అప్పనంగా జీతాలివ్వడానికి మీరేమైనా అల్లుళ్లా? | collector vivek yadav fired on officials | Sakshi

అప్పనంగా జీతాలివ్వడానికి మీరేమైనా అల్లుళ్లా?

Published Tue, Jan 30 2018 11:53 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

collector vivek yadav fired on officials - Sakshi

తమను పనులు చేయనివ్వడం లేదంటూ కలెక్టర్‌కు చెబుతున్న వైఎస్సార్‌సీపీ వెంకంపేట సర్పంచ్‌ తీళ్ల సుభద్రమ్మ

పార్వతీపురం: ‘పనిచేయకుండా ఇంట్లో కూర్చుంటే జీతాలివ్వడానికి మీరేమైనా సర్కారుకు అల్లుళ్లా... పనిచేయాలంటే చిత్తశుద్ధితో చేయండి... లేకుంటే ఇంట్లో కూర్చోండి... జరుగుతున్న పనులపై కనీస అవగాహన లేని మీకెందుకు ఉద్యో గం... తక్షణం సమావేశం నుంచి వెళ్లిపోండి’ అంటూ పంచా యతీరాజ్‌ ఈఈ వి.ఎస్‌.ఎన్‌.మూర్తిపై జిల్లా కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలని జేసీ–2 కె.నాగేశ్వరరావును ఆదేశించా రు. అంతేగాదు... పనిచేయకుంటే పనిష్మెంట్‌ కఠినంగా ఉం టుందని హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బలిజిపేట, పార్వతీపురం మండలాల ఏఈలు, సంతృప్తికిగా పనిచేయని ఎంపీడీఓలకు షోకాజ్‌ నోటీసులు జారీచేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. బలిజిపేట కం ప్యూటర్‌ ఆపరేటర్‌ సురేష్‌ను విధులనుండి తొలగించాలని ఆదేశించారు.

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద వివిధ శాఖలతో చేపట్టిన పనుల ప్రగతిపై ఇక్కడి ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో సోమవారం సమీక్షించిన ఆయన పనుల ప్రగతిపై తీవ్ర  అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 340 కిలోమీటర్ల సీసీ రోడ్లను ఏర్పాటు చేయటానికి నిర్దేశించినప్పటికీ 400 కిమీలు వేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికి 178 కిమీలు మాత్రమే వేయటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్వతీపురం నియోజకవర్గంలో 25.32 కిమీల సీసీ రోడ్ల నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సగటు వేతనం రూ. 197లు చెల్లించాల్సివుందని, ప్రస్తుతం రూ. 119లు మాత్ర మే  వుందని దానిని కనీసం రూ. 180లకు పెంచాలన్నారు. ఖరీఫ్‌ పంట పూర్తయినందున వేతనదారులు ఖాళీగా వున్నారని వారికి పని కల్పించాలన్నారు.

పనిదినాల పెంపుపై దృష్టిపెట్టాలి
జిల్లాలో 330 లక్షల పని దినాలను కల్పించాల్సివుండగా పార్వతీపురం నియోజక వర్గంలో 34 లక్షల పని దినాలు క ల్పించాలని సూచించారు. గృహ నిర్మాణానికి సంబంధించి 1.25 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని దినాలు క ల్పించాల్సివుండగా పార్వతీపురంలో 12,950 మందికి మాత్రమే 100 పని దినాలు కల్పించడం శోచనీయమన్నారు.  నియోజకవర్గంలో నీటికుంటలు, నాడెప్, ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ, శ్మశానవాటికలు, పాఠశాలల ఆటస్థలాల అభివృద్ధి విషయంలో పూర్తిగా వెనుకబడినందుకు తీవ్రంగా మండిపడ్డారు.

బాలగుడబ, వెంకంపేట, బలిజిపేట, ఎల్‌ఎన్‌పురం  గ్రామాల్లో సీసీ రోడ్లు మంజూరు చేసిన విషయం సంబంధిత సర్పంచ్‌కు చెప్పకపోవడం అన్యాయమని, పంచాయతీ తీర్మానించిన్పటికీ పనులు ప్రారంభించక పోవడం శోచనీయమని కలెక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అజ్జాడ, కృష్ణపల్లి గ్రామాల్లో సైతం అలానే జరగడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత కార్యనిర్వాహక  ఇంజనీర్‌ సత్యనారాయణమూర్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన్ను ప్రభుత్వానికి సరండర్‌ చేయాల్సిందిగా జేసీ–2 నాగేశ్వరరావును ఆదేశించారు. గృహాల కేటాయింపులో లాటరీ విధానాన్ని పక్కాగా అమలు చేసి లబ్ధిదారులచే వారి వాటా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి కుంటలకు సంబం ధించి సరైన సమాచారంతో సమీక్షకు హాజరు కాని ఏపీడీపై చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీని ఆదేశించారు.

సమీక్షలతోనే ప్రగతి సాధ్యం
రెవెన్యూ డివిజనల్‌ అధికారి సమక్షంలో ఏంపీడీఓలు, తహశీల్దార్లు, వీఆర్‌ఓలు, సెక్రెటరీలు, ఏపీడీలకు నిరంతర సమీక్షలు నిర్వహించి తగు ప్రగతిని సాధించాలని సూచించారు. పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు మాట్లాడుతూ సాంఘిక సంక్షేమశాఖ భూముల్లోపనులు  చేపట్టడానికి ఆటంకంగా వున్నందున తగు ప్రగతి సాధించలేకపోతున్నారని, ఇటీవల బొబ్బిలి జన్మభూమిలో 25వేలు ఎన్‌టీఆర్‌ జలసిరి బోర్లను ఏర్పాటుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, జంఝావతి, తోటపల్లి తదితర పనుల్లో రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆడారి గెడ్డ రిజర్వాయర్‌ పనులు వేగవంతం చేయాలని, పలు పెండింగ్‌ బిల్లులను చెల్లిం చాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ స్పందిస్తూ సాంఘిక సంక్షే మ భూముల్లో 10శాతం భూమిని వదిలిపెట్టాల్సివున్నదున ఆ భూముల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద చేపట్టిన పనులు పూర్తి చేయాలని  సూచించారు. 25వేల బోర్లకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, ఈ లోగా పాత పనులను పూర్తి చేయిస్తామని తెలిపారు.

పనితీరు బాగోలేని సర్పంచ్‌ల చెక్‌ పవర్‌ రద్దు
జిల్లాలో పనితీరు బాగోలేని సర్పంచ్‌ల చెక్‌పవర్‌ రద్దుచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామ తీర్మాణాలు చేసి, నిధులు మంజూరై ఉన్నప్పటికీ పనులు ప్రారంభించని సర్పంచ్‌ల జాబితాను తయారు చేసి చెక్‌పవర్‌ రద్దు చేయాలని డీపీఓను ఆదేశించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ డా.జి.లక్ష్మీశ, జెడ్పీ సీఈఓ టి.వెంకటేశ్వరరావు, డ్వామా, డీఆర్‌డీఏ, పీడీలు రాజ్‌గోపాల్, సుబ్బారావు , పలువురు జిల్లా అధికారులు, గ్రామ సర్పంచ్‌లు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement