Vivek Yadav
-
ఓటర్ల నమోదు షురూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ, యువకులతోపాటు ఓటర్ల జాబితాలో పేరు లేనివారు నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. వచ్చే నెల 28వ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతుందన్నారు.18 సంవత్సరాలు నిండిన వారితోపాటు జాబితాలో పేర్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఓటర్లుగా నమోదు చేస్తామన్నారు. ఓటరు నమోదుతో పాటు అభ్యంతరాలను కూడా స్వీకరిస్తారు. వాటిన్నింటినీ డిసెంబర్ 24లోగా పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 6న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో వచ్చే నెల 9, 10, 23, 24 తేదీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాతోపాటు సవరణలకు దరఖాస్తులను స్వీకరించడానికి బీఎల్వోలు అందుబాటులో ఉంటారన్నారు. -
‘ఎన్నికల’ పెండింగ్ బిల్లులకు రూ.286.36 కోట్లు
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల నిర్వహణ పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు జిల్లాల వారీగా రూ.286.36 కోట్లు అదనపు నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పెండింగ్ బిల్లులకే అదనపు నిధులను చెల్లించాలని, ఇతర శాఖల పనులకు ఈ నిధులను వ్యయం చేయరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లాల వారీగా ఏ పద్దు కింద ఎన్ని నిధులను విడుదల చేసింది కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఖర్చు వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా వివేక్ యాదవ్
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)గా ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. వివేక్ యాదవ్ బాధ్యతలు చేపట్టగానే.. ప్రస్తుత ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా రిలీవ్ కాన్నారు. ఎంకే మీనాకు కీలక శాఖ అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
మొక్కలు నాటిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అమరావతిలోని పేదల ఇళ్ల స్థలాల లేఔట్లలో పచ్చదనాన్ని పెంపొందించే దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మొక్కలు నాటారు. సోమవారం కృష్ణాయపాలెం లేఔట్లో మొక్కలు నాటి నగర వన మహోత్సవాన్ని ప్రారంభించారు. తర్వాత ఈ లేఔట్లో నిర్మించిన మోడల్ హౌస్‌ను పరిశీలించారు. ఆ ఇంటి యజమానురాలు ఈపూరి జీవరత్నం, ఆమె భర్త, పిల్లలతో మాట్లాడారు. వారి కోరిక మేరకు ఫొటో కూడా దిగారు. కృష్ణాయపాలెంలో మొక్కలకు నీళ్లు పోస్తున్న సీఎం జగన్ కాగా, మొత్తం 25 లేఔట్లలో పచ్చదనం అభివృద్ధి కోసం కేటాయించిన 10 శాతం భూమిలో అర్బన్ ఫారెస్ట్ కార్యక్రమంలో భాగంగా రూ.1.68 కోట్లతో 28 వేల మొక్కలు నాటనున్నట్టు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. రావి, వేప, నేరేడు, బాదం, రెయిన్‌ట్రీ, పచ్చతురాయి, పొగడ, ఆకాశమల్లె వంటి నీడను, పళ్లను ఇచ్చే మొక్కలతో కృష్ణాయపాలెం లేఔట్ హరిత వనంగా మారుతుందన్నారు. ఇక్కడ నివసించే ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడంతో పాటు ఆహ్లాదభరిత వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. -
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మధ్య ఆదాయ వర్గాలు (ఎంఐజీ) కోరుకునే ఇంటి నిర్మాణం కోసం అవసరమైన ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లను పూర్తి ప్రభుత్వ హామీతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. వాటిని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. స్మార్ట్ టౌన్‌షిప్‌ల అభివృద్ధి మార్గదర్శకాలు, పాటించాల్సిన నిబంధనలపై చర్చించేందుకు శనివారం సీఆర్డీఏ కార్యాలయంలో రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌తో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్ అలీంబాషా, డెవెలప్మెంట్ ప్రమోషన్ డైరెక్టర్ ఎం.వెంకటసుబ్బయ్య, క్రెడాయ్ అధ్యక్షుడు కె.రాజేంద్ర, సభ్యులు, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నెరెడ్కో) సభ్యులు, వాటి పరిధిలోని రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో కమిషనర్ డెవలపర్స్ సందేహాలకు సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. సీఆర్డీఏ పరిధితో పాటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో స్మార్ట్ టౌన్‌షిప్‌లను చేపట్టనున్నామని, ప్రాజెక్టు అమలుకు జిల్లా స్థాయి కమిటీ (డీఎల్సీ) నేతృత్వం వహిస్తుందని వివరిచారు. ప్రాజెక్టుకు 20 ఎకరాలు తప్పనిసరి డెవలపర్ సంస్థ కనీసం 20 ఎకరాల భూమిని లే అవుట్‌గా అభివృద్ధి చేయాలని, యజమాని పేరుతోనే భూమి ఉండాలని కమిషనర్ సూచించారు. లే అవుట్ అభివృద్ధికి ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం వేగంగా అన్ని అనుమతులు ఇస్తుందని వివరించారు. లే అవుట్లను మౌలిక సదుపాయాలతో సహా 150, 200, 240 గజాల విస్తీర్ణంలో మూడు రకాల ప్లాట్లను అభివృద్ధి చేయాలని, డెవలపర్ భూమి ఇచ్చినప్పటి నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అన్ని అభివృద్ధి పనులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందని కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. భూమి యజమానికి, ఎంఐజీల్లో ప్లాట్లు కొనుగోలు చేసేవారికి వారధిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందన్నారు. ఈ నెల 20 నుంచి ఎంఐజీ లే అవుట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, డెవలపర్స్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా డెవలప్స్ అడిగిన సందేహాలను వివేక్ యాదవ్‌తో పాటు, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్సెట్ మేనేజ్మెంట్కు చెందిన డొమైన్ ప్రాజెక్ట్ మేనేజర్ సిద్ధార్థ నివృత్తి చేశారు. అలాగే సీఆర్డీఏ ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని పాయకాపురం, తెనాలిలోని చెంచుపేట, మంగళగిరి, ఇబ్రహీంపట్నంలోని ట్రక్ టెర్మినల్ ప్రాంతాల్లో ప్లాట్లను ఈ–వేలం ద్వారా అమ్మకానికి ఉంచామని, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తోడ్పాటునందించాలని కోరారు. ఎంఐజీ నిబంధనలు ఇవీ.. ► రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 88లోని నిబంధనలకు అనుగుణంగా ఎంఐజీ లే అవుట్లు ఉండాలి ► లే అవుట్లో పట్టణాభివృద్ధి సంస్థ (యూడిఏ) వాటాగా 40 శాతం కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని ఎంఐజీ దరఖాస్తుదారులకు ఇచ్చేందుకు ప్రాజెక్టు అభివృద్ధి సంస్థ ముందుకొస్తే దాన్ని తిరస్కరణ లేదా అంగీకరించే అధికారం జిల్లాస్థాయి కమిటీకి ఉంటుంది ► దరఖాస్తుదారులకు అనువైన ప్రాంతంలో ఎలాంటి వ్యాజ్యాలు, తాకట్టులు లేని కనీసం 20 ఎకరాల భూమిలో మాత్రమే వీటిని ఏర్పాటు చేయాలి ► ఎంఐజీ ప్లాట్ల అనుమతులు, మార్కెట్ విలువ, అమ్మకం ధర వంటి అంశాలు ఎలా ఉండాలో జిల్లా కమిటీ సూచిస్తుంది. ► ప్రాజెక్టు ఏర్పాటు చేసే ఒక ప్రాంతం నుంచి ఒకటికి మించి దరఖాస్తులు వస్తే మార్గదర్శకాలకు అనుగుణంగా అభివృద్ధి సంస్థలను జిల్లా కమిటీ ఎంపిక చేస్తుంది ► ఎంఐజీ ప్లాట్ల అమ్మకపు ధర ఎప్పుడూ మార్కెట్ ధర కంటే కనీసం 10 నుంచి 20 శాతం తక్కువగా ఉండేలా కమిటీ చూడాలి ► లే అవుట్లలో అంతర్గత రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పార్కులు, ఫుట్‌పాత్ తదితర ముఖ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి ► ఎంఐజీలో ప్లాట్లు కావాలనుకునేవారు దరఖాస్తుతో పాటు ప్లాట్ ధరలో 10 శాతం, ఒప్పదం చేసుకునే సమయంలో మరో 10 శాతం, ప్రాజెక్టు పూర్తయ్యాక ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో మిగిలిన 80 శాతం మొత్తాన్ని చెల్లించాలి. -
AP: ఇక రోజూ బులెటిన్ బోర్డు
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రజలకు వారి చెంతనే అన్ని రకాల సేవలందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ పనితీరును ఎప్పటికప్పుడు మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా యంత్రాంగం సరికొత్త పంథాను ఎంచుకుంది. ఇకపై గ్రామ/వార్డు సచివాలయాల్లో ఎన్ని ఫిర్యాదులు, వినతులు వచ్చాయన్నది ఎప్పటికప్పుడు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఏదైనా సమస్యను గడువులోగా పరిష్కరించకపోతే ఎందుకు పరిష్కారం కాలేదు.. ఎవరి వద్ద పెండింగ్ ఉంది.. పెండింగ్‌లో ఉండడానికి కారణం.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ బులెటిన్ బోర్డుకు శ్రీకారం చుట్టారు. వార్డు/గ్రామ సచివాలయాలు నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేసేందుకే దీన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా సచివాలయాల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం, పెండింగ్ అంశాలపై రోజూ బులెటిన్ జారీ చేస్తారు. ఇందులో పేర్కొన్న సమస్య ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉందో గుర్తించి.. సంబంధిత అధికారికి పరిష్కారం కోసం పంపుతారు. గ్రామ/వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా పెండింగ్ సమస్యలకు సంబంధించిన బులెటిన్‌ను అధికారులకు పంపిస్తారు. నిర్దేశిత గడువులోగా పరిష్కరించకపోతే చర్యలు నిర్దేశిత గడువులోగా సమస్యలను పరిష్కరించనివారిపై చర్యలు తీసుకుంటారు. దీనివల్ల ఉద్యోగుల్లో బాధ్యత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు బులెటిన్‌లో తహసీల్దార్‌కు వచ్చిన మొత్తం అర్జీల సంఖ్య, పరిష్కరించిన అర్జీల సంఖ్య, నిర్దేశిత గడువులోపు ఉన్న అర్జీల సంఖ్య, నిర్దేశిత గడువు దాటిన అర్జీల సంఖ్య, 24 గంటలు, 48 గంటలలోపు పరిష్కరించాల్సినవి ఉంటాయి. బులెటిన్‌ను ఆరు కేటగిరీలుగా విభజించారు. మండల రెవెన్యూ అధికారి (రెవెన్యూ), అసిస్టెంట్ ఇంజనీర్ (విద్యుత్), మండల రెవెన్యూ అధికారి, డిప్యూటీ తహసీల్దార్ (వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాలు) సబ్ రిజిస్ట్రార్ (స్టాంపులు, రిజిస్ట్రేషన్లు), అసిస్టెంట్ ఇంజనీర్ (రవాణా, రోడ్లు, భవనాలు) కేటగిరీలుగా విభజించి.. ఎందులో ఎన్ని అర్జీలు వచ్చింది పొందుపరుస్తారు. జవాబుదారీతనం కోసమే.. గ్రామ/వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట గడువులోగా సేవలు అందించడంతోపాటు ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచేందుకు బులెటిన్ బోర్డుకు శ్రీకారం చుట్టాం. దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. – వివేక్‌యాదవ్, కలెక్టర్, గుంటూరు జిల్లా -
నేటి నుంచి మెగా ఆర్మీ రిక్రూట్మెంట్
గుంటూరు వెస్ట్: మెగా ఆర్మీ రిక్రూట్మెంట్కు గుంటూరులోని బీఆర్ స్టేడియం సిద్ధమైంది. గురువారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు జరగనున్న ఈవెంట్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి 34 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రోజూ 2,500 నుంచి 3,000 మంది వరకు అభ్యర్థులు అర్హత పోటీల్లో పాల్గొంటారు. కఠినమైన శారీరక, రాత పరీక్షలను దాటితేగానీ ఉద్యోగం సంపాదించే వీలుండదు. ఆర్మీ అధికారులు అభ్యర్థులకు ముందుగానే తేదీల వారీగా అడ్మిట్ కార్డులు ఆన్లైన్ ద్వారా జారీ చేశారు. ఇప్పటికే చాలా మంది గుంటూరుకు చేరుకున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌తో ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే వివిధ స్థాయిలకు సంబంధించిన 150 మంది ఆర్మీ అధికారులు స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్టెప్ సీఈవో డాక్టర్ శ్రీనివాసరావు లైజనింగ్ అధికారిగా ఉన్నారు. కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. అభ్యర్థులు మాస్క్‌తోపాటు శానిటైజర్ తెచ్చుకోవాలని సూచించారు. పోలీసుల పటిష్ట ఏర్పాట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. సుమారు 250 మంది సాయుధులైన పోలీసులతో పాటు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఆర్మీ అధికారులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ల నేతృత్వంతో రోడ్లు భవనాల శాఖ, జీఎంసీ, పోలీస్, మెడికల్ అండ్ హెల్త్, విద్యుత్ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 500 ఫ్లడ్లైట్స్, బారికేడ్లు, సీసీ కెమెరాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. వర్షం వల్ల ఇబ్బంది కలిగితే పొన్నూరు రోడ్డులో అదనపు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ క్రమశిక్షణతో మెలగాలి ఆర్మీ అధికారులతో కలిసి మన జిల్లా అధికారులు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో మెలగాలి. దేశానికి సేవ చేసే గొప్ప అవకాశం ఈ ఉద్యోగాల ద్వారా యువతకు లభిస్తుంది. ప్రతిభ ఆధారంగా ఆర్మీ ఆధ్వర్యంలో ఎంపిక ఉంటుంది. ఈ విషయం అభ్యర్థులు గుర్తించాలి. వర్షాలు పడినా ఇబ్బంది లేకుండా అదనపు ఏర్పాట్లు చేశాం. – వివేక్‌యాదవ్, కలెక్టర్ -
కల్తీలపై కొనసాగుతున్న దాడులు
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లాలో నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు కల్తీ చేసి విక్రయిస్తున్న వ్యాపార సంస్థలపై తనిఖీలు చేసి కేసులు నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వివేక్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. గత సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘ఆహారం.. హాహాకారం’ శీర్షికతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరుగుతున్న ఆహార కల్తీ వ్యాపారాలపై కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మూడోరోజు వరుసగా గుంటూరు జిల్లాలో నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు కల్తీ చేసి విక్రయిస్తున్న వ్యాపార సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయిస్, ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ, కార్పొరేషన్, మునిసిపల్, లీగల్ మెట్రాలజీ అధికారులు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల దాడులు చేశారు. పలు రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించి, సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. పలు షాపులు సీజ్.. జరిమానాల విధింపు జిల్లా వ్యాప్తంగా కారం మిల్లులు, హోటళ్లు, పచ్చళ్ల తయారీ దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, వాటర్ ప్లాంట్లు, సూపర్ బజార్లు, ఆయిల్ మిల్లులు, కిరాణా మాన్యుఫ్యాక్చరింగ్ షాపులు, పెట్రోలు బంకులు, చికెన్ సెంటర్లు, బిర్యాని పాయింట్లు, సినిమా థియేటర్లలో ఆహార పదార్థాలు, బేకరీలు, రైస్ మిల్లులు, స్వీట్, కూల్‌డ్రింక్ షాపులు, హోల్‌సేల్ మార్కెట్లు, మెస్‌లు మొత్తం 124 వ్యాపార సంస్థలపైన దాడులు చేశారు. తెనాలి సబ్ కలెక్టర్, డీఎస్వో పద్మశ్రీ, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ షేక్ గౌస్‌మొహిద్దీన్, తూనికలు, కొలతలశాఖ అధికారి షాలెంరాజు, నగరపాలకసంస్థ సిబ్బంది, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దారులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీలు చేశాయి. మిర్చియార్డు రోడ్డులో ఐదు కారం మిల్లులు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ఉల్లఘించి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించి ఆ మిల్లులను, రూ.1,47,90,000 విలువైన కారంపొడిని సీజ్ చేశారు. వేగస్ ట్రేడర్స్‌లో రూ.44,80,000 విలువైన 28,400 కిలోల కారంపొడి, వీరాంజనేయ ట్రేడర్స్‌లో రూ.14 లక్షల విలువైన 7 వేల కిలోలు, సత్యసాయి ఎంటర్‌ప్రైజెస్‌లో రూ.27,80,000 విలువైన 13,900 కిలోలు, తులసి స్పైసెస్‌లో రూ.61,30,000 విలువైన 30,650 కిలోల కారాన్ని సీజ్ చేశారు. ట్రేడ్ లైసెన్సు లేకుండా వ్యాపారం చేస్తున్న సత్యసాయి ఎంటర్ప్రైజెస్, మహాలక్ష్మి, వీరాంజనేయ ట్రేడర్స్ వ్యాపార సంస్థలను సీజ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ వ్యాపారసంస్థల్లో కొలతల్లో తేడాలు, ఆహార పదార్థాల నాణ్యతలో తేడాలు, ఆయిల్లో కల్తీ, రెస్టారెంట్లో పాడై కుళ్లిపోయిన, నిల్వ ఉంచిన పదార్థాలను గుర్తించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్‌యాదవ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ కల్తీకి పాల్పడిన వ్యాపారసంస్థలను సీజ్ చేయడంతో పాటు ఆహారభద్రత చట్టం, తూనికలు కొలతలశాఖ యాక్ట్, సివిల్ సప్లయిస్ యాక్ట్, ట్రేడ్ లైసెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు కల్తీ చేసి విక్రయిస్తున్న వారి సమాచారం టోల్ ఫ్రీ నంబర్ 1902కి ఫోన్ చేసి చెబితే వెంటనే దాడులు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అక్రమ లే అవుట్లపై కలెక్టర్ కొరడా..!
విజయనగరం, బొబ్బిలి: పంచాయతీలు, మున్సిపాలిటీలకు పన్నులు ఎగ్గొట్టి.. నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్న లే అవుట్లపై కొరడా ఝుళిపించేందుకు కలెక్టర్ వివేక్‌యాదవ్ రంగంలోకి దిగారు. జిల్లాలోని లే అవుట్లపై నివేదిక ఇవ్వాలని జిల్లా పం చాయతీ అధికారి బి.సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డీపీవో ఆధ్వర్యం లోని కమిటీలు అక్రమ లే అవుట్లు గుర్తించే పనిలో పడ్డాయి. జిల్లాలో అక్రమంగా ఉన్నవెన్ని? సక్రమ లే అవుట్లు ఎన్ని అన్న అంశాలపై కమిటీ సభ్యులు, అధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లాలో 746 అవుట్ల పరిశీలనలోకమిటీలు.. జిల్లాలో ఉన్న అక్రమ రియల్ ఎస్టేట్లపై అటు ఉడా అధికారుల సూచనలతో జిల్లా పంచాయ తీ అధికారులు ఓ నివేదిక సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,100కు పైబడి రియల్ ఎస్టేట్లు ఉన్నట్టు గుర్తించారు. అయితే, కొత్తగా కలెక్టర్ ఆదేశించిన మీదట జిల్లాలోని 29 మండలాల్లో 746 రియల్ వెంచర్లు వెలసినట్టు నిర్ధారించారు. వీటిని ఆయా మండలాల్లోని కమిటీలు పరిశీలించనున్నాయి. ఇందులో 364 అధికార లే అవుట్లు కాగా, 382 అనధికార లే అవుట్లు ఉన్నట్టు ప్రాథమిక అంచనాకొచ్చినట్టు సమాచారం. భూ బదలాయింపు ఫీజు తగ్గినా రూ.కోట్లలో దోపిడీ.. ఇటీవల వాణిజ్యపరంగా ఇంటి స్థలాలుగా మార్చే వ్యవసాయ భూములకు మార్పిడి ఫీజు తగ్గింది. సుమారు 12 శాతం ఉండే ఈ పీజు ఇప్పుడు పదిలోపే చెల్లించాల్సి ఉంటుంది. అయినా రియల్టర్లు క్రమబద్ధీకరణకు ముందుకు రావడం లేదు. దీంతో ఏటా ఈ అక్రమ రియల్ ఎస్టేట్ల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో గండి పడుతోంది. పరిశీలన ఇలా... కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశాలతో డీపీవో సత్యనారాయణ ఆధ్వర్యంలో వేసిన కమిటీలు లే అవుట్లను పరిశీలిస్తాయి. కమిటీ సభ్యులుగా స్థానిక పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, ఈవోపీఆర్డీలు ఉంటారు. వారు లే అవుట్లను గుర్తించి అందజేసిన నివేదికను తహసీల్దార్, సర్వేయర్లు పరిశీలించి డీపీవోకు అందజేస్తారు. వాటిని సరిపోల్చిన డీపీవో కలెక్టర్‌కు నివేదిస్తారు. అనంతరం వాటిపై చర్యలకు కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడా కమిటీలు పరిశీలనలకు దిగాయి. అంటకాగుతున్న క్షేత్రస్థాయి ప్రభుత్వ సిబ్బంది.. క్షేత్ర స్థాయిలో రియల్టర్లతో కొన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు అంటకాగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేని రియల్ ఎస్టేట్లలో కొనుగోలుచేసిన ప్లాట్లలో వాస్తవానికి ఇళ్లను నిర్మించే అవకాశం లేదు. వాటిని కూడా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రభుత్వ సిబ్బంది మేనేజ్ చేసి ఇళ్ల నిర్మాణానికి కూడా లంచాలు గుంజి అనుమతులు ఇచ్చేస్తున్నట్టు భోగట్టా! ఇది అందరికీ తెల్సిన విషయమే అయినా ఏ ఒక్క అధికారీ పట్టించుకోవడం లేదన్నది సుస్పష్టం. చర్యలుంటాయా? అక్రమ రియల్ ఎస్టేట్లతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అటు వినియోగదారులకు జెల్ల కొడుతున్న రియల్టర్ల ఘరానా మోసాలకు ఇకనయినా చెక్ పడే అవకాశం ఉంటుందానని వినియోగదారులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్వయంగా కలెక్టర్ వీటిపై నివేదిక కోరడంతో కాస్తయినా లైన్లో పడే పరిస్థితులు ఉంటే మంచిదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. శనివారం నాటికినివేదిక సిద్ధం చేస్తాం! జిల్లాలో 29 మండలాల్లో 746 లే అవుట్లు ఉన్నట్టు గుర్తించాం. వీటిని కొత్తగా నియమిం చిన కమిటీలు గుర్తిస్తాయి. అవి ఇచ్చిన నివేదికను తహసీల్దార్లు, సర్వేయర్లు పరిశీలిస్తా రు. ఈ నివేదికను వారం రోజుల్లో కలెక్టర్‌కు నివేదిస్తాం. తదుపరి చర్యలు కలెక్టర్ తీసుకుంటారు. – బలివాడ సత్యనారాయణ,జిల్లా పంచాయతీ అధికారి, విజయనగరం -
అప్పనంగా జీతాలివ్వడానికి మీరేమైనా అల్లుళ్లా?
పార్వతీపురం: ‘పనిచేయకుండా ఇంట్లో కూర్చుంటే జీతాలివ్వడానికి మీరేమైనా సర్కారుకు అల్లుళ్లా... పనిచేయాలంటే చిత్తశుద్ధితో చేయండి... లేకుంటే ఇంట్లో కూర్చోండి... జరుగుతున్న పనులపై కనీస అవగాహన లేని మీకెందుకు ఉద్యో గం... తక్షణం సమావేశం నుంచి వెళ్లిపోండి’ అంటూ పంచా యతీరాజ్ ఈఈ వి.ఎస్.ఎన్.మూర్తిపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని జేసీ–2 కె.నాగేశ్వరరావును ఆదేశించా రు. అంతేగాదు... పనిచేయకుంటే పనిష్మెంట్ కఠినంగా ఉం టుందని హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బలిజిపేట, పార్వతీపురం మండలాల ఏఈలు, సంతృప్తికిగా పనిచేయని ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. బలిజిపేట కం ప్యూటర్ ఆపరేటర్ సురేష్‌ను విధులనుండి తొలగించాలని ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద వివిధ శాఖలతో చేపట్టిన పనుల ప్రగతిపై ఇక్కడి ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో సోమవారం సమీక్షించిన ఆయన పనుల ప్రగతిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 340 కిలోమీటర్ల సీసీ రోడ్లను ఏర్పాటు చేయటానికి నిర్దేశించినప్పటికీ 400 కిమీలు వేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికి 178 కిమీలు మాత్రమే వేయటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్వతీపురం నియోజకవర్గంలో 25.32 కిమీల సీసీ రోడ్ల నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ సగటు వేతనం రూ. 197లు చెల్లించాల్సివుందని, ప్రస్తుతం రూ. 119లు మాత్ర మే వుందని దానిని కనీసం రూ. 180లకు పెంచాలన్నారు. ఖరీఫ్ పంట పూర్తయినందున వేతనదారులు ఖాళీగా వున్నారని వారికి పని కల్పించాలన్నారు. పనిదినాల పెంపుపై దృష్టిపెట్టాలి జిల్లాలో 330 లక్షల పని దినాలను కల్పించాల్సివుండగా పార్వతీపురం నియోజక వర్గంలో 34 లక్షల పని దినాలు క ల్పించాలని సూచించారు. గృహ నిర్మాణానికి సంబంధించి 1.25 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని దినాలు క ల్పించాల్సివుండగా పార్వతీపురంలో 12,950 మందికి మాత్రమే 100 పని దినాలు కల్పించడం శోచనీయమన్నారు. నియోజకవర్గంలో నీటికుంటలు, నాడెప్, ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ, శ్మశానవాటికలు, పాఠశాలల ఆటస్థలాల అభివృద్ధి విషయంలో పూర్తిగా వెనుకబడినందుకు తీవ్రంగా మండిపడ్డారు. బాలగుడబ, వెంకంపేట, బలిజిపేట, ఎల్‌ఎన్‌పురం గ్రామాల్లో సీసీ రోడ్లు మంజూరు చేసిన విషయం సంబంధిత సర్పంచ్‌కు చెప్పకపోవడం అన్యాయమని, పంచాయతీ తీర్మానించిన్పటికీ పనులు ప్రారంభించక పోవడం శోచనీయమని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అజ్జాడ, కృష్ణపల్లి గ్రామాల్లో సైతం అలానే జరగడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత కార్యనిర్వాహక ఇంజనీర్ సత్యనారాయణమూర్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన్ను ప్రభుత్వానికి సరండర్ చేయాల్సిందిగా జేసీ–2 నాగేశ్వరరావును ఆదేశించారు. గృహాల కేటాయింపులో లాటరీ విధానాన్ని పక్కాగా అమలు చేసి లబ్ధిదారులచే వారి వాటా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి కుంటలకు సంబం ధించి సరైన సమాచారంతో సమీక్షకు హాజరు కాని ఏపీడీపై చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీని ఆదేశించారు. సమీక్షలతోనే ప్రగతి సాధ్యం రెవెన్యూ డివిజనల్ అధికారి సమక్షంలో ఏంపీడీఓలు, తహశీల్దార్లు, వీఆర్ఓలు, సెక్రెటరీలు, ఏపీడీలకు నిరంతర సమీక్షలు నిర్వహించి తగు ప్రగతిని సాధించాలని సూచించారు. పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు మాట్లాడుతూ సాంఘిక సంక్షేమశాఖ భూముల్లోపనులు చేపట్టడానికి ఆటంకంగా వున్నందున తగు ప్రగతి సాధించలేకపోతున్నారని, ఇటీవల బొబ్బిలి జన్మభూమిలో 25వేలు ఎన్టీఆర్ జలసిరి బోర్లను ఏర్పాటుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, జంఝావతి, తోటపల్లి తదితర పనుల్లో రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆడారి గెడ్డ రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలని, పలు పెండింగ్ బిల్లులను చెల్లిం చాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ స్పందిస్తూ సాంఘిక సంక్షే మ భూముల్లో 10శాతం భూమిని వదిలిపెట్టాల్సివున్నదున ఆ భూముల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన పనులు పూర్తి చేయాలని సూచించారు. 25వేల బోర్లకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, ఈ లోగా పాత పనులను పూర్తి చేయిస్తామని తెలిపారు. పనితీరు బాగోలేని సర్పంచ్ల చెక్ పవర్ రద్దు జిల్లాలో పనితీరు బాగోలేని సర్పంచ్ల చెక్‌పవర్ రద్దుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ తీర్మాణాలు చేసి, నిధులు మంజూరై ఉన్నప్పటికీ పనులు ప్రారంభించని సర్పంచ్ల జాబితాను తయారు చేసి చెక్‌పవర్ రద్దు చేయాలని డీపీఓను ఆదేశించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ డా.జి.లక్ష్మీశ, జెడ్పీ సీఈఓ టి.వెంకటేశ్వరరావు, డ్వామా, డీఆర్డీఏ, పీడీలు రాజ్‌గోపాల్, సుబ్బారావు , పలువురు జిల్లా అధికారులు, గ్రామ సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
ఆర్థికంగా వెనుకబడిన వారికి సబ్సిడీ రుణాలు
విజయనగరం పూల్‌బాగ్: ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి (ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ, క్రిస్టియన్, బ్రాహ్మణ కులాలు కానివారు)2017–18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు లింకేజీతో కూడిన సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తోందని కలెక్టర్ వివేక్‌యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లాకు రూ.12.76 కోట్లతో 638 మందికి రుణాలు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. రెండు లక్షల రూపాయల యూనిట్ ధరలో 50 శాతం సబ్సిడీ, 50 శాతం బ్యాంకు రుణం ఉంటుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కులాల వారు పట్టణ ప్రాంతాల్లో రూ.1.03 లక్షల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.61వేల లోపు వార్షిక ఆదాయం గల 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్నవారు రుణాలకు అర్హులని తెలిపారు. ఆసక్తిగల వారు www.apobm-m-r.c-f-f.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని మండల, మున్సిపల్ స్క్రీనింగ్ కమ్ సెలక్షన్ కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుందన్నారు. వెబ్సైట్ ఈనెల 19వ తేదీ నుంచి ఓపెన్ చేయబడిందని అర్హులైన అభ్యర్థులు ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 08922–272080, 94409 66575 నంబర్లకు సంప్రదించాలని కోరారు. -
ప్రసన్న వదనం...పనిలో ఘనం
చూడ్డానికి ప్రశాంతంగా కనిపిస్తారు... అయినా పనిలో మాత్రం ప్రగతిచూపుతారు. ముంబైలో పుట్టి... వివిధ రాష్ట్రాల్లో విద్యనభ్యసించి... ఇప్పుడు విజయనగరం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనే వివేక్‌యాదవ్. వివేకంతో ఆలోచించడం... పట్టుదలగా పూర్తి చేయడం ఆయన నైజం. నేవీ కుటుంబంలో పుట్టిన ఆయన ఇంజినీరింగ్ చదివి టెలికాం సెక్టార్లో ఉన్నత ఉద్యోగం చేశారు. అయినా తండ్రి కల నెరవేర్చేందుకు ఐఏఎస్ అయ్యారు. విజయనగరాన్ని బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్న సదాశయంతో ఓ భారీ క్రతువు నిర్వహిస్తున్నారు. ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదని, అది ఓ బాధ్యతని అంటున్న వివేక్ యాదవ్‌తో ‘సాక్షి ప్రతినిధి’ ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ వారం సండే స్పెషల్. సాక్షి: నమస్తే సర్..మీ కుటుంబం, చదువు గురించి తెలుసుకోవాలని ఉంది..చెప్పండి? కలెక్టర్: మా నాన్న మోతీలాల్, అమ్మ కాంతి.. నాన్న 1969లో నేవీలో జాయిన్ అయ్యారు. విశాఖపట్నంలోనే ట్రైనింగ్ తీసుకున్నారు. ఉద్యోగరీత్యా బదిలీపై చాలా ప్రాంతాలకు వెళ్లాం. 1981లో ముంబైలో ఉంటున్నప్పుడు నేను పుట్టాను. నేవీలో రిటైర్ అయిన తర్వాత నాన్న కొన్నాళ్లు ఉత్తర్‌ప్రదేశ్‌లో మావోయిస్టు ప్రభావిత మారుమూల ప్రాంతంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌లోని ఎన్టీపీసీ ప్రాజెక్ట్‌లో పనిచేశారు. నా స్టడీ అక్కడే కేంద్రీయ విద్యాలయంలో జరిగింది. లక్నో దగ్గర సుల్తాన్‌పూర్‌లోని స్టేట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివాను. చదువయ్యాక సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలీమాట్రిక్స్(సిడాట్)లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరాను. మేం ఇద్దరం అన్నదమ్ములం. తమ్ముడు డాక్టర్. చార్టెర్డ్ అకౌంటెంట్ (సీఎ) చదివిన రూలీ నా భార్యగా వచ్చారు. మాకు ఐదేళ్లు, ఏడాదిన్నర వయసున్న ఇద్దరు పిల్ల లున్నారు. నా భార్య ప్రస్తుతం గృహిణిగా పిల్లల్ని, నన్ను చూసుకుంటున్నారు. మొదటి పాప అనన్య తెలంగాణలోని వరంగల్‌లో పుడితే రెండవ పాప వరణ్య ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో పుట్టింది. మామగారు డీజీపీగా పనిచేసేవారు. సాక్షి: ‘ఐఏఎస్’ వైపు అడుగులెలా పడ్డాయి? కలెక్టర్: బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాను. టెలికాం సెక్టార్లో పనిచేస్తూ మూడు సార్లు సివిల్స్ రాశాను. మూడోసారి ర్యాంకు వచ్చింది. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. రూరల్ ఏరియాతో కూడా కొంత టచ్ ఉండేది. ఊళ్లలో ఉన్నవారు తమ పిల్లల్ని కలెక్టర్గాచూడాలని ఆశపడుతుంటారు. మా నాన్న కూడా అలాగే ఆశపడ్డారు. అలాగని ఎప్పుడూ నన్ను ఒత్తిడి చేయలేదు. నా ఇష్టానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ ఆయన కోరిక మేరకు కలెక్టర్ అయ్యాను. ఫస్ట్పోస్టింగ్ అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో. తర్వాత వరంగల్, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పనిచేసి విజయనగరం వచ్చాను. సాక్షి: ఉద్యోగంలో చేరాక మర్చిపోలేని అనుభవం ఏదైనా ఉందా? కలెక్టర్: ఐఏఎస్ పూర్తిచేసి సబ్‌కలెక్టర్‌గా ఉద్యోగంలోకి చేరిన కొత్తలో నాకు మూడే మూడు తెలుగు పదాలు వచ్చేవి. ‘రండి, కూర్చోండి, చెప్పండి.’ ఈ మూడే మాట్లాడి పదివేల ఎకరాల భూసేకరణ చేశాను. ఆ సమయంలో నా దగ్గరకు భూ సమస్యతో ధోతీ వేసుకున్న ఒక 70 ఏళ్ల వృద్ధుడు వచ్చారు. సింగరేణి గనులకు భూములు ఇచ్చిన ఆయన తన భూమికి అందాల్సిన పరిహారం కోసం మా సిబ్బందిని అడుగుతున్నారు. అతని మాటలు నేను విని పిలిచి కూర్చోబెట్టి సమస్య తెలుసుకున్నాను. మంచినీళ్ళు తాగించి పరిహారం డబ్బులకు సంబంధించిన ‘చెక్’ అతని చేతిలో పెట్టాను. అది నేను ఉద్యోగంలో చేరాక చేసిన మొదటి మంచిపని. ఆ రోజు అనిపించింది, ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదు బాధ్యత అని. మన వల్ల చిన్న మంచి జరిగినా చాలని. చెక్ అందుకున్న ఆ పెద్దాయన కళ్లల్లో కనిపించిన కృతజ్ఞత నిండిన కన్నీళ్లు ఇప్పటికీ నా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. సాక్షి: ఓడీఎఫ్‌ను 14వ ఆర్థిక సంఘం నిధులతో ముడిపెట్టడానికి కారణం? కలెక్టర్: ఓడీఎఫ్‌కు సంబంధించి 14వ ఆర్థిక సంఘ నిధుల్లో ఫండ్‌ని కొంత ఆపాం. ఆ నిధులను ఓడీఎఫ్కి మార్చడం వల్ల చాలా మంది వచ్చి పంచాయతీలకు ఇబ్బంది కలుగుతోందని అన్నారు. ఫిబ్రవరి 15 కల్లా వారి గ్రామాలను ఓడిఎఫ్ గ్రామాలుగా డిక్లేర్ చేస్తే ఆ నిధులు ఇచ్చేస్తామని, ముందే కావాలంటే ఆ మేరకు డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పాం. ఇవి కేంద్రం నిధులు కనుక ఈ పారామీటర్స్ అందరూ పాటించాల్సిందే. గ్రామాల సంరక్షణ సర్పంచ్ పైనే ఉంటుంది. కేవలం కమిట్మెంట్ కోసమే ఆ మాట చెప్పాం. సాక్షి: విజయనగరంలో విజయాలు, లక్ష్యాలు? కలెక్టర్: 2014 లెక్కల ప్రకారం.. రూరల్ ఏరియాల్లో 9 శాతం మాత్రమే వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉన్నారు. 4లక్షల40వేల కుటుంబాలు ఉంటే 40వేల కుటుంబాలకు మాత్రమే మరుగుదొడ్లు ఉండేవని అప్పటి లెక్కలో తేలింది. అక్కడి నుంచి ఉద్యమంలా మొదలుపెడితే ఈ రోజు 58 శాతానికి తీసుకురాగలిగాం. బిల్లులు మంజూరు సరళీకృతం చేయడంతో పాటు, టెక్నాలజీపై అవగాహన కల్పించాం. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. ఫిబ్రవరి 15నాటికి ఓడీఎఫ్‌కు చేరాలన్న లక్ష్యంపై ఈ నెల 27న ఓ సదస్సు ఏర్పాటు చేయనున్నాం. మరుగుదొడ్లకు స్థలం లేని వారు కూడా చాలా మంది ఉన్నారు. వారికి ఆ గ్రామంలోనే సామూహిక మరుగుదొడ్లు కట్టబోతున్నాం. బహిరంగ ప్రదేశాలకు వెళ్ళే వారిని కూడా ఆపేలా చర్యలు తీసుకోడానికి విజిలెన్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. -
పీఓఎస్‌ను వ్యాపారులు వాడాల్సిందే
కలెక్టర్ వివేక్ యాదవ్ విజయనగరం అర్బన్: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన నగదు బదిలీ సమస్యను పరిష్కరించుకోవడానికి వ్యాపారులు విధిగా పారుుంట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) వ్యవస్థకు సంబంధించిన ఈ-పాస్ మిషన్లు వాడాల్సిందేనని కలెక్టర్ వివేకయాదవ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన నగదు రహిత లావాదేవీలపై వివిధ వర్గాలతో సమీక్షించారు. ప్రభుత్వ లావాదేవీలన్నీ నగదు రహితంగా జరగాలని, ఈ వ్యవస్థపై ప్రజలకు అవగాహన కలిగించాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతా లేనివారికి జనరల్ ఖాతాలు, జన్‌ధన్ ఖాతాలు తెరవాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఉపాధి హామీ వేతనాలు, డీఆర్డీఏ ద్వారా పంపిణీ చేస్తున్న పింఛన్ల పంపిణీకి బ్యాంకు ఖాతాలు తెరవాలన్నారు. ఖాతాదారులందిరికీ ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. జన్‌ధన్ రూపే కార్డులు సత్వరమే జారీ చేసి ఖాతాదారులకు అందజేయాలని అన్నారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా బ్యాంకులు, ఏటీఎంలలో రూ.100, రూ.2వేలు నోట్లు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో జేసీ శ్రీకేష్ బి లఠ్కర్, డీఆర్ఓ జితేంద్ర, డీఆర్డీఏ పీడీ ఢిల్లీరావు, డ్వామా పీడీ ప్రశాంతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ గురవయ్య, ఎస్బీఐ ఏజీఎం శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎం.వెంకటాచలం, బ్యాంక్ అధికారులు, వ్యాపారులు పాల్గొన్నారు. -
ఎన్యూమరేటర్ సస్పెన్షన్
► స్మార్ట్ పల్స్ సర్వే వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం ►విజయనగరం మున్సిపాలిటీలోని పలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ విజయనగరం మున్సిపాలిటీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వే తుది దశకు చేరుకుందని, ఇప్పటికీ సర్వే పరిధిలోకి రాని ప్రజలను గుర్తించి వారి వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆదేశించారు. మంగళవారం విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని పలుప్రత్యేక శిబిరాల్లో చేపడుతున్న సర్వే ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిధిలో గల లంకాపట్నం ఆది ఆంధ్ర మున్సిపల్ ప్రైమరీ పాఠశాల పోలింగ్ బూత్‌ను పరిశీలించారు. అక్కడ సర్వే కోసం ప్రజలెవ్వరు రాకపోగా... నియమించిన ఇద్దరు ఎన్యూమరేటర్లలో విధులకు గైర్హాజరైన త్రినాథ్‌ను విధుల నుంచి సస్పెన్షన్ చేయాలని మున్సిపల్ ఇంజినీర్‌ను ఆదేశించారు. అదేవిధంగా 10వ వార్డులోని ఆదిభట్ల నారాయణ దాసు పురపాలక ప్రాథమిక పాఠశాలలో, 20వ వార్డులోని జొన్నగుడ్డి వినాయకనగర్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా 20 వ వార్డకు కేటారుుంచిన ఇద్దరు ఎన్యూమరేటర్లు 209 మందిని సర్వే చేయాల్సి ఉండగా.. మరో 94మంది సర్వే పరిధిలోకి రావాల్సి ఉన్నట్లు వివరించారు. తరువాత 30 వ వార్డు పరిధిలోని కంటోన్మెంట్ హిందూమున్సిపల్ ప్రైమరీ పాఠశాల పోలింగ్ బూత్‌ను పరిశీలించారు. సర్వే చేపడుతున్న ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. వివిధ కారణాల వల్ల జిల్లాలో సర్వే పరిధిలోకి రాకుండా మిగిలిపోరుున వారి కోసం ఈనెల 19 నుంచి 23వరకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. పంచాయతీ కార్యాలయాలతో పాటు పట్టణ పరిధిలో వార్డు పోలింగ్ బూత్‌లలో ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు సర్వేలో వివరాలు నమోదు చేసుకోని వారంతా విధిగా వివరాలు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెనుక మున్సిపల్ ఇంజినీర్ కె.శ్రీనివాసరావు, విజయనగరం తహసీల్దార్ శ్రీనివాసరావు, టౌన్‌ప్లానింగ్ అధికారి శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇదో రకం ‘కార్’చిచ్చు
► తహసీల్దార్లకు ఏజెన్సీల ద్వారా అద్దె కార్లు ►కలెక్టరుకు ప్రభుత్వం ఉత్తర్వులు విజయనగరం గంటస్తంభం: అద్దె వాహనాల బిల్లులు డ్రా చేసుకుంటూ సొంత వాహనాల్లో తిరగడం తహసీల్దార్లకు ఇకపై కుదరదు. ఏజెన్సీల ద్వారానే అన్ని మండలాల తహసీల్దార్లుకు వాహనాలు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఏజెన్సీల ద్వారా వాహనాలను సమకూర్చాలని, ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు కలెక్టరు వివేక్‌యాదవ్ ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. విధుల నేపథ్యంలో తహసీల్దార్లు పర్యటించడానికి ప్రభుత్వం వాహన సదుపాయం కల్పించిన విషయం విదితమే. తాలూకా కేంద్రాల్లో ఇందుకు ప్రభుత్వ వాహనాలుండగా మిగతా చోట్ల అద్దె వాహనాలు ఉండేవి. ప్రస్తుతం పురపాలకసంఘాల్లో మినహా ఎక్కడా సొంత వాహనాలు లేవు. ఈనేపధ్యంలో అందరూ అద్దె వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. సగానికిపైగా సొంత వాహనాలే జిల్లాలో 34మండలాలు ఉండగా అందులో 30మండలాల్లో అద్దె వాహనాలను వాడుతున్నట్లు తహసీల్దార్లు బిల్లులు డ్రా చేస్తున్నారు. ఒక్కో తహసీల్దారుకు ఇందుకు రూ.24వేలు విడుదల చేయాల్సి ఉండగా ప్రభుత్వం బడ్జెట్ తక్కువగా విడుదల చేస్తున్నందున నెలకు రూ.16వేల నుంచి రూ.22వేల మధ్య బిల్లును ప్రభుత్వం ఇస్తోంది. అరుుతే ఈ బిల్లులు డ్రా చేస్తున్న సగం మందకి పైగా తహసీల్దార్లు సొంత వాహనాలనే అద్దె వాహనాలుగా వాడుతున్నారు. మరి కొందరు వాహనాలు వాడకుండా ద్విచక్ర వాహనాలపై తిరిగేసి బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. 10శాతం మంది మాత్రమే అద్దె వాహనాలను నిజంగా వాడుతున్నారు. ఒకే ఏజెన్సీ ద్వారా అద్దె వాహనాలు ఇకపై జిల్లా వ్యాప్తంగా ఒకే ఏజెన్సీ ద్వారా అద్దె వాహనాలు సమకూర్చాలని ప్రభుత్వం కలెక్టరుకు ఉత్తర్వులు జారీ చేసింది. పారదర్శకంగా ఒక ఏజెన్సీని ఎంపిక చేసి, వారు సమకూర్చే వాహనాలు తహసీల్దార్లకు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒక్కో వాహనానికి రూ.36వేలు బిల్లు చెల్లించాలని, నెలకు ఆవాహనం 2,200 కిలోమీటర్లు తిరగాల్సి ఉంటుందని సూచించింది. ఈనేపథ్యంలో ఇక అందరూ ఏజెన్సీ సమకూర్చే వాహనాలు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇందుకు కలెక్టరు వివేక్‌యాదవ్ కూడా రంగంలోకి దిగారు. పారదర్శకంగా ఏర్పాటు చేయాలని సూచించడంతో టెండర్ల పక్రియ ద్వారా ఏజెన్సీని నిర్ణరుుంచాలని కలెక్టరు భావిస్తున్నారు. టెండరు నోటిఫికేషన్‌కు కలెక్టరేట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అరుుతే ఎటువంటి వాహనాలు సమకూర్చాలో చెప్పకపోవడంతో దీనిపై స్పష్టత లేదు. టెండరు విడుదల నాటికి ఒక నిర్ణయానికి వస్తారని అధికార వర్గాలు చెబుతున్న మాట. అరుుతే తహసీల్దార్లు మాత్రం బోలెరో వాహనాలు ఇవ్వాలని అడుగుతున్నారు. అంత మొత్తానికి ఆ వాహనాలు ఏజెన్సీలు సమకూరుస్తాయో లేదో అన్న చర్చ జరుగుతోంది. ఇదిలాఉండగా డ్రైవర్లను తాము సూచించిన వారినే పెట్టాలని తహసీల్దార్లు అడుగుతున్నారు. రెవెన్యూలో కొన్ని బయటకు చెప్పలేని విషయాలు ఉంటాయని, వాటిని వాహనాల్లో డిస్కస్ చేస్తే బయటకు పొక్కే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంది. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. మొత్తానికి తహసీల్దార్లకు బల్క్‌గా అద్దె వాహనాలు సమకూర్చడం ఖాయం. -
వివేకం చూపేనా...
కొత్త కలెక్టర్ ముందు అనేక సవాళ్లు నేడు బాధ్యతలు స్వీకరించనున్న వివేక్‌యాదవ్ విజయనగరం గంటస్తంభం : వెనుకబడిన జిల్లాకు ఓ ఆశాదీపంలా... పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించగల యువతేజంలా... ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పాలన అందించగల దక్షునిగా... కొత్త కలెక్టర్ వివేక్‌యాదవ్ జిల్లాకు వస్తున్నారు. ఇప్పటివరకూ వివిధ బాధ్యతలు చేపట్టినా... ఏకంగా జిల్లా కలెక్టర్‌గా ఇక్కడే విధులు నిర్వర్తించనున్నారు. ఈ తరుణంలో తనదైన ముద్రవేసుకోవడం సహజం... కొన్ని ఆశయాలతో రావడం సాధారణం... అవన్నీ జిల్లా పురోగతికి ఎంతైనా తోడ్పడాలని ఆశిద్దాం. ముందస్తు ఏర్పాట్లు జిల్లా కలెక్టర్‌గా నూతనంగా నియమితులైన వివేక్‌యాదవ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. శుక్రవారం ఉదయం ప్రస్తుత కలెక్టర్ ఎం.ఎం.నాయక్నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం కలెక్టరేట్వర్గాలు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి. తొలిసారిగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆయనపై జిల్లా ప్రజల్లో సంతోషం నింపాల్సిన బాధ్యత ఉంది. సవాళ్ల స్వాగతం కలెక్టరుగా బాధ్యతలు చేపట్టనున్న వివేక్ యాదవ్‌కు జిల్లా వాసులతోపాటు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. పరిపాలనలో లోపాలు మొదలుకుని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల వరకు ఇందులో ఉన్నాయి. ఆయన పనితీరుకు భోగాపురం ఎయిర్‌ఫోర్టు భూసేకరణ సవాల్ కానుంది. అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కోసం ఇక్కడ 2004 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. 750 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు అంగీకరించారని చెబుతున్నా ఇందులో చాలామందిని బలవంతంగా ఒప్పించారు. పోనీ వీరు ఇచ్చినా మిగతావారు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. భూముల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతామని పదేపదే చెబుతున్నారు. ఈ పరిస్థితులను ప్రధానంగా అధిగమించాల్సి ఉంది. పాలనలో సమన్వయం అవసరం పాలనలో సమన్వయం కలెక్టర్‌కు పెద్ద సమస్యే. కలెక్టరేట్ పరిపాలనా విభాగంలో ఒక అధికారి వైఖరిపై కొంతమంది అసంతప్తిగా ఉన్నారు. దీనివల్ల అక్కడ వర్గపోరు నడుస్తోంది. జిల్లా అధికారుల్లో సైతం వర్గాలు ఉన్నాయి. మరోవైపు రాజకీయ నాయకులతో సమన్వయం చేసుకోవాల్సి ఉంది. అందరూ అధికార పార్టీకి చెందినవారే అయినా... ఎవరి పట్టు వారికుంది... ఎవరి డిమాండ్ వారికుంది. వారితోపాటు బలమైన ప్రతిపక్షమూ ఉంది. వారందరినీ సమ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. వెక్కిరిస్తున్న పెండింగ్ ప్రాజెక్టులు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. 2లక్షల ఎకరాలకు నీరందించడమే ధ్యేయంగా నిర్మించిన తోటపల్లి ప్రాజెక్టు నుంచి గతేడాది నీరు విడుదల చేశారు. ఉప కాలువలు, బ్రాంచి కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. లక్షా 20వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉన్నా... అందుకు తగ్గ పనులు ఇంకా కొనసాగలేదు. తారకరామ తీర్ధసాగర్ పనులు ఇప్పటికి 35శాతం మాత్రమే పూర్తయ్యాయి. సొరంగం, ఇతర పనులు పూర్తయితేగానీ నీరు విడుదల సాధ్యం కాదు. ఒడిశాతో వివాదం, అసంపూర్తి పనుల వల్ల జంఝావతి ప్రాజెక్టు నుంచి అరకొర నీరే పోలాలకు అందుతోంది. ఈ ప్రాజెక్టుపైనా దష్టిసారించాలి. అక్రమాల గుట్టలు నీరు చెట్టు పథకం కింద సాగునీటి వనరుల అభివద్ధి, మొక్కల పెంపకానికి ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. రామభద్రపురం, మక్కువ, సీతానగరం, బలిజిపేట మండలాల్లో ఇవి వెలుగులోకి వచ్చాయి. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు జరిగిన అక్రమాలపై నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇంకా శతశాతం మరుగుదొడ్ల నిర్మాణం, రెవెన్యూపరంగా ఉన్న లోపాలు, మీఇంటికి మీభూమి కార్యక్రమంలో లోటుపాట్లు, ఆన్లైన్ పట్టాదారుపాసుపస్తకాలు జారీలో జాప్యం వంటివి పరిష్కరించాల్సి ఉంది. స్మార్ట్పల్స్కు సాంకేతిక సమస్యలు జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 5,87,149కుటుంబాలు ఉండగా ప్రారంభమై 20రోజలైనా 50వేల కుటుంబాల సర్వే కూడా పూర్తి కాలేదు. ఇంటర్నెట్ సమస్య, ప్రజలు నుంచి సహకారం లేకపోవడం వంటివి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి. వీటిని అధిగమించేందుకు ప్రణాళికలు చేయకుంటే సర్వేకు ఎన్నో నెలలు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటివరకూ నిర్వహించిన బాధ్యతల కారణంగా వీటిపై పరిణితితో వ్యవహరించే వివేక్‌యాదవ్ ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపగలరన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
ఏపీలో నలుగురు ఐఏఎస్‌ల బదిలీ
-
ఏపీలో నలుగురు ఐఏఎస్‌ల బదిలీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాంత్‌ను సాధారణ పరిపాలన విభాగం పొలిటికల్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన జేసీ శ్రీధర్ సీఆర్డీఏ కమిషనర్‌గా నియమించారు. విజయనగరం జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్‌ను విశాఖ ఈపీడీసీఎల్ సీఎండీగా బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ వివేక్ యాదవ్‌ను విజయనగరం కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
వాగులపై హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
కొరిటెపాడు (గుంటూరు) రహదారులపై వాగులు ప్రహిస్తున్నప్పుడు ఇరువైపులా హెచ్చరికల బోర్డులు పెట్టి ప్రజలు వాగు దాటకుండా చూడాలని జిల్లా సంయుక్త కలెక్టర్ వివేక్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. తన చాంబర్ నుంచి శుక్రవారం మండలస్థాయి అధికారులతో భారీ వర్షాలపై సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి, పశునష్టం వాటిల్లకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 18 తేదీన కురిసిన వర్షాలకు ముగ్గురు మరణించారని తెలిపారు. తాడికొండ మండలం రావెలకు చెందిన మూల్పూరి శ్రీనివాసరావు (35) కంతేరు వద్ద యర్రవాగులో కొట్టుకొనిపోయినట్లు తెలిపారు. అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన వెలగల సీతామహాలక్ష్మి(55) పిడుగుపాటుకు మృతి చెందినట్లు పేర్కొన్నారు. తాడికొండ మండలం లాం వద్ద కొండవీటి వాగులో గుర్తుతెలియని మహిళ కొట్టుకొని పోయినట్లు తెలిసిందని, అయితే ఆమె పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ ముగ్గురికి ఆపద్భంధు పథకం కింద ప్రతిపాదనలు పంపించాలని తహశీల్దార్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల వద్ద ఒక అధికారిని ఇన్చార్జిగా ఉంచి అన్ని రకాల సౌకర్యాలు అందేలా చూడాలని సూచించారు. మంగళగిరి రత్నాల చెరువు కట్టపై ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో వాగులు ప్రవహిస్తున్న ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల వద్ద ముందస్తు జాగ్రత్తగా తగిన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాలు ఆధార్ సంఖ్యతో అనుసంధానం 68 శాతం జరిగిందని తెలిపారు. మ్యుటేషన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. త్వరలో స్పెషల్ సమ్మరి రివిజన్‌కు సంబంధించి ఎలక్టోరల్ రోల్‌పై బీఎల్వోఎస్, ఏఈవోఎస్, ఏఈఆర్వోలకు శిక్షణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. డిప్యూటీ తహశీల్దార్లు స్టాట్యూటరీ రిజిస్టర్లు ఖచ్చితంగా నిర్వహించాలన్నారు. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సెట్ కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు, కలెక్టరేట్ పరిపాలనాధికారి బీబీఎస్ ప్రసాదు పాల్గొన్నారు. -
ఎంసెట్.. ఆల్రైట్
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్-2014) కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సజావుగా ముగిసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో అధికారులు పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. విద్యార్థులపై ప్రత్యేక నిఘాతోపాటు పరీక్ష నిర్వహణను డేగ కళ్లతో పరిశీలించారు. గురువారం గుంటూరు నగరంతో పాటు సమీప మండలాల్లో ఏర్పాటు చేసిన 55 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఎంసెట్‌కు జిల్లా వ్యాప్తంగా 24,261 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 43 కేంద్రాల్లో జరిగిన ఇంజినీరింగ్ పరీక్షకు దరఖాస్తు చేసిన 20,221 మందిలో 19,177 (94.84శాతం) మంది హాజరయ్యారు. మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 5,324 మంది విద్యార్థుల్లో 5,084 (95.4శాతం) మంది హాజరయ్యారు. గత రెండు మూడేళ్లతో పోల్చితే మెడిసిన్ పరీక్షకు ఏ దఫా అత్యధికం హాజరు నమోదయింది. ముందుగానే విద్యార్థుల రాక.. ఎంసెట్‌కు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు పదే, పదే హెచ్చరించడంతో విద్యార్థులు ఉదయం 8.00 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ప్రారంభించారు. 9.00 గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి పంపిన అధికారులు ఉదయం 10, మధ్యాహ్నం 2.00 గంటల తరువాత గేట్లను మూసివేసి తాళాలు వేశారు. జిల్లా నలుమూలల నుంచి పరీక్షకు దరఖాస్తు చేసిన విద్యార్థులను వెంట పెట్టుకుని వచ్చిన తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలను కనుక్కోవడంలో ఇబ్బంది పడ్డారు. ఇంజినీరింగ్ పరీక్షకు గుంటూరు నగరంతో పాటు ప్రత్తిపాడు, వట్టి చెరుకూరు, పెదకాకాని, తాడికొండ, చేబ్రోలు మండలాల పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం కష్టమైంది. ఆయా మండలాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను తమ విద్యాసంస్థల బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరవేశాయి. పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా.. ఇంజినీరింగ్, మెడిసిన్ పరీక్షా కేంద్రాల్లో ఈ సారి ప్రత్యేక నిఘా బృందాలను నియమించిన అధికారులు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే పరీక్షకు అనుమతించారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కలిగి ఉంటే కఠినంగా వ్యవహరిస్తామని ముందుగానే హెచ్చరించడంతో విద్యార్థుల అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూ నుంచి వచ్చిన పరిశీలకులు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇన్చార్జి కలెక్టర్ సందర్శన .. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్ నగరంలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మశీ కళాశాల, పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాల, జేకేసీ కళాశాలలను సందర్శించిన ఇన్చార్జి కలెక్టర్ పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మౌళిక సదుపాయాలపై చీఫ్ సూపరింటెండెంట్లకు తగు సూచనలు చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎంసెట్ ప్రశాంతంగా జరిగిందని ఆయన ప్రకటించారు. ఇన్చార్జి కలెక్టర్ వెంట ఎంసెట్ ప్రాంతీయ సమన్వయకర్త ఇ.శ్రీనివాస రెడ్డి, ఆర్డీవో బి.రామమూర్తి, తహశీల్దార్ చెన్నయ్య, ప్రొఫెసర్ వై.వి.రెడ్డి ఉన్నారు. ఆర్టీసీ హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు.. పట్నంబజారు(గుంటూరు) : ఎంసెట్‌కు హాజరైన విద్యార్థులకు ఆర్టీసీ సిబ్బంది పరీక్షా కేంద్రాల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. సమాచారం అందించడంతో పాటు పరీక్ష కేంద్రాల వివరాలు తెలుసుకుని ఇబ్బంది లేకుండా ఆయా రూట్లలో వెళ్లే బస్సెక్కించారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పి.వి.రామారావు పర్యవేక్షణలో 50 మంది అధికారులతో పాటుగా 60 మంది సిబ్బంది భాధ్యతలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 80 సర్వీసులు అధికంగా ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం తెలిపారు. నగరంలోని బీఆర్ స్టేడియం, నాజ్‌సెంటర్‌లోని బీఈడీ కళాశాల, ఏసీ కళాశాల, చిలకలూరిపేట, పొన్నూరురోడ్డుతో పాటుగా ప్రతి కళాశాల వద్ద సిబ్బంది విద్యార్థులకు రూట్లు తెలిపేందుకు కేటాయించారు. ఆర్టీసీ అధికారుల చొరవకు విద్యార్థులు, వారి తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
వరంగల్ మున్సిపాలిటికి అమీర్ ఖాన్ ప్రశంస!
దేశం ఎదుర్కొంటున్న శిశు మరణాలు, అత్యాచార ఘటనల సమస్యలను ఎత్తి చూపుతూ.. ప్రజలకు సత్యమేవ జయతే టెలివిజన్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 16 తేదిన ప్రసారమైన సత్యమేవ జయతే కార్యక్రమంలో చెత్త చెదారాన్ని శుభ్రం చేయడంపై.. మున్సిపల్ కార్పోరేషన్ నిర్లక్ష్య విధానాలను, నిధుల దుర్వినియోగం తదితర అంశాలను ఆమీర్ ఖాన్ ప్రస్తావించారు. చెత్త చెదారాన్ని డంపింగ్ యార్డుల్లో కాల్చడం వల్ల వచ్చే చర్మ సమస్యలపై, అనారోగ్య సమస్యలపై సంబంధిత పలువురు నిపుణులతో మాట్లాడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ జిల్లా మున్సిపాలిటి సాధించిన విజయాన్ని దేశప్రజల దృష్టికి తీసుకువచ్చారు. ఏడు రోజుల్లో వరంగల్ నగరాన్ని శుభ్రపరిచడమే కాకుండా చెత్త చెదారాన్ని రీసైక్లింగ్ చేస్తూ .. మున్సిపాలిటీకి రెవెన్యూ తెచ్చిపెట్టేలా కృషి చేసిన డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బి జనార్ధన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్ ల సేవలను ప్రశంసించారు. పరిశుభ్రమైన నగరంగా చేయడానికి తాము తీసుకున్న చర్యలను, ప్రణాళికలను బి జనార్ధన్ రెడ్డి, వివేక్ యాదవ్ లు ఈ కార్యక్రమంలో వెల్లడించారు. వరంగల్ పట్టణాన్ని క్లీన్ సిటీగా మార్చిన ఇద్దరు అధికారులను అమీర్ ఖాన్ ప్రశంసలతో ముంచెత్తారు. -
‘బాల పంచాయత్’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది
తెనాలిటౌన్,న్యూస్‌లైన్: బాలల రక్షణ, హక్కుల గురించి మాట్లాడానికి వేదిక ‘బాలపంచాయత్’ అని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పిల్లలను పంచాయతీలలో భాగస్వామ్యులను చేసి వారి ఆలోచనలను తెలుసుకోవాలన్నారు. కొలకలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో సోమవారం ‘బాలపంచాయత్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర శాసన సభ స్పీకర్ మనోహర్, బ్రిటిష్ డెప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మేక్లెన్, యునిసెఫ్ ప్రతినిధి రోఫ్ లియోనో, ఏపీ ఆలయన్స్ చైల్డ్ రైట్స్ ప్రతినిధి రమేష్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్‌లు తొలుత లాంచనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభకు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ అధ్యక్షత వహించారు. తొలుత స్పీకర్ మనోహర్ మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో అమలులో వున్న ‘బాల పంచాయత్’ను మోడల్ ప్రాజెక్టుగా తెనాలిలో ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. సమాజ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి 26 ప్రభుత్వ శాఖల ప్రతినిధులను భాగస్వామ్యులను చేస్తూ ఈ కార్యక్రామానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన వివరించారు. బ్రిటీష్ డెప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మేక్లెన్ మాట్లాడుతూ బాల పంచాయత్‌లో పిల్లల ఆలోచనలు తెలుసుకున్నట్లయితే వారికి కావలసినవి గుర్తించవచ్చన్నారు. యునిసెఫ్ ప్రతినిధి రోఫ్ లియోనో మాట్లాడుతూ పిల్లల్లో నిర్ణయాత్మక ఆలోచనలు పెరగడానికి బాల పంచాయత్ ఉపయోగపడుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ తొలిసారిగా రాష్ర్టంలో బాలపంచాయత్ను తెనాలి నియోజకవర్గంలో ప్రారంభించడం అభినందనీయమన్నారు. చైల్డ్ రైట్స్ ప్రతినిధి రమేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, అభివృద్ధి బాల పంచాయత్ ద్వారా జరుగుతుందన్నారు. సీడ్స్ ప్రతినిధి, ప్రాజెక్టు నిర్వాహకులు రోషన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు బాల పంచాయత్‌లో చర్చించి అధికారులు దృష్టికి తీసుకువెళతామన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి డి.ఆంజనేయులు, ఆర్డీవో ఎస్.శ్రీనివాసమూర్తి, డీఎస్పీ టి.పి.విఠలేశ్వర్, ఆర్వీఎం శ్రీనివాసరావు, సర్పంచ్ కాలిశెట్టి లక్ష్మీ నాంచారమ్మ, ఎంపీడీవో శ్రీనివాసరావు, సీడీపీఓ సులోచన, తహశీల్దార్ ఆర్.వెంకటరమణనాయక్, స్పెషల్ ఆఫీసర్ జివి.నారాయణ, ఏఓ అమలకుమారి, ఏడీఈ ఆర్మ్‌స్ట్రాంగ్, ఏఈ కృష్ణారావు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులతో ‘బాల పంచాయత్’ కార్యక్రమం అనంతరం స్పీకర్ మనోహర్ పాఠశాల విద్యార్థులతో పంచాయతీ సభను ఏర్పాటు చేయించారు. విద్యార్థులను సర్పంచ్, సభ్యులుగా ఏర్పాటు చేసి సమస్యలను చెప్పించారు. రోడ్ల పై జీబ్రా క్రాసింగ్ లైన్ ఏర్పాటు చేయాలని, రోడ్లపై చెత్త చెదారం వేస్తున్నారని, మందుబాబులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయని, సీసీఎల్ ఫ్యాక్టరీ రసాయన పదార్థాల వల్ల తాగునీరు కలుషితమైందని వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వాణి, భార్గవ్, ప్రదీప్, శిరీష్, మస్తాన్ వలీ, తదితరులు కోరారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, రోడ్ల మీద చెత్తాచెదారం శుభ్రం చేయించాలని సర్పంచ్ నాంచార మ్మకు సూచించారు. రూ. 1.25 కోట్లతో పాఠశాల భవనాలు నిర్మించనున్నట్టు చెప్పారు. సీసీఎల్ నుంచి వచ్చే కలుషిత నీటిని పరిశీలించి దానిపై నివేదిక అందజేయాని ఆర్డీవో శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. -
సరుకుల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే అక్రమార్కులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా ముమ్మరం చేశారు. ఏడాది కాలంలో లక్ష్యానికి మించి ఆదాయాన్ని సమకూర్చారు. ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణ , ఇసుక రీచ్‌ల అవకతవకలకు బాధ్యులైన కొంతమంది అధికారులపై నివేదికలు తయారుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 విజిలెన్స్ యూనిట్లలో గుంటూరు అధికారులు అధిక స్థాయిలో కేసులు నమోదు చేసి భారీ మొత్తంలో జరిమానా వసూలు చేశారు.సాక్షి, గుంటూరు: ప్రభుత్వ ఖజానాకు చేరకుండా పన్ను ఎగవేత జరుగుతున్న చోట విజిలెన్స్ అధికారులు ప్రత్యక్షమవుతున్నారు. 2012-2013 ఆర్థిక సంవత్సరానికి రూ.150 కోట్లు లక్ష్యం కాగా, రూ.250 కోట్లకు పైగా ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు సమకూర్చి లక్ష్యాన్ని అధిగమించారు. ఆర్థిక సంవత్సరం పూర్తవడానికి ఉన్న మూడు నెలల కాలంలో మరో రూ.40 నుంచి రూ.50 కోట్లు ఆదాయం రావచ్చని విజిలెన్స్ ఎస్పీ ఎంఎన్ అమ్మిరెడ్డి తెలిపారు. రెవెన్యూ, మైనింగ్, వ్యవసాయం, వాణిజ్య తదితర శాఖలకు సంబంధించిన అక్రమాలపై ఇప్పటికే 300కు పైగా కేసులు నమోదు చేశారు. దాడులు చేసి వాణిజ్యశాఖ పన్ను ఎగవేతకు సంబంధించి రూ.121 కోట్లు, మైనింగ్ శాఖలో రాయ ల్టీ, సీనరే జీలకు సంబంధించి రూ.9 కోట్లు, వ్యవసాయశాఖకు సంబంధించి రూ.50 కోట్లు ఆదాయాన్ని రాబట్టగలిగారు. పౌరసరఫరాల శాఖలో అక్రమాలు జిల్లాలో పౌరసరఫరాల శాఖ లో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా జాయిం ట్ కలెక్టర్ వివేక్‌యాదవ్, ఆ శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పకడ్బందీ ప్రణాళికలు చేపడుతున్నప్పటికీ, పీడీఎస్ బియ్యం, నీలి కిరోసిన్ అక్రమ తరలింపు మాత్రం ఆగడం లేదు. విజిలెన్స్ అధికారుల దాడులే ఇందుకు నిదర్శనం. ఇప్పటి వరకు వీరి దాడుల్లో రూ.1.45 కోట్ల విలువైన 8826 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సరుకులు తరలిస్తున్న 100 వాహనాలను సీజ్చే శారు. వీటికి సంబంధించి 244 (6ఏ) కేసులు, 86 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 200 మందికి పైగా అరెస్టుచేశారు. బియ్యం అక్రమ తరలింపులో పల్నాడు, నీలి కిరోసిన్ అక్రమాలు రేపల్లె, నిజాంపట్నం ప్రాంతాల్లో చోటుచేసుకోవడం గమనార్హం. వీటిపై ప్రభుత్వానికి 500 నివేదికలు పంపగా, అందుకు బాధ్యులైన కొందరు అధికారులపై చర్యలకు కూడా సిఫార్సు చేశారు. వాహనాల తనిఖీ ముమ్మరం ప్రభుత్వ ఖజానాకు పన్ను ఎగవేస్తూ అక్రమ మార్గంలో నడిచే సరుకుల రవాణాపై విజిలెన్స్ దృష్టిసారించి, వాహనాల తనిఖీని ముమ్మరం చేసింది. దీని ద్వారా ఆదాయ సేకరణ లక్ష్యం రూ.2.59 కోట్లు కాగా, లక్ష్యానికి మించి రూ.2.83 కోట్లు ఆదాయం వచ్చింది. వ్యవసాయశాఖకు సంబంధించి 59 క్వింటాళ్ల ఎరువులు, పురుగుమందులు, నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇసుక రీచ్‌ల దందాపై నివేదికలు.. బినామీ సొసైటీల పేరుతో నడుస్తున్న ఇసుక రీచ్‌ల వ్యవహారాలపై కూడా విజిలెన్స్ అధికారులు నివేదికలు తయారుచేశారు. అమరావతి, అచ్చం పేట, మల్లాది, జువ్వలపాలెం, తుళ్లూరు, గొడవర్రు రీచ్‌లకు సంబంధించిన అక్రమాలపై ఇప్పటికే ప్రభుత్వానికి పలు నివేదికలు అందాయి. అదేవిధంగా మందుల కొనుగోలులో అక్రమాలపై నిజాలు నిగ్గుతేల్చిన విజిలెన్స్ నివేదిక ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. -
‘హెలెన్’..టెన్షన్
సాక్షి, గుంటూరు: జిల్లాకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ‘పై-లీన్’ తుపాను ప్రభావంతో జరిగిన నష్టం కళ్ల ముందు కదలాడుతుంటే పుండుపై కారం రాసినట్టు ‘హెలెన్’ తుపాను ముందుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారి శ్రీహరికోట-ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం వున్నట్టు విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో తీరప్రాంతంలో భారీ అలలు ఎగసిపడే ప్రమాదం వుండడంతోపాటు, గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్ అన్ని మండలాల తహశీల్దార్లను బుధవారం సెట్కాన్ఫెరెన్స్లో అప్రమత్తం చేశారు. లోతట్టుప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను తమ ఆధీనంలో ఉంచుకోవాలని సూచించారు. అవసరమైతే ఆయా పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా వినియోగించుకోవాలని సూచించారు. తుపాను రక్షణ కేంద్రాలను శుభ్రం చేసి సిద్ధం చేయాలన్నారు. తీరప్రాంత మండలాలైన బాపట్ల, కర్లపాలెం, రేపల్లె, నగరం, పిట్టలవానిపాలెం, నిజాంపట్నం ప్రాంతాల్లో తుపాను ఏర్పాట్లు పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించారు. నిజాంపట్నం ఓడరేవులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. గుంటూరులో తుపాను కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే , ఇటీవల ‘పై-లీన్’ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో సుమారు 6.5 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇప్పుడు ‘హలెన్’ తుపాను హెచ్చరికలతో రైతాంగం ఆందోళన చెందుతోంది. మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ రేపల్లె, న్యూస్‌లైన్: నిజాంపట్నం హార్బర్లో బుధవారం మూడో నంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు.అధికారుల హెచ్చరికలతో మత్స్యకారులు వేటను నిలిపివేసి బోట్లను హార్బర్ జెట్టీకి చేర్చారు. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లవద్దని పోర్టు కన్జర్వేటర్ మోకా వెంకటరామారావు తెలిపారు. వరుస విపత్తులతో వేట సాగకపోవటంతో ఈఏడాది మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా మారింది. డీజిల్ ధరలు పెంపుదలతో నష్టాల బాటపట్టారు. -
విధుల్లో చేరిన కొత్త జేసీ
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా వచ్చిన పౌసుమి బసు బుధవారం విధుల్లో చేరారు. ఇంతకాలం ఇన్చార్జ్ జేసీగా ఉన్న వివేక్‌యాదవ్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కలెక్టరేట్లోని జేసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్య్కూట్ అతిథి గృహానికి వెళ్లారు. సాయంత్రం కార్యాలయంలో డీఆర్వో సురేంద్రకరణ్, ఆర్డీవోలు, పౌరసరఫరాల సంస మేనేజరు రాజేంద్రకుమార్, ఇతరు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా : జేసీ విధుల్లో చేరిన జేసీ పౌసుమి బసును బుధవారం సాయంత్రం జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు ఆధ్వర్యంలో ఉద్యోగులు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లాలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని ఉద్యోగ సంఘాల నేతలతో జేసీ అన్నారు. జిల్లాలో సుమారు 70 శాఖల ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. జేసీని కలిసినవారిలో గెజిటెడ్ అధికారుల సంఘం కార్యదర్శి జగన్మోహన్రావు, టీఎన్జీవోస్ అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌గౌడ్, కార్యదర్శి రత్నవీరాచారి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మార్గం కుమారస్వామి, కార్యదర్శి రాజ్‌కుమార్, డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు చీకటి వెంకటేశ్వర్లు, మహేష్, వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రత్నాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కాందారి బిక్షపతి, శ్రీశైలం, రంజిత్, చుంచు రవీందర్, నాల్గవ తర గతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాస్యనాయక్, ఐసీడీఎస్ ఉద్యోగుల సంఘం బాధ్యుడు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.