
ఎవరు సృష్టించిన పాత్ర వారికి నచ్చడం గురించి కాదు... కఠినమైన నిష్కర్షయిన విమర్శకుడిగా మారి చూసిన రచయితకు ముచ్చట గొలిపిన పాత్ర మధురవాణి. కన్యాశుల్కం కథానాయిక, నాయకుడు కూడా మధురవాణే. వేశ్యాకులంలో పుట్టింది. సంగీత, సాహిత్యాలలో సుశిక్షితురాలు. మంచివారి ఎడల మంచిగానూ చెడ్డవారి ఎడల చెడ్డగానూ ప్రవర్తించమన్న తల్లి మాటల విలువ తెలుసుకున్నది. అయితే చాలాసార్లు ముఖ్యంగా తోటి స్త్రీలకు సహాయపడే సందర్భాలలో ఆమె తన పట్ల చెడ్డగా ఉన్నవారి పట్ల కూడా మంచిగనే ఉంది. మానవ సంబంధాలలో ఎంత సున్నితంగా, ఆత్మగౌరవంతో ఉండవచ్చో మధురవాణి నుంచి మనం నేర్చుకోవచ్చు. మనస్తత్వం, చతురత, హాస్య ప్రియత్వం, కార్యసాధనా సామర్థ్యం, కత్తుల వంటి విమర్శలను పువ్వుల వలే విసరగల దక్షత, ఎదుటివారు తనను అవమానిస్తున్నారని తోస్తే గొంతు నులమకుండానే వారికి ఊపిరాడనీయకుండా చేయగల నేర్పు, తనను తాను కాచుకోగల ఒడుపు. ఇంత అందంగా గొప్పగా మధురవాణిని ఎలా రూపుదిద్దగలిగాడో గురజాడ!
స్నేహం, ప్రేమలకు మాటలాడటం నేర్పి మన తెలుగు వారికి మంచిచెడ్డలు తెలియచెప్పేందుకు సృష్టించిన పాత్ర మధురవాణి. భారతీయ సాహిత్యంలో కూడా మధురవాణికి సాటి వచ్చే పాత్రలు ఒకటి రెండు కంటే ఉండవు. కన్యాశుల్కం ఆచారానికి బానిసవబోతున్న సుబ్బిని బలైపోతున్న బుచ్చమ్మను మధురవాణి రక్షించడమే కన్యాశుల్కం నాటక సారాంశం. అణిచివేతకు గురైన స్త్రీలు ఒకరికొకరు తోడైతే విముక్తి చెందగలరనే ఆశను కల్పించింది మధురవాణి. తనకు పేర్లు కూడా తెలియని ఎన్నడూ చూడని సుబ్బికి, వెంకమ్మకి, బుచ్చమ్మకి, మీనాక్షికి సహాయం చేయాలనే ఆలోచన ఆమెలోని మానవత్వానికి నిదర్శనం. అనివార్యంగా తనలో కలిగిన ఆలోచనలకు ఆచరణాత్మక రూపమే మధురవాణి. నీతి కలిగిన మనిషి. దయగలిగిన మనిషి. ఆమె దయకు పాత్రం కాని మనిషి కన్యాశుల్కంలో ఎవరున్నారు?
మధురవాణి కాకుండా మరోపాత్ర పేరు చెప్పమంటే క్షణం ఆలోచించకుండా నేను చెప్పే మరో స్త్రీ పాత్ర ‘శాంతం’. ఉప్పల లక్ష్మణరావు గారి ‘అతడు ఆమె’ నవలలో కథానాయిక. ఇక కొడవటిగంటి కుటుంబరావు ‘కస్తూరి’, ‘స్వరాజ్యం’ చలం నవలా నాయికలు ... ఇలా ఎన్ని పేర్లయినా ఉంటాయి. కాని మధురవాణి మధురవాణే.
Comments
Please login to add a commentAdd a comment