గెటవుట్ ఫ్రం మైరూం
Published Fri, Jan 13 2017 11:02 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
- టీజీవీ క్షేత్రం నిర్వాహకులను దూషించిన కలెక్టర్
– సునయనకు మార్చాలని ప్రయత్నం
- ఎఫ్‌డీసీ జోక్యంతో మళ్లీ టీజీవీ కళాక్షేత్రమే ఖరారు
కర్నూలు(అగ్రికల్చర్): నంది నాటకోత్సవ వేదికగా టీజీవీ కళాక్షేత్రాన్ని ముందే నిర్ణయించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీవీ కళా క్షేత్రం నిర్వాహకులను దూషించారు. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఫిలిండెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి కర్నూలులో టీజీవీ కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే నందినాటకోత్సవాల కన్వీనర్ ఆర్డీవో రఘుబాబు, టీజీవీ కళాక్షేత్ర నిర్వాహకులు నందినాటకోత్సవాల ఆహ్వాన పత్రిక గురించి చర్చించేందుకు కలెక్టర్‌ను కలిశారు. టీజీవీ కళాక్షేత్రంలో ఎందుకు నిర్వహిస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించగా.. టీజీవీ కళాక్షేత్రం నిర్వాహకులు 2నెలల క్రితమే ఎఫ్‌డీసీ అధికారులు సునయన, టీజీవీ కళాక్షేత్రాలను పరిశీలించి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నాటక ప్రదర్శనలకు, కళాకారుల మేకప్ రూములకు టీజీవీ కళాక్షేత్రం అనుకూలంగా ఉందని నిర్ణయించారని చెప్పారు.
కలెక్టర్ ఆగ్రహంతో టీజీవీ కళాక్షేత్రం నిర్వాహకునితో హూ ఆర్‌యూ..! గెటవుట్ ఫ్రం మైరూం అంటూ దూషించారు. ఆర్‌డీఓ రఘుబాబును సునయనలోనే నాటకోత్సవాలు ఏర్పాటు చేయమని ఆదేశించారు. విషయం తెలుసుకున్న ఎన్‌ఎఫ్‌డీసీ అధికారులు మళ్లీ కర్నూలుకు వచ్చి సునయన టీజీవీ కళాక్షేత్రం సౌకర్యాలను పరిశీలించారు. కళాకారుల గ్రీన్‌రూమ్ సౌకర్యాలు తదితర ఏర్పాట్ల కోసం సునయనను ఇప్పుడున్న కాలపరిమితిలో తీర్చిదిద్దడం కష్టతరమని, కలెక్టర్ ఈ వేదికపై పట్టుపడితే నందినాటకోత్సవాలను వేరే జిల్లాకు మార్చాల్సి వస్తుందని స్పష్టం చేశారు. దీంతో తిరిగి కలెక్టర్ టీజీవీ కళాక్షేత్రంలోనే నందినాటకోత్సవాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 18 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరగనున్న నంది నాటక పోటీల కోసం టీజీవీ కళాక్షేత్రం ముస్తాబవుతోంది.
Advertisement
Advertisement