కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం
గుంటూరు ఈస్ట్: ప్రస్తుతం ప్రజాప్రతినిధులు గాలి తప్ప అన్ని సహజ వనరులనూ దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం ఆందోళన వ్యక్తం చేశారు. మట్టి, ఇసుక సైతం అమ్ముకుని కోట్ల రూపాయిలు సంపాదించడం ఈ మధ్యే మొదలైందని వెల్లడించారు. గుంటూరులో ఆదివారం జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘ధనస్వామ్యం– వారసత్వ రాజకీయాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సులో అజేయ కల్లం రచించిన ‘మేలుకొలుపు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి జిల్లాల్లోని ఓ గ్రామంలో చెరువు తవ్వడానికి కోటి రూపాయలు అంచనా వేసి విడుదల చేయగా, తవ్విన మట్టి అమ్ముకుని ఎకరాకు రూ. 60 లక్షలు ఆర్జించారని తెలిపారు. ఎమ్మెల్యేలు కేవలం తమ పార్టీకి, కార్యకర్తలకు మాత్రమే ప్రజాప్రతినిధులుగా వ్యవహరించడం అప్రజాస్వామికమన్నారు. పౌరసమాజం నిర్వీర్యం అవడం వల్లే ఇవన్నీ చెల్లుబాటు అవుతున్నాయని ఆయన చెప్పారు.
నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నవారిని ఆదర్శంగా తీసుకోవద్దు
సమాజం కోసం త్యాగాలు చేసిన వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అజేయ కల్లం పిలుపునిచ్చారు. సినిమా రంగానికి చెందిన వారిని, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నవారిని, రౌడీలు, సమాజాన్ని దోచుకున్న వారిని ఆదర్శంగా తీసుకుంటే అనర్థాలను మనమే చవిచూడాల్సి ఉంటుందన్నారు. గ్రామ స్థాయిలో ప్రాథమిక వసతులన్నింటినీ సమకూర్చే సెక్రటేరియట్లను అభివృద్ధి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు ఉండే సెక్రటేరియట్‌ను అభివృద్ధి చేస్తే ప్రజలకు ఒనగూరేది మిటని ప్రశ్నించారు.
ఆగమ శాస్త్ర నిపుణులే చెప్పాలి
తిరుమలలో భక్తుల సాధారణ దర్శనాన్ని నిలిపివేయడంపై అడిగిన ప్రశ్నకు అజేయ కల్లం స్పందిస్తూ సంప్రోక్షణ సమయంలో గర్భగుడిలోకి అనుమతించకపోయినా.. సాధారణ దర్శనాన్ని గతంలోలా కొనసాగించవచ్చన్నారు. ఏదో ఇబ్బందులు ఉన్న కారణంగానే వెంకన్న దర్శనం నిలిపివేసే సాహసం చేశారని వ్యాఖ్యానించారు. ఏ కారణాలతో దర్శనం నిలిపివేసిందీ ఆగమశాస్త్ర నిపుణులే చెప్పాలన్నారు.
ఎంపీల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు నేరస్తులు
సదస్సుకు అధ్యక్షత వహించిన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. లోక్‌సభకు ఎన్నికైన ప్రతి ముగ్గురు ఎంపీల్లో ఒకరు నేరస్తులు ఉంటున్నారని, 66 శాతం మంది వారసులు ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని, మేధావులకు సామాజికవేత్తలకు స్థానం కల్పిస్తేనే ఈ వ్యవస్థ మారుతుందని అభిప్రాయపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలను రాజ్యాంగంలో భాగస్వాములను చేయడం, ఐరోపా దేశాల తరహాలో దామాషా పద్ధతి ప్రవేశపెట్టడం తదితర విప్లవాత్మక చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు.
వైఎస్ జగన్‌ది వారసత్వ రాజకీయం కాదు
నవ్యాంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ డీఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఎంపీగా అనుభవం పొంది, సొంత పార్టీ పెట్టి.. ప్రజలను చైతన్యపరచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాభిమానం పొందారన్నారు. ఆయనది వారసత్వ రాజకీయం కిందకు రాదని స్పష్టం చేశారు. ఈ సదస్సులో ఏఎన్‌యూ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.రంగయ్య, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, కన్నా విద్యా సంస్థల డైరెక్టర్ కన్నా మాస్టారు, వావిలాల సంస్థ కార్యదర్శి మన్నవ షోడేకర్, సోషలిస్టు ఉద్యమ నేత మోదుగుల బాపిరెడ్డి, ఎస్‌హెచ్‌ఓ వ్యవస్థాపకుడు సేవాకుమార్, ఆగ్జిలరీ సొసైటీ అధ్యక్షుడు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment