కలెక్టర్‌కు కోపం వచ్చింది
► వీడియో కాన్ఫరెన్స్‌లో నవ్వారని తహసీల్దార్, ఎంపీడీవోపై తీవ్ర ఆగ్రహం
► బందరు తహసీల్దార్‌కు జుడీషియల్ పవర్ కట్
► ఎంపీడీవోకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఆదేశం
విజయవాడ: కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతానికి కోపం వచ్చింది. తాను సీరియస్‌గా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా సిల్లీగా నవ్వుకుంటున్న తహసీల్దార్, ఎంపీడీవోలపై కలెక్టర్ ఆగ్రహం చెందారు. వారిద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. వివరాలు.. కలెక్టర్ లక్ష్మీకాంతం విజయవాడలో తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలో 50 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు. ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు.
ఎన్టీఆర్ జలసిరి పథకంపై కలెక్టర్ సీరియస్‌గా మాట్లాడుతుండగా మచిలీపట్నం తహసీల్దార్ నారదముని, ఎంపీడీవో సూర్యనారాయణ నవ్వుకుంటున్నారు. మచిలీపట్నం జిల్లా కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన వారిద్దరు నవ్వుకోవటాన్ని స్క్రీన్‌లో చూసిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు వారిద్దరని ఏడెనిమిది నిముషాల పాటు గమనించి కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రెవెన్యూ యాక్టు ప్రకారం మీ ఇద్దరిపై చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకటించారు. ఈ క్రమంలో మచిలీపట్నం తహసీల్దార్ నారదముని నిలబెట్టి కలెక్టర్ చివాట్లు వేశారు.
తహసీల్దార్ మేజిస్టీరియల్ పవర్స్ రద్దు చేయమని మచిలీపట్నం ఆర్డీవో సాయిబాబును ఆదేశించారు. నేటి నుంచి అధికారాలు లేని తహసీల్దార్‌గా పని చేయమని కలెక్టర్ తహసీల్దార్‌తో అన్నారు. అదే విధంగా మచిలీపట్నం ఎంపీడీవో సూర్యనారాయణను నుద్ధేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఎందుకు నవ్వుతున్నారు తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ నుంచి బయటికి వెళ్లండి అంటూ కోపంగా చెప్పారు. అంతటితో ఆగకుండా జెడ్పీ సీఈవో సత్యనారాయణకు ఫోన్ చేసి ఎంపీడీవోకు షోకాజ్ నోటీసు జారీ చేయమని ఆదేశించారు. జిల్లా అధికారులు, 50 మండలాల్లో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు, ఉన్నతాధికారులు ఈ సంఘటనతో కంగుతిన్నారు.
లక్ష్యాలు సాధించకుంటే చర్యలు..
నీరు ప్రగతి నిర్వహణ సక్రమంగా లేదని పలువురు స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలపై కలెక్టర్ లక్ష్మీకాంతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడ నుంచి నీరు–ప్రగతి కార్యక్రమంపై జిల్లాలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నీరు–ప్రగతిలో పనుల చేపట్టాలని వారం రోజులుగా అధికారులను ఆదేశిస్తున్నప్పటికీ కొన్ని మండలాల్లో నేటికి పనులు ప్రారంభించకపోవటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ, ఉంగుటూరు, ఘం టసాల మండలాల్లో పనులు ప్రారంభించకపోవటంపై సంబంధిత ఎంపీడీవోలను వివరణ కోరుతూ త్వరలో ఆయా మండలాల్లో తనిఖీ చేస్తానని కలెక్టర్ హెచ్చరించారు. అదే విధంగా పంటకుంటల తవ్వకాల్లో ముందంజలో ఉన్న మైలవరం, తిరువూరు, కంచికచర్ల మండలాలు అధికారులను అభినందించారు. రానున్న మూడు రోజుల్లో జిల్లాలో వంద నుంచి 120 వరకు తప్పనిసరిగా పంట గుంతలు తవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
అదే విదంగా వర్మీ కంపోస్టు కేంద్రాలను జిల్లాలో 15 వేలు పూర్తి చేయాల్సి ఉం డగా నేటి వరకు కేవలం 500 వరకు మాత్రమే చేయడంపై కలెక్టర్ అధికారులను వివరణ కోరారు. జీరోలో ఉన్న పెడన, గుడ్లవల్లేరు, మచిలీపట్నం, నాగాయలంక అధికారులను మందలించారు. పనుల నిర్వహణలో లక్ష్యాలు సాధించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో పెండింగు సమస్యలు పరిష్కారంలో రెవెన్యూ శాఖ వెనకబడి ఉన్నదని తక్షణం దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.