
సదస్సులో మాట్లాడుతున్న అజేయ కల్లం, చిత్రంలో లక్ష్మణరెడ్డి, విజయబాబు
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తారస్థాయి కి చేరిందని ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధులను ప్రచారం కోసం వేలాది కోట్ల ప్రజాధనాన్ని ఏపీ ప్రభుత్వం పెద్దఎత్తున దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం రూ.20వేల కోట్లను ఏపీకి ఇస్తే.. అందులో మూడోవంతు నిధులు స్వాహా అయ్యాయని ఆరోపించారు. జన చైతన్య వేదిక ఏపీ అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సు నిర్వహించారు. అజేయ కల్లం ఏపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. మార్కెట్‌లో రూ.4వేలు విలువచేసే సెల్‌ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రూ.7,500 చొప్పున 5 లక్షల మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయడం ద్వారా రూ.150 కోట్లు స్వాహా చేశారన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేరుతో రూ.450 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.45 లక్షలకే ధారాదత్తం చేశారని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో 80శాతం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కూడా లభించటంలేదని అజేయ కల్లం ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించక ఓవైపు అప్పులపాలవుతుంటే.. మరోవైపు, ప్రభుత్వం విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుని వ్యాపారులకు దోచిపెడుతోందని ఆరోపించారు. 30శాతం లోటు వర్షపాతంతో రాయలసీమ, ప్రకాశం జిల్లాల రైతులు ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోవటంలేదన్నారు. కాగా, రాజధానిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.11వేలు చెల్లించినా చిన్నపాటి వర్షానికే కారుతోందని అజేయ కల్లం ఎద్దేవా చేశారు. అలాగే, గత నాలుగేళ్లుగా ఓ మీడియా సంస్థకు రూ.700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన నిధులను ప్రచారం కోసం ధర్మపోరాట దీక్ష, నవనిర్మాణ దీక్ష, పుష్కరాలు, క్యాంప్ కార్యాలయాలు, ప్రత్యేక విమానాలు, విదేశీయాత్రల పేరుతో వేలాది కోట్లు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అంతేకాక, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమ సంపాదనను కర్ణాటక, గుజరాత్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ఖర్చుచేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో చేసిన అప్పులు తీర్చడానికి సర్కార్ మరిన్ని అప్పులు చేస్తోందని.. వీటిని ప్రయోజనంలేని రంగాలకు వెచ్చిస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాలపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని.. అందరిలో ప్రశ్నించే తత్వం పెరగాలని అజేయ కల్లం ఆకాంక్షించారు.
ప్రజలే కాపాడుకోవాలి: విజయబాబు
సదస్సులో పాల్గొన్న సమాచార హక్కు మాజీ కమిషనర్ పి విజయబాబు మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలు, దోపిడీలు మితిమీరిన తరుణంలో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. నేటి ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ధ్వజమెత్తారు. హుందాగా వ్యవహరించాల్సిన స్పీకర్ సైతం పార్టీ ఫిరాయింపుదారులకు మద్దతుగా నిలవటం దౌర్భాగ్యమన్నారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తిని మంత్రిగా చేసిన ఘనత రాష్ట్రానికే దక్కిందని ఎద్దేవా చేశారు.
అవినీతికి కేంద్రాలుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు
ఏపీలో సేవా దృక్పథంతో ఉండాల్సిన విద్య, వైద్య రంగాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి. లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. మానవ వనరుల అభివృద్ధి సూచికలో రాష్ట్రం దేశంలోనే 27వ స్థానం, అక్షరాస్యతలో 32వ స్థానంలో ఉంటే.. అవినీతిలో మాత్రం అగ్రభాగాన ఉందన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులు రాజకీయ అవినీతి కేంద్రాలుగా మారాయన్నారు. రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లుగా 2.4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉండగా.. కేవలం 5వేలు మాత్రమే భర్తీ చేశారని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్‌రావు వివరించారు. అలాగే, 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉంటే... కేవలం 6వేల పోస్టులకు మాత్రమే డీఎస్సీ నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
రాష్ట్రమంతటా ‘సేవ్ ఏపీ’ సదస్సులు
కాగా, ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’సదస్సులను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్ కే రత్నయ్య కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ.. కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రభుత్వ వైద్యం పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమకు నికర జలాలను కేటాయించి నీటిపారుదల ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయాలన్నారు. సమావేశంలో దళిత ఐక్య వేదిక నేత కల్లూరు చంగయ్య, సామాజిక సేవకురాలు నర్మద, ప్రొఫెసర్ రంగారెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.