= ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ఆగ్రహం
= ఎంపీలు ప్యాకేజీల పాఠం వల్లించడంపై మండిపాటు
= మూడు గంటలపాటు సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ
సాక్షి, విజయవాడ/ ఉయ్యూరు : సీమాంధ్ర ఎంపీలు ప్యాకేజీలకు అమ్ముడుపోయారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయ నాయకులను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. ఉయ్యూరులో ఆదివారం జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేసీపీ చక్కెర కర్మాగారం ఉద్యోగులు సహా విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు తరలివచ్చిన ఈ సభ మూడు గంటలపాటు జరిగింది. సభలో అశోక్‌బాబు ఉద్వేగంగా మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు తగు బలం లేని కారణంగా ఎన్నికల వరకు విభజన జరగదని, ఎన్నికల తర్వాత సమైక్యంగా ఉంచడం ప్రధాన కర్తవ్యమని చెప్పారు. వచ్చే ఎన్నికలు కీలకమైనవని పదేపదే తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరించాలని హితవు పలికారు. కులం, వర్గం, పార్టీలను బట్టి కాకుండా సమైక్యానికి ఎవరు ముందుంటారో వారిని ఎన్నుకోవాలని సూచించారు. పలుమార్లు ఆయన వచ్చే ఎన్నికలను ప్రస్తావించడం... ఓటును తూటాల్లా వాడాలని చెప్పడం సభలో చర్చనీయాంశమైంది. రాజకీయ నాయకులను ఆయన ఎక్కువగా టార్గెట్ చేసుకొని ప్రసంగించారు. వారి స్వార్థాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఉయ్యూరు సభను విజయవంతం చేసేందుకు ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు కృషిచేశారు.
రాజకీయ సమాధి కట్టాలి...
తెలుగు జాతికి వెన్ను పోటు పోడుస్తున్న నాయకులకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలని మేధావుల వేదిక రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాస్ సూచించారు. మనవేలితో మనకన్నే పొడిచేందుకు ప్యాకేజీలతో మీ ముందుకు వస్తున్నారు మోసపోవద్దు అని హితవు పలికారు. ‘సమైక్య ఉద్యమాన్ని చంపేయాలన్న దుర్మార్గాలు పన్నుతున్న కేంద్ర మంత్రులు, ఎంపీలను తిరగనివ్వకండి.. ప్యాకేజీలకు తలొగ్గి పార్లమెంట్, అసెంబ్లీలో బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి విదేశాలకు వెళ్లి తలదాచుకునే దొంగలు ఉన్నారు.. వీరందరికీ పౌరసన్మానం చేసి వారి ఇళ్లను ముట్టడించండి’ అంటూ పిలుపునిచ్చారు.
కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, పురందేశ్వరి సమైక్యాంధ్రకు ద్రోహం తలపెట్టారని విమర్శించారు. ‘తన ఇంటి పక్కన వ్యక్తికి రేషన్‌కార్డు, తన ఊళ్లో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసుకోలేని పనబాక సీమాంధ్రను మరో సింగపూర్ చేస్తుందట.. వీరి మాటలు నమ్మితే భవితరాలు మనల్ని క్షమించరు.. ఇది యుద్ధ సమయం.. సకల జనులు మరో స్వాతంత్రోద్యమానికి సన్నద్ధం కావాలి’ అని సూచించారు.
ఉద్యమానికి తూట్లు పొడవటం దుర్మార్గం..
తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు లేఖ ఇవ్వటం, ఎన్టీఆర్ తనయ పురందేశ్వరి ప్యాకేజీలు కావాలంటూ సమైక్య ఉద్యమానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించటం దుర్మార్గమని వ్యవసాయ శాఖ రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. సీమాంధ్ర ఎంపీలు డ్రామాలు కట్టిపట్టి రాజీనామాలు చేస్తే విభజన ఆగిపోతుందని స్పష్టంచేశారు. విభజన కోసమే రాష్ట్రాన్ని విభజించటం సరికాదని మొదటి ఎస్సారీలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు.
ప్రాంతీయ కమిటీ వేసి తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని శ్రీకృష్ణకమిటీ తన నివేదికలో స్పష్టంగా సూచించిందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఇరు ప్రాంతాల ప్రజల ఆమోదం లేకుండా విభజన ప్రక్రియ ప్రారంభిస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయని కమిటీ నివేదికలో పొందుపరిచారని వివరించారు. కమిటీ నివేదికను కేంద్రం పక్కనపెట్టి విభజన చర్యలు ప్రారంభించిందని మండిపడ్డారు. రాష్ట్రం ముక్కలైతే నీటి యుద్ధాలు జరుగుతాయని, చుక్కనీరు కూడా డెల్టాకు వచ్చే అవకాశం లేదని, రైతులంతా రోడ్డెక్కి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పరాజు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను నిలదీసి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల జోనల్ కార్యదర్శి వైవీ రావు మాట్లాడుతూ విభజిస్తే ఆర్టీసీకి సంబంధించి విద్యార్థులు రాయితీలు కోల్పోతారన్నారు. ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమంతోనే సమైక్యాంధ్ర సాధించుకోగలుగుతామని స్పష్టం చేశారు. సభలో ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, కేసీపీ సీవోవో జి.వెంకటేశ్వరరావు, అడ్వకేట్ జేఏసీ నేత నరహరిశెట్టి శ్రీహరి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమాన్ని ఉయ్యూరు జేఏసీ కన్వీనర్ పరుచూరి శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
దాడులకు పాల్పడితే ఖబడ్దార్...
ఉయ్యూరు : సమైక్యవాదులపై, ఉద్యోగులు, విద్యాసంస్థలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని సమైక్యాంధ్ర పరిరక్షణవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పర్చూరి అశోక్‌బాబు హెచ్చరించారు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా సరే పరిధి మించి వ్యవహరిస్తే తాము అదే స్థాయిలో ప్రతిఘటించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమానికి అండగా నిలుస్తున్న విద్యాసంస్థలు, ఉద్యమంలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై దాడులు, బెదిరింపులకు ప్రజాప్రతినిధులు పాల్పడుతున్నారని సభలో కొందరు అశోక్‌బాబు దృష్టికి తీసుకొచ్చారు.
ఇటీవలే నూజివీడులో అక్కడి జేఏసీ కన్వీనర్ కుమార్ విషయంలో పోలీసులు అనుచితంగా వ్యవహరించారని, అతని విద్యాసంస్థలపై దాడులు చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై అశోక్‌బాబు స్పందిస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. విద్యాసంస్థలపై, ఉద్యోగులపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. మంత్రులనైనా, ఎమ్మెల్యేలైనా సరే వదిలే ప్రసక్తే లేదన్నారు. సమైక్యాంధ్ర ద్రోహులుగా వ్యవహరించే ఏ ఒక్కరినీ వదలబోమని స్పష్టం చేశారు. నూజివీడులో ఇటీవల చోటుచేసుకున్న ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
సీమాంధ్ర ఎంపీలు అమ్ముడుపోయారు..
Published Mon, Nov 18 2013 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM
Advertisement