విలేకరులతో మాట్లాడుతున్న ఐవైఆర్. చిత్రంలో అజేయ కల్లం, లక్ష్మణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల జాబితాలో 52.67 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీలు ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లం వెల్లడించారు. నగరంలోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల జాబితాలోని అవకతవకలపై శనివారం మీడియా సమావేశం జరిగింది. ఇందుకు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐవైఆర్ మాట్లాడుతూ.. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో 3.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 52.67 లక్షల నకిలీ ఓటర్లు ఉండటం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమన్నారు. 2–3 శాతం ఓట్ల తేడతో జయాపజయాలు ఉంటున్న నేటి పరిస్థితుల్లో 15 శాతం నకిలీ ఓట్లు ఉండటం దుర్మార్గమన్నారు. అజేయ్ కల్లం ప్రసంగిస్తూ.. అధునాతన సాఫ్ట్‌వేర్ ఉపయోగించి నకిలీ ఓట్లను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లుగా కూడా నమోదైన వారు 18 లక్షల మంది ఉన్నారన్నారు. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 26వేల నకిలీ ఓట్లను గుర్తించగా అందులో 18 వేల ఓటర్లను తొలగించారని ఇంకా 8 వేల ఓట్లు కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ పార్టీలు, కేంద్ర ఎన్నికల సంఘం, ప్రజాసంఘాలు అప్రమత్తమై ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని పిలుపునిచ్చారు.
అధికారులు, జన్మభూమి కమిటీలు కుమ్మక్కై
జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. జన్మభూమి కమిటీలతో ఏపీ అధికార యంత్రంగం కుమ్మక్కు కావడంవల్లే నకిలీ ఓట్లు కొనసాగుతున్నాయన్నారు. ఓటరు కార్డులను ఆధార్‌కు లింకు చేయడంతోపాటు బయోమెట్రిక్ విధానాలను అమలుచేయడం ద్వారా వీటిని నిరోధించవచ్చన్నారు. జాబితాలో అక్రమాలు జరిగితే స్థానిక అధికార యంత్రాంగాన్ని బాధ్యులను చేసి శిక్షించాలన్నారు.
34లక్షల డూప్లికేటెడ్, రిపీటెడ్ ఓట్లు
ఓటరు అనలెటిక్స్ మరియు స్ట్రాటాలజీ టీమ్ సభ్యులు తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ.. ఏపీలోని 175 నియోజవర్గాల్లో 34,13,000 ఓట్లు డూప్లికేటెడ్, రిపీటెడ్‌గా ఉన్నాయని ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
– 18లక్షల మందికి పైగా రెండు రాష్ట్రాల్లో ఓట్లున్నాయని.. ఇవి ఏ విధంగా వచ్చాయో ఆధారాలతో ఎన్నికల కమిషన్‌కు చూపించాం.
– 10 కేటగిరీల కింద డూప్లికేట్ ఓట్లను విభజించాం.
– అలాగే, సెప్టెంబర్ 1, 2018న విడుదల చేసిన ఓటరు జాబితాలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. భర్త స్థానంలో భార్య పేరు మార్చడం, ఇంటి నెంబర్లు వేర్వేరుగా నమోదు చేసి నకిలీ ఓట్లు సృష్టించారు.
– ఒకటే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నాయి. వయస్సు తేడా చూపించి ఓటరుగా నమోదు చేయించుకున్నారు. ఈ విధంగా 24,928 కేసులు నమోదయ్యాయి.
– ఇంటి పేర్లు, అసలు పేర్లు అటూఇటూ మార్చి మొత్తం 92,198 ఓట్లు నమోదు చేశారు.
పుట్టిన ఏడాదికే ఓటు హక్కు
ఇదిలా ఉంటే.. 18 ఏళ్లకే ఓటు హక్కు ఉండాలని.. కానీ, రాష్ట్రంలో పుట్టిన ఏడాదికే ఓటు హక్కు ఇచ్చారని ఆయన విస్మయం వ్యక్తంచేశారు. ప్రపంచంలో 124 సంవత్సరాల 2 రోజులు బతికినట్లు రికార్డులు ఉంటే .. మన రాష్ట్ర ఓటర్ల జాబితాలో 352 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఉన్నారన్నారు. ఇలాంటివి 6,118 ఓట్లు నమోదు అయ్యాయన్నారు. పీపుల్స్ రిప్రజంటేషన్ యాక్ట్ ప్రకారమైతే.. ఇలాంటి తప్పులు చేసిన వారిపై ఏడాది జైలుశిక్ష విధించాలని చెబుతోందని ఆయన గుర్తుచేశారు. అలాగే, ఇలాంటివి దేశంలో ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్లు గుర్తించలేవని,, సాఫ్ట్‌వేర్ ఆప్‌డేట్ చేయకపోవడంతో కూడా ఇలా జరుగుతుందని లోకేశ్వర్‌రెడ్డి చెప్పారు. సమావేశంలో రీసెర్చ్ స్కాలర్ ఓటరు అనలెటిక్స్ మరియు స్ట్రాటాజీ టీమ్ సభ్యులు జీవీ సుధాకర్‌రెడ్డి, జన చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సలీమ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment