కన్నడ సంక్షోభం | Karnataka Government Crisis | Sakshi
Sakshi News home page

కన్నడ సంక్షోభం

Published Sun, Jul 7 2019 3:57 AM | Last Updated on Sun, Jul 7 2019 10:35 AM

Karnataka Government Crisis - Sakshi

రాజీనామా చేశాక బెంగళూరులో గవర్నర్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలోని జేడీఎస్‌– కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. శనివారం 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడంతో రాజకీయం కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర అసెంబ్లీలోని 224 మంది సభ్యులకుగాను మెజారిటీకి అవసరమైన 118 మంది సభ్యుల బలం సంకీర్ణానికి ఉంది. తాజా రాజీనామా లను స్పీకర్‌ అంగీకరిస్తే మాత్రం ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

స్పీకర్‌ ఆఫీస్‌లో రాజీనామా లేఖలు
కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు శనివారం స్పీకర్‌ కార్యాలయంలో రాజీనామా పత్రాలు సమర్పించారు. అనంతరం వారు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ వాజూభాయ్‌ వాలాను కలిశారు. ‘ఇటీవలి రాజీనామా సమర్పించిన ఆనంద్‌ సింగ్‌తోపాటు కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 14 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌ కార్యాలయంలో రాజీనామా లేఖలు అందజేశారు’ అని జేడీఎస్‌ ఎమ్మెల్యే ఏహెచ్‌ విశ్వనాథ్‌ గవర్నర్‌తోను కలిశాక మీడియాకు చెప్పారు. ‘ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయడం లేదు’ అని విశ్వనాథ్‌ అన్నారు.

ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేలను బీజేపీ మచ్చిక చేసుకుంటోందన్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. ‘ఆపరేషన్‌ కమలం వంటివన్నీ ఊహాగానాలు. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం’ అని అన్నారు. అయితే, ఆనంద్‌ సింగ్‌ సహా 13 మంది ఎమ్మెల్యేలే రాజీనామా లేఖలను అందజేసినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్‌ వర్గాలు చెప్పాయి. ఈ పరిణామంపై స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ స్పందిస్తూ.. ‘ఎమ్మెల్యేలు వచ్చిన సమయంలో కార్యాలయంలో లేను.

మొత్తం 11 మంది శాసనసభ్యులు రాజీనామా లేఖలు ఆఫీస్‌లో ఇచ్చారు. ప్రభుత్వం కొనసాగేదీ లేనిదీ అసెంబ్లీలోనే తేలుతుంది. మంగళవారం ఆఫీసుకు వెళ్లి రాజీనామా లేఖలను పరిశీలించి, చర్య తీసుకుంటా’ అని తెలిపారు. ఈ పరిణామంతో కాంగ్రెస్‌లో ‘ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్‌ రంగంలోకి దిగారు. అసంతృప్త ఎమ్మెల్యేల్లో ముఖ్యులైన రామలింగారెడ్డి తదితరులను బుజ్జగించే పనిలో పడ్డారు. ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ వేణుగోపాల్‌ బెంగళూరుకు చేరుకోనున్నారు.

ముంబై రిసార్టుకు 10 మంది ఎమ్మెల్యేలు
రాజీనామాలు సమర్పించిన కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు చార్టెర్డ్‌ విమానంలో శనివారం సాయంత్రం ముంబైకి బయలుదేరారు. వీరంతా హోటల్‌లో బస చేసే అవకాశముందని సమాచారం. ‘ప్రత్యర్థి పార్టీల్లో జరుగుతున్న పరిణామాలతో నాకు గానీ, మా పార్టీకి గాని ఎటువంటి సంబంధం లేదు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప స్పష్టం చేశారు.  

అంతర్గత కుమ్ములాటలే కారణం: బీజేపీ
కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న కాంగ్రెస్‌ ఆరోపణలపై కమలదళం స్పందించింది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్, జేడీఎస్‌ అంతర్గత కుమ్ములాటలే కారణమని బీజేపీ మీడియా చీఫ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌ బలూనీ ఆరోపించారు. ఎమ్మెల్యేల రాజీనామాలతో తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు.

మా ప్రభుత్వానికి ఢోకాలేదు: కాంగ్రెస్‌ ధీమా
ఎమ్మెల్యేల రాజీనామా వార్తలపై సంకీర్ణ ప్రభుత్వ సమన్వయ కమిటీ అధ్యక్షుడు సిద్దరామయ్య స్పందించారు. ‘మా ప్రభుత్వానికి ఢోకా లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ‘బంతి స్పీకర్‌ కోర్టులో ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం’ అని  జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ అన్నారు.


రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement