సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ.. హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషీట్‌లో తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
నా వాంగ్మూలంపై సిబిఐ తప్పుడు వైఖరి
"ఏప్రిల్ 29న నేను వాంగ్మూలం ఇస్తుండగా.. అధికారి మరొకరిని లోపలికి పిలిచారు. ఆయన లాప్‌ట్యాప్‌తో వచ్చి ఏదో రికార్డు చేసుకున్నాడు. ఆయన ఏం రికార్డు చేసింది నాకు చూపించలేదు. కనీసం చదివి వినిపించలేదు. నాకు తెలిసినంతవరకు నా వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో రికార్డు కూడా చేయలేదు. సీబీఐ నా స్టేట్‌మెంట్‌ను తప్పుడు రికార్డు చేసినట్లు మే 17న ఓ పత్రికలో ప్రచురితమైన వార్త ద్వారా తెలుసుకున్నా".
విచారించింది ఒకరయితే, సంతకం చేసింది మరొకరా?
"నా స్టేట్‌మెంట్‌పై సంతకం చేసిన అధికారి, నన్ను విచారించిన అధికారి ఒకరు కాదు. దర్యాప్తు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాజ్యాంగ ధర్మాసనాలు పదేపదే చెబుతున్నా.. కొందరు మాత్రం వాటిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తు చేయడం అంటే అస్పష్టమైన సత్యాన్ని బయటికి తీసుకురావడం. కానీ, ఇక్కడ అధికారులు అలా వ్యవహరించలేదు."
నా వాంగ్మూలం పత్రికకు సిబిఐ ఎలా లీక్ చేస్తుంది?
"నా వాంగ్మూలం గురించి నేను ఎవరి వద్దా ప్రస్తావించలేదు. కానీ, ఆ పత్రికలో ఎలా వచ్చిందో నాకు అర్థంకాలేదు. ఆశ్చర్యం వేసింది. ఆ పత్రికలో పేర్కొన్నదంతా అసత్యపూరితం. పత్రికలో వచ్చిన దానిపై ఎలక్ట్రానిక్ మీడియా చర్చా కార్యక్రమాలు పెట్టడంతో నేను విలేకరుల సమావేశం పెట్టి.. ఆ పత్రికది కట్టుకథ అని చెప్పాల్సి వచ్చింది. సీబీఐ నమోదు చేసింది కూడా నేను చెప్పింది కాదని తెలిసింది. అయితే సీఆర్‌పీసీ 161 కింద రికార్డు చేసిన కాపీ నావద్ద లేనందున నా వాంగ్మూలం తప్పుగా పేర్కొన్న విషయాన్ని తెలుసుకోలేకపోయా"
నేను చెప్పింది ఒకటయితే సిబిఐ మరోలా స్టేట్ మెంట్ తయారు చేస్తుందా?
"ఏప్రిల్ 29, 2023న సీబీఐ నా నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. నేను చెప్పింది ఒకటయితే CBI దాన్ని మార్చి ఛార్జిషీటులో మరోలా పేర్కొంది. మార్చి 15, 2019న జగన్ గారి నివాసంలో సుమారు ఉదయం 5 గంటల సమయంలో మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన సుమారు గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారు. OSD కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్‌గారు షాక్‌కు గురైయ్యారు. చిన్నాన్న చనిపోయారని తమతో అన్నారు" ఇంతకుమించి తానేమీ సీబీఐకి చెప్పలేదని అజేయ కల్లం స్పష్టం చేశారు.
నేను చెప్పని విషయాలు మీరేలా స్టేట్ మెంట్ లో చేర్చుతారు?
తాను CBIకి స్టేట్‌మెంట్లో కేవలం పైన పేర్కొన్న విషయాన్ని మాత్రమే చెప్పానని, కాని సీబీఐ ఛార్జిషీటులో వీటిని మార్చివేసిందని అజేయ కల్లం తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి భార్య ప్రస్తావన కాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదని అజేయ కల్లం తెలిపారు. అయితే సీబీఐ పేర్కొన్న స్టేట్‌మెంట్‌లో తనకు ఆపాదించి, తాను చెప్పినట్టుగా అబద్ధాలను చేర్చారని అజేయకల్లం పిటిషన్ లో పేర్కొన్నారు.
CBI దాన్ని తొలగించాల్సిందే
"దురదృష్టవశాత్తు నేను చెప్పింది CBI సరిగ్గా రికార్డు చేయలేదు. చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది పూర్తిగా అసంబద్ధం. దర్యాప్తును తప్పుదారి పట్టించి.. ఇతరులను కేసులో ఇరికించే ధోరణితోనే సీబీఐ ఇలా తప్పుగా పేర్కొంది. నేను చెప్పకున్నా చెప్పినట్లు సీబీఐ తప్పుడు వాంగ్మూలాన్ని సమర్పించడం ఎంతమాత్రం సరికాదు. ఇతర వ్యక్తులను చిక్కుల్లో పడేసేందుకే సీబీఐ తప్పుడు సమాచారం చేర్చింది. ఈ అంశాలను పరిశీలించి హైదరాబాద్ సీబీఐ కోర్టులో సమర్పించిన చార్జిషీట్ నుంచి తప్పుడు వాంగ్మూలాన్ని తొలగించాలి". తెలంగాణ హైకోర్టు ఆ ఛార్జ్ షీట్ నుంచి తన వాంగ్మూలం తొలగించేలా ఆదేశాలివ్వాలని అజేయ కల్లం విజ్ఞప్తి చేశారు.
వివక్ష లేకుండా విచారణ జరగాలి
సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేయడం చట్టవిరుద్ధమని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని అజేయకల్లం విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ లో సీబీఐ డైరెక్టర్‌ని, వివేకా కేసు విచారణాధికారి (ఏఎస్పీ)ని ప్రతివాదులుగా చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment