nandi drama festival
-
అర్హులకే నంది అవార్డులు.. ఎవరికీ అన్యాయం జరగదు: పోసాని
సాక్షి, హైదరాబాద్: నంది అవార్డులు అర్హులకే వస్తాయని.. ఎవరికీ అన్యాయం జరగదని ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అర్హులైన నటులను గుర్తించి గౌరవిస్తామని, నంది అవార్డుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. పారదర్శకంగా అవార్డుల ఎంపిక ఉంటుందన్నారు. సీఎం జగన్ నాపై గొప్ప బాధ్యత పెట్టారు. నంది నాటకోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం. అర్హులైన వారికి అవార్డులిచ్చి సత్కరిస్తాం’’ అని పోసాని కృష్ణమురళి వెల్లడించారు. ఇదీ చదవండి: ఏపీలో నేరాలు తగ్గాయి: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి -
గతంలో అనర్హులకే నందులు.. ఇప్పుడు న్యాయం చేస్తాం: పోసాని
సాక్షి, గుంటూరు: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకే అవార్డులు దక్కాయని ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బీసీ వెల్ఫేర్, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి నాటకోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ, నంది అవార్డుల్లో గతంలో తనకు అన్యాయం జరిగిందన్నారు. ‘‘వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక నన్ను ఛైర్మన్ చేశారు. అర్హులైన వారికి మాత్రమే నంది అవార్డులు ఇస్తున్నాం. కళాకారులకు గుర్తింపునిచ్చే ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం. నాటక రంగాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం. వర్క్‌షాపులు నిర్వహించి కళాకారులకు ప్రోత్సహిస్తాం’’ అని పోసాని కృష్ణ మురళి పేర్కొన్నారు. నాటక రంగలో ఇదొక చారిత్ర ఘట్టం: మంత్రి వేణు మొత్తం 73 అవార్డులు ఇవ్వబోతున్నామని, 38 నాటక సమాజాల నుంచి 1200 మంది కళాకారులు పాల్గొంటున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ‘‘నాటక కళాకారులకు అత్యుత్తమ వసతులు కల్పించాం. నిరుత్సాహంతో ఉన్న కళాకారులకు ఇది గొప్ప అవకాశం. రాష్ట్రంలో అంతరించుపోతున్న కళలను సజీవంగా ఉండాలనేది సీఎం జగన్ ఆకాంక్ష. వీధి నాటకాలను సైతం పోత్సహిస్తున్నాం. వెనుకబడిన వర్గాల నుంచి ఎక్కువ మంది నాటక రంగానికి వస్తున్నారు. ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం వల్ల కళాకారులకు మరింత గౌరవం దక్కుతుంది. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇప్పుడు ఇవ్వనున్న అవార్డులు ప్రతిబింబాలు. నాటక రంగలో ఇదొక చారిత్ర ఘట్టం’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు. ఇదీ చదవండి: నంది నాటకోత్సవాలు: సీఎం జగన్ 100 అడుగుల కటౌట్ -
నంది నాటకోత్సవాలు: సీఎం జగన్ 100 అడుగుల కటౌట్
సాక్షి, గుంటూరు: నాటక రంగానికి పూర్వవైభవం తీసుకురాడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం బీసీ వెల్ఫేర్, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి నాటకోత్సవాలను ప్రారంభించారు. నంది నాటకోత్సవాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీఎం జగన్ 100 అడుగుల భారీ కటౌట్ ఆకట్టుకుంటోంది. ప్రాథమిక దశలో మెప్పించి తుది పోటీలకు అర్హత పొందిన కళాకారులు ఈ ఉత్సవాల్లో సత్తా చాటి బహుమతులు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. మొత్తం ఐదు విభాగాలుగా పోటీలు జరగనున్నాయి. పద్య, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, కళాశాల, యూనివర్సిటీ స్థాయి నాటికలు, బాలల నాటికల ప్రదర్శనలు ఆహూతులను అలరించనున్నాయి. ఈ పోటీల్లో 73 అవార్డులు గెలుచుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 38 నాటక సమాజాల నుంచి 1,200 మంది కళాకారులు పాల్గొంటున్నారు. కళాకారులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఏర్పాట్లు చేశారు. నాటక ప్రదర్శనలను కళాకారులు, విద్యార్థులు, కళాభిమానులు ఉచితంగా తిలకించే అవకాశం కల్పించారు. ఈ వేడుకలు 29 వరకు జరగనున్నాయి. నేటి నాటక ప్రదర్శనలివే ● శనివారం ప్రారంభ సభానంతరం ఉదయం 11 గంటలకు రాజాంకు చెందిన కళా సాగర నాటక సంక్షేమ సంఘం వారి ’శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం’ పద్య నాటక ప్రదర్శనతో ఉత్సవాలు ఆరంభమవుతాయి. కళారత్న డాక్టర్ మీగడ రామలింగ స్వామి రచనలో రూపుదిద్దుకున్న ఈ నాటకానికి మీగడ మల్లికార్జున స్వామి దర్శకత్వం వహిస్తారు. ● మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారి ’ఎర్ర కలువ’ సాంఘిక నాటకం ప్రదర్శితమవుతుంది. రచన: ఆకురాతి భాస్కర్ చంద్ర. దర్శకత్వం : డాక్టర్ వెంకట్ గోవాడ ● సాయంత్రం 5 గంటలకు గుంటూరు అమృతలహరి థియేటర్ ట్రస్ట్ వారి ‘నాన్నా.. నేనొచ్చేస్తా’ సాంఘిక నాటిక ప్రదర్శన ఉంటుంది. రచన: తాళాబత్తుల వెంకటేశ్వరరావు. దర్శకత్వం: అమృత లహరి. ● సాయంత్రం 6.30 గంటలకు తెనాలి శ్రీదుర్గా భవాని నాట్యమండలి వారి ‘శ్రీరామభక్త తులసీదాసు’ పద్య నాటకం ప్రదర్శితమవుతుంది. రచన: డాక్టర్ ఐ.మల్లేశ్వరరావు. దర్శకత్వం : ఆదినారాయణ వైఎస్సార్, ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాలు ఈ ఏడాది డాక్టర్ వైఎస్సార్ రంగస్థల అవార్డును కాకినాడకు చెందిన యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్‌కు ఇస్తున్నట్టు పోసాని కృష్ణమురళి తెలిపారు. రూ.5,00,000 నగదు ప్రోత్సాహం అందించనున్నట్టు వెల్లడించారు. ఎన్టీఆర్ రంగస్థల పురస్కారానికి విశాఖపట్నానికి చెందిన డాక్టర్ మీగడ రామలింగస్వామి ఎంపికై నట్లు చెప్పారు. ఈయనకు రూ.1,50,000 నగదు ప్రోత్సాహకం అందించనున్నారు. -
కర్నూలు వాసికి ఉత్తమ మేకప్‌మెన్ అవార్డు
కర్నూలు (అగ్రికల్చర్) : కర్నూలు వాసికి ఉత్తమ మేకప్‌మెన్‌గా అవార్డు లభించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో నంది నాటకోత్సవాలు జరిగాయి. పద్య, నాటక విభాగంలో శ్రీకృష్ణ భీమసేనం నాటకానికి సంబంధించి కర్నూలుకు చెందిన చింత శ్రీనివాసులుకు ఉత్తమ మేకప్‌మెన్‌గా నంది అవార్డు లభించింది. కర్నూలు అభిఆర్ట్స్కు చెందిన చింతా శ్రీనివాసులు ఇదివరకే ఐదు అవార్డులు దక్కించుకున్నారు. తాజాగా మరో అవార్డు దక్కడం విశేషం. కర్నూలు వాసికి అత్యుత్తమమైన అవార్డు దక్కడంపై కళాకారులు అభినందనలు తెలిపారు. -
ఆ‘నంది’..అద్వితీయం
- పద్యనాటకంలో లలిత కళా సమితి - బాలల విభాగంలో శ్రీ గురు రాజా కాన్సెప్ట్ స్కూల్ సాక్షి, రాజమహేంద్రవరం : రాష్ట్ర స్థాయిలో 2016 ఏడాదికి గాను పద్య, సాంఘిక, బాలల, కళాశాలల, యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన నాటక పోటీల విజేతలకు 20వ నంది నాటక బహుమతులు ప్రదానం చేశారు. పద్యనాటకంలో మొదటి బహుమతి అనంతపురం పట్టణానికి చెందిన లలిత కళాపరిషత్తు, రెండో బహుమతి కర్నూలుకు చెందిన లలిత కళా సమితి, తృతీయ బహుమతి ఖమ్మం కల్చరల్ అసోసియేషన్ గెలుచుకున్నాయి. వీరికి బంగారు, వెండి, క్యాంస నందులతోపాటు రూ.80 వేలు, రూ.60 వేలు, రూ.40 వేలు చొప్పున నగదు, ప్రశంసాపత్రం ఇచ్చారు. సాంఘిక నాటిక విభాగంలో మొదటి బహుమతి గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన గంగోత్రి, రెండో బహుమతి హైదరాబాద్‌కు చెందిన కళాంజలి, మూడో బహుమతి రాజమహేంద్రవరం విజయాదిత్య ఆర్ట్స్‌కు ప్రదానం చేశారు. వీరికి నంది, వెండి, క్యాంస నందులతోపాటు రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.30 వేలు చొప్పున నగదు, ప్రశంసాపత్రం అందించారు. బాలికలు, కళాశాలలు, యూనివర్సిటీల విభాగంలో... బాలల విభాగంలో శ్రీ ప్రకాశ్ విద్యానికేతన్ విశాఖపట్నం మొదటి బహుమతి, కళారాధన, శ్రీ గురు రాజా కాన్సెప్ట్ స్కూల్ నంద్యాల రెండో బహుమతి, కళాప్రియ లిటిల్ చాంప్స్ ఒంగోలు మూడో బహుమతి గెలుచుకున్నాయి. వీరికి బంగారు, వెండి, కాంస్య నందులతోపాటు రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేల చొప్పున నగదు, ప్రశంసాపత్రం అందించారు. కళాశాలలు, యూనివర్సిటీల విభాగంలో సెయింట్ థెరిస్సా మహిళా డిగ్రీ కాలేజి ఏలూరు మొదటి బహుమతి, న్యూ స్టార్ మోడ్రన్ థియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్, పీబీ సిద్ధార్ద కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విజయవాడ రెండో బహుమతి, ఎస్.ఎస్.బి.ఎన్. డిగ్రీ కాలేజి అనంతపురం మూడో బహుమతి గెలుచుకున్నాయి. వీరికి బంగారు, వెండి, కాంస్య నందులతోపాటు రూ.40 వేలు, రూ.30వేలు, రూ.20 వేలు చొప్పున నగదు, ప్రశంసాపత్రం ప్రదానం చేశారు. గ్రామీణ నేపథ్యంలో ఆధునిక తెలుగు నాటక రచన సమస్యలు, పరిష్కారాలు అనే అంశంపై నాటక రంగంలో రచించిన పుస్తకానికి గాను రచయిత కారుమూరి సీతారామయ్యకు తామ్ర నంది, రూ.35 వేల నగదు, ప్రశంసాప్రతం అందించారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల, ఇతర వక్తలు మాట్లాడుతూ నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో నాటకాలకు మంచి ప్రాధాన్యం ఉందన్నారు. రాష్ట్రంలో రంగస్థల నటులకు పింఛన్ పెంచాలని, వారికి ఇళ్లు ఇవ్వాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, నగర మేయర్ పంతం రజనీశేషసాయి, ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.శ్రీకాంత్, ఎండీ ఎస్.వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వెండినందిని అందుకున్న ‘‘అపురూపం’’ నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వం, చలన చిత్ర, నాటక రంగ అభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన నంది నాటకోత్సవం పోటీల్లో వెండి నంది బహుమతిని ఆదివారం రాత్రి అపురూపం నాటిక బృందం అందుకుంది. స్థానిక గురురాజ స్కూల్, కళారాధన, సాంస్కృతిక సంస్థ అపురూపం బాలల నాటికను రూపొందించింది. ఇటీవల కర్నూలులో జరిగిన నంది నాటకోత్సవాల్లో ఈ నాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. ఈ మేరకు రాజమండ్రిలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ నుంచి వెండి నంది, రూ.30వేల నగదును నాటిక దర్శకుడు డాక్టర్ రవికృష్ణ, గురురాజ స్కూల్ డైరెక్టర్ షావలిరెడ్డి, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఆర్ఎస్ ప్రసాద్, చిన్నారులు అందుకున్నారు. ఈ వెండి నందిని సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని, వరుసగా నాలుగేళ్ల నుంచి ప్రతి ఏడాది నంది నాటకోత్సవంలో బహుమతులను సాధిస్తున్నామని డాక్టర్ రవికృష్ణ, షావలిరెడ్డి తెలిపారు. -
కర్నూలు నాటకానికి ఏడు నందులు
రికార్డు సృష్టించిన ప్రమీలార్జున పరిణయం – నంది నాటకోత్సవ చరిత్రలోనే అరుదైన రికార్డు కర్నూలు(కల్చరల్): రాష్ట్రస్థాయి నంది నాటక పోటీల్లో కర్నూలు లలిత కళాసమితి కళాకారులు ప్రదర్శించిన ‘ప్రమీలార్జున పరిణయం’ పద్యనాటకం ఏడు నంది అవార్డులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నాటకానికి ఉత్తమ ద్వితీయ ప్రదర్శన(వెండి నంది), ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రచన, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ హాస్యనటి, ఉత్తమ సంగీత దర్శకత్వం అవార్డులు లభించాయి. నాటకానికి దర్శకత్వం వహించిన పత్తి ఓబులయ్యకు ఉత్తమ దర్శకుడు, రచన చేసిన ప్రముఖ నాటక రచయిత పల్లేటి కులశేఖర్‌కు ఉత్తమ రచయిత, నాటకంలో అర్జున పాత్ర పోషించిన బాల వెంకటేశ్వర్లుకు ఉత్తమ నటుడు అవార్డులు లభించాయి. నారద పాత్ర పోషించిన శామ్యూల్‌కు ఉత్తమ సహాయ నటుడు, కుతూహలం పాత్ర పోషించిన విజయకు ఉత్తమ హాస్యనటి, సంగీత దర్శకత్వం వహించిన రామలింగంకు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు వరించింది. నంది నాటక పోటీల్లోనే తొలిసారిగా ఏడు నందులు సాధించి అరుదైన రికార్డు సృష్టించి కర్నూలు కళారంగ ఖ్యాతిని ఇనుమడింపజేసిన లలిత కళాసమితిని పలువురు నాటకరంగ మేధావులు అభినందించారు. లలిత కళాసమితి రాష్ట్రస్థాయి నంది నాటక పోటీల్లో ఏడు నందులు సాధించడం పట్ల తెలుగు కళాస్రవంతి అధ్యక్షులు డాక్టర్ ఎం.పి.ఎం.రెడ్డి, ప్రముఖ నవలా నాటక రచయిత ఎస్.డి.వి.అజీజ్, ప్రముఖ జానపద కవి డాక్టర్ వి.పోతన ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. -
నటనా కౌశలం
- అలరించిన పద్యనాటకాలు - ఆసక్తికరంగా సాగిన నందినాటకోత్సవాలు కర్నూలు (కల్చరల్): నందినాటకోత్సవాల్లో భాగంగా మంగళవారం వివిధ నాటక సమాజాల కళాకారులు తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. రైతు కళా నిలయం పత్తికొండ కళాకారులు ప్రదర్శించిన సీతారామ కల్యాణం అలరించింది. కర్నూలు కళాకారుల సంక్షేమ సంఘం కళాకారులు ప్రదర్శించిన కృష్ణభీమ సేన, సాయి కళాస్రవంతి రంగారెడ్డి జిల్లా కళాకారులు ప్రదర్శించిన శ్రీకృష్ణసత్య పద్యనాటకం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాముని పరాక్రమ విశిష్టత.. సీతారామ కల్యాణం నాటకం.. రామాయణ ప్రాధాన్యతను, రాముని పరాక్రమ విశిష్టతను చాటి చెప్పింది. సీతా స్వయం వరానికి వెళ్లి శివధనస్సును ఎత్తలేక రావణుడు గర్వభంగానికి గురై వెనుదిరుగుతాడు. రాముడు శివధనుస్సును ఎత్తి సీతను పరిణయమాడటమే ఈ నాటకంలోని ప్రధాన ఇతివృత్తం. వేదాల వెంకటప్పలాచార్య రచించిన ఈ నాటకానికి పీవీ జనార్దనరెడ్డి దర్శకత్వం వహించారు. భారత గాథలోని ఇతివృత్తం.. కర్నూలు కళాకారుల సంక్షేమ సంఘం కళాకారులు ప్రదర్శించిన శ్రీకృష్ణభీమసేనం పద్య నాటకం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ నాటకంలో శ్రీకృష్ణునికి, భీమసేనునికి మధ్య ఉన్న ఆత్మీయ అనుబం«ధాన్ని చాటిచెప్పారు. పల్లేటి లక్ష్మి కులశేఖర్ రచించిన ఈ నాటకానికి పీవీ రెడ్డి దర్శకత్వం వహించారు. దృశ్యకావ్యం శ్రీకృష్ణసత్య శ్రీసాయి కళా స్రవంతి రంగారెడ్డి జిల్లా కళాకారులు ప్రదర్శించిన శ్రీకృష్ణసత్య నాటకం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపింది. యుద్ధరంగంలో సత్యభామ పతిప్రాణ సంరక్షణకు విల్లంబులు చేతబూని విజృంభిస్తుంది. తన తల్లి చేతిలో తప్ప అన్యుల చేతిలో తనకు మరణం లేదని గ్రహించిన నరకాసురుడు సత్యభామనే తల్లిగా గుర్తించి తన తప్పులు క్షమింపమని ఆమె పాదముల చెంత మరణిస్తాడు. ఈ ఇతివృత్తాన్ని అత్యంత హృద్యంగా చిత్రించిన శ్రీకృష్ణ సత్య నాటకం ప్రేక్షకులను అలరించింది. సీవీ రామారావు రచించిన ఈ నాటకానికి ఏ.నాగభూషణం దర్శకత్వం వహించారు. -
పద్యనాటకాలు.. ఇతిహాస సుగంధాలు
కర్నూలు (కల్చరల్) : నందినాటకోత్సవాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో వివిధ నాటక సమాజాలు ప్రదర్శించిన పద్య నాటకాలు అలనాటి ఇతిహాస సుగంధాలను వెదజల్లాయి. స్వామి అయ్యప్ప, మైరావణ, భక్త మార్కండేయ నాటకం ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. నైతిక విలువలకు సంబంధించి చక్కని సందేశాలను అందించాయి. అయ్యప్ప చరితను చాటిన స్వామి అయ్యప్ప నాటకం శ్రీసర్వేశ్వర నాట్య మండలి హైదరాబాద్ నాటక సమాజం ప్రదర్శించిన స్వామి అయ్యప్ప నాటకం స్వామి జన్మవృత్తాంతం, ఆయన అడవులకు వెళ్లడం, శబరిగిరిలో ఆలయం నిర్మాణం వంటి సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహిషాసురుడిని దుర్గామాత సంహరించిన తర్వాత అతని సోదరి మహిషి తపస్సు చేసి హరిహరుల సంగమం వలన పుట్టిన వాడి చేతనే తాను మరణిస్తానని వరం పొందుతుంది. విష్ణుదేవుడు, మోహినిని శివునికి ఇచ్చి వివాహం చేయడం, మోహిని, శివంశ సంఘమం వలన ధర్మశాస్త్రుడు అవతరించి మహిషిని సంహరిస్తాడు. కలియుగంలో రాజశేఖర, రాజ దంపతులకు పసిపాపగా ధర్మశాస్త్రుడు జన్మించి అయ్యప్ప, మణికంఠుడిగా మారుతాడు. అనంతరం ఆ దంపతులకు పుట్టిన మరో పుత్రుడు అయ్యప్పకు రాజపీఠానికి పోటీగా తయారవుతాడు. అయ్యప్ప తల్లి అతనిపై ధ్వేషంతో తన ఔషధం కోసం పులిపాలను తెమ్మని అడవులకు పంపుతుంది. తుదకు అయ్యప్ప మహిమాన్వితుడై దైవంగా మారుతాడు. నాటకాన్ని పల్లేటి లక్ష్మీ కులశేఖర్ రచించగా బీఆర్ తీట్ల దర్శకత్వం వహించారు. రామాయణ విశిష్టతను చాటిన మైరావణ నాటకం శ్రీవినాయక నాటక కళా మండలి రేణిగుంట నాటక సమాజం ప్రదర్శించిన మైరావణ పద్య నాటకం రామాయణ గాథలోని విశిష్టతను చాటి చెప్పింది. రామరావణ యుద్ధంలో రావణ పరివారంలోని ముఖ్యులు గతించి పోయాక నారదుని సలహా మేరకు రావణుడు మైరావణుడిని సాయం కోరుతారు. మైరావుణుడు తన మంత్ర ప్రభావంతో రామలక్ష్మణులను భైరవీదేవికి బలి ఇవ్వాలని ఆలోచిస్తాడు. అయితే ఆంజనేయుడు రామలక్ష్మణులను కాపాడుకునే నేపథ్యంలో పాతాళలంక ముఖద్వారం దగ్గర మత్స్యవల్లభునితో యుద్ధం చేస్తాడు. మత్స్య వల్లభుడు తన కుమారుడేనని నారదుడి ద్వారా తెలుసుకుంటాడు. ఆంజనయుడు, మైరావణుడు బంధించిన చంద్రసేన ద్వారా అతని జన్మరహస్యాన్ని సంపాదిస్తాడు. మైరావణుడి ప్రాణమున్న చిలుకను తెచ్చి వధించి ఆంజనేయుడు, రామలక్ష్మణులను కాపాడుకుంటాడు. సుంకర పండరిబాబు నాటకానికి దర్శకత్వం నిర్వహించారు. మార్కండేయ చరితకు అద్దం పట్టిన భక్త మార్కండేయ.. మార్కండేయుని ఇతివృత్తాన్ని ఆసక్తికరమైనకథగా మలిచి చక్కని నాటకీయతతో ప్రదర్శించారు ఓరుగల్లు శారదానాట్య మండలి కళాకారులు. యమధర్మరాజు నారదుడితో 14 భువనములలో తనకు తిరుగులేదని ఎటువంటి జీవి అయినా తన లోకానికి వచ్చి తీరాల్సిందేనని అహంభావంతో పలికుతాడు. నారదుడు అతని గర్వాన్ని అణచడానికి ఒక వీరుడుని సృష్టించాలని సంకల్పిస్తారు. మ్రికండముని, మరుద్మతి దంపతులు చాలా కాలాంగా పిల్లలు లేక అష్టకష్టాలు పడుతుంటారు. నారదుడి ఉపదేశంతో వారు శివుని గూర్చి తపస్సు చేస్తారు. శివుడు వారికి 16 ఏళ్లు ఆయుష్షు కలిగిన, గుణవంతుడైన మార్కండేయుడు అనే కుమారున్ని ప్రసాదిస్తాడు. మార్కండేయుడు గురుదేవుల దీవెనలతో జాబాలి విద్యను అభ్యసిస్తాడు. అయితే 16 ఏళ్లు ముగియగా, అతని ఆయష్షు అంతమవుతుందని తిరిగి ఆ దంపతులు బ్రహ్మదేవున్ని వేడుకుంటారు. బ్రహ్మ మార్కండేయునికి దీర్ఘాయుష్షు ప్రసాదిస్తాడు. మార్కండేయుడు యముని గర్వాన్ని అణచివేస్తాడు. శారదానాట్య మండలి (ఓరుగల్లు) అధ్యక్షుడు జేఎన్ శర్మ దర్శకత్వం వహించారు. -
సత్య సంధత..భక్తి పరాయణత
- అలరించిన పౌరాణిక నాటకాలు కర్నూలు (కల్చరల్): నందినాటకోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ప్రదర్శించిన పౌరాణిక పద్య నాటకాలు భారతీయ ఇతిహాసాలలోని ఉన్నత విలువలను చాటి చెప్పాయి. వంశీ కళాక్షేత్రం తిరుపతి నాటక సమాజం ప్రదర్శించిన ‘రావణ బ్రహ్మ’, వేణుగోపాల స్వామి నాట్యమండలి వరంగల్ నాటక సమాజం వారు ప్రదర్శించిన సత్యహరిశ్చంద్ర, మైత్రీ కళాపరిషత్ మహబూబ్‌నగర్ నాటక సమాజం వారు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’ నాటకాలు, రామాయణ భారత గాథలలోని ఔన్యత్యాన్నికి ప్రతీకగా నిలిచాయి. ఆకట్టుకున్న ‘రావణబ్రహ్మ’ బ్రహ్మ వంశానికి చెందిన దశగ్రీవుడు అసురజాతిలో పుట్టి తపస్సు చేసి పరమేశ్వరున్ని మెప్పించి అఖండమైన వరుములు పొంది రావణబ్రహ్మగా గుర్తింపు పొందారు. అసురజాతిలో అత్యంత పరాక్రమవంతుడుగానే కాకుండా ఆధ్యాత్మిక సేవాతత్వం కలిగిన రాజుగా రావణబ్రహ్మ గణుతికెక్కాడు. నిత్యం శివలింగార్చన చేసి లంకను స్వాధీనం చేసుకొని అత్యంత అహంభావంతో మెలిగిన రావణుని చరితను ‘రావణబ్రహ్మ’ నాటకం కళ్లకు కట్టినట్లు చిత్రించింది. రాధాదేవి రచించిన ఈ నాటకంలో పల్లేటిలక్ష్మి కులశేఖర్ అత్యంత హృద్యమైన పద్యాలను రచించారు. జీఎల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆసక్తికరంగా ‘సత్యహరిశ్చంద్ర’ సూర్యవంశపు రాజైన హరిశ్చంద్రుడు క్రమశిక్షణాబద్ధమైన జీవన శైలికి ప్రతీకగా నిలిచాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, తన జీవిత కాలంలో ఎన్నడూ అబద్ధమాడి ఎరుగకపోవడం హరిశ్చంద్రుని ఉత్తమ గుణాలు. ఈ పాత్రలోని సత్యసంధతను హరిశ్చంద్ర నాటకం చక్కగా చాటి చెప్పింది. విశ్వామిత్రుడికి ఇచ్చిన మాట ప్రకారం సత్యహరిశ్చంద్రుడు కట్టుబట్టలతో అడవులకేగడం, కాటి కాపరిగా మారడం, కొడుకు శవాన్ని వల్లకాడులోకి అనుమతించడానికి సుంకం అడగడం నిష్టాగరిష్టమైన గుణాలను ఈ పాత్రలో దర్శకుడు చక్కగా చూపించాడు. వరంగల్ జిల్లా వేణుగోపాలస్వామి నాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన ఈ నాటకం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. శ్రీనివాసాచారి దర్శకత్వం వహించిన ఈ నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. హాస్య సన్నివేశాలతో ‘కృష్ణాంజనేయ యుద్ధం’ మహబూబ్‌నగర్ జిల్లా మైత్రీ కళా పరిషత్ కళాకారులు ప్రదర్శించిన కృష్ణాంజనేయ యుద్ధం నాటకం చక్కని హాస్యసన్నివేశాలతో అలరించింది. బలరాముడు, సత్యభామ, గరుత్మండుల గర్వభంగమే ఈ నాటి ప్రధాన సారాంశం. ఈ ముగ్గురి గర్వభంగం చేయడం కోసం శ్రీకృష్ణుడు ఆంజనేయున్ని పురమాయించడం, ఆంజనేయుడు, కృష్ణుడు మధ్యలో రసవత్తరమైన యుద్ధం జరగడం ఈ నాటకంలో ప్రధాన ఇతివృత్తంగా నిలిచింది. చక్కని వ్యవహార శైలిలో హాస్య సంభాషణలతో సాగిన ఈ నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాండ్ర సుబ్రమణ్యం రచించిన ఈ నాటకానికి జగన్నాథరావు దర్శకత్వం వహించారు. -
ఊహలకు రూపం.. నటనకు ప్రాణం
- సామాజిక సమస్యలకు దర్పణం పట్టిన నాటికలు - ఏడో రోజు అలరించిన నంది నాటకోత్సవాలు కర్నూలు(హాస్పిటల్): నందినాటకోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రదర్శించిన సాంఘిక నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదటి రెండు, మూడు రోజుల కంటే ఏడోరోజు ప్రేక్షకుల సంఖ్య బాగా పెరిగింది. స్త్రీల సమస్యలకు అద్దం పట్టే ‘విముక్త’, త్యాగానికి నిర్వచనం చెప్పే ‘నిష్క్రమణ’, సినిమాలు తీయాలని సర్వం పోగొట్టుకునే ఓ వ్యక్తి కథ ‘ఊహాజీవులు’, నిజాయితీకి విలువ జెప్పే రచ్చబండ నాటికలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. వీటితోపాటు శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ వారి ‘ఇంకెంత దూరం’, ఆర్ట్స్ ఫామ్ క్రియేషన్స్ వారి ‘ఓ కాశీ వాసి రావయ్యా.. సాంఘిక నాటికలు అలరించాయి. గుంటూరు శాస్త్రీయం వారి ‘రసరాజ్యం’ నాటిక గురువారానికి వాయిదా పడింది. స్త్రీల వేదనకు అద్దం పట్టే ‘విముక్త’ అనాటి రామాయణ కాలం నుంచి ఈనాటి ఆధునిక సమాజంలోని స్త్రీలు ఎన్నో అవమానాలకు, హింసలకు గురవుతున్నారు. వాటిని అధిగమించే స్త్రీల గురించి తెలుపుతుందీ నాటిక. ఇందులో పాత్రదారులు జ్యోత్స్న, నిర్మల, డాక్టర్ మస్తానమ్మ, డాక్టర్ రోజారమణి, సాయిలక్ష్మి, ధనలక్ష్మి నటించారు. శ్రీ వాసవీ డ్రెమటిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ నాటికను ప్రదర్శించారు. త్యాగానికి నిదర్శనం ‘నిష్క్రమణ’ కర్నూలులోని లలిత కళాసమితి వారి సమర్పణలో ‘నిష్క్రమణ’ సాంఘిక నాటకం కొనసాగింది.రోడ్డు ప్రమాదంలో తనను కాపాడి మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి అండగా నిలవడమే ఇందులోని ఇతివృత్తం. ఈ నాటికను పీవీ భవానీప్రసాద్ రచించగా, పత్తి ఓబులయ్య దర్శకత్వం వహించారు. పాత్రదారులు సూరపురాజు శ్రీనివాసరావు, బీఎస్ సింగ్, వన్నెం బలరామ్, ఎన్డి. క్రిష్టఫర్, మోహన్‌నాయక్, జి. రేణుక నటించారు. సినీమాయాలోకానికి నిదర్శనం ‘ఊహాజీవులు’ ఉయ్యూరుకు చెందిన కళావర్షిణి వారి ‘ఊహాజీవులు’ ప్రేక్షకులను ఆలోచింపజేసింది. సినిమా రంగంలో మోసాలు ఎలా జరుగుతాయనేది ఇందులోని ఇతి వృత్తం. ఈ నాటికను రత్నగిరి జగన్నాథం రచించగా, జెట్టి హరిబాబు దర్శకత్వం వహించారు. జీఎస్ చలపతి, ఆర్. శివకుమార్, ఆర్పీ కార్తీక్, ఎన్.స్వాములు, జె. హరిబాబులు నటించారు. నిజాయితీ విలువ చెప్పే ‘రచ్చబండ’ బాగా బతికిన ఊళ్లోనే బర్రెలు కాసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలాంగుంటదనే ఇతివృత్తంతో ప్రదర్శించిన నాటకమే ‘రచ్చబండ’. బాగా తెలిసిన మనుషులతోనే బర్లమల్లయ్య అని ఆయన పిలిపించుకోవాల్సి వచ్చింది. కుటుంబభారంతో ఆర్థికంగా చితికిన మనిషి గ్రామీణ రాజకీయ చట్రంలో చేయని నేరానికి తీర్పును ఆశ్రయించాడు. అన్యాయంగా న్యాయాన్ని కొనుక్కోవాలని తెలిసిన క్షణం అతని నిజాయితీ కట్టలు తెంచుకుని కన్నీరైంది. అతన్ని తీర్పుకు దగ్గర చేసిందా..?, అతన్ని న్యాయానికి చేరువ చేసిందా..?, బర్లమల్లయ్య తిరిగి పిల్లల మర్రి పెద్ద మల్లయ్య అయ్యాడా..? అనే వృత్తాంతంతో ఆద్యంతం హృద్యంగా ప్రదర్శించారు. గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్ వారి ‘రచ్చబండ’ సాంఘిక నాటకాన్ని రావుల పుల్లాచారి రచించగా, వెంకటగోవాడ దర్శకత్వం వహించారు. నేటి నాటికలు ఉదయం 9.30 గంటలకు నంద్యాల కళారాధన వారి సైకత శిల్పం, ఉదయం 11 గంటలకు ప్రొద్దుటూరు కళాభారతి వారి ఒయాసిస్, సిరిమువ్వ కల్చలర్ అసోసియేషన్స్ వారి రేలపూలు, మధ్యాహ్నం 3.30 గంటలకు ఉయ్యూరు కళావర్షిణి వారి తర్జని, సాయంత్రం 6 గంటలకు గుంటూరు శాస్త్రీయం వారి రసరాజ్యం, రాత్రి 8.30 గంటలకు అక్కల ఆర్ట్స్ అసోసియేషన్ వాకరి పుట్టలోని చెదలు నాటికలు ప్రదర్శిస్తారు. -
స్ఫూర్తి స్వరాలు..చైతన్య గీతికలు
- అలరించిన నందినాటకోత్సవాలు - నటనకు జీవం పోసిన బాలలు - సామాజిక రుగ్మతలను రూపుమాపే ఇతివృత్తాలు కర్నూలు(హాస్పిటల్): ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో స్థానిక సి.క్యాంపులోని టిజివి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలు సోమవారానికి ఆరోరోజుకు చేరుకున్నాయి. ఆదివారం లాగే సోమవారం సైతం బాలల నాటికలే ప్రదర్శించారు. పవిత్ర భారత దేశాన్ని కులమత, వర్గ, వర్ణ విభేదాల నుంచి ఎలా రక్షించుకోవాలని చెప్పే ‘పవిత్ర భారతదేశం’. భావి భారత నిర్మాతలు ఉపాధ్యాయులే అని చెప్పే ‘సత్యస్వరాలు’. చిన్ననాటి స్నేహాన్ని ఎంత ఎత్తుకు ఎదిగినా మరిచిపోకుండా ఉండే ‘స్ఫూర్తి’ నాటిక, ఓ చిన్న నాటకం ద్వారా చెడు అలవాట్లకు బానిసైన తండ్రిని సన్మార్గంలో పెట్టే కుమారుని కథ ‘స్వయంకృతం’ ప్రేక్షకులను అలరించాయి. సామాజిక అంశాల ఇతివృత్తాలతో రచించిన ఈ నాటికలు అటు పిల్లలనే కాదు పెద్దలనూ ఆలోచింపజేస్తున్నాయి. పవిత్ర భారతదేశాన్ని రక్షించుకుందాం ఎందరో అమరవీరుల త్యాగఫలమే ఈ దేశం. అయితే కొందురు స్వార్థం కోసం, వారి అవసరాల కోసం ఈ దేశాన్ని అపవిత్రం చేస్తున్నారు. ఇందులో కొన్ని కోట్ల ప్రజలు బలైపోతున్నారు. ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ సమానమే అనేదే ‘పవిత్ర భారత దేశం’ నాటిక ఇతివృత్తం. ఈ నాటికకు రచన, దర్శకత్వం సుంకరి శరత్(సిద్ధిపేట), నిర్వహణ శ్రీమాలి ఎడ్యుకేషనల్ సొసైటీ(సిద్ధిపేట). సంగీతం వర్మ, మేకప్, కాస్ట్యూమ్స్ డి. ప్రశాంతి. పాత్రల్లో కీర్తి, శ్రావ్య, సనా, లాస్య, భార్గవి, నవ్య హృద్యంగా నటించారు. భావిభారత నిర్మాతలు ఉపాధ్యాయులే.. కుల, మత, ప్రాంతీయ, వర్గ విషబీజాలను బాల్యంలోనే తొలగించాలనది ‘సత్యస్వరాలు’ నాటిక ఇతివృత్తం. మనుషులంతా ఒక్కటేనన్న సత్యభావనను పాఠశాల స్థాయిలోనే బాలలకు కలిగించాలని..ఇందుకు ఉపాధ్యాయులు నడుంబిగించాలనేది ఇందలో సందేశం. వైఎస్ఆర్ కడప జిల్లా నందలూరు మండలంలోని స్వర్ణాంధ్ర కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ బాలల సాంఘిక నాటికను ప్రదర్శించారు. రచయిత భారతుల రామకృష్ణ , దర్శకత్వం హస్తవరం ఆనందకుమార్, సంగీతం పీడీ ప్రసాద్, పాత్రదారులుగా ఎస్. విష్ణుదుర్గారెడ్డి, ఎం. శివనారాయణ, కె. కమలనాథ్యాదవ్, ఆర్. ధర్మేంద్రసింగ్, ఎస్. హాసిఫ్అల్లి, జి. దినేష్, సీఎస్.శశిధర్ తదితరులు నటించారు. నాటకం వేపగుంట సాంరాజ్ పర్యవేక్షణలో జరిగింది. రెండు కుటుంబాల కథ ‘స్ఫూర్తి’ ఇది రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. ఒక కుటుంబం పేదది. తండ్రి ప్రమాదంలో మరణిస్తే తల్లి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి కుమారున్ని ఉన్నతంగా చదివించి కలెక్టర్‌ను చేస్తుంది. ఇక రెండో కుటుంబం జమీందారి కుటుంబం. తండ్రి డబ్బు అహంకారంతో పేదపిల్లలతో స్నేహానికి కూడా తన కుమారున్ని ఒప్పుకోని మనస్తత్వం కలవాడు. ఆయన భార్య మహాస్వాధ్వి. వీరి కుమారుడు బాగా చదువుకుంటాడు కానీ డబ్బు వల్ల దురలవాట్లకు లోనై చివరకు మెకానిక్‌గా జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు. తాను చదువుకున్న పాఠశాల ఉండే జిల్లాకే సోము కలెక్టర్‌గా వస్తాడు. అక్కడి ఉపాధ్యాయులే ఆయనను సన్మానిస్తారు. అక్కడే మెకానిక్ జీవితాన్ని అనుభవిస్తున్న తన చిన్ననాటి మిత్రుడు రవికి(జమీందారి కుమారుడు) తన చెల్లినిచ్చి వివాహం చేస్తాడు కలెక్టర్. స్నేహానికి చక్కని నిర్వచనాన్ని ఇచ్చే ఈ ‘స్ఫూర్తి’ నాటికను పాలేం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించారు. రచన డి. పార్వతమ్మ, దర్శకత్వం బి.బ్రహ్మచారి, పర్యవేక్షణ గాడి సురేందర్, కూర్పు పల్లెగోపాల్, పాత్రదారులుగా రాజేశ్వరి, దక్షిత, కళ్యాణి, మహేశ్వరి, మణికుమార్, అరుణజ్యోతి, విజయ్, స్వప్న, బాలీశ్వరి, శివకుమార్ తదితరులు బాగా నటించారు. తండ్రిని సన్మార్గంలో పెట్టే కొడుకు కథ ‘స్వయంకృతం’ నేటి బాలలే రేపటి పౌరులు అనేది దేశానికే కాదు ప్రపంచానికే అవసరమైన నినాదం. నిజానికి మంచిపౌరులుగా బాలలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులపైనా ఉంది. ఒక కుటుంబాన్ని తీసుకుని తల్లిదండ్రులు బాధ్యత కోల్పోయి సోమరులుగా ఉంటే పిల్లలు ఏ విధంగా చెడిపోతారో తండ్రి పాత్రలో నటించిన పరశురాం ఒదిగిపోయారు. సోమరిగా, తాగుబోతుగా ఉన్న తండ్రిని ఓ చిన్న నాటకం ద్వారా కుమారుడు మేల్కొలిపే సన్నిశేశం ఆలోచింపజేస్తుంది. తద్వారా తండ్రి తన తప్పు తెలుసుకోవడమే గాక సమాజంలోని తల్లిదండ్రులకు మేలుకొలుపుగా సందేశాన్ని ఇచ్చారు మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలులోని జ్ఞాన వికాస భారతి వారి స్వయంకృతం బాలల నాటికలో. రచన బి.సోమయ్య, దర్శకత్వం జి. బ్రహ్మాచారి, సంగీత సహకారం ప్రసాదాచారి, ఆర్గనైజర్ ఎం. జంగయ్య. పాత్రదారులుగా దేవి, నూతనసాయి, ఇక్ష్వాక్, మణి, విజయ్, బాలీశ్వరి నటించారు. నేటి ప్రదర్శనలు.. ఉదయం 9 గంటలకు ఈటెల నాటక రంగ కళాకారుల సమాఖ్య వారి ‘కొత్తబానిసలు’, ఉదయం 10.30 గంటలకు అమెచ్యూర్ ఆర్ట్స్ వారి ‘మార్గదర్శి’. మధ్యాహ్నం 12 గంటలకు మహతి క్రియేషన్స్ వారి ‘నియతి, మధ్యాహ్నం 2 గంటలకు మహతి క్రియేషన్స్ వారి ‘మిస్టరీ’, సాయంత్రం 4.30 గంటలకు సత్కళాభారతి వారి ‘నాయకురాలు నాగమ్మ(సాంఘిక నాటకం), రాత్రి 7 గంటలకు కళారాధన (నంద్యాల) వారి ‘సైకత శిల్పం’ నాటికలు ప్రదర్శిస్తారని ఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. -
ప్రేమను చాటిచెప్పిన ‘అపురూపం’
-
రూపాంతరం..అపురూపం
నందినాటకోత్సవాల్లో నాల్గో రోజు రెండు నాటికల ప్రదర్శన కర్నూలు(కల్చరల్): నంది నాటకోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు శనివారం.. స్థానిక టీజీవి కళాక్షేత్రంలో బాల కళాకారులు ప్రదర్శించిన నాటికలు పసి మనసులను హృద్యంగా ఆవిష్కరించాయి. నంద్యాల కళారాధన, గురు రాజా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన ‘అపురూపం’ నాటిక పసి మనసుల్లో సహజసిద్ధమైన ప్రేమను చాటిచెప్పింది. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పిల్లల మనసుల్లో దాగివుండే ప్రేమానురాగాలకు ఈ నాటిక అద్దం పట్టింది. అనాథలైన పిల్లలు ఒకచోట చేరి జీవిస్తుండగా శ్రీను అనే బాలుడికి తీవ్రమైన అనారోగ్యం కల్గుతుంది. అనారోగ్య కారణాలు కూడా తెలుసుకోలేని పసివయస్సులో ఉన్న పిల్లలు ఆ బాలుడికి అత్యంత ఇష్టమైన బొమ్మలను తీసుకువచ్చి అతడిని అనునిత్యం ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నాన్ని గమనించిన పెద్దలు సైతం ఆ బాలుడికి సహాయపడేందుకు ముందుకు వస్తారు. పరులకు సహాయం చేయాలనే అపురూపమైన భావనకు ప్రేరణ కల్గించిన బాలలు పెద్దలకు ఆదర్శంగా నిలువడమే ఈ నాటికలోని ఇతివృత్తం. ఆకెళ్ల శివప్రసాద్ రచించిన ఈ నాటికకు డాక్టర్ జి.రవికృష్ణ దర్శకత్వం వహించారు. ఎస్.ఆర్.ఎస్.ప్రసాద్ పర్యవేక్షణలో ఈ నాటికను ప్రదర్శించారు. నేటితరం స్థితిగతులను చాటిచెప్పిన ‘రూపాంతరం’... స్వర్ణాంధ్ర కల్చరల్ అసోసియేషన్ నందలూరు (వైఎస్సార్ జిల్లా) నాటక సమాజం కళాకారులు ప్రదర్శించిన ‘రూపాంతరం’ నాటిక ప్రస్తుత తరం యువతీయువకుల స్థితిగతులను చాటిచెప్పింది. గర్భంలో శిశువు ఉన్నప్పటినుంచి తల్లి ఎన్నో ఆశలను పెంచుకుంటుంది. తన బిడ్డ ప్రయోజకుడై కీర్తిప్రతిష్టలు సంపాదించిపెడతాడని కలలు కంటుంది. కానీ పుట్టిన బిడ్డ యవ్వన వయస్సులో క్రికెట్ బెట్టింగులు, అమ్మాయిల టీజింగ్‌లు, ఇంటర్నెట్ వ్యామోహంలో పడి అప్రయోజకుడిగా మారి శిక్షార్హుడిగా తయారైతే ఆ తల్లి పడే క్షోభ ఎలా ఉంటుందో నాటిక దృశ్యరూపంలో చూపించింది. దారి తప్పిన పిల్లలు మళ్లీ రూపాంతరం చెంది ఉత్తమ పౌరులుగా ఎదగాలనే సందేశాన్ని ఈ నాటిక అందించింది. చిలువూరు నాగేశ్వరరావు రచించిన ఈ నాటికకు హెచ్.ఆనందకుమార్ దర్శకత్వం వహించారు. వేపగుంట సామ్రాట్ పర్యవేక్షణలో ఈ నాటికను ప్రదర్శించారు. నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి నాటికల ప్రదర్శనలు... నంది నాటకోత్సవాల్లో భాగంగా ఐదో రోజున ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు బాలల నాటికల ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు బంగారుకొండ అనే నాటిక, 3 గంటలకు ‘పసిమొగ్గలు’ అనే నాటికను, 6:30 గంటలకు ‘వృక్షోరక్షతి రక్షితః’ అనే నాటికను ప్రదర్శిస్తారు. శనివారం జరిగిన నాటిక ప్రదర్శనలో నంది నాటకోత్సవాల కన్వీనర్ కర్నూలు ఆర్డీఓ రఘుబాబు, ఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాస్, లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు. -
గెటవుట్ ఫ్రం మైరూం
- టీజీవీ క్షేత్రం నిర్వాహకులను దూషించిన కలెక్టర్ – సునయనకు మార్చాలని ప్రయత్నం - ఎఫ్డీసీ జోక్యంతో మళ్లీ టీజీవీ కళాక్షేత్రమే ఖరారు కర్నూలు(అగ్రికల్చర్): నంది నాటకోత్సవ వేదికగా టీజీవీ కళాక్షేత్రాన్ని ముందే నిర్ణయించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీవీ కళా క్షేత్రం నిర్వాహకులను దూషించారు. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఫిలిండెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి కర్నూలులో టీజీవీ కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే నందినాటకోత్సవాల కన్వీనర్ ఆర్డీవో రఘుబాబు, టీజీవీ కళాక్షేత్ర నిర్వాహకులు నందినాటకోత్సవాల ఆహ్వాన పత్రిక గురించి చర్చించేందుకు కలెక్టర్‌ను కలిశారు. టీజీవీ కళాక్షేత్రంలో ఎందుకు నిర్వహిస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించగా.. టీజీవీ కళాక్షేత్రం నిర్వాహకులు 2నెలల క్రితమే ఎఫ్డీసీ అధికారులు సునయన, టీజీవీ కళాక్షేత్రాలను పరిశీలించి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నాటక ప్రదర్శనలకు, కళాకారుల మేకప్ రూములకు టీజీవీ కళాక్షేత్రం అనుకూలంగా ఉందని నిర్ణయించారని చెప్పారు. కలెక్టర్ ఆగ్రహంతో టీజీవీ కళాక్షేత్రం నిర్వాహకునితో హూ ఆర్యూ..! గెటవుట్ ఫ్రం మైరూం అంటూ దూషించారు. ఆర్డీఓ రఘుబాబును సునయనలోనే నాటకోత్సవాలు ఏర్పాటు చేయమని ఆదేశించారు. విషయం తెలుసుకున్న ఎన్ఎఫ్డీసీ అధికారులు మళ్లీ కర్నూలుకు వచ్చి సునయన టీజీవీ కళాక్షేత్రం సౌకర్యాలను పరిశీలించారు. కళాకారుల గ్రీన్‌రూమ్ సౌకర్యాలు తదితర ఏర్పాట్ల కోసం సునయనను ఇప్పుడున్న కాలపరిమితిలో తీర్చిదిద్దడం కష్టతరమని, కలెక్టర్ ఈ వేదికపై పట్టుపడితే నందినాటకోత్సవాలను వేరే జిల్లాకు మార్చాల్సి వస్తుందని స్పష్టం చేశారు. దీంతో తిరిగి కలెక్టర్ టీజీవీ కళాక్షేత్రంలోనే నందినాటకోత్సవాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 18 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరగనున్న నంది నాటక పోటీల కోసం టీజీవీ కళాక్షేత్రం ముస్తాబవుతోంది.