమ సంపూర్ణ మద్దతుంటుందని ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రకటించాయి. సంకీర్ణాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని ఎన్సీపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కాంగ్రెస్‌కు చెందిన మంత్రి అశోక్ చవాన్ అన్నారు. రౌత్ వ్యాఖ్యలపై ఉద్ధవ్‌తో మాట్లాడతామని అజిత్ చెప్పారు.
బీజేపీ హస్తముంది: పవార్
పాలక సంకీర్ణం భవితవ్యం సభలోనే తేలుతుంది తప్ప రెబల్స్ క్యాంపు పెట్టిన గౌహతిలో కాదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. సేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి బలపరీక్షతో నెగ్గి మెజారిటీ రుజువు చేసుకుంటుందని ధీమా వెలిబుచ్చారు. రెబల్స్ ముంబై వచ్చి సభలో పరీక్షకు నిలవాలన్నారు. ఈ సంక్షోభంలో బీజేపీ హస్తం కచ్చితంగా ఉందని ఆరోపించారు. ఇందులో బీజేపీ పాత్ర ఉందని చెప్పలేమని ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, ‘‘ఆయనకు బీజేపీ నేతల గురించి తెలియక అలా మాట్లాడుంటారు.
వారి గురించి నాకు బాగా తెలుసు. ఓ జాతీయ పార్టీ తనకు అన్నివిధాలా సాయం చేస్తానని హామీ ఇచ్చిందని షిండే స్వయంగా చెప్పారుగా! ఈ సంక్షోభంలో మిగతా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీల పాత్ర లేదన్నది స్పష్టమే. ఇక మిగిలింది బీజేపీయే. షిండే వ్యాఖ్యలు ఆ పార్టీని ఉద్దేశించినవే’’ అన్నారు. ఎన్సీపీ తమను చిన్నచూపు చూస్తోందన్న రెబల్ ఎమ్మెల్యేల అభ్యంతరాలన్నీ సాకులేనన్నారు.
గెలుపు మనదే: షిండే
మరోవైపు గౌహతిలో రెబల్ ఎమ్మెల్యేలంతా షిండేను తమ నాయకునిగా మరోసారి ప్రకటించారు. తమ తరఫున ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని ఆయనకు కట్టబెట్టారు. వారినుద్దేశించి షిండే మాట్లాడుతున్న వీడియోను ముంబైలోని ఆయన కార్యాలయం విడుదల చేసింది. ‘‘మన బాధలు, ఆనందాలు అన్నీ ఒకటే. ఐక్యంగా ఉందాం. గెలుపు మనదే. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పిన మహాశక్తి అయిన ఓ జాతీయ పార్టీ ఉంది. మనం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని కొనియాడింది. అన్నివిధాలా సాయం చేస్తామని మాటిచ్చింది’’ అని వారినుద్దేశించి అందులో షిండే మాట్లాడుతూ కన్పించారు.
Comments
Please login to add a commentAdd a comment