ఆయన ముఖం ప్రశాంతతకు చిహ్నం. పెదవిపై చిరునవ్వు... ఏ విషయాన్నైనా సావధానంగా వినడం... వాటికి సున్నితంగా సమాధానం చెప్పడం... ఇష్టం లేకుంటే ముభావంగా ఉండటం... ఇదీ నిత్యం మనం చూసే మన జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ విధానం. అంతటి శాంతస్వభావుడు ఒక్కసారిగా ఆగ్రహోదగ్రుడయ్యారు. ముఖం ఎర్రగా మారిపోయింది. తూటాల్లాంటి మాటలతో చెలరేగిపోయారు. టాప్ లేచిపోతుందా అన్నట్లు కేకలు వేశారు. ఏం చేస్తారోనన్న భయం కలిగించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన సమీక్ష సమావేశం ఇందుకు వేదికైంది.
విజయనగరం గంటస్తంభం: ‘జిల్లాలో కలెక్టరు ఎందుకున్నారు? కలెక్టరుకు చెప్పాల్సిన అవసరం ఉందా? లేదా? జిల్లా పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌గారు పిలిస్తేనే వెళతారా? కలెక్టర్ పిలిస్తే రారా... మనిషికి స్వర్గం, నరకం ఉంటాయంటారు... నాకు నరకం చూపిస్తున్నారు... ప్రిపేర్ కాకుండా సమావేశానికి వచ్చేశారు? ఇది సమావేశం అనుకుంటున్నారా? ఆటలు పాటలు కార్యక్రమం అనుకుంటున్నారా?’ అంటూ కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆగ్రహం తో ఊగిపోయారు. అధికారుల నిర్లిప్తతపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణుమనాయుడు ఆధ్వర్యంలో శాసనమండలి హామీల కమిటీ జిల్లాలో సోమవారం పర్యటించింది. సభలో ఇచ్చిన హామీల అమలుపై కమిటీ సమీక్షించనుంది. ఇందులో భాగంగా జిల్లాకు సంబంధించి ఇచ్చిన 33 హామీల గురించి సమీక్షించేందుకు సంబంధిత అధికారులతో ముందుగా కలెక్టర్ సమావేశమయ్యారు. అధికారుల వైఖరి ఆయన్ను తీవ్రంగా బాధించింది.
అంతే వారి వైఫల్యాలపై తీవ్ర స్వరంతో మండిపడ్డారు. విద్యాశాఖలో ఉ పాధ్యాయ నియామకాలకు సంబంధించి జరిగిన చర్చలో డిప్యూటీ డీఈవోను జిల్లాలో డీఎస్సీలో భర్తీ చేస్తున్న పోస్టులపై ప్రశ్నించగా ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం మొదలైంది. సమాచారం లేకుండా ఎలా వచ్చారని, తెలియనపుడు సూపరింటెడెంట్‌ను తీసుకుని రావాల్సిందని మండిపడ్డారు. తర్వాత అదనపు తరగతి గదుల నిర్మాణం విషయంలో ఎస్‌ఎస్‌ఏ పీవో లక్ష్మణరావుపై విరుచుకుపడ్డారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రతిపాదనలు తనకు తెలియకుండా జెడ్పీ సమావేశంలో తెలియజేయడంపై మండిపడ్డారు. కలెక్టర్‌కు తెలియకుండా ఎలా వెల్లడిస్తారని ప్రశ్నించారు. ఆ సమాచారం తాను సమాచార హక్కు చట్టంలో తెలుసుకోవాలా? అంటూ నిప్పులు చెరిగారు. మత్స్యకారులకు జెట్టీల ఏర్పాటు విషయాన్ని మత్స్యశాఖ డీడీని ప్రశ్నించగా ఆయన మంత్రి ప్రతిపాదనలు పంపారనడంతో ఆశ్చర్యపోతూ మంత్రి ప్రతిపాదనలు చేస్తారా? పాలన గురించి తెలుసుకోండి... ఇలా ఎలా ఉద్యోగం చేస్తున్నారంటూ చిర్రెత్తిపోయారు.
జలవనరులశాఖ ఎస్‌ఈపై ఫైర్
నీరుచెట్టు బిల్లుల పెండింగ్ ఎంత ఉందో తెలియని బొ బ్బిలి జలవనరులశాఖ ఎస్‌ఈపై కేకలు వేశారు. తెలి యకపోతే తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా అంటూ నిలదీశారు. అందరూ మోసం చేయడానికి ఇక్కడకు వ చ్చారంటూ నిట్టూర్చారు. ఎస్సీ కుల «ధ్రువీకరణ పత్రాలపై కేసుల విషయంలో డీఆర్వో రాజ్‌కుమార్‌ను సై తం గట్టిగా ప్రశ్నించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో క్రమశిక్షణ చర్యలకు సంబంధించి పెండింగ్ లేవంటూ ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ చెప్పడంతో అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ‘అంతా సక్రమంగా ఉంది... అధికారులు పని చేయడం లేదు... మీరు నిద్రపోతున్నారు... అంతే’ అన్నారు. పీఐఏ ఈఈ సమావేశానికి రాకపోవడంపై మండిపడుతూ ‘కలెక్టరు పిలిస్తే రారా, మీరేమైనా రాష్ట్రపతి అనుకుంటున్నారా? ట్రంప్‌గారు పిలిస్తే వెళతారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగం చేయాలని ఉందా? లేదా?
వక్స్ బోర్డు భూములకు రక్షణపై మైనార్టీ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టరు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో నీ వయస్సు ఎంత? ఎంత సర్వీసు ఉంది అంటూ ప్రశ్నించారు. సర్వీసంతా ఉద్యోగం చేయాలని ఉందా? లేదా? అని మండిపడ్డారు. ట్రైబుల్ వెల్ఫేర్ ఎస్డీసీ, సాంఘిక సంక్షేమశాఖ డీడీ, ఇతర అధికారులపై సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరంతా సుఖంగా ఉండాలి. శరీరం అలిసిపోకూడదు... కలెక్టరు మాత్రం పని చేయాలి. మాకు విజయవాడలో కూర్చోబెట్టి క్లాస్ పీకారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి రాని ఎక్సైజ్ సూరెండెంట్, మైనార్టీ ఏడీ, ఆర్‌అండ్‌బి ఈఈ, పీఐఏలకు నోటీసులు ఇవ్వాలని డీఆర్వోను ఆదేశించారు. అనుమతి లేకుండా వెళ్లిన అధికారులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని సూచించారు.
ఈఎస్ ఏమయ్యారు?
హామీల అమల్లో ఎక్కువ అంశాలున్న ఎక్సైజ్ అధికారులపైనా మండిపడ్డారు. యారక్ ఆపేయడంతో కుటుంబా లకు పరిహారం ఇవ్వాలని కలెక్టర్‌కు ప్రతిపాదిస్తూ చేతులు దులుపుకోవడంతో లబ్ధిదారులను ఎవరు గుర్తిస్తారని కలెక్టర్ ప్రశ్నించారు. ఆయా కుటుంబాల గురించి సహాయ ఈఎస్ శంభు ప్రసాద్ చెప్పలేకపోవడంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎక్కడని ప్రశ్నించారు. కమిషనరు సమావేశానికి విజయవాడ వెళ్లారని చెప్పడంతో ఎవరిని అడిగి వెళ్లారని మండిపడ్డారు. కలెక్టరును అడగాలా? వద్దా? అంటూ నిలదీశారు. ‘శంభుప్రసాద్‌గారు... మీరే చెప్పం డి... కలెక్టరు జిల్లాలో ఎందుకు?’ అని ప్రశ్నించారు. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్‌లో మానిటరింగ్ కమిటీల గురించి కోఅర్డనేటర్ చంద్రావతితో మాట్లాడుతూ ఎన్నిసార్లు సమావేశాలు పెట్టారని ప్రశ్నించగా సమావేశాలు పెట్టలేదని అనగానే అంతకుముందు ఇచ్చిన నోట్‌లో కలెక్టర్ పెట్టాలని సూచిస్తూ రాయడంపై మండిపడ్డారు. వేలాది కమిటీలు జిల్లాలో ఉన్నాయని, అన్నీ తాను పెట్టాలంటే తన పదవీకాలం చాలదని, మీరు దగ్గరుండి చేయించుకోవాల్సిన బాధ్యత లేదా? అని ఊగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment