Telugu race
-
తెలుగును రాజేస్తున్న నిప్పు కణిక
తెలుగులో ప్రసంగించినందుకు పార్టీ సభ్యత్వాన్ని కోల్పోయిన ఒక తమిళనాడు యువతి అక్కడి తెలుగు జాతిని ఏకం చేసేందుకు, అన్ని రంగాలలోనూ తమిళులతో సమానంగా తెలుగువారికీ అవకాశాలు కల్పించేందుకు ఉద్యమించారు. ఎన్నికల తరుణం కావడంతో సహజంగానే ఆమె పోరాటానికి విస్తృతంగా మద్దతు లభిస్తోంది. ఓ సినిమాలో ముస్లిం యువకుడు ‘నేను ఇక్కడే పుట్టాను. ఈ దేశం నాది. నీకెంత హక్కుందో నాకంతే హక్కుంది. ముస్లిములు అందరూ తీవ్రవాదులు కాదు. మేరా భారత్ మహాన్’ అంటాడు. ఇప్పుడు అదే అస్తిత్వం కోసం పోరాడుతూ.. ‘ఇదే నా మాతృభాష. ఇదే నా జన్మభూమి’ అంటూ.. ‘నేను తెలుగు.. నా భాష తెలుగు. ఇక్కడే పుట్టా. ఇదే నా ప్రాంతం. భారతీయురాలిగా నేను నా భాషలో మాట్లాడే హక్కును ఎందుకు కోల్పోవాలి?’ అని నినదిస్తున్నారు ఓ మహిళ! నిర్బంధ తమిళంలో భాష పేరిట జరుగుతున్న వేధింపులపై గళమెత్తిన ఆ తెలుగు మహిళ ధనమణి వెంకట్ ఇప్పుడు తమిళనాట ఓ సంచలనం! ధనమణి తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఆమెది వలస వెళ్లిన తెలుగు కుటుంబం కాదు. తొలి తరం నుండి అక్కడి కుటుంబమే. ఆ ఇంట్లో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ధనమణి. ఆమె భర్త వెంకట్ వ్యాపారంలో స్థిరపడ్డారు. అదే సమయం వైగో (వైపురి గోపాలస్వామి) నేతృత్వంలోని ఎండిఎంకె (మురుమలర్చి ద్రవిడ మన్నేట్ర కళగం) లో కీలక కార్యకర్తగా ఉన్నారు. ఆయన ద్వారానే ధనమణి ఎండిఎంకెలో మంచి వక్తగా ఎదిగారు. అధికార ప్రతినిధిగా ప్రచారాలలో, బహిరంగ సభలలో ఆమె గొంతుక అగ్గిని రాజేసే నిప్పుకణికగా మారింది. ఆమె మైక్ పట్టుకుంటే ప్రతిపక్షాలకు హడల్. ఆమె తమిళంలో ఎంత అనర్గళంగా ప్రసంగిస్తారో.. పుట్టినగడ్డ తమిళ పరిమళంతో కూడిన మాతృభాష తెలుగులో కూడా అదే ఒరవడితో ప్రసంగిస్తారు. ఈ ఏడాది జనవరి 27న కోయంబత్తూరు ఎండిఎంకె బహిరంగసభ జరిగింది. ఆ స¿¶ కు ధనమణి ముఖ్య అతిథిగా హాజరై అనర్గళంగా ఉపన్యసించారు. అంతా బాగానే ఉంది. సభకు హాజరైన వారంతా కోయంబత్తూరు, పొల్లాచ్చి ప్రాంతాలకు చెందిన తెలుగు వారు. దీంతో ఆమె తెలుగులో ప్రసంగించారు. అదే ఇప్పుడు వివాదంగా కొనసాగుతోంది. ధనమణి ఏం మాట్లాడారు? ఆమె తన ప్రసంగంలో తెలుగువారి గొప్పదనం గురించి మాట్లాడారు. ‘‘తెలుగువాళ్లం అంటే వలస వచ్చిన జీవులం కాదు. ద్రవిడనాడు అంటే.. కేవలం తమిళ భాష, ఒక్క తమిళ ప్రాంతం మాత్రమే కాదు. తెలుగుతో కలిపి నలభై నాలుగు భాషల సమాహారం. ఆరుకోట్ల తమిళుల్లో మూడు కోట్ల తెలుగు అనుబంధం ఉంది. చోళులు, పల్లవులు, తిరుమలై నాయకర్లు, ఆదీనాలు, శైవ మఠాలు, పన్నెండు మంది ఆళ్వార్లు అంతా కలిసి ఉన్నారు. వందల ఏళ్లనాటిది ఈ తమిళ, తెలుగు సమిష్టి బంధం. ఐదవ శతాబ్దంలోనే తెలుగు భాష ఆనవాళ్లు ద్రవిడ భూమిలో వెలుగు చూశాయి. తమిళులకు ఎంత హక్కు ఉందో ఇక్కడే పుట్టి ఇక్కడే మట్టిలో కలిసిపోయే మనకూ అంతే హక్కు ఉంటుంది. అలాగని మనం తమిళులకు వ్యతిరేకం కాదు. కొందరు వేర్పాటువాద నాయకులు తెలుగు వారిని ఇక్కడి నుండి తరిమి వేయాలని కుట్ర పన్నుతున్నారు. తమిళుల్లో మమేకమై, ఒక బంధంగా కొనసాగుతున్న తెలుగు వారిలో చీలిక తేవాలనే కుట్రకు మనం బలి కావద్దు. అన్ని రంగాల్లో తెలుగు వారికి సమాన అవకాశాలు తెచ్చుకుందాం. ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో రాణిద్దాం’’ అంటూ మాతృభాషపై మమకారంతో తన సహజమైన ఆవేశంతో ప్రసంగించారు ధనమణి. మూడు నెలలుగా వేధింపులు అయితే ఆమె తెలుగులో ప్రసంగించటం.. తమిళం, ఈలం తమిళం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే ‘నామ్ తమిళర్’ పార్టీ వ్యవస్థాపకుడు సీమాన్‌ను అగ్గిమీద గుగ్గిలం అయ్యేలా చేసింది. అంతే.. ‘‘ధనమణి తమిళ ద్రోహి. తెలుగులో మాట్లాడటం ద్వారా తమిళులను చులకన చేసింది. తమిళనాట తెలుగు వారి పెత్తనం, దౌర్జన్యం సాగదు’’ అంటూ సభల్లో తెలుగుపై విషం కక్కాడు. అలా.. ఆనోటా ఈనోటా.. ధనమణి ప్రసంగాలపై తమిళ వ్యతిరేక ఆరోపణలు రాష్ట్రమంతటా వ్యాపించాయి. ఈ క్రమంలో తమిళ నినాదం ఎక్కడ దెబ్బతింటుందోనన్న ఆందోళనలో ఎండిఎంకె అధినేత వైగో ఆమెను పార్టీ పదవి నుండి సస్పెండ్ చేశారు. ధనమణి వైగో నిర్ణయంపై ఎక్కడా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. తాను తప్పుగా మాట్లాడలేదని, అదే విషయంపై వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా ఆమె ప్రకటించారు. కానీ.. నామ్ తమిళర్ పార్టీకి చెందిన కొందరు ధనమణిని తీవ్రమైన, అసభ్యమైన పదజాలంలో మానసిక క్షోభకు గురిచేశారు. ఫోన్ల ద్వారా, వాట్సప్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అతి జుగుప్సాకరంగా ధనమణిని వేధింపులకు గురిచేశారు. దీంతో ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో పైకి వస్తున్న మహిళగా గుర్తింపు పొందిన ధనమణి ఇమేజ్‌ని శాశ్వతంగా భూస్థాపితం చేసేందుకు నామ్ తమిళర్ ప్రయత్నిస్తోంది. గత మూడు నెలలుగా ఈ వేధింపులు భరించలేక ధనమణి.. తేని, కోవిల్పట్టి, కోయంబత్తూరులోని సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఎన్నికల వేళ కనుక ధనమణి ఫిర్యాదుపై పోలీసుల విచారణకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ధనమణి ఈ విషయాన్ని తేలిగ్గా వదలదలచుకోలేదు. తమిళనాడులోని తెలుగు సంఘాల వేదికగా నిలిచిన ‘తమిళనాడు తెలుగు మక్కల్’ పార్టీ సాయంతో తనపై బురదజల్లె వారిపై పోరాడుతానంటూ రంగంలోకి దిగారు. వందల వేల సంవత్సరాలుగా ఒక్కటై బతుకుతున్న ద్రవిడ భూమిలో నా మాతృభాషను మాట్లాడుకునే హక్కును నేనెందుకు వదులు కోవాలంటూ ఉద్యమించారు. అంతేకాదు.. వందల ఏళ్లుగా కలిసిమెలిసి సంతోషంగా ఉంటున్న తమిళ, తెలుగుల నడుమ చిచ్చుపెట్టే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే వేర్పాటు వాదులు ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉందని అప్రమత్తం చేస్తున్నారు. అంతేకాదు..తమిళనాట తెలుగు వారందరినీ ఒకేతాటిపైకి తెచ్చి తెలుగు వారి బలాన్ని చూపించటం ద్వారా ప్రభుత్వంలో, రాజకీయాల్లో, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సమాన హక్కులను పొందేలా కార్యాచరణకు ధనమణి శ్రీకారం చుడుతున్నారు. సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి సాక్షి టీవీ, చెన్నై బ్యూరో -
అక్కినేనికి మరణం లేదు
తెలుగు జాతి ఉన్నంత వరకు అభిమానుల గుండెల్లో జీవించే ఉంటారు:నాగసుశీల ఎంవీవీఎస్ మూర్తికి అక్కినేని జీవిత సాఫల్య పురస్కార ప్రదానం విశాఖపట్నం-కల్చరల్: కాలేజీకి వెళ్లకపోయినా ప్రపంచాన్ని చదివిన మహానటుడు అక్కినే ని నాగేశ్వరరావు తెలుగు జాతి ఉన్నంత వరకు అభిమానుల హృదయూల్లో జీవించే ఉంటారని అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె నాగసుశీల అన్నారు. కళాభారతి ఆడిటోరియంలో అక్కినేని నాటక కళాసాగర పరిషత్ నిర్వహిస్తున్న అక్కినేని నాటకోత్సవాలు గురువారం రాత్రి ముగిశాయి. ఈ సందర్భంగా ఆమె గీతం యూనివర్శిటీ అధినేత డాక్టర్ ఎం.వి.వి.ఎస్.మూర్తికి అక్కినేని కళాసాగర పరిషత్ తరపున ‘అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం’ అందజేశారు. ఈ సందర్భంగా నాగసుశీల మాట్లాడుతూ అక్కినేని చిహ్నంగా భారత్‌తోపాటు అమెరికాలో కూడా ఒక స్టాంప్‌ను విడుదల చేయడం విశేషమన్నారు. పురస్కార గ్రహీత డాక్టర్ ఎం.వి.వి.ఎస్.మూర్తి మాట్లాడుతూ సమాజంలో విద్యను ప్రోత్సహించిన వ్యక్తుల్లో అక్కినేని ముందువరసలో ఉంటారన్నారు. 1960లో గుడివాడలో ఉన్న కాలేజీకి ఆయన లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి ఔన్నత్యాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంతో ఉన్న అన్ని యూనివర్శిటీలకు ఆయన విరాళాలు ఇచ్చి విద్యను ప్రోత్సహించిన వ్యక్తిగా గుర్తింపు పొందారని తెలిపారు. 2011లో గీతం వర్సిటీకి ఆహ్వానించి ‘డీ లిట్’ ప్రదానం చేసినట్టు గుర్తు చేసుకున్నారు. 1955 నుంచి 1983 వరకు అక్కినేని సినిమాలు విడవకుండా చూసిన వ్యక్తుల్లో తానూ ఒక్కడినన్నారు. అక్కినేని కళాసాగర పరిషత్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అర్జున్ అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, విజయ నిర్మాణ్ కంపెనీ అధినేత ఎస్.విజయకుమార్, దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, డాక్టర్ రెహమాన్, కళాసాగర పరిషత్ అధ్యక్షుడు పొన్నాడ మోహనరావు, అక్కినేని నాటకోత్సవాల సంఘం అధ్యక్షుడు కనకరావులు ప్రసంగించారు. -
జయహో.. దేవరాయ
పండగను తలపించిన రాయల పట్టాభిషేక మహోత్సవాలు రూ.2 కోట్లతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పర్యాటక కేంద్రాలుగా పెనుకొండ, గుత్తి కోట గుప్త నిధుల కేటుగాళ్లపై నిఘా ముగింపు ఉత్సవాల్లో మంత్రి పరిటాల సునీత సాక్షి, అనంతపురం : శ్రీకృష్ణదేవరాయల 504వ పట్టాభిషేక మహోత్సవాలు పండగను తలపించడం సంతోషంగా ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. పెనుకొండలో రెండు రోజులపాటు నిర్వహించిన ఉత్సవాలు గురువారం ముగిశాయి. పెనుకొండ కోటపై ఎమ్మెల్యే బీకే పార్థసారథి అధ్యక్షతన గురువారం జరిగిన ముగింపు కార్యక్రమంలో, అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తమ ప్రభుత్వంలో రాయల ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. వచ్చే ఏడాది మరింత ఘనంగా నిర్విహ స్తామన్నారు. ముందుగా కొండపైకి వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. కోటలో శిథిలావస్థకు చేరుకున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రూ.2 కోట్లతో పునరుద్ధరిస్తామని, ఇస్కాన్ ఆధ్వర్యంలో కోటపై శ్రీకృష్ణుడి ఆలయం నిర్మిస్తామని ప్రకటించారు. రాయల కీర్తి, చారిత్రక నిర్మాణాల గురించి తెలియజేసేందుకు వీలుగా కోటపై మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. కోట సంపద పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. రాయల కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పేందుకు, తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగించే వారిపై నిఘా పెంచుతామన్నారు. అనంతరం రాయల ఉత్సవాల్లో ప్రదర్శనలు నిర్వహించిన కళాకారులకు మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. అంతకు ముందు ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాన్ని మంత్రి సునీత ప్రారంభించారు. కోట పునఃనిర్మాణానికి చర్యలు : హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ పెనుకొండ కోటను పునఃనిర్మిస్తామన్నారు. కోటపై విద్యుత్ దీపాలు, రోడ్లు, తాగునీటి వసతి కల్పించేందుకు రూ.25 కోట్లు మంజూరు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. రాయలేలిన సీమలో ఫ్యాక్షన్ సంస్కృతిని చెరిపి వేయడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. రాయలసీమలో రాయల కీర్తి గురించి తప్ప ఫ్యాక్షన్ మాట వినపడడానికి ఆస్కారం లేకుండా చేస్తామన్నారు. పోటెత్తిన కోట : రాయల ఉత్సవాల సందర్భంగా పెనుకొండ కోట జనంతో పోటెత్తింది. కోటపై ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు చివరకు చేతులెత్తేసినా.. ప్రజలు, విద్యార్థులు మాత్రం తెలుగు జాతి ఔన్నత్వాన్ని చాటిచెప్పేందుకు, రాయలపై ఉన్న అపార గౌరవంతో ఎనిమిది కిలోమీటర్ల మేర కాలినడకన కోటకు చేరుకున్నారు. కోట నలువైపులా కలియ దిరిగారు. చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకోవడంపై ఆవేదన చెందారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు : ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతపురం అరబింద్ ఆర్ట్స్ అకాడమీ కళాకారిణులు చేసిన పలు నృత్య ప్రదర్శనలు, హైదరాబాద్ నృత్య కారిణులు ‘శ్రీకృష్ణ లీలలు’ గేయానికి చేసిన ప్రదర్శన అమితంగా ఆకట్టుకుంది. ముగింపు కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఈరన్న, జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, డీఈఓ మధుసూదన్‌రావు, సివిల్ సప్లయీస్ డీఎం వెంకటేశం, డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డి పాల్గొన్నారు. -
సడలని సంకల్పం సమైక్య దీక్షలు ప్రారంభం
కర్నూలు, న్యూస్‌లైన్: తెలుగుజాతిని విడదీయవద్దంటూ అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యచరణలో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును నిరశిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సమైక్యవాదుల నుంచి సంఘీభావం వెల్లువెత్తింది. 7వ తేదీ నుంచి 10 వరకు తాలుకా కేంద్రాల్లో దీక్షలు కొనసాగుతాయి. ఆలూరు అంబేద్కర్ సర్కిల్ ఆవరణలో చేపట్టిన దీక్షలను నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాం, బీసీ సెల్ కన్వీనర్ డాక్టర్ మధుసూదన్ ప్రారంభించారు. పది మంది దీక్షల్లో పాల్గొన్నారు. ఆదోని బీమా సర్కిల్లో దీక్షలను స్థానిక నాయకులు ప్రసాదరావు, చంద్రకాంత్‌రెడ్డి, విశ్వనాథగౌడ్ ప్రారంభించారు. మహిళా విభాగం కార్యకర్తలు దీక్షల్లో కూర్చున్నారు. ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల కూడలిలో బీవీ.రామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన దీక్షల్లో మాల మహానాడు కార్యకర్తలు పాల్గొన్నారు. డోన్ పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద మండల మాజీ అధ్యక్షుడు శ్రీరాములు ప్రారంభించిన దీక్షల్లో ఐదుగురు నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారు. కోడుమూరు పాతబస్టాండ్‌లో నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టగా 11 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారు. ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో మండల కన్వీనర్ బసిరెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్ బుట్టా రంగయ్య ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో గోనెగండ్ల మండలానికి చెందిన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజే వందమందికిపైగా నాయకులు, కార్యకర్తలు దీక్షల్లో కూర్చున్నారు. -
విభజన జరిగితే చంద్రబాబు చరిత్రహీనుడే!
వినుకొండ, న్యూస్‌లైన్: తెలుగుజాతిని రెండుగా చీల్చాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నన్నపనేని సుధ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద సమైక్యశంఖారావం బహిరంగ సభ జరిగింది. ఈ సభలో మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అధికశాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని, విభజన జరిగితే అందుకు ప్రధాన కారణమైన చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలోని ఎమ్మెల్యేలతో ఒక మాట, సీమాంధ్ర ప్రాంతంలోని ఎమ్మెల్యేలతో మరో మాట చెప్పి ఉద్యమాలు చేయాలని ఉసికొల్పడ ం బాబు నైజమన్నారు. రెండు కళ్ల సిద్ధాంతం పోయి ఇప్పుడు సమన్యాయం అంటున్న బాబుకు రాష్ట్ర ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమైక్యాంధ్ర సాధిస్తానంటూ ప్రగల్బాలు పలుకుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చివరి బంతి వరకు ఆట ఉంటుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆయన అసలు బ్యాట్ ఊపని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. విడిపోతే ఇబ్బందులు తప్పవు.. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి ప్రసంగిస్తూ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని పాటు పడుతున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రం విడిపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్ పాలనలో ప్రవేశపెట్టిన అనేక పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరాయన్నారు. విజయవాడ పార్టీ నాయకులు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేయని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆ పార్టీని ఏవిధంగా బలోపేతం చేస్తారని ప్రశ్నించారు. వైఎస్సార్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు తాను ప్రవేశపెట్టినట్లుగా చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గు చేటన్నారు. ఒంటరిగా వచ్చిన వైఎస్ జగన్ శక్తిగా మారారని పేర్కొన్నారు. నరసరావుపేట సమన్వయకర్త గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్ మర ణానంతరం రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడిందన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా నాటకాలు ఆడుతున్నారని అన్నారు. సమావేశంలో ఎస్సీ సెల్ కన్వీనర్ బండారు సాయిబాబు, మైనార్టీ సెల్ కన్వీనర్ సయ్యద్ మహబూబ్, ఎస్టీ సెల్ కన్వీనర్ హనుమంతునాయక్, పిల్లా ఓబుల్‌రెడ్డి, ఎలిశెట్టి ఆదినారాయణ, ఆర్. శ్రీను, కర్నాటి చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్ర ఎంపీలు అమ్ముడుపోయారు..
= ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ఆగ్రహం = ఎంపీలు ప్యాకేజీల పాఠం వల్లించడంపై మండిపాటు = మూడు గంటలపాటు సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సాక్షి, విజయవాడ/ ఉయ్యూరు : సీమాంధ్ర ఎంపీలు ప్యాకేజీలకు అమ్ముడుపోయారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయ నాయకులను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. ఉయ్యూరులో ఆదివారం జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేసీపీ చక్కెర కర్మాగారం ఉద్యోగులు సహా విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు తరలివచ్చిన ఈ సభ మూడు గంటలపాటు జరిగింది. సభలో అశోక్‌బాబు ఉద్వేగంగా మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు తగు బలం లేని కారణంగా ఎన్నికల వరకు విభజన జరగదని, ఎన్నికల తర్వాత సమైక్యంగా ఉంచడం ప్రధాన కర్తవ్యమని చెప్పారు. వచ్చే ఎన్నికలు కీలకమైనవని పదేపదే తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరించాలని హితవు పలికారు. కులం, వర్గం, పార్టీలను బట్టి కాకుండా సమైక్యానికి ఎవరు ముందుంటారో వారిని ఎన్నుకోవాలని సూచించారు. పలుమార్లు ఆయన వచ్చే ఎన్నికలను ప్రస్తావించడం... ఓటును తూటాల్లా వాడాలని చెప్పడం సభలో చర్చనీయాంశమైంది. రాజకీయ నాయకులను ఆయన ఎక్కువగా టార్గెట్ చేసుకొని ప్రసంగించారు. వారి స్వార్థాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఉయ్యూరు సభను విజయవంతం చేసేందుకు ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు కృషిచేశారు. రాజకీయ సమాధి కట్టాలి... తెలుగు జాతికి వెన్ను పోటు పోడుస్తున్న నాయకులకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలని మేధావుల వేదిక రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాస్ సూచించారు. మనవేలితో మనకన్నే పొడిచేందుకు ప్యాకేజీలతో మీ ముందుకు వస్తున్నారు మోసపోవద్దు అని హితవు పలికారు. ‘సమైక్య ఉద్యమాన్ని చంపేయాలన్న దుర్మార్గాలు పన్నుతున్న కేంద్ర మంత్రులు, ఎంపీలను తిరగనివ్వకండి.. ప్యాకేజీలకు తలొగ్గి పార్లమెంట్, అసెంబ్లీలో బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి విదేశాలకు వెళ్లి తలదాచుకునే దొంగలు ఉన్నారు.. వీరందరికీ పౌరసన్మానం చేసి వారి ఇళ్లను ముట్టడించండి’ అంటూ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, పురందేశ్వరి సమైక్యాంధ్రకు ద్రోహం తలపెట్టారని విమర్శించారు. ‘తన ఇంటి పక్కన వ్యక్తికి రేషన్‌కార్డు, తన ఊళ్లో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసుకోలేని పనబాక సీమాంధ్రను మరో సింగపూర్ చేస్తుందట.. వీరి మాటలు నమ్మితే భవితరాలు మనల్ని క్షమించరు.. ఇది యుద్ధ సమయం.. సకల జనులు మరో స్వాతంత్రోద్యమానికి సన్నద్ధం కావాలి’ అని సూచించారు. ఉద్యమానికి తూట్లు పొడవటం దుర్మార్గం.. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు లేఖ ఇవ్వటం, ఎన్టీఆర్ తనయ పురందేశ్వరి ప్యాకేజీలు కావాలంటూ సమైక్య ఉద్యమానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించటం దుర్మార్గమని వ్యవసాయ శాఖ రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. సీమాంధ్ర ఎంపీలు డ్రామాలు కట్టిపట్టి రాజీనామాలు చేస్తే విభజన ఆగిపోతుందని స్పష్టంచేశారు. విభజన కోసమే రాష్ట్రాన్ని విభజించటం సరికాదని మొదటి ఎస్సారీలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. ప్రాంతీయ కమిటీ వేసి తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని శ్రీకృష్ణకమిటీ తన నివేదికలో స్పష్టంగా సూచించిందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఇరు ప్రాంతాల ప్రజల ఆమోదం లేకుండా విభజన ప్రక్రియ ప్రారంభిస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయని కమిటీ నివేదికలో పొందుపరిచారని వివరించారు. కమిటీ నివేదికను కేంద్రం పక్కనపెట్టి విభజన చర్యలు ప్రారంభించిందని మండిపడ్డారు. రాష్ట్రం ముక్కలైతే నీటి యుద్ధాలు జరుగుతాయని, చుక్కనీరు కూడా డెల్టాకు వచ్చే అవకాశం లేదని, రైతులంతా రోడ్డెక్కి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పరాజు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను నిలదీసి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల జోనల్ కార్యదర్శి వైవీ రావు మాట్లాడుతూ విభజిస్తే ఆర్టీసీకి సంబంధించి విద్యార్థులు రాయితీలు కోల్పోతారన్నారు. ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమంతోనే సమైక్యాంధ్ర సాధించుకోగలుగుతామని స్పష్టం చేశారు. సభలో ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, కేసీపీ సీవోవో జి.వెంకటేశ్వరరావు, అడ్వకేట్ జేఏసీ నేత నరహరిశెట్టి శ్రీహరి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమాన్ని ఉయ్యూరు జేఏసీ కన్వీనర్ పరుచూరి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. దాడులకు పాల్పడితే ఖబడ్దార్... ఉయ్యూరు : సమైక్యవాదులపై, ఉద్యోగులు, విద్యాసంస్థలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని సమైక్యాంధ్ర పరిరక్షణవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పర్చూరి అశోక్‌బాబు హెచ్చరించారు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా సరే పరిధి మించి వ్యవహరిస్తే తాము అదే స్థాయిలో ప్రతిఘటించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమానికి అండగా నిలుస్తున్న విద్యాసంస్థలు, ఉద్యమంలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై దాడులు, బెదిరింపులకు ప్రజాప్రతినిధులు పాల్పడుతున్నారని సభలో కొందరు అశోక్‌బాబు దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవలే నూజివీడులో అక్కడి జేఏసీ కన్వీనర్ కుమార్ విషయంలో పోలీసులు అనుచితంగా వ్యవహరించారని, అతని విద్యాసంస్థలపై దాడులు చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై అశోక్‌బాబు స్పందిస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. విద్యాసంస్థలపై, ఉద్యోగులపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. మంత్రులనైనా, ఎమ్మెల్యేలైనా సరే వదిలే ప్రసక్తే లేదన్నారు. సమైక్యాంధ్ర ద్రోహులుగా వ్యవహరించే ఏ ఒక్కరినీ వదలబోమని స్పష్టం చేశారు. నూజివీడులో ఇటీవల చోటుచేసుకున్న ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.