ప్రభుత్వాస్పత్రిలో తనిఖీలు చేస్తున్న జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం పక్కన సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ బాబూలాల్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రోగులకు మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేరా..రెండేళ్ల కిందట సంప్ తొలగిస్తే ఇప్పటి వరకూ ఎందుకు ఏర్పాటు చేయలేదు. ఇలాంటి అధికారులు మాకు అవసరం లేదంటూ ఇంజినీర్లుపై కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాస్పత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, వైద్యం అందించేందుకు వైద్యులు, అధికారులు కృషి చేయాల్సిన బాధ్యత లేదా అంటూ ప్రశ్నల వర్షం కురపించారు. గురువారం జరిగిన ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం వాడీవేడిగా జరిగింది. కొత్త ప్రభుత్వాస్పత్రిలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో ప్రారంభంలోనే సాక్షిలో వచ్చిన కథనంపై అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. మంచినీటి సమస్యపై ప్రశ్నిస్తూ ఇంజినీర్లపై మండిపడ్డారు. తక్షణమే సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సీటీ రిపోర్టుల జాప్యంపై ఆగ్రహం
ప్రాణాపాయంలో ఉన్న రోగికి సీటీ స్కాన్ చేసి రిపోర్టులు ఇవ్వడంలో జాప్యం చేస్తే ఎలాగంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి అధికారులు నిర్వాహకులను సమావేశానికి పిలిపించారు. కొద్దిసేపటి తర్వాత వచ్చిన నిర్వాహకులు రెండు గంటల్లో రిపోర్టులు ఇస్తున్నట్లు కలెక్టర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీనిపై వైద్యులు సైతం మౌనంగా ఉండడంతో కలెక్టర్ మరో అంశంపై చర్చించారు. రోగులకు రక్తపరీక్షలు బయటకు ఎందుకు రాస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆస్పత్రిలోని 24 గంటల లేబొరేటరీలో పూర్తిస్థాయిలో పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు.
బ్లడ్ కాంపోనెంట్స్ సిద్ధం చేయండి
ప్రభుత్వాస్పత్రిలోని బ్లడ్ బ్యాంకులో కాంపోనెంట్స్ యూనిట్‌ను సత్వరమే అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కొరత ఉన్న టెక్నీషియన్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు సమావేశంలో ఆమోదించారు. పలు విభాగాల్లో పరికరాలు కొనుగోలుపై సమావేశంలో ఆమోదించారు. అత్యవసర చికిత్సా విభాగం, పోస్టు ఆపరేటివ్ వార్డు, అవుట్‌పేషెంట్స్ విభాగాల్లో ఏసీలు అమర్చేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. రోగి ఆçస్పత్రిలోకి అడుగు పెట్టగానే కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చినట్లు ఫీలయ్యేలా ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ బాబూలాల్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గీతాంజలి, అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి, విభా«గాధిపతులు డాక్టర్ కె.శివశంకరరావు, డాక్టర్ కంచర్ల సుధాకర్, డాక్టర్ ఎఆర్‌సీహెచ్ మోహన్, డాక్టర్ డి.రాజ్యలక్ష్మి, డాక్టర్‌శ్రీనివాసరావు, డాక్టర్ జి.రామకృష్ణ, డాక్టర్ పి.నాంచారయ్య, ఈఈ ప్రవీణ్‌దాస్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ ఆఫీస్ నిర్వహించండి
కలెక్టర్ తొలుత ఆస్పత్రిలోని అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి వెళ్లి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కార్యాలయంలో పెద్ద ఎత్తున ఫైళ్లు ఉండటం చూసి, ఈ ఆఫీసు విధానం అమలు చేయమంటే ఇన్ని ఫైళ్లు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. తక్షణమే ఈ ఆఫీసు విధానాన్ని అమలు చేయాలని ఆ విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మిని ఆదేశించారు.
పాత ఆస్పత్రిని చక్కదిద్దేందుకు కమిటీ
ప్రసూతి విభాగానికి పెద్ద సంఖ్యలో గర్భిణులు, రోగులు వస్తుండటంతో వారిని సర్దుబాటు చేయడం పెద్ద సమస్యగా మారిందని, ఒక్కో బెడ్‌పై ఇద్దరిని ఉంచాల్సిన పరిస్థితి వస్తుందని ఆ విభాగాధిపతి డాక్టర్ రాజ్యలక్ష్మి కలెక్టర్ లక్ష్మీకాంతంకు వివరించారు. ఆ పరిస్థితిని మార్చేందుకు ఏమి చేస్తే బాగుంటుందో అధ్యయనం చేసేందుకు నలుగురు సభ్యులతో కమిటీని నియమించారు. వారు మూడు రోజులు పాటు ఆస్పత్రిలోని అన్ని అంశాలను పరిశీలించి తనకు నివేదిక ఇస్తే, అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment