పథకాలు రూపొందించేటప్పుడే దోపిడీకి ప్లాన్‌ | State govt is making a Guinness record in corruption | Sakshi
Sakshi News home page

పథకాలు రూపొందించేటప్పుడే దోపిడీకి ప్లాన్‌

Published Mon, Feb 25 2019 2:42 AM | Last Updated on Mon, Feb 25 2019 5:17 AM

State govt is making a Guinness record in corruption - Sakshi

రాజమహేంద్రవరంలో జరిగిన ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌–సేవ్‌ డెమొక్రసీ’ సదస్సులో మాట్లాడుతున్న మాజీ సీఎస్‌ అజేయ కల్లాం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘రాష్ట్రంలో అవినీతి సంస్థాగతంగా మారిపోయింది. అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం గిన్నిస్‌ బుక్‌ రికార్డు సృష్టించేలా ఉంది. స్కీమ్‌లు తయారు చేసినప్పుడే ఏ విధంగా దోచుకోవచ్చో ఆలోచిస్తున్నారు. ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ పనుల అంచనాలను పెంచేసి, సీఎం దగ్గరి నుంచి నాయకులు, ఉద్యోగుల వరకూ పర్సంటేజీలు పంచుకుంటున్నారు. ఇసుక, మట్టిని కూడా పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు’’ అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) అజేయ కల్లాం ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌–సేవ్‌ డెమోక్రసీ’ సదస్సు నిర్వహించారు. పలువురు ప్రముఖులు, మేధావులు, ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, ఇతర పెద్దలు పాల్గొన్న ఈ సదస్సులో అజేయ కల్లాం ప్రసంగించారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్‌ పరంగా 2014 జూలై నాటికి పోలవరం మనిహా మిగిలిన 23 ప్రాజెక్టులకు రూ.17 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా చేశారని, ప్రస్తుతం రూ.51 వేల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోందని, మూడు రెట్లు అధికంగా ఖర్చు పెట్టినా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. హౌసింగ్‌లో అవినీతికి అంతేలేకుండా పోతోందని విమర్శించారు. పక్క రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో చదరపు అడుగుకు అదనంగా రూ.1,000 వరకూ ఖర్చు చేస్తున్నారని చెప్పారు. 10 లక్షల ఇళ్లకు గాను అదనంగా రూ.36,500 కోట్లు ఖర్చు చూపించి, రూ.18,250 కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అజేయ కల్లాం ఇంకా ఏం చెప్పారంటే... 

దిగజారిన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి 
‘‘ఏపీ విభజనకు ముందు రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా కేవలం 23 శాతం. విభజన వల్ల 2014 జూలై నాటికి అది 30.2 శాతానికి పెరిగింది. 2017–18 నాటికి ఈ వాటా 34.4 శాతంగా నమోదైనట్లు శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొంది. కానీ, పరిశ్రమల రంగం వాటా 22.5 శాతం నుంచి 22.1 శాతానికి దిగజారిపోయింది. సేవా రంగం వాటా కూడా 44.6 శాతం నుంచి 43.5 శాతానికి పడిపోయింది. అభివృద్ధి సూత్రం ఏమిటంటే జీడీపీలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతూ పోవాలి. పరిశ్రమలు, సేవా రంగం వాటా పెరగాలి. వాస్తవ లెక్కలు ఇలా ఉంటే గుజరాత్‌ రాష్ట్రం మన రాష్ట్రాన్ని చూసి అసూయ పడుతోందని, అందుకే  ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెబుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. 

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు 
రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు కేవలం 20.28 శాతం ఉండగా, గత ఏడాది 28.2 శాతంగా ఉందని ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొనగా, ప్రస్తుతం 29 శాతం వరకు ఉండవచ్చు. అంతకు ముందు 1995–2004 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో అప్పుల శాతాన్ని స్థూల ఉత్పత్తిలో 29.5 శాతానికి పెంచారు. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 29.5 శాతం ఉన్న అప్పులను 20.28గా తగ్గించింది. 28 శాతం ఉంటే రెడ్‌అలెర్ట్‌. కానీ, ప్రస్తుతం అప్పులను 29 శాతానికి తీసుకువెళ్లి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఆర్‌బీఐ అనుమతి లేకుండా, కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకొస్తున్నారు. ఈ విధంగా నాలుగేళ్లలో బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పు రూ.35 వేల కోట్లుండగా, ప్రస్తుతం మరో రూ.15 వేల కోట్ల అప్పులు చేయడానికి కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ అనుమతి లేకుండా, కేంద్రానికి తెలియకుండా తెస్తున్న అప్పులు రూ.50 వేల కోట్లకు చేరనున్నాయి. ముందు చెప్పిన విధంగా 29 శాతానికి ఇది అదనం. దీన్ని కూడా కలుపుకుంటే రాష్ట్రం తీర్చాల్సిన అప్పు స్థూల ఉత్పత్తిలో 34 శాతం దాటుతుంది. దీన్నుంచి బయటపడాలంటే ఏ రాష్ట్రానికైనా కనీసం రెండు దశాబ్దాలు పడుతుంది. 

చేనేత రంగంలోనూ అదేతీరు 
చేనేత రంగం పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా ఉంది. ఒక్క వైఎస్సార్‌ జిల్లాలో 120 చేనేత సొసైటీలున్నాయి. ఆరు వేల మంది సభ్యులు ఉన్నారు. ఆప్కో చైర్మన్‌గా ఓ వ్యక్తి ఉన్నారు. ఆయన తాలూకు వ్యక్తులతో 80 బోగస్‌ సొసైటీలు పెట్టి, వాటి ద్వారా బట్ట తయారైనట్టు, 2015–16లో రూ.262.75 కోట్ల విలువైన క్లాత్‌ను ఆప్కోకు సరఫరా చేసినట్టుగా చూపారు. 11 కంపెనీల నుంచి మీటరు రూ.30కి కొని, రూ.50కి సొసైటీల ద్వారా అమ్ముకుంటున్నారు. 2015 ఏప్రిల్‌ 1 నుంచి 2018 మార్చి 31 వరకు రూ.75.95 కోట్ల విలువైన బట్ట బోగస్‌గా సరఫరా చేశారు. వాస్తవంగా రూ.29.63 కోట్ల విలువైన బట్ట మాత్రమే సరఫరా చేశారు. మిగిలినదంతా బయటి నుంచి కొనుగోలు చేసి తెచ్చిన బట్ట’’ అని అజేయ కల్లాం పేర్కొన్నారు. 

దోపిడీపై ప్రశ్నిస్తే బురద జల్లుతారా?: విజయ్‌బాబు 
చంద్రబాబు ప్రభుత్వం గోబెల్స్‌ ప్రచారానికి దిగుతోందని సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌ విజయబాబు అన్నారు. ప్రపంచంలో మాకియవెల్లీ ఇజం అనేది ఒకటుందని, దీనిప్రకారం పదవి కోసం ఏ నీచానికైనా దిగజారుతారని, అవసరమైతే వెన్నుపోటు పొడుస్తారని, సీఎం చంద్రబాబు కూడా ఆ బాటలోనే నడుస్తున్నారని విమర్శించారు. దోపిడీపై ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం బురద జల్లుతోందని మండిపడ్డారు. 

పోలవరంపై ప్రజలను ఏమారుస్తున్నారు: ఉండవల్లి అరుణ్‌కుమార్‌
‘‘పోలవరం సందర్శన అంటూ లక్షకు పైగా జనాన్ని తరలించి భోజనాలు కూడా పెడుతున్నారు. ఒక్కసారైనా నేను నా సొంత ఖర్చులతో వచ్చి చూస్తాను. ప్రభుత్వం తరపున ఒక్క అధికారి వచ్చి నేను అడిగిన సమాధానాలకు చెప్పండి అని అడుగుతున్నా స్పందించడం లేదు’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నచ్చిన వ్యక్తులకు పోస్టింగ్‌లు ఇచ్చి, ప్రజలను ఏమారుస్తున్నారని దుయ్యబట్టారు. 

15 శాతం బోగస్‌ ఓట్లు: వి.లక్ష్మణరెడ్డి 
అవినీతి చేయడం తప్పు కాదనే భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఒక్కో ఎమ్మెల్యే రూ.100 కోట్ల నుంచి రూ.1,000 కోట్లు వరకూ సంపాదించారని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గంలో 25 కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదని, నంద్యాల మోడల్‌ ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని 3.6 కోట్ల ఓట్లల్లో 15 శాతం (60 లక్షల ఓట్లు) బోగస్‌ ఓట్లు కొనసాగుతున్నాయని, ఆ బోగస్‌ ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశిస్తాయని చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కోరారు.  

రాష్ట్రంలో అవినీతి శివతాండవం 
మాజీ సీఎస్‌ అజేయ కల్లాం 
పోడూరు: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా అవినీతి శివతాండవం చేస్తోందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి’సీఎస్‌) అజేయ కల్లాం ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో ‘మనకోసం మనం’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాలను దోపిడీ కోసమే భారీగా పెంచుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతి అభివృద్ధి పనిలోనూ 30 శాతం నుంచి 40 శాతం కమీషన్లు, లంచాలు రూపంలో దోపిడీ జరుగుతోందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా జరుగుతున్న ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని పిలుపునిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement