సీఈవోలో ఐటీ ప్రాజెక్టు మేనేజర్‌గా బోడపాటి అనిల్ నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన సీఈవో వివేక్ యాదవ్
ఓటర్ల నమోదు మొదలు కౌంటింగ్ వరకు పర్యవేక్షణ
కార్డుల జారీ, సాఫ్ట్‌వేర్, లైవ్ వెబ్‌కాస్టింగ్, వివిధ అప్లికేషన్ల అమలు
ఇలాగైతే పారదర్శకతకు పాతరే అంటున్న అధికార వర్గాలు
సాక్షి, అమరావతి : ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలకమైన ఓటర్ల జాబితా ప్రక్రియ పర్యవేక్షణ అంతా ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెడుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో ఐటీ ప్రాజెక్టు మేనేజర్‌గా ప్రైవేట్ వ్యక్తి బోడపాటి అనిల్‌ను నియమించడం చర్చ నీయాంశమైంది.
తొలుత ఏడాది పాటు ఔట్ సోర్సింగ్ విధానంలో నెలకు రూ.1.40 లక్షల వేతనంతో ఈయన పని చేస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎంపిక కమిటీ సిఫారసుతో ఈయన్ను నియమించామని తెలిపారు. ఎంపిక కమిటీలో ఎవరున్నారనేది ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్–నెట్‌ను ఐటీ ప్రాజెక్టు మేనేజర్ అమలు చేస్తారని తెలిపారు.
ఈవీఎంలు, సాప్ట్‌వేర్ ట్రాకింగ్‌తో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సర్వం ఇకపై బోడపాటి అనిల్ పర్యవేక్షణలో ఉంటాయి. తద్వారా ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ ప్రక్రియలో పారదర్శకతకు పాతర వేయడమేననే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
ఐటీ ప్రాజెక్టు మేనేజర్ విధులు ఇలా..
» ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఏటా నిరంతర నవీకరణ వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ–సేవా, మీ–సేవా కేంద్రాల ద్వారా ఎలక్టోరల్ రోల్స్‌లో పేరు చేర్చడం, పీవీసీ కార్డుల జారీ కోసం పౌర సేవల దరఖాస్తు అమలు స్థితిని రోజువారీ పర్యవేక్షించడం.
» రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎం ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన వివిధ సమస్యలను పర్యవేక్షించడం.
» ఎస్‌ఎంఎస్ గేట్‌వే ఏకీకరణ, ఎస్‌ఎంఎస్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను అమలు చేయడం.
» కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి వివిధ అప్లికేషన్ అమలు పర్యవేక్షణ. ఐటీ అప్లికేషన్స్ (ఇఆర్‌ఓ–నెట్, సైబర్ సెక్యూరిటీ, ఈ–రోల్ పర్యవేక్షణ), ఫామ్ 1–8 డేటా పర్యవేక్షణ, జిల్లా అధికారులు, కేంద్ర ఎన్నికల సంఘం మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం.
» కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి వివిధ అప్లికేషన్ల పర్యవేక్షణతో పాటు పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్, కౌంటింగ్ అండ్ ఇండెక్స్ కార్డు అప్లికేషన్ల పర్యవేక్షణ.
» కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలతో ఆన్‌లైన్ కార్యకలాపాలు, ఐటీ సంబంధిత కార్యకలాపాల పర్యవేక్షణ. వీటితో పాటు ఓటర్ల జాబితా సవరణకు ముందు తీసుకోవాల్సిన చర్యలను పూర్తి చేయడం.
Comments
Please login to add a commentAdd a comment