ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం
భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్): భవనాలు నిర్మించడం, కాలువలు తవ్వడమే అభివృద్ధి కాదని.. అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు లభిస్తేనే నిజమైన అభివృద్ధి అని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పీసీఆర్ కల్యాణ మండపంలో గురువారం ‘ఓపెన్ మైండ్ ఫర్ బెటర్ సొసైటీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ నాడు–నేడు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తన ఉద్యోగానుభవంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే రెండేళ్లు కరోనా విపత్తు వల్ల తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చిందన్నారు. మిగిలిన మూడేళ్ల కాలంలో ఒకపక్క పేదలకు సంక్షేమం, మరోపక్క రాష్ట్రంలో శాశ్వత అభివృద్ధి ప్రణాళికలు రచించారని తెలిపారు.
ఐదేళ్లలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో జరిగాయనేందుకు ఉదాహరణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కళాశాలలు, గ్రామ, వార్డు సచివాలయ భవనాలు, విలేజ్ క్లినిక్‌లు, ఆస్పత్రి భవనాలు అని వివరించారు. చంద్రబాబు హయాంలో పేదరికం నిష్పత్తి 7.7 శాతం ఉంటే.. జగన్ పాలనలో 4.19 శాతానికి తగ్గిందన్నారు.
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి కేవలం రూ.3 వేల కోట్ల పెట్టుబడులు వస్తే.. గడచిన ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.78 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. నాడు–నేడు పథకం ద్వారా 45,975 ప్రభుత్వ పాఠశాలలను రూ.18 వేల కోట్లతో అభివృద్థి చేశారన్నారు.
ఓపెన్ మైండ్‌తో చర్చించాలి
ఓపెన్ మైండ్ ఫర్ బెటర్ సొసైటీ చైర్మన్, ఏపీ ఉన్నత విద్యా రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ ఎన్.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో 34వేల ఉద్యోగాలు ఇస్తే.. జగన్ పాలనలో 2.7 లక్షల ఉద్యోగాలు కల్పించారని వివరించారు. 2018–19 వరకు స్థూల రాష్ట్ర ఉత్పత్తి రూ.7,90,800 కోట్లయితే 2023–24లో రూ.11,66,000 కోట్లు అని చెప్పారు. తలసరి ఆదాయం 2018–19లో రూ.1.54 లక్షల కోట్లు అయితే 2023–24లో రూ.2.20 కోట్లకు పెరిగిందన్నారు.
ఆర్‌టీఐ మాజీ కమిషనర్, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు మాట్లాడుతూ.. గత పాలనతో పోలిస్తే మన రాష్ట్రంలో పేదరికం 50 శాతం తగ్గిందన్నారు. పేదల పిల్లలు ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, మాస్టర్ డిగ్రీ వంటి ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారని, దీనిని మేధావులు గుర్తించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment