ఊహలకు రూపం.. నటనకు ప్రాణం
ఊహలకు రూపం.. నటనకు ప్రాణం
Published Wed, Jan 25 2017 11:01 PM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM
- సామాజిక సమస్యలకు దర్పణం పట్టిన నాటికలు
- ఏడో రోజు అలరించిన నంది నాటకోత్సవాలు
కర్నూలు(హాస్పిటల్): నందినాటకోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రదర్శించిన సాంఘిక నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదటి రెండు, మూడు రోజుల కంటే ఏడోరోజు ప్రేక్షకుల సంఖ్య బాగా పెరిగింది. స్త్రీల సమస్యలకు అద్దం పట్టే ‘విముక్త’, త్యాగానికి నిర్వచనం చెప్పే ‘నిష్క్రమణ’, సినిమాలు తీయాలని సర్వం పోగొట్టుకునే ఓ వ్యక్తి కథ ‘ఊహాజీవులు’, నిజాయితీకి విలువ జెప్పే రచ్చబండ నాటికలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. వీటితోపాటు శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ వారి ‘ఇంకెంత దూరం’, ఆర్ట్స్ ఫామ్ క్రియేషన్స్ వారి ‘ఓ కాశీ వాసి రావయ్యా.. సాంఘిక నాటికలు అలరించాయి. గుంటూరు శాస్త్రీయం వారి ‘రసరాజ్యం’ నాటిక గురువారానికి వాయిదా పడింది.
స్త్రీల వేదనకు అద్దం పట్టే ‘విముక్త’
అనాటి రామాయణ కాలం నుంచి ఈనాటి ఆధునిక సమాజంలోని స్త్రీలు ఎన్నో అవమానాలకు, హింసలకు గురవుతున్నారు. వాటిని అధిగమించే స్త్రీల గురించి తెలుపుతుందీ నాటిక. ఇందులో పాత్రదారులు జ్యోత్స్న, నిర్మల, డాక్టర్ మస్తానమ్మ, డాక్టర్ రోజారమణి, సాయిలక్ష్మి, ధనలక్ష్మి నటించారు. శ్రీ వాసవీ డ్రెమటిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ నాటికను ప్రదర్శించారు.
త్యాగానికి నిదర్శనం ‘నిష్క్రమణ’
కర్నూలులోని లలిత కళాసమితి వారి సమర్పణలో ‘నిష్క్రమణ’ సాంఘిక నాటకం కొనసాగింది.రోడ్డు ప్రమాదంలో తనను కాపాడి మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి అండగా నిలవడమే ఇందులోని ఇతివృత్తం. ఈ నాటికను పీవీ భవానీప్రసాద్ రచించగా, పత్తి ఓబులయ్య దర్శకత్వం వహించారు. పాత్రదారులు సూరపురాజు శ్రీనివాసరావు, బీఎస్ సింగ్, వన్నెం బలరామ్, ఎన్‌డి. క్రిష్టఫర్, మోహన్‌నాయక్, జి. రేణుక నటించారు.
సినీమాయాలోకానికి నిదర్శనం ‘ఊహాజీవులు’
ఉయ్యూరుకు చెందిన కళావర్షిణి వారి ‘ఊహాజీవులు’ ప్రేక్షకులను ఆలోచింపజేసింది. సినిమా రంగంలో మోసాలు ఎలా జరుగుతాయనేది ఇందులోని ఇతి వృత్తం. ఈ నాటికను రత్నగిరి జగన్నాథం రచించగా, జెట్టి హరిబాబు దర్శకత్వం వహించారు. జీఎస్ చలపతి, ఆర్. శివకుమార్, ఆర్‌పీ కార్తీక్, ఎన్.స్వాములు, జె. హరిబాబులు నటించారు.
నిజాయితీ విలువ చెప్పే ‘రచ్చబండ’
బాగా బతికిన ఊళ్లోనే బర్రెలు కాసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలాంగుంటదనే ఇతివృత్తంతో ప్రదర్శించిన నాటకమే ‘రచ్చబండ’. బాగా తెలిసిన మనుషులతోనే బర్లమల్లయ్య అని ఆయన పిలిపించుకోవాల్సి వచ్చింది. కుటుంబభారంతో ఆర్థికంగా చితికిన మనిషి గ్రామీణ రాజకీయ చట్రంలో చేయని నేరానికి తీర్పును ఆశ్రయించాడు. అన్యాయంగా న్యాయాన్ని కొనుక్కోవాలని తెలిసిన క్షణం అతని నిజాయితీ కట్టలు తెంచుకుని కన్నీరైంది. అతన్ని తీర్పుకు దగ్గర చేసిందా..?, అతన్ని న్యాయానికి చేరువ చేసిందా..?, బర్లమల్లయ్య తిరిగి పిల్లల మర్రి పెద్ద మల్లయ్య అయ్యాడా..? అనే వృత్తాంతంతో ఆద్యంతం హృద్యంగా ప్రదర్శించారు. గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్ వారి ‘రచ్చబండ’ సాంఘిక నాటకాన్ని రావుల పుల్లాచారి రచించగా, వెంకటగోవాడ దర్శకత్వం వహించారు.
నేటి నాటికలు
ఉదయం 9.30 గంటలకు నంద్యాల కళారాధన వారి సైకత శిల్పం, ఉదయం 11 గంటలకు ప్రొద్దుటూరు కళాభారతి వారి ఒయాసిస్, సిరిమువ్వ కల్చలర్ అసోసియేషన్స్ వారి రేలపూలు, మధ్యాహ్నం 3.30 గంటలకు ఉయ్యూరు కళావర్షిణి వారి తర్జని, సాయంత్రం 6 గంటలకు గుంటూరు శాస్త్రీయం వారి రసరాజ్యం, రాత్రి 8.30 గంటలకు అక్కల ఆర్ట్స్ అసోసియేషన్ వాకరి పుట్టలోని చెదలు నాటికలు ప్రదర్శిస్తారు.
Advertisement