పిడియాట్రిక్ ఐసీయూలో అరుదైన వ్యాధితో చికిత్స పొందుతున్న సంధ్యారాణి
‘దైవం మానుష రూపేణ’ అనంటారు. అలా ఉంటేనే జన్మకు సార్థకత. కళ్లెదుట బిడ్డ మృత్యువుకు దగ్గరవుతూ పంటిబిగువున ఆవేదన అణుచుకున్న దంపతులకు జిల్లాకలెక్టర్ బి.లక్ష్మీకాంతం ప్రాణదాతగా నిలిచారు. ప్రభుత్వ వైద్యులు డీల్ చేయలేని కేసు కేవలం ఒక్క ఫోన్‌కాల్‌తో పరిష్కరింప చేశారు. కలెక్టర్ కోరిక మేరకు సదరు డాక్టరు చెంతకు వెనువెంటనే చిన్నారిని అంబులెన్స్‌లో తరలింప చేశారు. దీంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ల్లేవు. కన్నీటితో జిల్లాపరిపాలనాధికారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వివరాల్లోకి వెళితే...
లబ్బీపేట (విజయవాడ తూర్పు): గుంటూరు జిల్లా పేరేచర్ల మండలం దోసపాలెంకు చెందిన సంధ్యారాణికి పుట్టుకతో ఎలాంటి గుండెజబ్బు లేదు. మూడేళ్ల వయస్సులో వచ్చిన రుమాటిక్ ఫీవర్ కారణంగా అరుదైన గుండెజబ్బుకు గురైంది. నిరుపేద కుటుంబం కావడంతో చిన్నారికి వచ్చిన జబ్బును గుర్తించలేక పోయారు. వయస్సు పెరిగినా ఎదుగుదల లేక పోవడం, కాళ్లు చేతులు సన్నగా అయిపోవడంతో గతంలో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. బాలిక అరుదైన గుండెజబ్బుతో బాధపడుతోందని, తమ వద్ద వైద్యం లేదని చేతులెత్తేసారు. అనంతరం ప్రవేటు ఆస్పత్రిలో పిడియాట్రిక్ కార్డియాలజీ వైద్యుడికి చూపించగా, ప్రస్తుతం ఆపరేషన్ చేయడం కుదరదని తేల్చి చెప్పారు. చేసేది లేక ఇక్కడి ప్రభుత్వాస్పత్రికి తీసుకు రాగా, పిడియాట్రిక్ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
అయ్యా.. మీరేదిక్కు!
ఈ తరుణంలో శుక్రవారం కలెక్టర్ ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు రాగా, బాలిక తండ్రి సరోజ్‌కుమార్ తమ కుమార్తె దీనస్థితిని ఆయనకు వివరించారు. తమకు మీరే దిక్కంటూ వేడుకున్నారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లాల్‌ను కలెక్టర్ వివరణ కోరగా, పిడియాట్రిక్ కార్డియాలజి తమ వద్ద లేదని చెప్పారు. దీంతో వెంటనే కార్డియాలజిస్ట్ రమేష్‌తో మాట్లాడి బాలికకు అవసరమైన వైద్యం అందించాలని స్వయంగా కోరడంతో పాటు, తక్షణమే బాలికలను అక్కడకు తీసుకెళ్లాలని ఆదేశించారు. దీంతో ప్రభుత్వాస్పత్రి అంబులెన్స్‌లోనే బాలికను రమేష్ హాస్పటల్‌కు తరలించారు. బాలిక వైద్యం పట్ల తక్షణమే స్పందించిన కలెక్టర్ ఔదార్యాన్ని అక్కడున్న వారంతా ప్రశంసించారు.
గతంలో ఈ కేసులు ఎక్కువ!
కాగా రుమాటిక్ ఫీవర్ కేసుల్లో ఈ రకమైన గుండె జబ్బులు ఒకప్పుడు ఎక్కువుగా చూసే వాళ్లమని, ఇటీవల కాలంలో చాలా అరుదుగా వస్తున్నట్లు బాలికకు చికిత్స చేస్తున్న ప్రభుత్వాస్పత్రి పిల్లల వైద్య విభాగ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్‌ఎస్ విఠల్‌రావు తెలిపారు. పాపకు చికిత్స అందించడంలో ఇప్పటికే జాప్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment