వినుకొండ, న్యూస్‌లైన్: తెలుగుజాతిని రెండుగా చీల్చాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఎన్‌టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నన్నపనేని సుధ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద సమైక్యశంఖారావం బహిరంగ సభ జరిగింది.
ఈ సభలో మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అధికశాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని, విభజన జరిగితే అందుకు ప్రధాన కారణమైన చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలోని ఎమ్మెల్యేలతో ఒక మాట, సీమాంధ్ర ప్రాంతంలోని ఎమ్మెల్యేలతో మరో మాట చెప్పి ఉద్యమాలు చేయాలని ఉసికొల్పడ ం బాబు నైజమన్నారు. రెండు కళ్ల సిద్ధాంతం పోయి ఇప్పుడు సమన్యాయం అంటున్న బాబుకు రాష్ట్ర ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమైక్యాంధ్ర సాధిస్తానంటూ ప్రగల్బాలు పలుకుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చివరి బంతి వరకు ఆట ఉంటుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆయన అసలు బ్యాట్ ఊపని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
విడిపోతే ఇబ్బందులు తప్పవు..
పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి ప్రసంగిస్తూ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని పాటు పడుతున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రం విడిపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్ పాలనలో ప్రవేశపెట్టిన అనేక పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరాయన్నారు. విజయవాడ పార్టీ నాయకులు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేయని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆ పార్టీని ఏవిధంగా బలోపేతం చేస్తారని ప్రశ్నించారు.
వైఎస్సార్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు తాను ప్రవేశపెట్టినట్లుగా చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గు చేటన్నారు. ఒంటరిగా వచ్చిన వైఎస్ జగన్ శక్తిగా మారారని పేర్కొన్నారు. నరసరావుపేట సమన్వయకర్త గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్ మర ణానంతరం రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడిందన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా నాటకాలు ఆడుతున్నారని అన్నారు. సమావేశంలో ఎస్సీ సెల్ కన్వీనర్ బండారు సాయిబాబు, మైనార్టీ సెల్ కన్వీనర్ సయ్యద్ మహబూబ్, ఎస్టీ సెల్ కన్వీనర్ హనుమంతునాయక్, పిల్లా ఓబుల్‌రెడ్డి, ఎలిశెట్టి ఆదినారాయణ, ఆర్. శ్రీను, కర్నాటి చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విభజన జరిగితే చంద్రబాబు చరిత్రహీనుడే!
Published Mon, Dec 30 2013 12:42 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement