Ajeya Kallam
-
విద్య, వైద్యం, ఉపాధితోనే నిజమైన అభివృద్ధి
భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్): భవనాలు నిర్మించడం, కాలువలు తవ్వడమే అభివృద్ధి కాదని.. అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు లభిస్తేనే నిజమైన అభివృద్ధి అని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పీసీఆర్ కల్యాణ మండపంలో గురువారం ‘ఓపెన్ మైండ్ ఫర్ బెటర్ సొసైటీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ నాడు–నేడు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తన ఉద్యోగానుభవంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే రెండేళ్లు కరోనా విపత్తు వల్ల తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చిందన్నారు. మిగిలిన మూడేళ్ల కాలంలో ఒకపక్క పేదలకు సంక్షేమం, మరోపక్క రాష్ట్రంలో శాశ్వత అభివృద్ధి ప్రణాళికలు రచించారని తెలిపారు. ఐదేళ్లలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో జరిగాయనేందుకు ఉదాహరణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కళాశాలలు, గ్రామ, వార్డు సచివాలయ భవనాలు, విలేజ్ క్లినిక్‌లు, ఆస్పత్రి భవనాలు అని వివరించారు. చంద్రబాబు హయాంలో పేదరికం నిష్పత్తి 7.7 శాతం ఉంటే.. జగన్ పాలనలో 4.19 శాతానికి తగ్గిందన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి కేవలం రూ.3 వేల కోట్ల పెట్టుబడులు వస్తే.. గడచిన ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.78 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. నాడు–నేడు పథకం ద్వారా 45,975 ప్రభుత్వ పాఠశాలలను రూ.18 వేల కోట్లతో అభివృద్థి చేశారన్నారు. ఓపెన్ మైండ్‌తో చర్చించాలి ఓపెన్ మైండ్ ఫర్ బెటర్ సొసైటీ చైర్మన్, ఏపీ ఉన్నత విద్యా రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ ఎన్.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో 34వేల ఉద్యోగాలు ఇస్తే.. జగన్ పాలనలో 2.7 లక్షల ఉద్యోగాలు కల్పించారని వివరించారు. 2018–19 వరకు స్థూల రాష్ట్ర ఉత్పత్తి రూ.7,90,800 కోట్లయితే 2023–24లో రూ.11,66,000 కోట్లు అని చెప్పారు. తలసరి ఆదాయం 2018–19లో రూ.1.54 లక్షల కోట్లు అయితే 2023–24లో రూ.2.20 కోట్లకు పెరిగిందన్నారు. ఆర్టీఐ మాజీ కమిషనర్, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు మాట్లాడుతూ.. గత పాలనతో పోలిస్తే మన రాష్ట్రంలో పేదరికం 50 శాతం తగ్గిందన్నారు. పేదల పిల్లలు ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, మాస్టర్ డిగ్రీ వంటి ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారని, దీనిని మేధావులు గుర్తించాలని కోరారు. -
ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చాయన్న అజయ్ కల్లాం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఇదే కదా సుపరిపాలన
సాక్షి, విశాఖపట్నం : ‘ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2.18 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. ప్రజలకవసరమైన అన్ని సేవలనూ అందుబాటులోకి తెచ్చారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలను సమూలంగా మార్చేశారు. విలేజి/అర్బన్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటుచేశారు. ఫ్యామిలీ డాక్టర్ సదుపాయాన్ని కల్పించారు. పారిశ్రామికంగానూ ఎంతో అభివృద్ధి చేశారు. ఇవేకాదు.. సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు ఇంకెన్నో సంక్షేమ పథకాలను అవినీతికి ఆస్కారంలేకుండా అందజేస్తున్నారు. ఇదేకదా సుపరిపాలన అంటే?’.. అని సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం చెప్పారు. విశాఖలోని ఓ హోటల్లో ఆదివారం జరిగిన ‘ట్రాన్స్ఫార్మింగ్ గవర్నెన్స్’ అనే సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. స్వాతంత్య్రం వచ్చాక 17 వైద్య కళాశాలలు వస్తే ఇప్పుడు 17 ఏర్పాటుకానున్నాయని.. ఇందులో ఐదింటి నిర్మాణం, అడ్మిషన్లు ఇప్పటికే పూర్తయి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన, చేపట్టిన సంస్కరణలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అజేయ కల్లాం చెప్పారు. ప్రభుత్వోద్యోగుల జీతాలు ఇక్కడే ఎక్కువ.. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ప్రభుత్వోద్యోగుల జీతాలు ఏపీలోనే ఎక్కువని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పోలిస్తే 30 శాతం అధికమని ఆయన తెలిపారు. ఏపీలో 2014లో ప్రభుత్వోద్యోగుల జీతాల చెల్లింపులు రూ.18,709 కోట్లుంటే 2023–24లో అది రూ.57,222 కోట్లకు పెరిగిందన్నారు. ఏపీకంటే రెట్టింపు ఉన్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగుల జీతాలు రూ.48 వేల కోట్లేనని చెప్పారు. ఉద్యోగుల అలవెన్సులు, పెండింగ్ క్లియరెన్సుపై ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని అజేయ కల్లాం తెలిపారు. 2.18 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు.. ఇక ఈ ఐదేళ్లలో 2.18 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు వచ్చాయని, వీరిలో 1.35 లక్షల మంది సచివాలయాల ఉద్యోగులేనన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 13 వేల మందికే ఉద్యోగ నియామకాలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ ఊరూరా సచివాలయాలను ఏర్పాటుచేసి రాష్ట్రస్థాయి సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయికి తీసుకొచ్చారన్నారు. ఈ వ్యవస్థలో జరుగుతున్న అద్భుతాలను చూసి తమిళనాడు, కేరళ సహా మరికొన్ని రాష్ట్రాలు అమలుకు సన్నాహాలు చేస్తున్నాయని.. పాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ఏర్పాటుజరుగుతోందన్నారు. అలాగే.. సుదీర్ఘకాలంగా ఉన్న భూ వివాదాల పరిష్కారానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్టును అమలుచేస్తున్నారన్నారు. ఇప్పుడు మరో 12 రాష్ట్రాలు దీని అమలుకు ప్రయత్నిస్తున్నాయని అజేయ కల్లాం చెప్పారు. ఈ విషయంలో కొంతమంది న్యాయవాదులు సృష్టిస్తున్న ఆపోహలను నమ్మొద్దని ఆయన కోరారు. 31లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు.. ఇదిలా ఉంటే.. మరే రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు, పథకాలు అందజేస్తున్న ఘనత ఒక్క మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కొత్త పోర్టులు, హార్బర్లు, ఐటీలు, పరిశ్రమలు వస్తున్నాయని.. మరే రాష్ట్రానికి రాని విధంగా రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీలో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని అజేయ కల్లాం చెప్పారు. ఇలాఅన్నిటా గత ప్రభుత్వాలకంటే ఎన్నో రెట్లు మెరుౖగెన సుపరిపాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరుగుతోందని.. ఈ సుపరిపాలనపై ప్రజలే మంచి తీర్పునిస్తారన్నారు. ఈ సదస్సులో సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్, నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వీసీ బాలమోహన్‌దాస్, డా.బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీ సుధాకర్, కార్తీక్, పలువురు మేధావులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. రైతుల ఆత్మహత్యలే ఆలోచింపజేశాయి ‘1997లో ఏపీలో ఏడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరి ఆత్మహత్యలకు కారణాలపై అప్పటి ముఖ్య కార్యదర్శి జన్నత్ హుస్సేన్ నేతృత్వంలో జరిపిన దర్యాç³#్తలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైతు పంట పెట్టుబడికి రూ.10 వేలు అప్పుచేస్తే రూ.3 లక్షలు చెల్లించాల్సి వస్తోందని, అప్పుల భారంతో పిల్లలను చదివించలేకపోతున్నారని, ఆరోగ్య సమస్యలకు రూ.వేలల్లో, పిల్లల పెళ్లిళ్లకు లక్షల్లో అప్పులు చేయాల్సి వస్తోందని, వాటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తేలింది. ఈ వాస్తవాలను మహానేత వైఎస్ గుర్తించారు. సీఎం అయ్యాక దీనిపై ఆలోచించి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్ వంటివి అమలుచేశారు’ అని అజేయ కల్లాం వివరించారు. -
ల్యాండ్ టైట్లింగ్‌తో భూ వివాదాలకు తెర
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం–2022 వల్ల భూ వివాదాలు, మోసాలను అరికట్టి యాజమాన్య హక్కుపై పూర్తి భరోసా కల్పించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. వాస్తవాలను గమనించకుండా కొన్ని రాజకీయ పార్టీలు, కొంత మంది న్యాయవాదులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు దేశంలోని 12 రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయని, భూములకు శాశ్వత హక్కు రావాలంటే ఈ చట్టం అమలు జరగాలని అన్నారు. యజమాని ఎక్కడున్నా భూమికి రక్షణ అవసరమని, ప్రతి మూడు నెలలకోసారి మొబైల్ ఫోన్లో భూమి వివరాలను చెక్ చేసుకునే సౌలభ్యం ఉంటుందని వివరించారు. ఎవరైనా మార్పులు, చేర్పులకు ప్రయత్నిస్తే మనకు సమాచారం కూడా వస్తుందన్నారు. న్యాయ వ్యవస్థలో 66 శాతం కేసులు, 24 శాతం హత్యలు భూ తగాదాలకు సంబంధించినవే ఉన్నాయని చెప్పారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. వివరాలు ఇలా.. సాక్షి: ఈ చట్టం వల్ల భూ యజమానులకు ప్రయోజనాలేమిటి? కల్లం: ఈ చట్టం కింద నిర్వహించే టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదయితే ఆ భూమికి అతనే యజమాని అనే హామీని ప్రభుత్వం ఇస్తుంది. ఆ భూమిపై హక్కుకు ఈ రికార్డే సాక్ష్యం. ఒకవేళ రికార్డుల్లో ఏదైనా పొరపాటు వల్ల భూమి హక్కులకు భంగం కలిగితే ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది. ఇందుకోసం టైటిల్ ఇన్సూరెన్సు వ్యవస్థ ఏర్పాటవుతుంది. సాక్షి: ఈ చట్టం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి? కల్లం: వ్యవసాయ భూమి కొనుగోలు చెయ్యాలంటే రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ చెల్లించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు చేయించుకోవాలి. ఆ తరువాత ఆర్వోఆర్ చట్ట రిజిస్ట్రేషన్ ప్రకారం తహసీల్దార్ విచారణ చేసి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చెయ్యాలి. కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకేచోట, ఒకేసారి జరుగుతాయి. భూమి కొనుగోలు చేసిన వ్యక్తికి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్ ఉంటే హక్కులకు సంపూర్ణ హామీ ఉన్నట్లే. సాక్షి: రెవెన్యూ రికార్డుల్లో ఎలా నమోదు చేసుకోవాలి? కల్లం: తహసీల్దార్‌కు మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ విచారణ చేసి నమోదు చేస్తారు. పట్టాదారు రికార్డుల్లో పాస్ పుస్తకం జారీ చేస్తారు. కొత్త విధానంలో టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసి, సర్టిఫికెట్ జారీ చేస్తారు. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ప్రాథమిక పరిశీలన చేసి, రికార్డుల వివరాలు, దరఖాస్తుదారు అర్జీల్లో పొందుపరిచి నిర్ధారించి సర్టిఫికెట్ ఇస్తారు. సాక్షి: టైటిల్ రిజిస్టర్లో ఏర్పడే భూ వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? కల్లం: భూమి రికార్డులను రూపొందించిన ఆ రికార్డుల్లో పొరపాట్లను సరి చెయ్యడానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటయ్యింది. భూమి యజమానుల రికార్డు అయినా రిజిస్టర్ 1, 1బిలో తప్పులుంటే సవరణ కోసం ఆర్వోఆర్ చట్టం కింద రెవెన్యూ డివిజనల్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు, జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ దాఖలు చెయ్యవచ్చు. కొత్త చట్టం కింద నిర్వహించే టైటిల్ రిజిస్టర్లో తప్పులుంటే జిల్లా స్థాయిలోని ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్ దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు.టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసిన వివరాలకు సంబంధించి వివాదాలుంటే జిల్లా స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్ దగ్గర అప్పీల్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చే తీర్పుపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చు. సాక్షి: ఈ చట్టం కింద ఏర్పడే నూతన వ్యవస్థలు ఏమిటి? కల్లం: కొత్త చట్టం అమలులోకి వస్తే భూమి హక్కుల రిజిస్టర్‌కు భూమి టైటిలింగ్ ఆఫీసర్లను నియమిస్తారు. టైటిల్ రిజిస్టర్‌పై వివాదాలుంటే పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్లను నియమిస్తారు. ఇప్పుడున్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు అనుబంధ సంస్థలుగా పని చేస్తాయి. సాక్షి: కొత్త చట్టంలో సివిల్ కోర్టుల పాత్ర ఏమిటి? కల్లం: ఆర్వోఆర్ చట్టం కింద నిర్వహించే 1బి రిజిస్టర్లో నమోదు, తప్పొప్పుల సవరణ బాధ్యత సివిల్ కోర్టులకు లేనట్లే. ఈ కొత్త చట్టం కింద నిర్వహించే టైటిల్ రిజిస్టర్లో తప్పులను సవరించే బాధ్యత కూడా సివిల్ కోర్టులకు ఉండదు. వారసత్వ/ఆస్తి పంపకాల వివాదాలు, ప్రస్తుతం కోర్టుల్లో పెండింగులో ఉన్న వివాదాలు, టైటిల్ రిజిస్టర్ తయారీకి సంబంధం లేని ఇతర భూ వివాదాలు సివిల్ కోర్టు పరిధిలోనే ఉంటాయి. కొత్త చట్టం అమలులోకి వచ్చినప్పటికీ, ప్రస్తుతం కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివాదాల వివరాలు టీఆర్‌లో నమోదు చేయించుకోవాలి. అంతిమంగా ఉత్తర్వుల ప్రకారం చర్య తీసుకుంటారు. టీఆర్ నమోదైన వివరాలపై అభ్యంతరాలుంటే హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. సాక్షి: కొత్త చట్టంలో రికార్డులు ఎవరు నిర్వహిస్తారు? కల్లం: ఈ చట్టం కింద మూడు రికార్డులుంటాయి. 1. భూమి హక్కులకు అంతిమ సాక్ష్యంగా ఉండే టైటిల్ రిజిస్టర్, 2. భూ సమస్యలుంటే నమోదు చేసే వివాదాల రిజిస్టర్, 3. భూమిపై ఇతర హక్కులను నమోదు చేసే చార్లెస్ అండ్ కొవనెంట్స్ రిజిస్టర్. ఈ మూడు రిజిస్టర్లను కలిపి రికార్డ్ ఆఫ్ టైటిల్స్ అంటారు. ఈ రికార్డులను ల్యాండ్ అథారిటీ, సంబంధిత అధికారులు నిర్వహిస్తారు. సాక్షి: అభ్యంతరాలుంటే ఎంత కాలంలో తెలపాలి? కల్లం: టైటిల్ రిజిస్టర్లో ఉన్న వివరాలపై అభ్యంతరాలు ఉంటే ఆ వివరాలు నమోదైన రెండు సంవత్సరాల లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆర్వోఆర్ చట్ట ప్రకారం రూపొందిన రిజిస్టర్–1లో అభ్యంతరాలుంటే సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ 1బిలో నమోదు చేసిన వివరాలపై అభ్యంతరాలుంటే 90 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఈ చట్టంలో అత్యధికంగా రెండేళ్ల కాల వ్యవధి ఇచ్చారు. సాక్షి: కొత్త చట్టం హక్కులకు భద్రతా? భంగమా? కల్లం: హక్కులకు పూర్తి భద్రత చేకూర్చడం, భూ యజమానులకు ప్రభుత్వమే భరోసాగా ఉండడమే ఈ చట్టం ఉద్దేశం. భూములన్నింటికీ ఒకే రికార్డు ఉండటం, ఈ రికార్డును ఆన్లైన్లో పూర్తి రక్షణతో అందరికీ అందుబాటులో ఉంచడం వలన పారదర్శకత వస్తుంది. తారుమారు చేసే అవకాశం లేకుండా రికార్డులు నిర్వహిస్తారు. ఈ చట్టం వలన భూ వివాదాలు భారీగా తగ్గుతాయి. కొత్తగా భూ యాజమాన్య వివాదాలు ఏర్పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. కోర్టులు ఇచ్చిన తీర్పులను ఈ చట్టం కింద నమోదు చేసుకోవాలి. ఆ వివరాలకు ప్రభుత్వ గ్యారెంటీ లభిస్తుంది. టైటిల్ రిజిస్టర్లో క్లరికల్ తప్పిదాలుంటే టీఆర్ఓ వద్ద అప్పీలు చేసుకోవాలి. సాక్షి: ఇలాంటి చట్టం ఎక్కడైనా ఇప్పటికే అమలులో ఉందా? కల్లం: టైటిల్ గ్యారెంటీ చట్టం ఆస్ట్రేలియా, రష్యా, అమెరికా, కెనడా, బ్రిటన్, కామన్వెల్త్, తదితర వంద దేశాల్లో అమల్లో ఉంది. సాక్షి: కొత్త చట్టంలో భూమి కొనుగోలు చేస్తే కలిగే ప్రయోజనాలేమిటి? కల్లం: ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే భూమి కొనుగోలు చేసే ముందు టైటిల్ రిజిస్టర్లో వివరాలు చూసుకుంటే చాలు. పాత విధానంలో ఆర్ఎస్ఆర్ నుంచి ప్రస్తుత అడంగల్ వరకూ ప్రతి సంవత్సరం రికార్డు పరిశీలించాల్సిన అవసరం ఉండదు. టైటిల్ రిజిస్టర్లో పేరుంటే ప్రభుత్వ భరోసాతో భూమి కొనుగోలు చెయ్యవచ్చు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకేసారి సులభంగా జరిగిపోతాయి. రిజిస్ట్రేషన్ జరిగిందంటే భూమి హక్కుల బదిలీ జరిగినట్టే. అన్ని రకాల భూములకూ ఈ చట్టం వర్తిస్తుంది. అన్ని రకాల భూములకు ఒకటే రిజిస్టర్ ఉంటుంది. సాక్షి: తగాదాలు వస్తే ఎవరు పరిష్కరిస్తారు? కల్లం: వివాదాలుంటే సర్వే, హద్దుల చట్టం కింద సంబంధిత అధికారులను కానీ, సివిల్ కోర్టును కానీ ఆశ్రయించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య భాగ పంపిణీ, వారసత్వ తగాదాలు ఉంటే సివిల్ కోర్టులు పరిష్కరిస్తాయి. ఆస్తి పన్నులు, ఇతర వివాదాలు, కేసులు ఉంటే న్యాయస్థానాలు పరిష్కరిస్తాయి.రికార్డుల వివరాలపై అభ్యంతరాలుంటే చట్టంలో పేర్కొన్న కాల వ్యవధిలో ఎల్‌టీఏఓ, అప్పీలు వేసి, వివరాలు టీఆర్ఓ వద్ద నమోదు చేసుకోవాలి. అప్పీల్ చేసుకోకపోతే ఆ భూమిపై హక్కులకు ప్రభుత్వ గ్యారెంటీ లభించదు. ప్రస్తుతం సివిల్ కోర్టులో ఉన్న వివాదాల్లో వచ్చే అంతిమ తీర్పు ప్రకారమే టైటిల్ రిజిస్టర్లో హక్కుల నమోదు జరుగుతుంది. కానీ కోర్టుల్లో వివాదంలో ఉన్న వివరాలు టీఆర్ఓ వద్ద నమోదు చేయించుకుని, ఆ సర్టిఫైడ్ కాపీని సంబంధిత కోర్టుకు తెలియజేయాలి. -
భూసమస్యలన్నీ పరిష్కారమయ్యేలా...
దాదాపు వందేళ్ళ క్రితం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ సర్వేలో భూమిని అనుభవిస్తున్న వారి వివరాలతో వాటి వాస్తవ స్థితిని నిర్ధారించారు. అయితే రెవెన్యూ రికార్డులను సరిగ్గా అప్డేట్ చేయకపోవడం, వివిధ చట్టాల్లో తీసుకువచ్చిన మార్పుల కారణంగా క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, వ్యత్యాసాలు భూమి రికార్డుల్లో నమోదు కాలేదు.ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ చట్టాన్ని (భూ యాజ మాన్య హక్కు చట్టం) తెచ్చింది. భూ యాజమాన్య హక్కులకు సంబంధించి ఎదురవుతున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి డ్రోన్లు, విమానాల ద్వారా భూముల రీ సర్వే చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి భూకమతంలో పట్టాదారు వాస్తవ స్థితిని ధ్రువీకరించేలా సర్వే జరుగుతోంది. భారతీయుల్లో భూమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సమాజంలోని అన్ని వర్గాల సంస్కృతులు భూ యాజమాన్యానికి అనుకూలంగా ఉండడం వల్ల అందరూ దాన్ని కోరుకుంటారు. దేశంలోని గ్రామీణ కుటుంబాల మొత్తం ఆస్తిలో భూమి 73 శాతం ఉండగా, పట్టణ గృహాల ఆస్తిలో భూమి, భవనాలు 90 శాతం ఉన్నట్లు 2013 ఎన్ఎస్ఎస్ఓ నివేదికలో తేలింది. అందుకే పెట్టుబడిదారులు, రుణదాతలు, బ్యాంకర్లు స్పష్టమైన టైటిల్, స్పష్టమైన ల్యాండ్ మ్యాపింగ్, రికార్డుల నిర్వహణ, స్పష్టమైన హక్కులు ఉండాలని కోరుకుంటారు. కానీ మెకెన్సీ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో దేశంలోని ఎక్కువ భూముల యాజమాన్యానికి సంబంధించి చట్టపరమైన వివాదాలున్నాయని తేలింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా భూముల వివాదాలు 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. కానీ మన దేశంలో దాదాపు 70 శాతం సివిల్ వివాదాలున్నాయి. ప్రస్తుత రెవెన్యూ రికార్డులు ప్రాథమికంగా బ్రిటిష్ ప్రభుత్వం 100 ఏళ్ల క్రితం నిర్వహించిన సర్వే ఆధారంగా రూపుదిద్దుకున్నాయి. అవన్నీ ప్రభుత్వానికి భూముల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని సేకరించే లక్ష్యంతో రూపొందించినవి. స్వాతంత్య్రం వచ్చాక కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని సాగు చేసేవారికి సురక్షితమైన హక్కులు ఉండేలా ప్రోత్సహించడానికి అనేక భూ సంస్కరణలు ప్రవేశపెట్టాయి. ‘ఎస్టేట్లు – ఇనామ్ నిర్మూలన చట్టం’, ‘వ్యవసాయ భూముల సీలింగ్ చట్టం’, ‘పీఓటీ’ చట్టం, ‘ఆర్ఓఎఫ్ఆర్’ వంటి చట్టా లను వరుసగా వచ్చిన ప్రభుత్వాలు సాగుదారులకు అనుకూలంగా తీసుకువచ్చాయి. భూముల యాజమాన్యంలో జరిగిన ఈ మార్పు లన్నీ రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కినా... కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల క్రమం తప్పకుండా నవీకరణ (అప్డేట్) అవలేదు. దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగిన సర్వేలో భూమిని అను భవిస్తున్న వారి వివరాలతో వాటి వాస్తవ స్థితిని నిర్ధారించినా... రెవెన్యూ రికార్డులను సరిగ్గా అప్డేట్ చేయకపోవడం, వివిధ చట్టాల్లో తీసుకువచ్చిన మార్పుల కారణంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థి తులు, వ్యత్యాసాలు భూమి రికార్డుల్లో నమోదు కాలేదు. ఈ సమస్య లను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ చట్టాన్ని ప్రవేశపెట్టింది. అలాగే ఆ చట్టాన్ని సవరించడం ద్వారా గ్రామాల వారీగా ప్రతి వ్యక్తి అధీనంలో ఉన్న భూమి వివరాలను రికార్డుల్లో అప్డేట్ చేసింది. ఇలా హక్కుల రికార్డును ప్రవేశపెట్టిన తర్వాత కూడా భూ వివాదాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుత రెవెన్యూ రికార్డులు ఊహాజనిత హక్కును మాత్రమే కల్పిస్తాయి. కొన్ని కేసుల్లో రికార్డులు క్షేత్ర స్థాయి పరిస్థితికి విభిన్నంగా ఉంటాయి. కోర్టు కేసులు, వారసత్వాలు, తనఖా వంటి భూమికి సంబంధించిన వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించే ఎలాంటి ఒకే ఒక్క మూలాధారం ప్రస్తుత రికార్డుల్లో లేదు. దీనివల్ల భూ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం రాష్ట్రం మొత్తాన్ని డ్రోన్లు, విమానాల ద్వారా భూముల రీ సర్వే చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి భూ కమతంలో పట్టాదారు వాస్తవ స్థితిని ధ్రువీకరించేలా సర్వే జరుగుతోంది. భూ యాజమాన్యంపై ఉన్న గందరగోళాన్ని తొలగించేలా రీ సర్వేలో ప్రతి భూభాగానికి జియో రిఫెరెన్స్ ఇస్తున్నారు. భూమి, దానికి సంబంధించిన రికార్డులను అనేక శాఖలు (రెవెన్యూ, పంచాయితీ రాజ్, పట్టణ స్థానిక సంస్థలు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, రిజిస్ట్రేషన్ శాఖలు) నిర్వహిస్తుండడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతోంది. అలాగే పౌరులు వాటికి సంబంధించిన అనుమతులు, సేవలు పొందేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ పరిస్థితి ఎందుకంటే? భూమి యాజమాన్యం సార్వభౌమాధికారంతో ఉంటుందని దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం. అనేక అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా నిశ్చయాత్మకమైన టైటిల్ విధా నానికి (కన్‌క్లూజివ్ టైటిల్ విధానం) మన దేశం వెళ్లలేదు. ఇప్పుడు ఉన్న ల్యాండ్ టైటిల్ విధానం... యాజమాన్యాన్ని ధ్రువీకరించే నిశ్చ యాత్మక టైటిల్‌కు విరుద్ధంగా ‘అనుకూల టైటిల్ కాన్సెప్ట్’ (ప్రిజెమ్టివ్ టైటిల్) ఆధారంగా రూపొందించబడింది. అంటే భూమి అధీనంలో ఉన్న వ్యక్తి సదరు భూమికి సంబంధించి రెవెన్యూ శాఖకు పన్ను చెల్లిస్తున్న వ్యక్తిగా భావించబడే అర్థంలో ఇచ్చిన టైటిల్ మాత్రమే. అది కూడా ‘1872 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్’ ప్రకారం చట్టపరమైన స్వాధీనమే. భూమిపై లావాదేవీ జరిగినప్పుడు కూడా టైటిల్ వెరిఫి కేషన్ అవసరం లేని వ్యవస్థ కారణంగా భూమి టైటిల్ విధానం పేల వంగా ఉంది. ‘1908 ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్’ కూడా పత్రాల నమోదుకు సంబంధించిన చట్టమే తప్ప భూమి లేదా టైటిల్ రిజి స్ట్రేషన్‌కి సంబంధించినది కాదు. 1982 ఆస్తి బదిలీ చట్టానికి యాజ మాన్యం యొక్క ధ్రువీకరణ అవసరం లేదు. భూమి లావాదేవీల విషయంలో ఆదాయాన్ని పెంచడానికి మాత్రమే ఈ చట్టాలు పరిమి తమయ్యాయి. ఆ భూముల యాజమాన్యానికి సంబంధించి ఏదైనా ప్రశ్న తలెత్తితే, అది తనదేనని నిరూపించుకోవాల్సి బాధ్యత యజమా నిపైనే ఉంటుంది. తక్షణ సంస్కరణలు అవసరం ఈ నేపథ్యంలో భూ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు ఎలా ముందుకు వెళ్లాలో సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్‌ను నియమించింది. ఈ ‘టైటిల్ సర్టిఫికేషన్ టాస్క్‌ఫోర్స్’ ఒక సమగ్రమైన భూమి టైటిల్ వ్యవస్థను దేశంలో వీలైనంత త్వరగా తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించింది. దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2011లో ఒక ముసాయిదా ల్యాండ్ టైట్లింగ్ బిల్లును తీసు కువచ్చింది. నిశ్చయాత్మకమైన ఆస్తి హక్కుల (కన్‌క్లూజివ్ ప్రాపర్టీ టైటిల్స్) వ్యవస్థను ఏర్పాటు చేయడం, పాలన, నిర్వహించడం దీని ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా అనుసరించే ‘టోరెన్స్’ వ్యవస్థ ఆధారంగా దీన్ని రూపొందించారు. టోరెన్స్ వ్యవస్థ 3 సూత్రాలతో ఉంటుంది. 1. మిర్రర్ సూత్రం. ఇది టైటిల్ రిజిస్ట్రేషన్‌ను సూచిస్తుంది. క్షేత్ర స్థాయి వాస్తవికత (గ్రౌండ్ రియాలిటీ)ను కచ్చితంగా ప్రతిబింబిస్తుంది. 2. కర్టెన్ సూత్రం. ఇది గతానికి అడ్డుగా ఒక తెర ఉన్నన్నట్లు సూచిస్తుంది. టైటిల్‌ను రిజిస్టర్లో టైటిల్ నమోదు కావడమే ప్రస్తుత టైటిల్ నిశ్చయాత్మక రుజువు అనీ, గతాన్ని పరిశోధించాల్సిన అవ సరం లేదనీ చెబుతోంది. 3. హామీ సూత్రం. ఇది టైటిల్‌ను రిజిస్టర్ చేసే క్రమంలోనూ, భూ యజమానులకు జారీ చేసే ధ్రువీకరణ పత్రాలలోనూ దొర్లే తప్పు లకు నష్టపరిహారానికి ప్రభుత్వ సంస్థల హామీని ఇస్తుంది. ఇది కోర్టుల్లో కూడా చెల్లుబాటయ్యే పూర్తి అజేయమైన యాజమాన్య ధ్రువీకరణ పత్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ శాసనసభ 2019లో ‘ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టా’న్ని ఆమోదించి దాన్ని భారత రాష్ట్రపతి అంగీకారం కోసం పంపింది. దాన్ని అందుకున్న కేంద్రం భూమి వ్యవహారాలు పర్యవేక్షించే కేంద్ర ఎల్ఓఆర్, ఐటీ, న్యాయ తదితర శాఖల పరిశీలనకు పంపింది. ఆ యా శాఖలు కొంత సమయం తీసుకుని ఈ చట్టంపై అభిప్రా యాలు, వ్యాఖ్యలు పంపారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం అందుకనుగుణంగా టైట్లింగ్ బిల్లుకు పలు సవరణలు చేసి శాసనసభకు పంపింది. దీనిని 2023లో సభ ఆమోదించింది. ఆ బిల్లును మళ్లీ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా ఇటీవలే దానికి ఆమోదం లభించింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని నోటిఫై చేసి అమలు చేయడానికి కావల్సిన నియమాలు, మార్గదర్శకాలను రూపొందిస్తోంది. కానీ చర్చించకుండా హడావిడిగా చట్టం తెచ్చారని కొందరు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది. రెండు సార్లు పూర్తిగా చర్చించి సంతృప్తి చెందిన తర్వాతే అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది. మన దేశంలో చట్టాలు ఇదే విధానంలో రూపుదిద్దు కుంటాయి తప్ప వేరే విధానంలో కాదు. ప్రజాస్వామ్యంలో చట్ట సభలు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. రాజ్యాంగ సవరణలు కూడా ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లవు. దీన్ని సమగ్రంగా పరిశీ లించడానికి, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు పలు దఫాలుగా పంపిన వివరణలు చూసి ఆమోదించడానికి కేంద ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టింది. భూముల వ్యవహారంలో రెవెన్యూ శాఖ సమర్థతను ప్రశ్నిస్తూ కొందరు వ్యక్తులు పత్రికలకు ఎక్కడం కూడా దురదృష్టకరం. బహుశా ఈ దేశంలో భూ యాజమాన్య వ్యవస్థల పరిణామం గురించి వారికి తెలియకపోవచ్చు. బ్రిటిష్‌వారు మొదటిసారిగా రైత్వారీ సెటిల్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, రెవెన్యూ సిబ్బంది అయిన సెటిల్మెంట్ అధికారులే భూమిని అనుభవిస్తున్న ప్రజలకు హక్కులు ఇచ్చారు తప్ప వేరే వారు కాదు. ఆర్ఓఆర్, ఎస్టేట్ల రద్దు, ఇనాం రద్దు, ల్యాండ్ సీలింగ్ వంటి భూమికి సంబంధించిన ప్రతి చట్టంలోనూ హక్కుదారులకు సంబంధించిన అంశాలను పరిష్కరించే అధికారం రెవెన్యూ అధికారులకే ఉంది. భూ సమస్యలను పరిష్కరించడంలో, పట్టా హక్కులు లేదా యాజమాన్య హక్కులు ఇవ్వడంలో రెవెన్యూ సిబ్బందికి మించిన జ్ఞానం ఎవరికీ ఉండదు. రెవెన్యూ సిబ్బందికి భూ చట్టాలు/సమస్యలను అర్థం చేసుకునే సామర్థ్యం లేదని చెప్పడం సరికాదు. అదే సందర్భంలో ఏ సీనియారిటీ ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను నియమిస్తారనే విషయం రాష్ట్ర ప్రభు త్వానికే వదిలేయాలి. అన్ని వివరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను ఖరారు చేస్తుంది. చట్టం ప్రకారం అప్పీలేట్ అధికారులుగా సర్వీసులో ఉన్న లేదా రిటైర్ అయిన జాయింట్ కలెక్టర్ స్థాయి కంటే తక్కువ కాకుండా ఉన్న వారే నియమితులవుతారు. అప్పీలేట్ అధికారులుగా ఎవరిని నియ మించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయించలేదు. ఈ దశలో ఎవరికి నచ్చినట్లు వారు ఊహించుకోవడం సరికాదు. టైటిల్ రిజిస్టర్లో నమోదైన ఎంట్రీలపై అప్పీల్ చేసుకునేందుకు రెండేళ్ల సమయం ఎలా సరిపోతుందని కొందరు ప్రశ్నించారు. ఇది చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. మ్యుటేషన్ చట్టం, ఆర్ఓఆర్ వంటి ఏ ఇతర చట్టాల ప్రకారమైనా రికార్డింగ్ అధికారి నిర్ణయాన్ని సవాలు చేయడానికి చరిత్రలో ఎన్నడూ కొన్ని వారాల కంటే ఎక్కువ సమయం ఇవ్వలేదు. రికార్డింగ్ అధికారి నిర్ణయాన్ని సవాలు చేయడానికి కొన్ని వారాల సమయం మాత్రమే ఇస్తారు. కానీ ల్యాండ్ టైట్లింగ్ చట్టంలో రెండు సంవత్సరాల సమయం ఇచ్చారు. పైన చెప్పిన టోరెన్స్ వ్యవస్థ ప్రకారం పునఃసమీక్ష, పరిష్కారం తర్వాత, రికార్డింగ్ చేయబడుతుంది, ఇది తాత్కాలికంగా మాత్రమే పరిగణించబడుతుంది. ఈ ప్రక్రియలో పట్టాదారులకు నోటీసులు ఇవ్వబడతాయి. ఈ తాత్కా లికాన్ని సవాలు చేయడానికి ప్రజలకు 2 సంవత్సరాల సమయం ఇస్తారు. 2 సంవత్సరాలలోపు ఎటువంటి ఛాలెంజ్ లేకపోతే, తాత్కా లికమే ఫైనల్ అవుతుంది. ఈ విషయంలో పరిమితి చట్టంలోని నిబంధనలను కోట్ చేయడం అసంబద్ధం. అజేయ కల్లం వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు -
Viveka Case: నా వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేశారు
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ.. హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషీట్లో తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నా వాంగ్మూలంపై సిబిఐ తప్పుడు వైఖరి "ఏప్రిల్ 29న నేను వాంగ్మూలం ఇస్తుండగా.. అధికారి మరొకరిని లోపలికి పిలిచారు. ఆయన లాప్‌ట్యాప్‌తో వచ్చి ఏదో రికార్డు చేసుకున్నాడు. ఆయన ఏం రికార్డు చేసింది నాకు చూపించలేదు. కనీసం చదివి వినిపించలేదు. నాకు తెలిసినంతవరకు నా వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో రికార్డు కూడా చేయలేదు. సీబీఐ నా స్టేట్మెంట్ను తప్పుడు రికార్డు చేసినట్లు మే 17న ఓ పత్రికలో ప్రచురితమైన వార్త ద్వారా తెలుసుకున్నా". విచారించింది ఒకరయితే, సంతకం చేసింది మరొకరా? "నా స్టేట్మెంట్పై సంతకం చేసిన అధికారి, నన్ను విచారించిన అధికారి ఒకరు కాదు. దర్యాప్తు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాజ్యాంగ ధర్మాసనాలు పదేపదే చెబుతున్నా.. కొందరు మాత్రం వాటిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తు చేయడం అంటే అస్పష్టమైన సత్యాన్ని బయటికి తీసుకురావడం. కానీ, ఇక్కడ అధికారులు అలా వ్యవహరించలేదు." నా వాంగ్మూలం పత్రికకు సిబిఐ ఎలా లీక్ చేస్తుంది? "నా వాంగ్మూలం గురించి నేను ఎవరి వద్దా ప్రస్తావించలేదు. కానీ, ఆ పత్రికలో ఎలా వచ్చిందో నాకు అర్థంకాలేదు. ఆశ్చర్యం వేసింది. ఆ పత్రికలో పేర్కొన్నదంతా అసత్యపూరితం. పత్రికలో వచ్చిన దానిపై ఎలక్ట్రానిక్ మీడియా చర్చా కార్యక్రమాలు పెట్టడంతో నేను విలేకరుల సమావేశం పెట్టి.. ఆ పత్రికది కట్టుకథ అని చెప్పాల్సి వచ్చింది. సీబీఐ నమోదు చేసింది కూడా నేను చెప్పింది కాదని తెలిసింది. అయితే సీఆర్పీసీ 161 కింద రికార్డు చేసిన కాపీ నావద్ద లేనందున నా వాంగ్మూలం తప్పుగా పేర్కొన్న విషయాన్ని తెలుసుకోలేకపోయా" నేను చెప్పింది ఒకటయితే సిబిఐ మరోలా స్టేట్ మెంట్ తయారు చేస్తుందా? "ఏప్రిల్ 29, 2023న సీబీఐ నా నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. నేను చెప్పింది ఒకటయితే CBI దాన్ని మార్చి ఛార్జిషీటులో మరోలా పేర్కొంది. మార్చి 15, 2019న జగన్ గారి నివాసంలో సుమారు ఉదయం 5 గంటల సమయంలో మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన సుమారు గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారు. OSD కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్‌గారు షాక్‌కు గురైయ్యారు. చిన్నాన్న చనిపోయారని తమతో అన్నారు" ఇంతకుమించి తానేమీ సీబీఐకి చెప్పలేదని అజేయ కల్లం స్పష్టం చేశారు. నేను చెప్పని విషయాలు మీరేలా స్టేట్ మెంట్ లో చేర్చుతారు? తాను CBIకి స్టేట్మెంట్లో కేవలం పైన పేర్కొన్న విషయాన్ని మాత్రమే చెప్పానని, కాని సీబీఐ ఛార్జిషీటులో వీటిని మార్చివేసిందని అజేయ కల్లం తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి భార్య ప్రస్తావన కాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదని అజేయ కల్లం తెలిపారు. అయితే సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో తనకు ఆపాదించి, తాను చెప్పినట్టుగా అబద్ధాలను చేర్చారని అజేయకల్లం పిటిషన్ లో పేర్కొన్నారు. CBI దాన్ని తొలగించాల్సిందే "దురదృష్టవశాత్తు నేను చెప్పింది CBI సరిగ్గా రికార్డు చేయలేదు. చార్జిషీట్లో సీబీఐ పేర్కొంది పూర్తిగా అసంబద్ధం. దర్యాప్తును తప్పుదారి పట్టించి.. ఇతరులను కేసులో ఇరికించే ధోరణితోనే సీబీఐ ఇలా తప్పుగా పేర్కొంది. నేను చెప్పకున్నా చెప్పినట్లు సీబీఐ తప్పుడు వాంగ్మూలాన్ని సమర్పించడం ఎంతమాత్రం సరికాదు. ఇతర వ్యక్తులను చిక్కుల్లో పడేసేందుకే సీబీఐ తప్పుడు సమాచారం చేర్చింది. ఈ అంశాలను పరిశీలించి హైదరాబాద్ సీబీఐ కోర్టులో సమర్పించిన చార్జిషీట్ నుంచి తప్పుడు వాంగ్మూలాన్ని తొలగించాలి". తెలంగాణ హైకోర్టు ఆ ఛార్జ్ షీట్ నుంచి తన వాంగ్మూలం తొలగించేలా ఆదేశాలివ్వాలని అజేయ కల్లం విజ్ఞప్తి చేశారు. వివక్ష లేకుండా విచారణ జరగాలి సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేయడం చట్టవిరుద్ధమని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని అజేయకల్లం విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ లో సీబీఐ డైరెక్టర్ని, వివేకా కేసు విచారణాధికారి (ఏఎస్పీ)ని ప్రతివాదులుగా చేర్చారు. -
నూతన విద్యా విధానంతో ఉజ్వల భవిష్యత్తు
బంగారుపాళెం: నూతన విద్యా విధానంతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, రిటైర్డ్ సీఎస్ అజేయ కల్లం అన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలంలోని నల్లంగాడు, తుంబకుప్పం గ్రామ సచివాలయాలను గురువారం ఆయన సందర్శించారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై అక్కడి సిబ్బందిని ఆరా తీశారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా.. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం ద్వారా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు అడిగిన ప్రశ్నకు అజేయ కల్లం సమాధానం ఇస్తూ.. గతంలో 2, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లి చదువులు సాగించిన విషయాన్ని గుర్తుచేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులందరూ కలిసి చదువుకోవడం వల్ల తెలివితేటలు బాగా ఉండేవని, పిల్లల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొని ఉండేదని తెలిపారు. ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న విద్యావిధానం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తోందని చెప్పారు. అజేయ కల్లంను జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి, ఎంపీపీ అమరావతి, వైస్ ఎంపీపీ శిరీష్‌రెడ్డి, సర్పంచులు ధనంజయరావు, లీలావతమ్మ, రంజిత్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్ బెన్రాజ్, ఇన్చార్జి ఎంపీడీవో సందీప్ మర్యాద పూర్వకంగా కలిశారు. -
ఆయుర్వేదం విశిష్టమైన వైద్య విధానం: అజేయ కల్లం
సాక్షి, అమరావతి: ఆయుర్వేద వైద్యం అనేది వేదాలు, పంచ భూతాల ఆధారంగా ప్రకృతి పరంగా అందించబడిన విశిష్టమైన వైద్య విధానమని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. సీఎం వైఎస్ జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సచివాలయం మూడో బ్లాక్‌లో ఏపీ రాష్ట్ర ఆయుష్ విభాగం, సచివాలయ ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆయుర్వేద మెగా ఆరోగ్య శిబిరాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఆయుష్ కమిషనర్ కల్నల్ రాములు మాట్లాడుతూ ఈ మెగా వైద్య శిబిరం ద్వారా వివిధ సాధారణ వ్యాధులకు నిపుణులైన వైద్యులచే ఉచితంగా పలు సలహాలు సూచనలతోపాటు అవసరమైన మందులను ఉచితంగా పొందవచ్చన్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య శిబిరంలో 10 మంది ఆయుర్వేద వైద్య నిపుణులు, ఐదుగురు హోమియో వైద్య నిపుణులు, ఐదుగురు యోగా గురువులతో పాటు మొత్తం 40 మంది వైద్య బృందం పాల్గొంటున్నట్లు చెప్పారు. అంతకు ముందు సీఎం జన్మదినోత్సవం సందర్భంగా అజేయ కల్లం కేక్ కట్ చేసి ‘ఆయుష్ ద్వారా ఆరోగ్యం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
‘సమీకృతం’గా రైతులకు సాధికారత
గుంటూరు రూరల్: సమీకృత విధానంలో వ్యవసాయం ద్వారా రైతుల సాధికారత దిశగా కృషిచేయాలని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం సూచించారు. గుంటూరు సమీపంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సమీకృత వ్యవసాయం ద్వారా రైతుల సాధికారతపై నిర్వహించిన రెండురోజుల జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. రెండోరోజు సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అజేయ కల్లం మాట్లాడుతూ రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నదాతలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి నేతృత్వంలో 11 విభాగాలపై చర్చలు జరిపి రైతుల అభివృద్ధికి తీర్మానాలు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎ.విష్ణువర్థన్‌రెడ్డి , డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ టి.జానకిరాం, మాజీ ఉపకులపతి డాక్టర్ రాఘవరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ త్రిమూర్తులు, అగ్రివిుషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు డాక్టర్ ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ కె.గురవారెడ్డి, రైతులు, పాల్గొన్నారు. -
భూముల రీసర్వే ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీసర్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని రాష్ట్రస్థాయి స్టీరింగ్, ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో భూముల రీసర్వే ప్రాజెక్టుకు సంబంధించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న అర్బన్ సర్వే పైలట్ ప్రాజెక్టు పూర్తి కానుండగా, త్వరలోనే ఇతర పట్టణాలకు విస్తరించనున్నామని ఆశాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సర్వే, సెటిల్మెంట్, భూమి రికార్డుల కమిషనర్ సిద్దార్థ జైన్ మాట్లాడుతూ..రీసర్వే పనులకు అవసరమైన పరికరాల కొనుగోలు టెండర్లను వెంటనే పిలవాలని కమిటీ నిర్ణయించిందన్నారు. సరిహద్దుల వద్ద భూరక్ష రాళ్లను వెంటనే ఏర్పాటు చేసేందుకు స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. -
అది టీడీపీ ఎమ్మెల్సీ పీఆర్వో పనే
మంగళగిరి: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లంతో పాటుకొందరు విలేకరులపై సోషల్ మీడియాలో దు్రష్పచారానికి పాల్పడింది టీడీపీ ఎమ్మెల్సీ పీఆర్వో చైతన్య, ఎమ్మెల్సీ అనుచరులేనని పోలీసుల విచారణలో తేలింది. విద్యుత్ శాఖలో ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసిన కేసుతో పాటు అదే ఉద్యోగాలకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసిన ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు మంగళగిరి సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 2017లో ఎమ్మెల్సీ, మంత్రికి అనుచరుడిగా ఉన్న మంగళగిరికి చెందిన గాలి వెంకట లారెన్స్ పట్టణంలోని కొత్తపేటకు చెందిన కారంచేటి మణికాంత్‌కు విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.23 లక్షలు తీసుకున్నాడు. మూడేళ్లు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడం, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మణికాంత్ ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్న కోలపల్లి సునిల్‌కుమార్ కీలకపాత్ర వెలుగులోకి వచ్చింది. అతనితోపాటు ఎమ్మెల్సీకి మరో సన్నిహితుడు లారెన్స్ పేరు బయటకు రావడంతో పీఆర్వో చైతన్య దీన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడ వేశాడు. ఎమ్మెల్సీకి కేసు చుట్టుకుంటుందనే భావనతో ఉద్యోగాల పేరిట వసూళ్లకు సంబంధించి అజేయ కల్లం, ఆర్కే, సాక్షి విలేకరిపై దుష్ప్రచారానికి పూనుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో లారెన్స్, కొప్పూరి వేణును అరెస్ట్ చేసినట్టు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
నా పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోంది
సాక్షి, అమరావతి: మంగళగిరి ప్రాంతానికి చెందిన కొందరు ఓ ముఠాగా ఏర్పడి.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తన పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు వాట్సాప్ పోస్టుల ద్వారా తన దృష్టికి వచ్చిందని డీజీపీ గౌతం సవాంగ్‌కు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం బుధవారం ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించాల్సిందిగా కోరారు. ఈ ఆరోపణల మీద సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విచారణలో ఈ వార్తలు తప్పని తేలితే.. వాట్సాప్ మెసేజ్‌లు ఎక్కడ్నుంచి పుట్టుకొచ్చాయో.. వాటికి కారకులెవరో? గుర్తించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అజేయ కల్లం డీజీపీని కోరారు. -
నా పేరుతో మోసాలు: అజేయ కల్లం
సాక్షి, గుంటూరు: మంగళగిరికి చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి తన పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతున్నట్లు ఏపీ సీఎం ప్రధాన సలహాదారు, మాజీ సీఎస్ అజేయ కల్లం బుధవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ముఠా తన పేరును వాడుకుని జూనియర్ లైన్మెన్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. వాట్సప్ పోస్టుల ద్వారా ఈ విషయం తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డీజీపీని కోరారు. ఒకవేళ విచారణలో ఈ వార్తలు తప్పని తేలితే వాట్సప్ మేసేజ్‌లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి, వాటికి కారకులేవరో గుర్తించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. -
గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి బ్యూరో: గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శనీయంగా నిలిచిందని ఏపీ సీఎం సలహాదారు, మాజీ సీఎస్ అజేయ కల్లం అన్నారు. ఏఎన్‌యూలో ‘గ్రామీణ భారతదేశ సుస్థిర అభివృద్ధి పయనం–అభినందనీయమైన గ్రామ సచివాలయ వ్యవస్థ’ అనే అంశంపై సోమవారం సదస్సు జరిగింది. సదస్సులో అజేయ కల్లం ఆన్లైన్ ద్వారా ప్రసంగిస్తూ ప్రజా భాగస్వామ్యం లేని సమాజాభివృద్ధికి అర్థమే లేదన్నారు. గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యతని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణాభివృద్ధిలో బాధ్యతాయుతంగా చర్యలు చేపడుతున్నారన్నారు. అందులో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు పాలన, అధికార వికేంద్రీకరణ చేపట్టడం ద్వారా అవినీతికి తావులేకుండా వాటి ఫలాలు క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలకు అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. లక్షలాది మంది వలంటీర్లు నిస్వార్థమైన సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా గ్రామీణ పేద వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. గ్రామీణ సేవల విషయంలో గతంలో కేరళ ఆదర్శంగా ఉండేదని, నేడు గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ఆ ప్రభుత్వం కూడా ఏపీని ఆదర్శంగా తీసుకుంటుందని వివరించారు. గ్రామ సచివాలయాల ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని ఆదర్శవంతమైన ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రా రెడ్డి, ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్, ఏపీ ప్రభుత్వ ఐసీడీ (ఇంటర్ కేడర్ డిప్యుటేషన్) ఐఏఎస్ అధికారి జీఎస్ నవీన్‌కుమార్ తదితరులు మాట్లాడారు. -
వికేంద్రీకరణతో మూడు ప్రాంతాల అభివృద్ధి
సాక్షి, అమరావతి: వికేంద్రీకరణతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, భవిష్యత్తులోనూ ప్రాంతీయ విద్వేషాలు వచ్చేందుకు ఆస్కారం ఉండదని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. వీలైనన్ని తక్కువ నిధులతో మూడుచోట్ల 3 నగరాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. పాలన వికేంద్రీకరణకు సంబంధించి వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆదివారం వెబినార్ నిర్వహించింది. ఆ సెల్ కన్వీనర్ ఎం.మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్‌లో అజేయ కల్లం మాట్లాడారు. వెయ్యి కోట్లతో విశాఖ శివార్లలో పరిపాలనకు అవసరమైన భవనాలు నిర్మించవచ్చని, ఇందుకు భూమి అందుబాటులో ఉందని చెప్పారు. విశాఖకి కొంత బూస్ట్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో హైదరాబాద్‌కు పోటీగా తయారవుతుందన్నారు. వెయ్యి కోట్లతో కర్నూలులో హైకోర్టుకు భవనాలు, వసతులు కల్పిస్తే ఆ నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. అసెంబ్లీని అమరావతిలోనే కొనసాగించడం ద్వారా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. అమరావతి ప్రాంతం వ్యవసాయాధారితమైనది కావడం వల్ల ఇక్కడ అందుకనుగుణమైన పరిశ్రమల ఏర్పాటుకు ఆస్కారం ఉందన్నారు. రాజధాని రైతుల ప్రయోజనాలు కాపాడతామన్నారు. 29 గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని, వారికిచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ నేతృత్వంలో ఏర్పాటైన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ నివేదికలో వికేంద్రీకరణ గురించి చెప్పారన్నారు. స్వయంపాలనకు వీలుగా పంచాయతీలకు యంత్రాంగం, నిధులు సమకూర్చాలని గాంధీజీ చెప్పారని, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ ప్రభుత్వం అదే చేస్తోందని తెలిపారు. రాజధాని పేరుతో కార్యకలాపాలన్నింటినీ ఒకేచోట చేయాలని ఎక్కడా లేదన్నారు. వికేంద్రీకరణతో సాంకేతికంగా 99.999 శాతంమంది ప్రజలకు ఇబ్బంది ఉండదన్నారు. బీసీజీ నివేదిక ప్రకారం అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల నుంచి లక్షన్నర కోట్లు ఖర్చవుతుందని, అంతచేసినా అది లాభదాయకం కాదన్నారు. ప్రభుత్వం తక్కువ ఖర్చుతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేలా వికేంద్రీకరణను ప్రతిపాదించిందన్నారు. -
న్యాయ వ్యవస్థపై అమితమైన గౌరవం ఉంది
-
ఏపీ హైకోర్టుకు ‘సుప్రీం’ కమాండ్
(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి): నిస్సందేహంగా ఇదో సంచలనమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఆవేదనను ఆధారాలతో సహా భారత ప్రధాన న్యాయమూర్తితో పంచుకుంది. ఎందుకంటే దర్యాప్తు దశలో స్టే ఇవ్వవద్దని సుప్రీం కోర్టు పదే పదే చెబుతున్నా.. రాష్ట్ర హైకోర్టులో మాత్రం అలాంటి ‘స్టే’లు మంజూరైపోతున్నాయి. ఏ దర్యాప్తూ కదలకుండా ముందరికాళ్లకు బంధాలు పడిపోతున్నాయి. ఇక చిన్న చిన్న కేసుల్లో సైతం తీర్పుల సంగతలా ఉంచితే... రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిర్వీర్యమైపోయిందన్న స్థాయిలో తీవ్రమైన వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. వెంటనే ఓ వర్గం మీడియాలో అవన్నీ విపరీతమైన ప్రాధాన్యంతో ప్రసారమౌతూ అచ్చయిపోతున్నాయి. ఎందుకిలా అవుతోందని ఆరా తీసిన ప్రభుత్వం... అవన్నీ సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్.వి.రమణ జోక్యంతో జరుగుతున్నాయని తెలుసుకుని ఆధారాలతో సహా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేకు అందజేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటమే కాక... తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అడ్వొకేట్ జనరల్‌గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌తో కలిసి జస్టిస్ ఎన్.వి.రమణ ఎలా ఆస్తులను పోగేసుకున్నారో అందులో వివరించారు. జస్టిస్ రమణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నపుడు మామూలు న్యాయవాదిగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్‌కు అనుకూలంగా ఎన్ని ఉత్తర్వులిచ్చారో కూడా ముఖ్యమంత్రి ఆధారాలతో సహా వివరించారు. వీటన్నిటితో పాటు చంద్రబాబు నాయుడికి, జస్టిస్ ఎన్.వి.రమణకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని వెల్లడించే మరో ఆధారాన్ని కూడా సీఎం తన లేఖలో ప్రస్తావిస్తూ అందజేశారు. గతంలో ఓ ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సభ్యుడిగా జస్టిస్ ఎన్.వి.రమణ వ్యక్తం చేసిన అభిప్రాయం... అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన అభిప్రాయం అచ్చు గుద్దినట్లు ఒక్కటేనని... కింద సంతకాలు మాత్రమే మారాయని... ఈ విషయాన్ని అప్పట్లో కొలీజియం సభ్యుడిగా ఉన్న జస్టిస్ చలమేశ్వర్ స్వయంగా చెప్పారని కూడా సీఎం పేర్కొన్నారు. ఈ కుమ్మక్కు కారణంగా తాము ఏ అక్రమాన్ని వెలికితీయాలనకున్నా అడ్డుపడుతున్నారని, దానికి అన్ని స్థాయిల్లోనూ ఒత్తిళ్లు తెస్తున్నారని జగన్ వివరించారు. ఈ మేరకు ఆధారాలను కూడా సీజేఐకి అందజేసినట్లు శనివారం ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం తెలియజేశారు. రాత్రి 9 గంటల సమయంలో మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) సీజేఐకి లేఖ, ధ్రువపత్రాలు కూడా... అమరావతి భూ కుంభకోణంగా ప్రభుత్వం పేర్కొంటున్న వ్యవహారంలో కేబినెట్ సబ్‌కమిటీ విచారణను, సిట్ దర్యాప్తును నిలిపేస్తూ ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వి.సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేయటం మీకు తెలుసు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి సైతం... ఈ కుంభకోణంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జి కుటుంబ సభ్యులపై జరుగుతున్న దర్యాప్తును నిలిపేశారు. అంతేకాక దానికి సంబంధించిన వార్తలు మీడియాలో రాకుండా గ్యాగ్ ఉత్తర్వులిచ్చారు. వీటినీ సుప్రీం కోర్టులో సవాల్ చేశాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలను... ప్రత్యేకించి ఏపీ హైకోర్టు వ్యవహారాల్లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ జోక్యాన్ని దేశ ప్రధాన న్యాయమూర్తికి తెలియజేశాం. దీనికి సంబంధించిన వివిధ పత్రాలనూ ఈ నెల 8న ఆయనకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అందజేశారు. ఇవన్నీ జస్టిస్ ఎన్.వి.రమణకు, టీడీపీ అధిపతి నారా చంద్రబాబు నాయుడితో ఉన్న అనుబంధాన్ని, టీడీపీ నేతల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలను బయటపెట్టేవే. ఇక జస్టిస్ ఎన్.వి.రమణ తాను హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నపుడు దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించిన కేసుల్లో ఆయనకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులైతే న్యాయ వ్యవస్థ దుర్వినియోగాన్ని బయటపెడతాయి. ఈ పరిణామాలన్నిటినీ సీజేఐకి లేఖ రూపంలో ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర హైకోర్టు వ్యవహారాలను జస్టిస్ ఎన్.వి.రమణ నేరుగా ఎలా ప్రభావితం చేస్తున్నారో తెలియజేశారు. అమరావతి భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాలను, దాంట్లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి ముందుంచారు’’ అని కల్లం వివరించారు. మీడియా సమావేశంలో భాగంగా వివిధ పత్రాలను మీడియాకు కూడా అందజేసినా... అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ఇటీవల దమ్మాలపాటి, సుప్రీం న్యాయమూర్తి కుమార్తెలపై ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని, దానికి సంబంధించిన ఫిర్యాదును మాత్రం ఇవ్వలేదు. హైకోర్టు ఈ వ్యవహారాన్ని మీడియాలో ప్రచురించకుండా “గ్యాగ్’ ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో ఇలా చేసినట్లు కల్లం తెలిపారు. అయితే ఈ సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి మాత్రం అందజేశామన్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ విషయంలో ముందుకెళ్లేటపుడు అఫిడవిట్లతో సహా ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టంచేశారు. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) న్యాయ వ్యవస్థపై అమితమైన గౌరవం ఉంది... ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి హైకోర్టుపై, సుప్రీంకోర్టుపై, న్యాయవ్యవస్థపై అత్యంత గౌరవ ప్రపత్తులున్నట్లు కల్లం తెలిపారు. సీఎం తన లేఖలోనూ ఈ విషయం పేర్కొన్నారని చెప్పారు. “ఇదంతా కొద్ది మంది గౌరవ న్యాయమూర్తుల వ్యవహార శైలిని సుప్రీంకోర్టుకు వివరించే ప్రయత్నమే. ముఖ్యమంత్రిగానీ, ప్రభుత్వం గానీ ఎప్పుడూ చట్టాలకు, రాజ్యాంగానికి లోబడే పనిచేస్తాయి. ఏ వ్యవస్థతోనయినా గౌరవపూర్వకమైన విభేదాలే ఉంటాయి’’ అని కల్లం ఉద్ఘాటించారు. టీడీపీ ప్రయోజనాలే లక్ష్యంగా.. హైకోర్టు ఉత్తర్వులివీ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను పరిరక్షించేందుకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లోని వాస్తవాలు ఇవీ అని పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రీం సీజేకు అనుబంధ పత్రాలు అందజేశారు.. దానిలోని అంశాలు చూస్తే.. చంద్రబాబు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ వ్యవస్థలను గౌరవనీయ సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిల ద్వారా రాజకీయాలకు వినియోగించుకోవడం బాధ, ఆవేదన కలిగిస్తోంది. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, పడగొట్టడానికి గౌరవప్రదమైన హైకోర్టును ఉపయోగించుకుంటున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాయని మచ్చలాంటి తీర్పుల వెనుక జస్టిస్ ఎన్వీ రమణ ద్వారా చంద్రబాబు సాగిస్తున్న బహిరంగ, రహస్య కార్యకలాపాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతిలో వివిధ సంస్థలకు చెందిన వారు భూములు కొన్న విషయం ప్రజలకు తెలిసిందే. అసెంబ్లీ ఆమోదించిన మూడు రాజధానులు, ఒక కీలకమైన చర్చ జరిగిన విషయాన్ని సవాలు చేస్తూ ఈ ఏడాది జనవరి నుంచి వరుసగా రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతిలో తమ స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ పిటిషన్లు వేశారు. ఈ సందర్భంలో అక్కడ జరిగిన నిరసనలకు స్వార్థపూరిత వ్యక్తులే నిధులు సమకూర్చారని నివేదికలు చెబుతున్నాయి. వివిధ దశల్లో 30 వరకూ పిల్స్ దాఖలయ్యాయి. ముఖ్యమంత్రిని ప్రతివాదిగా కూడా పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టినప్పటి నుంచి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో న్యాయ పరిపాలనను హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ద్వారా జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారనే విషయం స్పష్టమైంది. ఆ ప్రభావం ఈ విధంగా ఉంది. ► చంద్రబాబునాయుడు నిర్ణయం మేరకు ఆయన ప్రయోజనాలు కాపాడే విధంగా జడ్జిల సిట్టింగ్ రోస్టర్‌ను ప్రభావితం చేశారు. ఆ జడ్జిల్లో జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ డి.రమేశ్ తదితరులు ఉన్నారు. ► న్యాయంవైపు లేకుండా ఉన్న, హైకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న పిల్స్‌ను అనుమతించే దిశగా ప్రభావం. ► కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభావం టీడీపీ ప్రయోజనాలను పరిరక్షించిన ప్రత్యేక సందర్భాలు అమరావతి ల్యాండ్ స్కామ్ : అమరావతి భూ కుంభకోణంపై ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే హైకోర్టు స్టే విధించింది. జస్టిస్ కె. లలిత జడ్జిల్లో తెలుగుదేశం ప్రయోజనాలను కాపాడే వాళ్లలో జస్టిస్ కె. లలిత ఒకరు. మెడికల్ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు. ఆయన ఒక వారం రోజులు జైల్లో లేకుండానే.. ఆ జడ్జి ఆ మాజీ మంత్రిని ఆస్పత్రికి మార్చాలని ఆదేశాలిచ్చారు. తర్వాత ఇంకో ఆస్పత్రికి మార్చారు. తుదకు ఆస్పత్రి నుంచే విడుదల అయ్యే విధంగా బెయిల్ ఇచ్చారు. ఆ ఆదేశాలను ఆపాలని కోరుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్లపై వాదనలు వినలేదు. దీంతో అచ్చెన్నాయుడుకు ప్రయోజనం చేకూరింది. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) అలాగే రక్షిత స్థలంలో ఉన్న ఇళ్లను, కట్టడాలను తొలగించడానికి గతంలో ఉన్న ఏపీసీఆర్డీఏ ప్రక్రియ మొదలు పెట్టింది. ఆ ఇళ్లలో చంద్రబాబు నివాసం కూడా ఉంది. ఆ ప్రక్రియపై స్టే ఉంది. వరదల సమయంలో నది నీళ్లు ఆ ఇళ్లలోకి చేరాయి. అలాగే ఆ కట్టడాలు ప్రవాహానికి ఆటకం కలిగించాయి. జస్టిస్ డి.రమేష్ జస్టిస్ రమేష్‌ను క్రిమినల్ కేసుల్లో క్వాష్ పిటిషన్ల విచారణ, రిట్ పిటిషన్ల పరిధిలో వ్యూహాత్మకంగా ఉంచారు. గత ప్రభుత్వం హయాంలో అడ్వొకేట్ జనరల్‌కు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా జస్టిస్ రమేష్ ఉండేవారు. టీడీపీకి అనుబంధంగా ఉన్న వారి విషయంలో ఆయన వ్యవహారం ఇలా ఉంది.. ► రమేష్ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ రమేష్ దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా, ఆయనపై తదుపరి చర్యలు తీసుకోకుండా జస్టిస్ రమేష్ స్టే ఇచ్చారు. రమేష్ ఆస్పత్రి నిర్వహించిన కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 10 మంది చనిపోయిన విషయంలో జస్టిస్ రమేష్ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ డాక్టర్ రమేష్ పరారీలోనే ఉన్నారు. జస్టిస్ రమేష్ ఆదేశాలను సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ► ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీపై దాఖలైన ఎఫ్ఐఆర్ను క్వాష్ కోరుతూ రాష్ట్ర ఎన్నికల అధికారి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కొన్ని రోజుల నిందితుడు అదే ఎఫ్ఐఆర్ను క్వాష్ కోరుతూ రెండో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణకు స్వీకరించినపుడు రెండు పిటిషన్లు కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. అయితే కారణాలు ఏమీ చెప్పకుండా జస్టిస్ రమేష్ మాత్రం దర్యాప్తుపై స్టే విధించారు. సత్యనారాయణ మూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి గత పది సంవత్సరాల నుం జస్టిస్ ఎన్వీ రమణకు విశ్వసనీయమైన వ్యక్తిగా ఉన్నారు. ప్రభుత్వంపై ఆయన వ్యతిరేకత ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పరిపాలనలో హైకోర్టు జోక్యం చేసుకున్న ప్రతి విషయంలోనూ ఆయన పాత్ర స్పష్టంగా కనబడుతుంది. రాజధానుల విచారణ విషయంలో అన్ని సందర్భాల్లో (ఆయన పక్కన కానీ లేదా ఫుల్ బెంచ్ అయినా కానీ) జస్టిస్ సత్యనారాయణ మూర్తి తనతో ఉన్నట్లు చీఫ్ జస్టిస్ నిర్ధారించారు. ప్రభుత్వ న్యాయవాదులపై ఆయన దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. ► ఇంటర్ కాలేజీల సంఘం దాఖలు చేసిన పిటిషన్ విషయంలో.. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 365 విషయంలో అడ్వొకేట్ జనరల్‌కు సూచనలు చేస్తూ జస్టిస్ మూర్తి వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విషయంలో కౌంటర్‌ను పట్టించుకోకుండా కేవలం పిటిషనర్ అఫిడవిట్ ఆధారంగా జస్టిస్ మూర్తి విచారణను రిజర్వ్‌లో ఉంచారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో కూడా పలుమార్లు ప్రభుత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై కూడా ఆయన పలుమార్లు విమర్శలు చేశారు. ► మాజీ అడ్వొకేట్ జనరల్, జస్టిస్ ఎన్వీ రమణకు ఆప్తుడు అయిన దమ్మాలపాటి శ్రీనివాస్‌పై నమోదైన క్రిమినల్ కేసు విషయంలో దర్యాప్తు కొనసాగకుండా జస్టిస్ మూర్తి స్టే ఇచ్చారు. జస్టిస్ డి.సోమయాజులు ► పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నుంచి నవయుగ ఇంజనీరింగ్‌ను తొలగించిన విషయంలో ఆ కంపెనీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ జస్టిస్ సోమయాజులు వద్దకు విచారణకు వచ్చింది. హైకోర్టు వెబ్సైట్లో ఆయన ప్రొఫైల్ చూస్తే.. జస్టిస్ సోమయాజులు గతంలో నవయుగ కంపెనీకి లీగల్ సలహాదారుగా ఉన్నారు. విచారణ సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించలేదు. ఆయన ఇచ్చిన ఆదేశాలను మరో జడ్జి వెకేట్ చేశారు. అయితే చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్.. జస్టిస్ సోమయాజులు ఇచ్చిన పూర్వ ఆదేశాలను తిరిగి అనుమతించింది. ► కేబినెట్ కమిటీ, సిట్ నివేదికలకు సంబంధించి అన్ని ప్రభుత్వ ఆదేశాలపై జస్టిస్ సోమయాజులు స్టే విధించారు. ఈ కేసు విషయంలో రిట్ పిటిషన్లు దాఖలు చేసిన వారు టీడీపీ కార్యకర్తలే. తమ పార్టీ ప్రతిష్టకు భంగం అంటూ ఆ పిటిషన్లు దాఖలు చేశారు. సర్కారుకు వ్యతిరేకంగా ‘ఎల్లో పిల్స్’ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ ఆ పార్టీ ఎజెండాను మోస్తున్న ఆంధ్రజ్యోతి, టీవీ5 న్యూస్ చానెల్ రాష్ట్ర ప్రభుత్వంపై పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలు చేయడానికి కారణమయ్యాయి. ముందుగా ఆయా అంశాలపై ఈ రెండు మీడియా సంస్థలు కథనాలు ఇవ్వడంతోపాటు చర్చలు నిర్వహిస్తాయి. ఇలా జరిగిన కొద్ది రోజులకే వాటిపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పలు పిల్స్ దాఖలు అవుతాయి. వీటిలో కొన్ని.. జడ్జిల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని పిల్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తోందంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఆగస్టు 15న ఒక కథనం ప్రచురించింది. అదే రోజు ఆ కథనాన్ని రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి ఖండించారు. ఆ పత్రిక రాసింది తప్పుడు కథనమని హైకోర్టు రిజిస్ట్రార్‌కు తెలిపారు. ఇది జరిగిన రెండు రోజులకే అంటే ఆగస్టు 17న హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై హైకోర్టు ఎలాంటి ప్రామాణికత లేని ఆ పత్రిక కథనాన్ని ఆధారం చేసుకుని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే ఆ పత్రిక కథనం ఆధారంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో విచిత్రమేమిటంటే.. అటు హైకోర్టు.. ఇటు చంద్రబాబు ఫోన్ల ట్యాపింగ్ ఎలాంటి ఆధారాలను చూపకపోవడం గమనార్హం. విశాఖలో టీడీపీ ర్యాలీకి అనుమతి నిరాకరణ విశాఖలో బహిరంగ ర్యాలీ నిర్వహించడానికి టీడీపీని అనుమతించకపోవడానికి సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విశాఖ వెళ్లడానికి చంద్రబాబును ప్రభుత్వం అనుమతించని ఒక రోజు తర్వాత, సీఆర్పీసీ సెక్షన్ 151 కింద ఆయనకు నోటీసు జారీ చేసి అరెస్టు చేశాక ఈ పిల్ దాఖలు చేయడం గమనార్హం. దీనిపై కోర్టు డీజీపీని కోర్టుకు పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని నిలదీసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ పిల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఒక నాయకుడు కోవిడ్–19 మార్గదర్శకాలను ఉల్లంఘించారని, భౌతికదూరాన్ని పాటించడం లేదని ఆరోపిస్తూ ఈ పిల్‌ను దాఖలు చేశారు. విచారణ చేసి ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేశామని ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే దీనిపై సంతృప్తి చెందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉల్లంఘనలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నానని పేర్కొన్నారు. ఇది జరిగిన మరుసటి రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని కోర్టులో పిల్ దాఖలైంది. ఈ రెండు పిల్స్‌ను కలిపి విచారించిన హైకోర్టు దీనికి సీబీఐ విచారణ అవసరం లేదని పేర్కొంది. పలు విషయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పులు.. 1. గ్రామ పంచాయతీ కార్యాలయాల అధికార పార్టీ జెండా రంగులేస్తోందని పిల్స్ 2. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టడంపై పిల్ 3. రాష్ట్ర ఎన్నికల సంఘానికి, మరెన్నో అంశాలకు సంబంధించి రిట్ పిటిషన్లు 4. జస్టిస్ ఈశ్వరయ్య, సస్పెన్షన్‌కు గురైన న్యాయాధికారి రామకృష్ణ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణపై హైకోర్టు నేరుగా విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ చేయాలని జస్టిస్ రవీంద్రన్‌ను కోరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టుపై కుట్ర జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేకుండానే విచారణ బాధ్యతలను రవీంద్రన్‌కు అప్పగించింది. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) -
నగదు బదిలీతో రైతు చేతికే ‘అస్త్రం’
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్తు మోటార్లకు మీటర్లను అమర్చడం వల్ల అంతిమంగా రైతులకే మేలు జరుగుతుందని, లో వోల్టేజీ ఇబ్బందులు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం లాంటి సమస్యలకు తెరపడుతుందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం పేర్కొన్నారు. సరఫరాలో అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు రైతులకు అందుతుందని, దీన్ని హక్కుగా నిలదీసే అవకాశం కూడా వ్యవసాయదారులకు లభిస్తుందని తెలిపారు. రాష్ట్ర రైతాంగానికి మరో 30 ఏళ్ల పాటు పూర్తి ఉచితంగా రోజూ 9 గంటలు పగటిపూట విద్యుత్తు అందించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు. కేంద్ర సంస్కరణల్లో భాగంగా నగదు బదిలీని అమలు చేసినా ఏ ఒక్క రైతుపైనా పైసా కూడా భారం పడనివ్వబోమన్నారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత సర్కారు నిర్లక్ష్యంతో.. గత సర్కారు నిర్వాకాలతో 42 శాతం ఫీడర్లలో నాణ్యమైన విద్యుత్తు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఫీడర్లను బలోపేతం చేసేందుకు ఈ ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తోంది. రబీ నాటికి çవంద శాతం ఫీడర్ల పరిధిలో పగటి పూటే 9 గంటల విద్యుత్తు అందచేస్తాం. రూ.8 వేల కోట్ల బకాయిలు చెల్లించాం.. నేరుగా నగదు బదిలీ చేయడం వల్ల పంపిణీ సంస్థల(డిస్కమ్‌లు) చేతికి డబ్బులు అంది ఆర్థికంగా మనుగడ సాగించగలుగుతాయి. చంద్రబాబు అధికారంలో ఉండగా డిస్కమ్‌లకు బకాయిలు 14 నెలల పాటు చెల్లించలేదు. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టాక రూ.8.000 కోట్ల బకాయిలు చెల్లించడంతోపాటు బిల్లులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తోంది. రైతు చేతిలో ‘అస్త్రం’ నగదు బదిలీ విధానంలో రైతులు తమ జేబు నుంచి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన పనిలేదు. ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే సొమ్ము బిల్లుల చెల్లింపు కోసం డిస్కమ్‌లకు చేరుతుంది. దీనిద్వారా రైతు ఎంత బిల్లు చెల్లిస్తున్నాడో తెలుసుకుంటాడు. విద్యుత్తులో నాణ్యత లేకుంటే నిలదీయవచ్చు. అంటే ప్రభుత్వం రైతుల చేతిలో ఒక అస్త్రాన్ని పెడుతోంది. ఫలితంగా డిస్కమ్‌ల బాధ్యత, జవాబుదారీతనం పెరుగుతుంది. 10 వేల మెగావాట్లతో సోలార్ ప్లాంట్లు... మీటర్లు బిగించడం లాంటి అవసరాలకు మూలధన వ్యయం తప్పదు. అయితే ఇది వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నం. రైతులకు 30 ఏళ్ల పాటు నిరాటంకంగా ఉచిత విద్యుత్తు ఇవ్వాలంటే ఇలాంటి చర్యలు తప్పవు. అందుకోసమే ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్తును అందుబాటులోకి తెస్తోంది. శ్రీకాకుళం నుంచి శ్రీకారం ► డిసెంబర్ నుంచి నగదు బదిలీని శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం. ► ఉచిత విద్యుత్తు వినియోగంపై ఎలాంటి పరిమితులు ఉండవు. ఒక్క కనెక్షన్ కూడా తొలగించరు. ఎక్కువ కనెక్షన్లు ఉన్నా ఇబ్బంది లేదు. ► ప్రతీ కిలోవాట్‌కు రూ. 1,200 డెవలప్మెంట్ చార్జీలు, ప్రతీ హెచ్‌పీకి రూ. 40 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి అక్రమ కనెక్షన్లు క్రమ బద్ధీకరించుకోవచ్చు. అదనపు లోడ్‌కు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. మీటర్లతో మేలు ఇలా.. మీటర్లు అమర్చడం వల్ల రైతు ఎంత విద్యుత్తు వినియోగిస్తున్నారో తెలుసుకుని అందుకు తగినట్లుగా లోడ్ ప్రకారం ట్రాన్స్ఫార్మర్ను అప్‌గ్రేడ్ చేయవచ్చు. లేదంటే మారుస్తారు. దీనివల్ల సరఫరాలో నాణ్యత పెరుగుతుంది. లో వోల్టేజీ–హై వోల్టేజీ లాంటి సమస్యలుండవు. ఎంత విద్యుత్తు కావాలో సబ్ స్టేషన్ స్థాయి నుంచే తెలుస్తుంది కనుక అంత మేరకు రైతులకు చేరుతుంది. -
తొమ్మిది గంటలు ఎంత వాడినా ఫ్రీనే
సాక్షి, విజయవాడ: వ్యవసాయ రంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం గురించి అనుమానాలు ఏమైనా ఉంటే నివృత్తి చేయడానికి తాను మీడియా ముందుకు వచ్చాను అన్నారు సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం ముఖ్య ఉద్దేశ్యం పగటి పూట 9 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వడం. ఇందుకు సంబంధించిన బిల్లును రైతుకు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి ప్రభుత్వమే నగదు చెల్లిస్తుంది. నాణ్యమైన విద్యుత్‌ని అందిస్తున్న నేపథ్యంలో రైతుకు ప్రశ్నించే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వం 16,371 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు బకాయి ఉంది. ప్రతి మోటార్‌కు మీటర్ అమర్చడం ద్వారా నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మరింత చౌకగా ఉచిత విద్యుత్‌ని అందిస్తాం’ అన్నారు. (చదవండి: సాగుకు ‘పవర్’) అంతేకాక ‘రైతు 9 గంటలు ఎంత విద్యుత్ వినియోగించినా అంతా ఉచితమే. విద్యుత్ మీటర్ రీడింగ్ అంతా ప్రభుత్వం చూస్తుంది. అనధికారికంగా ఉన్న విద్యుత్ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తాం. రైతులు కోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరుస్తాం. దీనిపై బ్యాంకులు, విద్యుత్ అధికారులు మద్య ఒప్పందం జరగనుంది. కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బంది రాదు. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా, చిత్తశుద్ధితో 7 వేలకు పైగా జూనియర్ లైన్ మెన్లను ఏర్పాటు చేశాం. 2018-19 కంటే 2019-20లో విద్యుత్ సరఫరాలో 38శాతం అవాంతరాలు తొలగిపోయాయి. రైతుకు అదనపు కనెక్షన్లు ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ పథకం కార్పొరేట్ పరిధిలోకి రాదు. 1250 రూపాయలు అదనంగా చెల్లిస్తే సరిపోతుంది. విద్యుత్ కనెక్షన్ల మార్పులకు సంబంధించిన వివరాలను విలేజ్ సెక్రటరీలకు ఇస్తే సరిపోతుంది. శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా డిసెంబర్ నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ నగదు బదిలీ అమలు చేస్తాం. 17 లక్షలు పైగా కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా ఉన్న కనెక్షన్లు ఒక లక్షకు పైగా ఉన్నట్లు అంచనా. వాటిని క్రమబద్దీకరిస్తాం’ అన్నారు అజేయ కల్లాం. -
రైతు శ్రేయస్సే ధ్యేయం
-
రైతులు పైసా కట్టక్కర్లేదు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలకు అనుగుణంగానే వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని చేపట్టాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్తు కోసం రైతులు పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదని, మీటర్లకయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. బిల్లు చెల్లిస్తారు కనుక విద్యుత్తు నాణ్యతపై రైతులకు అధికారులను నిలదీసే హక్కు ఉంటుందని చెప్పారు. అధికారులు కూడా మరింత బాధ్యతగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. బుధవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉచిత విద్యుత్తుపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఉచిత విద్యుత్తు పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని తెలిపారు. కనికరం లేకుండా కాల్పులు జరిపించారు.. ఉమ్మడి రాష్ట్రంలో ఏడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా నాటి చంద్రబాబు సర్కారు కనికరించలేదు. కరవు వెంటాడుతున్నా నిర్దాక్షిణ్యంగా వ్యవసాయ విద్యుత్ ధర హార్స్పవర్ రూ. 50 నుంచి రూ. 650కి పెంచింది. విద్యుత్తు బిల్లులు కట్టలేదని రైతులపై కాల్పులు జరపడంతోపాటు జైళ్లలో పెట్టిన ఘనత చంద్రబాబు సర్కారుదే. వైఎస్సార్ ఆశయాల దిశగానే... – ఈ పరిస్థితిని చూసి చలించిన దివంగత వైఎస్సార్ అధికారం చేపట్టగానే దేశానికే ఆదర్శమైన ఉచిత విద్యుత్పథకాన్ని తెచ్చారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య, ఉచిత విద్యుత్తు రైతు ఇంట ఆనందాన్ని నింపాయి. రూ. 50 వేల కోట్లతో రైతుల కోసం జలయజ్ఞం చేపట్టిన ఘనత వైఎస్సార్‌దే. – వైఎస్సార్ చేపట్టిన ప్రతీ పథకాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకేసీఎం జగన్ శ్రమిస్తున్నారు. బాబు మాటలు బూటకం.. మిగులు విద్యుత్తు అంటూ చంద్రబాబు చెప్పే మాటలు బూటకం. రాష్ట్ర విభజన నాటికే ఏపీలో 55 శాతం విద్యుత్‌ఉత్పత్తి ఉండగా తెలంగాణాలో 45 శాతం ఉంది. వినియోగం తెలంగాణలో 57 శాతం, ఏపీలో 43 శాతం ఉంది. ఏపీలో 12 శాతం అదనపు ఉత్పత్తి ఉంది. ప్రైవేటు విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు థర్మల్ విద్యుత్తు పీఎల్ఎఫ్ తగ్గించడమే చంద్రబాబు ఘనత. ఆ బకాయిలన్నీ సీఎం జగన్తీరుస్తున్నారు – వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు సరఫరా కష్టమైనా సీఎం జగన్ సాహసంతో అమలు చేస్తున్నారు. ఫీడర్ల బలోపేతం కోసం రూ. 1,700 కోట్లు మంజూరు చేశారు. – గత సర్కారు రూ.34 వేల కోట్ల మేర విద్యుత్తు బకాయిలు పెట్టి వెళ్లిపోతే సీఎం జగన్ వాటిని తీరుస్తున్నారు. విద్యుత్సబ్సిడీలకు సంబంధించి రూ.17,904 కోట్లు ఖర్చు పెట్టారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఇందులో సగం కూడా ఇవ్వలేదు. – ఈ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్సబ్సిడీ కోసం రూ.7 ,171 కోట్లు ఇచ్చింది. అక్వాసాగుదారులకు రూ.700 కోట్లు ఇచ్చింది. అన్ని రకాల ఉచిత విద్యుత్తు సబ్సిడీలు కలిపి రూ.11,000 కోట్లు ఇచ్చింది. కేంద్రం తెచ్చిన సంస్కరణలతో.. –సంస్కరణల దిశగా కేంద్రం వేస్తున్న అడుగులను అన్ని రాష్ట్రాలు అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదనపు నిధులపై కొన్ని షరతులు విధించింది. విద్యుత్సబ్సిడీని రైతుల ఖాతాలకు బదిలీ చేయాలనేది ఇందులో ప్రధానమైనది. డిసెంబర్‌లోగా ఒక్క జిల్లాలో అయినా ప్రయోగాత్మకంగా నగదు బదిలీ అమలు చేసి వచ్చే సంవత్సరం రాష్ట్రమంతా విస్తరిస్తామని చెబితేనే అప్పులపై కేంద్రం వెసులుబాటు కల్పిస్తుంది. -
మేడం... మీ లెక్క తప్పింది
సాక్షి, అమరావతి: కేంద్రం రాష్ట్రానికి ఒక యూనిట్ విద్యుత్‌ను రూ.2.70కే సరఫరా చేస్తుంటే, పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ రూ.9 చొప్పున సరఫరా చేస్తోందన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రి చెప్పిన మాటలు అవాస్తవమన్నారు. ఎన్టీపీసీ కుడ్గి నుంచి యూనిట్‌కు రూ.9.84 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వద్దన్నా.. కేంద్రం అంటగడుతోందని ఆయన ఎత్తిచూపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన, కులం, అవినీతిని రూపుమాపాలనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వాటిపై పోరాటం చేసే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. విద్యుత్ చార్జీల్లో మార్పులు చేయలేదు ► పరిశ్రమలకు యూనిట్‌కు రూ.7.65 చొప్పున వసూలు చేయాలని 2017లో టీడీపీ సర్కార్ నిర్ణయించింది. ఆ చార్జీల్లో మేం ఎలాంటి మార్పులు చేయలేదు. ► దేశంలో పరిశ్రమలకు యూనిట్ విద్యుత్‌ను తెలంగాణ రూ.7.60, మహారాష్ట్ర రూ.7.25, రాజస్తాన్ రూ.7.30, కర్ణాటక రూ.7.20, తమిళనాడు రూ.6.35 చొప్పున సరఫరా చేస్తున్నాయి. ► తమిళనాడులో కేంద్రం అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల యూనిట్‌ను రూ.3 చొప్పున ఇస్తుండటంతో ఆ రాష్ట్రం యూనిట్‌ను రూ.6.35 చొప్పున పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. ► గుజరాత్లో రాయితీలు తక్కువగా ఉండటం.. ఎక్కువ విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉండటం వల్ల యూనిట్ రూ.5 చొప్పున పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో యూనిట్‌పై రూ.1 చొప్పున రాయితీ ఇస్తున్నాం. అంటే.. యూనిట్ విద్యుత్‌కు రూ.6.65 చొప్పున వసూలు చేస్తున్నాం. టీడీపీ సర్కార్ అవినీతి వల్లే చార్జీలు అధికం ► థర్మల్ విద్యుత్ కేంద్రం పనులకు మెగావాట్‌కు రూ.3 కోట్ల నుంచి రూ.3.50 కోట్లకు మించి ఖర్చు కాదు. కానీ.. టీడీపీ సర్కార్ రూ.8.50 కోట్ల చొప్పున కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఈ వ్యవహారంలో టీడీపీ సర్కార్ పెద్దలు భారీగా కమీషన్లు తిన్నారు. ఈ ఒక్క విద్యుత్ కేంద్రం వల్లే విద్యుత్ సంస్థలపై రూ.20 వేల కోట్ల అప్పు భారం పడింది. ► బహిరంగ మార్కెట్లో సౌర, పవన విద్యుత్‌లు యూనిట్ రూ.2.. అంతకంటే తక్కువ ధరకు లభ్యమవుతోంటే.. టీడీపీ సర్కార్ అధిక ధరలకు దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను కుదుర్చుకుంది. ఈ వ్యవహారంలోనూ టీడీపీ సర్కార్ పెద్దలు అవినీతికి పాల్పడ్డారు. ► 2014 నాటికి ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు రూ.24,800 కోట్లు అప్పులు ఉండేవి. కానీ.. టీడీపీ సర్కార్ అవినీతి, అసమర్థత.. నిర్వహణ లోపం వల్ల విద్యుత్ సంస్థల అప్పులను రూ.70 వేల కోట్లకు పెంచేసింది. అప్పుగా తెచ్చిన నిధులను టీడీపీ సర్కార్ పెద్దలు తినేశారు. ► విభజన సమయంలో సింగరేణి కాలరీస్ తెలంగాణకు కేటాయించారు. రాష్ట్రానికి బొగ్గు గనులను కేటాయించలేదు. దీని వల్ల బొగ్గు కొనుగోలు కోసం ఏటా అదనంగా రూ.2,500 కోట్ల మేర భారం పడుతోంది. విద్యుత్ వాడకపోయినా ట్రాన్స్మిషన్ చార్జీలా! ► సెంట్రల్ ట్రాన్స్మిషన్ లైన్ల ద్వారా రాష్ట్రం మీదుగా సరఫరా అవుతున్న విద్యుత్‌ను వినియోగించుకున్నా.. వినియోగించుకోకపోయినా.. పక్క రాష్ట్రాలు వినియోగించుకుంటున్నా మెగావాట్‌కు రూ.5.50 లక్షల చొప్పున కేంద్రానికి రాష్ట్రం చెల్లించాల్సి వస్తోంది. ► ఇతర రాష్ట్రాలు ట్రాన్స్మిషన్ చార్జీలు మెగావాట్‌కు రూ.లక్ష చెల్లిస్తున్నాయి. ఇది అధర్మమని కేంద్రానికి చెప్పాం. వినియోగించుకున్న విద్యుత్‌కు మాత్రమే ట్రాన్స్మిషన్ చార్జీలు వసూలు చేయాలని సూచించాం. ఇందుకు కేంద్రం అంగీకరించింది. కానీ.. ఇప్పటికీ ఆ తప్పును సరిదిద్దలేదు. దీని వల్ల ట్రాన్స్మిషన్ చార్జీల రూపంలోనే ఏడాదికి రూ.1,700 కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి వస్తోంది. ► బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా.. సోలార్ బండిల్(సేవలతో కలిపి ఉత్పత్తిని విక్రయించే వ్యూహం) విద్యుత్‌ను ఎన్టీపీసీ యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీని వల్ల ఏడాదికి విద్యుత్ సంస్థలపై రూ.3,500 కోట్లకుపైగా భారం పడుతోంది. ► టీడీపీ సర్కార్ చేసిన అప్పుల్లో రూ.53 వేల కోట్లను కేంద్ర సంస్థలైన పీఎఫ్సీ, ఆర్ఈసీల నుంచే చేసింది. అదీ పది శాతం వడ్డీపై. అంటే వడ్డీ రూపంలోనే ఏటా రూ.5,300 కోట్లకుపైగా చెల్లించాల్సి వస్తోంది. దీని వల్లే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు అధికంగా ఉంటున్నాయి. అద్భుతమైన వ్యవస్థను తీసుకొచ్చాం ► ఎన్నడూ ప్రజా జీవితంలో లేకున్నా.. ఎలాంటి అర్హతలు లేకున్నా.. ఎమ్మెల్యే కాకపోయినా.. కేవలం కొడుకు అనే ‘ఏకైక’ కారణంతో ఒకరిని మంత్రిని చేసిన కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలనే ఆమె అభిప్రాయాలను గౌరవిస్తున్నాం. ► సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా ఇటీవల సచివాలయ ఉద్యోగాల భర్తీలో మెరిట్‌పైనే 80 శాతం పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఇచ్చాం. నామినేటెడ్ పదవుల్లో కూడా ఈ వర్గాలకు 50 శాతం పదవులను ఇచ్చేలా చట్టాన్ని తెచ్చి, అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ► అవినీతిని నిర్మూలించాలనే లక్ష్యంతో.. గ్రామ స్థాయి నుంచి వ్యవస్థలను పటిష్టం చేయాలనే గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. వలంటీర్ల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సేవలు అందిస్తున్నాం. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలోనే మరెక్కడా లేదు. ► ఇంజనీరింగ్ పనుల టెండర్లలో అవినీతిని నిర్మూలించడానికి చట్టాన్ని తెచ్చాం. జ్యుడిషియల్ ప్రివ్యూను ఏర్పాటు చేశాం. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూళ్లతో రివర్స్ టెండరింగ్‌ను నిర్వహిస్తున్నాం. ► టీడీపీ సర్కార్ హయాంలో అక్రమాలు జరిగిన టెండర్లను రద్దు చేసి.. గత నెల వరకూ నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో రూ.2,072 కోట్ల మేర ఖజానాకు ఆదా చేశాం. టీడీపీ సర్కార్ పట్టణాల్లో ఐదు లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచింది. నిర్మాణం ప్రారంభించని 64 వేల ఇళ్ల పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తేనే రూ.400 కోట్లు ఆదా అయింది. -
‘అధిక ధరకు విద్యుత్ అంటగడుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి అవినీతికి తావులేకుండా గ్రామస్థాయి నుంచి పటిష్టమైన వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ ఛార్జీలు, తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. ఉద్యోగ నియామాకాల్లో 80 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైరారిటీలకు ప్రాధాన్యత ఇస్తూ చట్టం తీసుకొచ్చామన్నారు. రివర్స్ టెండంరింగ్ ద్వారా ఇప్పటివరకు రూ.2,072 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు. వద్దన్నా విద్యుత్ అంటగడుతున్నారు ‘విద్యుత్ టారిఫ్‌పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఏపీలో పరిశ్రమలకు యూనిట్ విద్యుత్ ధర రూ.7.65ల టారిఫ్ గత ప్రభుత్వమే నిర్ణయించింది. మా ప్రభుత్వం వచ్చిన తరువాత దీనిలో ఎలాంటి మార్పు చేయలేదు. కేంద్రం రూ.2.70పైసలకే యూనిట్ విద్యుత్ ఇస్తుందని కేంద్రమంత్రి చెప్పడం అవాస్తవం. ఎన్టీపీసీ రూ.9.84పైసలకు యూనిట్ విద్యుత్ ఇస్తోంది. వద్దన్నా ఈ విద్యుత్‌ను ఏపీకి అంటగడుతున్నారు. ఒక మెగావాట్ విద్యుత్ ట్రాన్స్మిట్ చేసినందుకు ఏపీ నుంచి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారు. పక్క రాష్ట్రం వారు విద్యుత్ తీసుకుంటున్నా ట్రాన్స్మిషన్ చార్జీలు మనం చెల్లించాల్సి వస్తోంది. గత ఒప్పందాల వల్లే పెరిగిన విద్యుత్ ధరలు కేంద్రానికి ఏడాదికి ట్రాన్స్మిషన్ చార్జీలే రూ.1700కోట్లు ఏపీ చెల్లిస్తోంది. కేంద్రం చేసిన ఒప్పందాలను ఇప్పటి వరకు ఎక్కడా ఏపీ ఉల్లంఘించలేదు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపీకి బొగ్గుగనులు కేటాయించలేదు. ప్రత్యేక బొగ్గు గనుల కేటాయింపులు లేకపోవడం వల్ల ఏడాదికి రూ.2,500కోట్లు అదనంగా ఏపీ చెల్లించాల్సి వస్తోంది. గత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చేసిన కొన్ని ఒప్పందాల వల్లే ఏపీలో విద్యుత్ ధరలు పెరిగాయి. 2014లో అన్ని విద్యుత్ సంస్థల అప్పు కలిపి రూ 24,800 కోట్లు.. నేడు అది 70,000 కోట్లకు పెరిగింది. అవినీతి, తప్పుడు ఒప్పందాల వల్లే ఈ అప్పులు ఇంతగా పెరిగాయి. ఈ అప్పులకు వడ్డీలు కట్టడం వల్ల కూడా విద్యుత్ చార్జీలపై ప్రభావం పడుతోంది. గత ప్రభుత్వం వెళుతూ రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టింది’అంటూ అజేయ కల్లం వివరించారు. -
అదే సీఎం జగన్ సిద్ధాంతం : అజేయ కల్లాం
-
అదే సీఎం జగన్ సిద్ధాంతం : అజేయ కల్లాం
సాక్షి, చిత్తూరు : అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన అని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం అన్నారు. ఆదివారం ఆయన మూడు రాజధానులకు మద్దతుగా చిత్తూరు జిల్లా నారావారిపల్లి గ్రామంలో నిర్వహించిన అధికార వికేంద్రీకరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజేయకల్లాం మాట్లాడుతూ.. అధికార వికేంద్రీకరణ అనేదే సీఎం జగన్ ప్రభుత్వ సిద్ధాంతం అని, ఇందులో భాగంగానే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ అలోచిస్తే.. చంద్రబాబు, ఎల్లో మీడియా ఒకే చోట అభివృద్ధిని కోరుకుంటున్నాయని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం కొంతమంది లబ్ధి కోసమే అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టిందని ఆరోపించారు. గతంలో హైదరాబాద్‌లో మాత్రమే పెద్ద పెద్ద కంపెనీలను పెట్టించారని, దాని వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అలా చేయకుండా తమ రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని తీసుకెళ్లి సక్సెస్ సాధించాయని తెలిపారు. రాజధాని సెంటర్లో ఉండాలని కోరుకోవడం తప్పు అని అన్నారు. రాజధాని మధ్యలో ఉండాలని చంద్రబాబు అంటున్నారని, ఢిల్లీ నుంచి అమెరికా వరకు ఎక్కడా రాజధాని మధ్యలో లేదనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేయడమే టీడీపీ సిద్ధాంతం అని విమర్శించారు.