olga
-
పారిస్ పవనాలు
తెలుగువాళ్లు ఉగాది జరుపుకోవడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు ప్రపంచ సాహిత్యానికి ‘వసంతం’ వచ్చింది. సాహిత్య రంగంలో అత్యంత విశిష్టమైన మ్యాగజైన్ గా పేరున్న ‘ద పారిస్ రివ్యూ’ తన 70వ వార్షికోత్సవ ‘స్ప్రింగ్’ సంచికను ఈ వారంలోనే విడుదల చేసింది. అన్ని సంచికలనూ క్రమసంఖ్యతో వెలువరించే సంప్రదాయం ఉన్నందున పత్రిక పరంపరలో ఇది 243వ ఇష్యూ. 2018లో మ్యాన్ బుకర్ గెలుచుకుని, అదే ఏడాది నోబెల్ పురస్కారం పొందిన పోలండ్ రచయిత్రి ఓల్గా తొకార్చుక్ ఇంటర్వ్యూ ఈ సంచిక విశేషాల్లో ఒకటి. కవిత్వం, వచనం, కళలకు అత్యంత ప్రాధాన్యముండే ఈ పత్రికలో రచయితల అంతరంగాలను లోలోతుల నుంచి అత్యంత సూక్ష్మంగా, విశదంగా స్పృశించడం మొదటినుంచీ ఒక ప్రత్యేకతగా నిలిచిపోయింది. నేపథ్యం, రాసే విధానం, విచారధారతో పాటు సాహిత్య సృజనను ప్రయోగ శాలలో పరిశీలించినంత లోతుగా జరిపే కాలాతీత సంభాషణలు ఇవి. ‘ఒక రాత్రి ఓ స్నేహితుడు నాకు ఫ్రాంజ్ కాఫ్కా కథల పుస్తకం అరువిచ్చాడు. నేనుంటున్న లాడ్జికి తిరిగివెళ్లి ‘ద మెటమార్ఫసిస్’ చదవడం మొదలుపెట్టాను. ఆ మొదటివాక్యమే నన్ను దాదాపు మంచంలోంచి కిందపడేసినంత పని చేసింది. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ మొదటి వాక్యం ఇలా ఉంది: ‘‘ఒక ఉదయం కలత నిదురతో మేల్కొన్న గ్రెగర్ జాంజా, మంచంలో తానొక పెద్ద పురుగుగా మారిపోయి ఉండటం గుర్తించాడు...’’ ఆ వాక్యం చదవగానే, ఎవరైనా ఇలాంటి విషయాలు కూడా రాయవచ్చని నాకు ఇంతకుముందు తెలీదే అని నాకు అనిపించింది. తెలిసివుంటే, నేను ఎప్పుడో రాయడం మొదలుపెట్టేవాడిని. వెంటనే నేను కథలు రాయడం మొదలుపెట్టాను’ అని తన సాహిత్య ప్రస్థానం గురించి చెబుతారు గాబ్రియేల్ గార్సియా మార్వె్కజ్. ‘ఫిక్షన్ నా జర్నలిజానికి సాహిత్య విలువను ఇచ్చింది. జర్నలిజం నా ఫిక్షన్ ను వాస్తవానికి దగ్గరగా ఉండేట్టు చేసింది’ అంటారు ఈ పాత్రికేయ రచయిత. ‘నేను ఏ భాషలోనూ ఆలోచించను. నేను దృశ్యాల్లో ఆలోచిస్తాను. అసలు ఎవరికైనా ఆలోచించేటప్పుడు భాషతో పని ఉంటుందనుకోను’ అని చెబుతారు తన మాతృభాష రష్యన్ కు దూరమైన వ్లాదిమీర్ నబకోవ్. ‘అచ్చులోకొచ్చిన నా ప్రతీ పదమూ అనేకమార్లు తిరగరాయబడిందే. నా ఎరేజర్లతో పోలిస్తే నా పెన్సిళ్ల జీవితకాలమే ఎక్కువ’ అంటారు ఈ పర్ఫెక్షనిస్టు. ‘నేను ఎవరికీ ప్రాతినిధ్యం వహించటం లేదు’ అని నిర్మొహమాటంగా చెప్పే భారత మూలాలున్న ట్రినిడాడ్–బ్రిటిష్ రచయిత వి.ఎస్.నైపాల్, ‘మనిషి అనునిత్యం నైతిక తీర్పుల బరువు మోయనక్కర్లేని ప్రపంచాన్ని కోరుకున్నాను’ అంటారు. ఎర్నెస్ట్ హెమింగ్వే, జేమ్స్ థర్బర్, రే బ్రాడ్బరీ, స్టీఫెన్ కింగ్, రేమండ్ కార్వర్, మాయా ఏంజెలో, లిడియా డేవిస్ లాంటి వందలాది మేటి రచయితల ఇంటర్వ్యూలను ‘ది ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్ ’ విభాగంలో ప్రచురించింది పారిస్ రివ్యూ. జార్జ్ లూయీ బోర్హెస్, హారుకీ మురకామి, మిలన్ కుందేరా, సైమన్ దె బువా, ఒర్హాన్ పాముక్, సల్మాన్ రష్దీ, చినువా అచేబే లాంటి భిన్న మూలాలున్న రచయితలు ఇందులో ఉన్నారు. ‘ది ఆర్ట్ ఆఫ్ పొయెట్రీ’గా రాబర్ట్ ఫ్రాస్ట్, టీఎస్ ఎలియట్, అక్తావియో పాజ్, పాబ్లో నెరూడా, ఎజ్రా పౌండ్ లాంటి కవుల సంభాషణలను నమోదు చేసింది. ఇవన్నీ ‘ద రైటర్స్ ఎట్ వర్క్’ పుస్తకాల సిరీస్‌గా వచ్చాయి. ప్రపంచ చరిత్రలో పట్టువిడవకుండా ఒంటిచేత్తో నెరిపిన సాంస్కృతిక సంభాషణగా దీన్ని అభివర్ణించారు సాహిత్య విమర్శకుడు జో డేవిడ్ బెలామీ. ఈ త్రైమాసిక ఆంగ్లభాష పత్రిక ఫ్రాన్ ్స రాజధాని నగరం పారిస్‌లో 1953లో ప్రారంభమైంది. 1973లో అమెరికాలోని న్యూయార్క్ నగరానికి తన కార్యస్థానాన్ని మార్చుకుంది. పత్రికను స్థాపించిన నాటి నుంచీ 2003లో మరణించేదాకా– యాభై ఏళ్లపాటు అమెరికా రచయిత జార్జ్ ప్లింప్టన్ దీనికి ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన ముద్ర ఎంతటిదంటే, ఈయన తర్వాత ఆ స్థానంలోకి వచ్చిన బ్రిజిడ్ హ్యూస్... ప్లింప్టన్ గౌరవార్థం ‘సంపాదకురాలు’ అనిపించుకోవడానికి నిరాకరించారు. ప్రస్తుతం ఎమిలీ స్టోక్స్ సంపాదకురాలిగా ఉన్నారు. పత్రిక చరిత్రలో ఈమె ఆరో ఎడిటర్. ఫిలిప్ రాత్, ఇటాలో కాల్వీనో, శామ్యూల్ బెకెట్, డేవిడ్ ఫాస్టర్ వాలెస్ లాంటి మహామహుల రచనలు పారిస్ రివ్యూలో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం 24,000 ప్రింట్ కాపీల సర్క్యులేషన్, నెలకు సుమారు 12 లక్షల ఆన్ లైన్ వ్యూస్ ఇది కలిగివుంది. ఈ ఏడు దశాబ్దాల్లో ఎన్నో సాహిత్య పత్రికలు మూతపడ్డాయి. ‘ఎన్ని పోయినా మనకు ‘పారిస్’ మాత్రం ఉంటుంది’ అంటారు రచయిత వుహాన్ విడాల్. ‘పారిస్ రివ్యూ చచ్చేంత బోర్ కొడుతోందని ఎప్పటికీ అనలేం’ అంటారు పబ్లిషర్ జెస్సా క్రిస్పిన్ . ఉత్తమ సాహిత్యానికి పెద్దపీట వేయడంతో పాటు, ఆర్కైవు మొత్తాన్నీ అందుబాటులో ఉంచడం, అందులోని క్లాసిక్స్‌ను నవతరపు రచయితల వ్యాఖ్యానంతో పునఃప్రచురించడం లాంటివి కొత్త పాఠకులను పాత సాహిత్యంతో పరిచయం చేసుకునేలా ఉపకరిస్తున్నాయి. 2012 నుంచీ మొబైల్ యాప్ ప్రారంభించింది. 2017లో పాడ్‌కాస్ట్ మొదలుపెట్టింది. సమకాలీన రచయితల రచనలను తమ గొంతుల్లోనే వినిపించడం కూడా మొదలుపెట్టింది. ఎలా రాయాలో శిక్షణ ఇచ్చే రోక్సానే గే తన ‘మాస్టర్ క్లాస్’లో వర్తమాన రచయితలకు ఇచ్చే ఒక ముఖ్యమైన సలహా: పారిస్ రివ్యూ ఇంటర్వ్యూలను లోతుగా చదవడం! సాహిత్యం రెండో ఆలోచనగా మాత్రమే ఉండే ప్రపంచంలో దాన్ని ఉత్సాహభరితం చేస్తూ, ప్రధాన స్రవంతికి తేగలిగింది ‘ద పారిస్ రివ్యూ’! -
Vishwa Mahila Navala: తొలి నవలా రచయిత్రులకు పూమాల
మహిళా సృజనకారుల గురించీ, వారి జీవించిన సమాజం గురించీ, వారి రచనా స్వేచ్ఛ గురించి పరిశోధించి పాఠకుల చేతిలో పండు వలిచి పెట్టినట్లు రాయడంలో ఎంత శ్రమ, శ్రద్ధ, ఆసక్తీ అవసరమో కదా. అటువంటి ఆసక్తీ, శ్రమా శ్రద్ధల సమ్మేళనమే మృణాళిని ‘విశ్వమహిళా నవల’. ఇందులో జాపనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లిష్, రష్యన్ భాషలలో తొలి నవలా రచయిత్రుల పరిచయం, వారి జీవించిన కాలంలో స్త్రీలకుండే పరిమితులూ, రచయిత్రుల జీవన శైలీ, రచనా శైలీ, వస్తువూ అన్నిటినీ విస్తృతంగా చర్చించారు మృణాళిని. ప్రపంచ సాహిత్యంలోనే మొదటి నవల రాసిన జాపనీస్ రచయిత్రి లేడీ మూరసాకీ (978–1014) నుంచి ఫ్రెంచ్ రచయిత్రి జార్జ్ సాండ్ (1804 –1876) వరకూ పదముగ్గురు రచయిత్రుల పరిచయం స్త్రీల సాహిత్య చరిత్రను మనముందు ఉంచుతుంది. లేడీ మూరసాకి వ్రాసిన ‘ది టేల్ ఆఫ్ గెన్జి’ ప్రపంచ భాషల్లోనే తొలి నవల అని విమర్శకులు గుర్తించారు. వెయ్యి పేజీల ఈ వచన రచన అప్పటికింకా ప్రాచుర్యంలో లేని నవలా ప్రక్రియను అవలంబించింది. 1వ శతాబ్దం మొదలు 19వ శతాబ్దం వరకూ ఆయా దేశాలలో ఉండే మహిళా రచయిత్రులు అక్కడి రాజకీయ పరిస్థితులు, సామాజిక నియమ నిబంధనలు, పితృస్వామ్యం... వీటన్నిటినీ తట్టుకుని నవలలు రాశారని ఈ పుస్తకం వల్ల తెలుస్తుంది. కొంతమంది రచయిత్రుల కృషి వారి జీవిత కాలంలో గుర్తింపబడకపోయినా... తరువాత కొంతమంది సద్విమర్శకుల వలన, స్త్రీవాదుల వలన గుర్తించబడింది. స్త్రీలు తమ స్వంత పేర్లతో రాయడానికి జంకి పురుషుల పేర్లతో రాయడం లేదా అనామకంగా రాయడం, ఎప్పుడైనా ధైర్యంగా రాయడం, రాజకీయాలను గురించి రాయడం, ప్రభుత్వాలను ప్రశ్నించడం... చివరకు నెపోలియన్నే నిలదీసి ఆయన ఆగ్రహానికి గురి కావడం ఈ పుస్తకంలో చూస్తాం. త్రికోణ ప్రేమ కథలు, హారర్ కథలు రాసిన తొలి రచయిత్రులు కూడా వీరు అయ్యారు. పల్లె సీమల అందాలని రొమాంటిసైజ్ చేయడం కాక అక్కడి ప్రజా జీవనాన్ని చిత్రించారు. కొందరు రచయిత్రులు ప్రఖ్యాత పురుష రచయితలకు ప్రేరణ కూడా అయ్యారు. సమాజం విమర్శించే జీవన శైలులు కూడా అవలంబించారు. ఈ పుస్తకానికి ఓల్గా కూలంకషమైన పరిచయం రాశారు. రచయిత్రుల జీవన కాలం, రచనా కాలం, వారి జీవిత విశేషాలు, అనుభవాలు... ఏదీ వదలకుండా ఒక సంపూర్ణ చరిత్రను... అందులోనూ ప్రపంచ మహిళా రచయితల చరిత్రను ఇష్టంగా మనకు అందించిన మృణాళినికి అభినందలు లేదా కృతజ్ఞతలు అనేవి చాలా పేలవమైన మాటలు. ప్రస్తుతం అన్ని విశ్వ విద్యాలయాల్లో స్త్రీ అధ్యయన కేంద్రాలు ఉంటున్నాయి. ఆ కేంద్రాలలో ఈ పుస్తకం తప్పనిసరిగా ఉండాలి. (చదవండి: కళ్లు తెరిపించే కథా రచయిత్రి) ఇటువంటి వ్యాస సంపుటులు ఇంగ్లిష్‌లో ఉంటాయి కానీ తెలుగులో ఇదే మొదటిది అని అనుకుంటున్నాను. ఇంగ్లిష్‌కన్నా తెలుగులో చదువుకోవడం సులభం కనుక యిది సాహితీ ప్రేమికులకూ చరిత్ర అభిమానులకూ మంచి కానుక. మరొక విషయమేమిటంటే ఇందులో మృణాళిని ప్రతి విదేశీ పదానికీ సరి అయిన ఉచ్ఛారణ ఇచ్చారు. ధృతి పబ్లికేషన్స్ ప్రచురించిన ‘విశ్వ మహిళా నవల’ హైదరాబాద్‌లోని నవోదయలో కొనుక్కోవచ్చు. చదువుతూ నాణ్యమైన సమయం గడపవచ్చు. - పి. సత్యవతి ప్రముఖ రచయిత్రి -
స్త్రీవాద సాహిత్య యుగకర్త 'ఓల్గా'
సాక్షి,తెనాలి : తెలుగునాట స్త్రీవాద సాహిత్యాన్ని ఉద్యమ స్థాయికి తీసుకెళ్లేందుకు జీవితాన్ని అంకితం చేసిన ఆచరణశీలి ఓల్గా. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సాధికారికంగా ఉపన్యసించగల వక్త. కొత్త ఆలోచనలపై జరిగే దాడులను నిబ్బరంగా ఎదుర్కోగల సాహసి. మగవారికి మాత్రమే పరిమితమైన తాత్విక సైద్ధాంతిక రంగాల్లో ఒక స్త్రీగా ధీమాతో తిరుగాడిన మేధావి. ఈ సాహిత్య, సామాజిక, వ్యక్తిత్వ ప్రస్థానానికి నేటితో అర్ధ శతాబ్దం నిండింది. ఇదేరోజు ఏడు పదుల వయసులోకి ప్రవేశించటం మరో విశేషం! ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని ఓల్గా మిత్రులు ‘సాహిత్య సాన్నిహిత్య ఓల్గా ఎట్ 50’ సభను డిసెంబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. నారాయణగూడలోని రెడ్డి ఉమెన్స్ కాలేజీలో జరిగే సభలో కేఎన్ మల్లీశ్వరి సంపాదకత్వంలో తీసుకొచ్చిన ‘సాహిత్య సాన్నిహిత్య ఓల్గా’, ఓల్గా రచించిన ‘చలం–నేను’, ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్నిచ్చిన ‘విముక’ కన్నడ అనువాద పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. కలాన్ని కదం తొక్కించి.. ప్రముఖ స్త్రీవాద స్వచ్ఛంద సంస్థ ‘అస్మిత’లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఓల్గా తన కలాన్ని కదం తొక్కించారు. ‘సహజ’, ‘మానవి’, ‘కన్నీటి కెరటాల వెన్నెల’, ‘ఆకాశంలోసగం’, ‘గులాబీలు’, ‘గమనమే గమ్యం’, ‘యశోబుద’ నవలలు రాశారు. చలం రచనల్లోని ఆరు స్త్రీ పాత్రలతో ‘వాళ్లు ఆరుగురు’ నాటకం రచించారు. ఆమె రాసిన ‘రాజకీయ కథలు’, ‘ప్రయోగం’ సంపుటాలు, స్త్రీ దేహాన్ని కేంద్రంగా చేసుకొని ఆలోచించటం, రాజకీయం చేయటాన్ని ఎండగట్టాయి. భిన్న సందర్భాలు, మృణ్మయనాథం, విముక్త, కథలు లేని కాలం.. వంటివి మరికొన్ని కథా సంపుటాలు. వీటిలో విముక్తకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. పలు అనువాద రచనలు, నృత్యరూపకాలు, సిద్ధాంతవ్యాసాలు రాశారు. అనేక పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. రచనల్లో సీత, అహల్య, శూర్పణఖ వంటి పురాణపాత్రల పేర్లను చేర్చటం, సందేశంతో కూడిన నృత్యరూపకాలను రాయటం, ప్రజలకు దగ్గరయే అంశాలతో స్త్రీవాదాన్ని వారి దగ్గరకు చేర్చటానికే అంటారామె. స్త్రీవాదం అంటే పురుషులకు వ్యతిరేకం కాదని, వారి మైండ్‌సెట్ మారాలనేది ఓల్గా చెప్పే మాట. సినిమా రంగంలోనూ.. అధ్యాపక వృత్తి తర్వాత హైదరాబాద్ వెళ్లిన ఓల్గా ‘భద్రం కొడుకో’, ‘తోడు’, ‘గాంధీ’ (డబ్బింగ్), ‘పాతనగరంలో పసివాడు’, ‘గులాబీలు’, ‘అమూల్యం’ సినిమాలకు స్క్రిప్టు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా, పాటల రచన, సహాయ దర్శకురాలిగా రకరకాల బాధ్యతలు నిర్వర్తించారు. పలు టెలీఫిలింలు, టీవీ సీరియల్స్‌కూ పనిచేశారు. బీజింగ్‌లో జరిగిన మహిళల సదస్సు, అమెరికాలో ప్రపంచ మానవహక్కుల కాంగ్రెస్ సదస్సుకు హాజరయ్యారు. బంగ్లాదేశ్, బ్యాంకాక్లోనూ పర్యటించారు. పాటకు జాతీయ అవార్డులు ఆమె పాటలు రాసిన ‘భద్రం కొడుకో’ సినిమాకు రెండు జాతీయ అవార్డులొచ్చాయి. ‘తోడు’ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు దక్కింది. తనదైన సొంత నిబంధనలు, సిద్ధాంతాలతో వ్యక్తిగత స్వేచ్ఛ, సాధికారత కోసం కృషిచేస్తూ ఎందరో మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తున్నారు. అందుకే ఓల్గా మిత్రులు సాహితీ సాన్నిహిత్య సభను ఏర్పాటు చేసి ఓల్గా తన రచనల్లో పదే పదే ప్రస్తావించిన ‘సిస్టర్హుడ్ రిలేషన్షిప్’ స్త్రీల మధ్య నిలిచి ఉందని రుజువు చేయనున్నారు. -
తొందరే అన్ని పన్లనీ నాశనం చేసేస్తోంది
అబ్బాయీ, మన డేరా ఇవాళ ఇక్కడుంది. పశువులు ఇక్కడి గడ్డిని మేస్తాయి. ఈ చుట్టుప్రక్కల మనుష్యులవీ పశువులవీ మలమూత్రాలు కనపడ్డం మొదలెడతాయి. అప్పుడు ఈ చోటు వదలి మరో చోటుకి వెళ్లిపోతాం. అక్కడ కొత్తగా మొలిచిన పచ్చిక ఎక్కువగా ఉంటుంది. రాహుల్ సాంకృత్యాయన్ రచన ‘ఓల్గా నుంచి గంగకు’లో క్రీ.పూ. 2500 ఏళ్ల కింద జరిగిన కథగా చెప్పే ‘పురుహూతుడు’లో తాతకూ, పురుహూతుడికీ మధ్య జరిగే సంభాషణ ఆసక్తికరంగా ఉంటుంది. దీని అనువాదం చాగంటి తులసి. అది ఇక్కడ: ‘‘ఈ రాగిని చూసినా, వ్యవసాయపు పొలాల్ని చూసినా నా గుండె మండుతుంది. ఈ రెండూ వక్షునదీ తీరానికి వచ్చిన్నాటినుంచీ అంతటా పాపం అధర్మం పెరిగిపోయేయి. దేవతలూ కోపగించేరు. అంటువ్యాధులు ఎక్కువైపోయేయి. కొట్టుకోడాలు నరుక్కోడాలు ఎక్కువైపోయేయి’’ అన్నాడు తాత. ‘‘ఇంతకు పూర్వం ఈ రెండూ లేవా తాత?’’ పురుహూతుడు అడిగేడు. ‘‘లేవురా అబ్బాయీ! ఇవి నా చిన్ననాటి రోజుల్లో కొద్దికొద్దిగా అప్పుడప్పుడే వచ్చేయి. మా తాతైతే వీటిపేరన్నా వినలేదు. ఆ కాలంలో రాతితో చేసినవీ, ఎముకలతో చేసినవీ, కర్రతో చేసినవీ ఆయుధాలు ఉండేవి.’’ ‘‘అలాగా! అయితే కలప నెలా కోసేవారు తాతా?’’ ‘‘రాతి గొడ్డలితో.’’ ‘‘చాలాసేపు పడుతూ ఉండి ఉంటుంది. ఇంతబాగానూ తెగి ఉండి ఉండదు.’’ ‘‘ఇదిగో ఈ తొందరే అన్నిపన్లనీ నాశనం చేసేస్తోంది. ఇప్పుడు రెణ్నెల్లకి సరిపడే గ్రాసాన్నో సగం బతుక్కి ఉపయోగపడే స్వారీ గుర్రాన్నో ఇచ్చి ఓ రాగి గొడ్డలి తీసుకో. ఆ తర్వాత అడవులకి అడవులు నరికేసి ధ్వంసం చేసెయ్యి. ఊళ్లకి ఊళ్లు చంపేసి నాశనం చేసెయ్యి. అయితే ఊళ్లు అడవిలో చెట్లలా ఆయుధాలు లేకుండా లేవు. వాటిదగ్గరా అంత పదును గొడ్డలీ ఉంది. ఇదిగో ఈ రాగి గొడ్డలి యుద్ధాల్ని మరింత క్రూరంగా మార్చేసింది. దీనితోగాని గాయం అయిందా విషపూరితమైపోతుంది. పూర్వం అయితే బాణపు ములుకులు రాతివి ఉండేవి. అవింత పదునుగా ఉండేవి కావు కాబట్టి సరిపోయేది. అయితే నేర్పరుల చేతుల్లో అవీ ఉపయోగపడేవి. ఇప్పుడీ రాగి ములుకులతో ముక్కుపచ్చలారని పిల్లకాయలూ పులిని వేటాడేద్దామనుకుంటున్నారు. ఇప్పుడిహ ఎవరైనా గొప్ప విలుకాణ్ణవాలని ఎందుకనుకుంటాడు?’’ ‘‘తాతా! నువ్వు చెప్పేవాటిల్లో ఓ దానిని నేను ఒప్పుకుంటున్నాను. మనిషి ఓ దగ్గరే కట్టిపడి ఉండటానికి పుట్టలేదు. నిజం.’’ ‘‘అవున్రా అబ్బాయీ! రోజూ చేసినచోటే దానిమీద దానిమీదే మల విసర్జన చెయ్యడం ఎంత అసహ్యకరం! మన డేరా ఇవాళ ఇక్కడుంది. పశువులు ఇక్కడి గడ్డిని మేస్తాయి. ఈ చుట్టుప్రక్కల మనుష్యులవీ పశువులవీ మలమూత్రాలు కనపడ్డం మొదలెడతాయి. అప్పుడు ఈ చోటు వదలి మరో చోటుకి వెళ్లిపోతాం. అక్కడ కొత్తగా మొలిచిన పచ్చిక ఎక్కువగా ఉంటుంది. అక్కడ నేలా నీరూ గాలీ ఎక్కువ పరిశుద్ధంగా ఉంటాయి.’’ ‘‘అవున్తాతా! నాకూ అలాంటి నేలంటేనే ఇష్టం. అలాంటిచోట నా పిల్లంగోవి ఇంకా తియ్యగా పలుకుతుంది.’’ -
ఈ యుగపు మహాకవి జాషువానే
సాక్షి, అనంతపురం కల్చరల్ : సమాజంలోని అసమానతలు తొలిగేలా సాహిత్యాన్ని నడిపించిన 20వ శతాబ్దపు మహాకవిగా గుర్రం జాషువానే గుర్తించాలని ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి ఓల్గా అన్నారు. గుర్రం జాషువా సాహిత్య పీఠం ప్రధాన కార్యదర్శి నాగలింగయ్య ఆధ్వర్యంలో ‘మహాకవికి నివాళి’ పేరిట జరిగిన కార్యక్రమంలో శనివారం నగరానికి విచ్చేసిన ప్రఖ్యాత సాహితీ వేత్తలు ఓల్గా, అక్కినేని కుటుంబరావు, కథా రచయిత సింగమనేని నారాయణ తదితరులు జాషువా జీవితాన్ని, సాహిత్యంలోని విశేషాల గురించి మాట్లాడారు. తెలుగు సాహిత్య రంగంలో అసమాన ప్రతిభతో రాణించిన జాషువా గొప్పతనాన్ని తొలిరోజుల్లో పెద్ద పండితులు గుర్తించలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. గబ్బిళం రచన ద్వారా సమాజానికి కొత్త సందేశాన్ని అందించిన జాషువా చిరస్మరణీయుడని, ఆయనను గౌరవించుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టు భావించాలన్నారు. సాహిత్య సభల కోసం అనంతకు విచ్చేసిన తమకు జాషువా విగ్రహం ఏర్పాటు చేసుకుని భక్తితో ఆరాధించుకోవడం ఆనందమేసిందని తెలిపారు. నాగలింగయ్య జాషువా సాహిత్య సేవకునిగా ఎనలేని సేవలందిస్తున్నారని అభినందించారు. అంతకు ముందు స్థానిక టవర్‌క్లాక్ సమీపంలోని గుర్రం జాషువా విగ్రహానికి ఓల్గాతో కలిసి పలువురు రచయితలు, ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర నాయకులు భాస్కర్, ఉమర్ ఆలీషా సాహితీ సమితి అధ్యక్షుడు రియాజుద్దీన్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. -
బూజుకర్ర చివరన
కారిడార్‌లో నడుస్తూ ఉంటే ఆ ఫ్లాట్‌లో నుంచి మృదువైన ధ్వని. ఏమిటది?వయొలిన్ కావచ్చు. అవును. వయొలినే. ఎవరు మీటుతున్నారబ్బా? తలుపు ఓరగా తెరిచి ఉంది. ఉండబట్టలేక తొంగి చూశాడు. ఆమే. కొత్త వయొలిన్ లాగుంది... ఇవాళే కొని ఉండవచ్చు... కూచుని సాధన చేస్తూ ఉంది. అది మృదువుగా ఒకసారి మారాము చేస్తున్నట్టు మరోసారి సంగీతం పలుకుతూ ఉంది. ఇతణ్ణి చూసింది. మొహమాటపడుతూ నవ్వింది. ‘చాలా బాగుందండీ’ అనేసి అక్కడి నుంచి వచ్చేశాడు. nఆలోచిస్తే కొంచెం తబ్బిబ్బుగా ఉంది. భర్త ఇటీవలే చనిపోయాడు. పిల్లలు వచ్చి జరగవలసిన కార్యక్రమాలు చూసి మాతో వచ్చెయ్యమ్మా అని పిలిస్తే వెళ్లలేదు. సాధారణంగా ఇలాంటి టైములో పిల్లల దగ్గర ఉండటమే మంచిది. కాని ఇక్కడ ఉండిపోయింది. భర్త పోయిన దుఃఖం, దీనత్వం ఆశించాడు. కాని ఆ ఛాయలేమీ లేవు. పైగా వయొలిన్ నేర్చుకుంటూ కనిపిస్తోంది. మరి తన పరిస్థితి? దాదాపు దివాలా తీసినట్టయ్యింది బతుకు. కొన్ని రోజుల క్రితమే భార్య కేన్సర్‌తో మరణించింది. ఆమెను సాగనంపాక ఇల్లంతా బోసిపోయినట్టయ్యింది. అది సరే. ఇంతవరకూ ఆ ఇల్లు అసలు తనకు పరిచయమే లేదని అతనికి తెలిసొచ్చింది. రేజర్ కనిపించలేదు. టూత్‌పేస్ట్ ఎక్కడుంటుంది తెలియలేదు. తనకో ఫుల్‌హ్యాండ్స్ బ్లూషర్ట్ ఉండాలి... ఎంత వెతికినా అది కనిపించలేదు. కుక్కర్ కనిపించలేదు. పళ్లేలు కనిపించలేదు. టీవీ రిమోట్ కనిపించలేదు. హాల్లో సోఫా ఉన్నా అదీ కనిపించలేదు.ఇన్నాళ్లూ వాటన్నింటికీ భార్య కళ్లు ఉండేవి. అవి వెతికి అమర్చి పెట్టేవి. ఇప్పుడు తన కళ్లకు అవి కనిపించాలంటే పెద్ద విషయంగా ఉంది. భార్య లేకపోతే భర్త అంధుడైపోతాడా?మరి ఆ వయొలిన్ ఆమె అలా లేదే. ఇద్దరివీ పక్కపక్క ఫ్లాట్లు. ఎంత తేడా?ఆ రోజు టెర్రస్ మీదకు వెళితే ఆమె కేన్ కుర్చీ వేసుకుని వాటర్ ట్యాంక్ నీడలో ఏదో పుస్తకం చదువుకుంటోంది. మొహమాట పడుతూనే అడిగాడు–‘మీవారు పోయిన దుఃఖం మిమ్మల్ని వేధించడం లేదా అండీ’ ‘దుఃఖం ఉండదని ఎవరన్నారు?’ అడిగింది. అక్కడే సిమెంట్ చేసిన పిల్లర్ ఉంటే కూర్చున్నాడు.‘దుఃఖం ఉంటుంది. జీవితంలో తోడు నిలిచిన భర్తని, మనతో పాటు నడిచిన భర్తని, ప్రేమించిన భర్తని కోల్పోతే దుఃఖం లేకుండా ఎలా ఉంటుంది. ఆ దుఃఖమూ నిజమే. అతడు పోయాక ఆర్థిక ఇబ్బందులంటూ లేకపోతే నేనూ నావంటి మరో స్త్రీ కాసింతైనా తెరిపిన పడటమూ నిజమే. ఇంతకాలమూ ఒక హోరులో జీవితం గడిచి ఉంటుంది కదా. ఇప్పుడు ఆగి బేరీజు వేసుకునే సమయం చిక్కుతుంది. మనల్ని మనం గమనించుకోవచ్చు. తప్పిపోయిన స్నేహితులను వెతుక్కోవచ్చు. మానేసిన ఇష్టాలను కొనసాగించవచ్చు. ఇదిగో.. ఇలా పుస్తకాలు చదువుకోవచ్చు. ఇక వంట భారం, ఇంటి భారం అంటారా... భర్త పోయాక అవి తగ్గుతాయే తప్ప పెరగవు’ అంది. తల ఆడించి కిందకు దిగేశాడు. తనకు అన్నం వండుకోవడం రాదు. కూర చేయడం అంటే రోలర్ కోస్టర్ ఎక్కి దిగినట్టే. నాలుగు అంచులు సరిగ్గా కలిపి దుప్పటి మడతెట్టడం రాదు. బాత్రూమ్ దగ్గరుండాల్సిన స్లిప్పర్లు టీవీ దగ్గర, బయట ఉండాల్సిన చప్పల్స్ బెడ్రూమ్లో.. ఇలా అరాచకం అయిపోయింది ఇల్లు. సాయంత్రమైతే ఏదో గుబులుగా అనిపించి బజారున పడి అటూ ఇటూ తిరుగుతున్నాడు. అలవాట్లున్న మగవాళ్లు ఎలాగోలా పొద్దుపుచ్చుతారో ఏమో. తనకు అలవాట్లు కూడా లేవే.ఆ రోజు కారిడార్‌లో కొత్త కుండీ పెట్టి ఏదో తీగ నాటి నైలాన్ దారానికి పాకించడానికి ప్రయత్నిస్తూ ఉంటే పలకరించాడు.‘కాఫీ తాగుతారా?’ అడిగింది.‘ఈ మాట ఎవరైనా అడిగి ఎంత కాలమైందండీ’ అన్నాడు.కాఫీ ఇచ్చింది. తాగాడు. కదల్లేదు.‘ఒకమాట అడిగితే ఏమీ అనుకోరుగా?’ అడిగాడు.‘మనం పెళ్లి చేసుకుందామా’ అన్నాడు.‘ఏంటీ?’ నవ్వింది. పెద్దగా నవ్వింది. ఆగకుండా నవ్వుతూనే ఉంది.అయోమయంగా చూశాడు.‘మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి?’ అడిగింది.‘తోడు కోసం’ ‘తోడంటే మీ దృష్టిలో ఏమిటో తెలుసా?’ గంభీరమవుతూ అంది.‘మీ దృష్టిలో తోడంటే వచ్చి మీ వాషింగ్ మెషీన్ ఆన్ చేయడం. కుక్కర్ ఆన్ చేయడం. సిలిండర్ బుక్ చేయడం. బూజుకర్ర పట్టుకుని సమయానికి బూజు దులిపి పెట్టడం. డోర్‌మేట్స్ ఆర్డర్లో ఉండేలా చూసుకోవడం. అదీ మీ దృష్టిలో తోడంటే. ఇప్పటి వరకు పడీపడీ ఉన్నాను. మరి పడలేను’మాట్లాడకుండా వచ్చేశాడు. రెండు మూడు రోజులు ఆలోచనలు సతమతం చేశాయి. అహం రెపరెపలాడింది. దుమ్ము అణిగి దృశ్యం స్పష్టమైనట్టుగా వాస్తవం బోధపడి ‘నిజమే కదా’ అనిపించింది. తోడంటే తనకు తీరిక ఆమెకు భారమూ కాదు. తోడంటే చెరిసగం. అన్నింటా చెరిసగమే.ఇది నిశ్చయమయ్యాక అతడు కొన్నాళ్లు ఆమె ఫ్లాట్ వైపు తొంగి చూడలేదు. ఇంటి పని శ్రద్ధగా చేయడం నేర్చుకున్నాడు. వంట నేర్చుకునే ప్రయత్నం చేశాడు. జీవితంలో తొలిసారి సోఫాక్లాత్స్ మార్చగలిగాడు. అన్నింటికంటే ముఖ్యం బూజుకర్రను తానూ పట్టుకోగలనని గ్రహించాడు. అన్నం, రెండు కూరలు, అవసరమైతే చపాతీ చేయగలడు. సరుకులు తేగలడు. ఇస్త్రీ పద్దు రాయగలడు.ఒకరోజు వెజిటెబుల్ బిర్యానీ చేసి ఆమెను ఇంటికి ఆహ్వానించాడు.ఆమె వచ్చింది. ‘ఏమిటిదీ’ అని ఆశ్చర్యపోయింది. ఇల్లంతా తిరిగి చూసింది. ఉప్పు తక్కువైనా సరే బిర్యాని ఆరగించి మెచ్చుకుంది.‘తోడంటే ఇక మీదట నా దృష్టిలో ఇలా ఉండటం అండీ’ అన్నాడు.ఆమెకు యాభై ఏళ్లు. చూసింది. అతడికి మరో అయిదు ఉంటాయేమో. చూశాడు.మనోహరమైన ఒక ప్రేమ కథ ఆమె చేతిని అతడు పట్టుకోవడంతో మొదలైంది.ఓల్గా రాసిన ‘తోడు’ కథ ఇది.శ్రమ అంటే ఏమిటనే నిర్వచనాలు మగవాళ్ల దగ్గర చాలా ఉంటాయి. ఆఫీసుకు వెళ్లడం, స్కూటర్ డ్రైవ్ చేయడం, బ్యాంక్‌కు వెళ్లి లావాదేవీలు చూడటం, పిల్లల స్కూలుకు వెళ్లి మాట్లాడటం... ఇవి వాళ్ల దృష్టిలో శ్రమ. పచ్చడి నూరడం, గ్రైండర్ తిప్పడం, ఆరేసిన బట్టలు తీసుకురావడం, పిల్లలకు స్నానం చేయించడం, జిడ్డోడే అంట్లను రుద్ది రుద్ది తోమడం.. ఇవి శ్రమ కాదు. బూజుకర్ర చివరన ఉండాల్సింది గాజుల చేయే అని అనుకుంటారు. అలా అనుకున్నంత కాలం స్త్రీ హృదయంలో సంపూర్ణమైన చోటు సంపాదించలేరు. ఇల్లు మీరుండే చోటు కూడా అయినప్పుడు ఇంటి శ్రమ మీది కూడా కదా.సగం సగం అనుకునే మగవాడా.. నీకు వెల్కమ్. పునః కథనం: ఖదీర్ - ఓల్గా -
మగాళ్లు మారాలి
ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ‘‘స్త్రీలు ప్రపంచ పనిగంటల్లో 60 శాతం పనిచేస్తారు. ప్రపంచ ఆదాయంలో పదిశాతం మాత్రమే పొందుతారు. ప్రపంచ సంపదలోనైతే ఒకేఒక శాతం మీద మాత్రమే స్త్రీలకు యాజమాన్యం ఉంటుంది.’’ ఇది 1980, 90 దశాబ్దాల లెక్కల ప్రకారం. ఇప్పుడు పరిస్థితి మరింత క్షీణించింది. స్త్రీలు ఎంతో శ్రమ చేసి, తక్కువ పొందటం ఒకరకమైన వివక్ష అయితే, స్త్రీలు చేసే పనులు విలువలేనివిగా, దాని వల్ల స్త్రీలు విలువలేనివారుగా పరిగణించడం మరొకరకం వివక్ష. వివక్ష వేరు వేరు కాలాలలో, వేరువేరు ప్రాంతాల్లో వేరుగా ఉంటుంది. కానీ సారాంశంలో మాత్రం స్త్రీలు తక్కువ స్థాయి వారు, వారు పురుషుల కంట్రోలులో ఉండాలి అనే ప్రాథమిక సూత్రంపై వివక్ష ఆధారపడి ఉంటుంది. మన అమ్మమ్మల కాలంలో పద్ధతులిప్పుడు లేవు. అలాగే దళిత స్త్రీలపై, గిరిజన స్త్రీలపై ఉండే వివక్షకూ అగ్రవర్ణ స్త్రీలపై అమలయ్యే వివక్షకూ ఎంతో తేడా ఉంటుంది. ఈ వివక్షలో అతి ప్రధానమైన, ప్రాథమికమైన నియంత్రణలు లైంగికత్వం మీద, సంతానోత్పత్తి మీద, శ్రమ మీదా అమలు జరుగుతాయి. ఈ నియంత్రణలను కచ్చితంగా అమలు చేయాలంటే స్త్రీల కదలికలను నియంత్రించాలి. ఒకప్పుడు స్త్రీలను ఇల్లుదాటి బైటికి రానివ్వకపోతే, ఇప్పుడు రాత్రి పొద్దుపోయాక రావొద్దంటున్నారు. కొన్ని ప్రాంతాల్లోనే సంచరించాలనే ఆంక్షలు పెడుతున్నారు. ఈ వివక్షను కొనసాగించడానికి అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో ఉపయోగించే సాధనం హింస. లైంగిక అత్యాచారం, లైంగిక అవమానాలు, గృహహింస, çపనిచేసే చోట లైంగిక వేధింపులు– వీటన్నింటితో స్త్రీలలో భయాన్నీ, అభద్రతా భావాన్నీ కల్పించి వివక్ష విశ్వరూపంతో వర్ధిల్లుతోంది. ఈ వివక్షలన్నింటినీ స్త్రీలు సవాలు చేస్తున్నారు. చట్టాలలో మార్పులకోసం కృషి చేస్తున్నారు. స్త్రీలలో ఇలా చైతన్యం పెరగటం అనేది కచ్చితంగా మార్పే. కానీ ఇప్పుడు చైతన్యం పెరగవలసింది పురుషులలో. స్త్రీలు అన్ని రంగాలలోకీ వస్తున్నారు. కానీ పురుషులు ఇంటి పనులకు ఇంకా దూరంగానే ఉంటున్నారు. ఇంటి పనికి సమాజం విలువ కట్టడం లేదు. శ్రమగా గుర్తించటం లేదు. పిల్లల పెంపకంలోకి పురుషులు రావటం లేదు. సమానత్వం లేనిదే తమ కుటుంబ సభ్యులైన స్త్రీల ప్రేమను వారెన్నటికీ పొందలేరనే ఎరుక వారికి కలగటం లేదు. స్త్రీలను సమానులుగా భావించటం వల్ల తామేదో కోల్పోతామనే తెలివితక్కువ ఆలోచన నుండి బయటపడి, తాము ఎంతో పొందుతామనీ, సమాజం అభివృద్ధి చెందుతుందనీ పురుషులు గ్రహించేలా స్త్రీలు తమ పోరాటాలను నడిపి, వివక్షను నిర్మూలించాలి. - ఓల్గా, రచయిత్రి -
రెండు సాహిత్య ఉత్సవాలు
జైపూర్ లిటరరీ ఫెస్టివల్ గురించి గత ఏడెనిమిదేళ్లుగా వింటున్నా, ప్రతిసారీ ఏదో ఒక వివాదం వస్తుందనే విషయమే మనకు వార్తల్లో ప్రముఖంగా తెలుస్తుంటుంది. కానీ జైççపూర్లో నిజంగానే సాహిత్యోత్సవం పెద్ద ఉత్సవంలాగా జరుగుతుందని ప్రత్యక్షంగా చూస్తేనే తెలుస్తుంది. జైçపూర్ ఫెస్టివల్ నుండి ఆహ్వానం అందినపుడు ‘అబ్బా! జనవరిలో జైççపూర్ చలి ఎలా భరించాలి’ అనుకున్నాను. పైగా డిసెంబరంతా కుటుంబరావు అనారోగ్యం చలి వల్ల వచ్చిందే. ఐనా మృణాళిని ఇచ్చిన ధైర్యంతో కుటుంబరావూ, నేనూ కాస్త ఒణుకు తగ్గించుకుని వెళ్లాం. చలి ఉంది. కానీ ప్రపంచమంతటి నుంచీ వచ్చిన వేలాది సాహిత్యాభిమానులు, ముఖ్యంగా యువతీ యువకులు ఆ చలిని తమ ఉత్సాహంతో వెచ్చగా చేసేశారు! మేం వెళ్ళిన రోజే పెరుమాళ్ మురుగన్ కనిపించటం, పరిచయం, స్నేహం సంతోషకరమైన అనుభవం. ఆయన సాదాసీదాగానూ, ఆత్మీయంగానూ. గంభీరంగానూ అనిపించారు. పర్వ రచయిత భైరప్ప గారిని కలిసి మాట్లాడటంతో ఆయన సీత గురించి కొత్త పుస్తకం రాశారని తెలిసింది. వెళ్ళిన రోజే మా ఇద్దరి సదస్సులూ ఒకే సమయంలో ఉన్నాయి. డిగ్గీ ప్యాలెస్ ఒకే సమయంలో ఏడు సదస్సులు జరిగేంత పెద్దది. అందులో మూడింట్లో వెయ్యి మంది దాకా కూర్చోవచ్చు. మరో నాలుగింటిలో ఆరేడు వందల మంది కూర్చోవచ్చు. ఒక్క సాహిత్యమే కాదు, సామాజిక విషయాలన్నిటి మీదా సదస్సులు జరుగుతున్నాయి. ఒక గంట అన్నిటినీ తిరిగి వచ్చాం. విలియం డెరిలింపుల్ కోహినూర్ వజ్ర ప్రయాణాన్ని వివరిస్తున్నాడు. ట్రంప్ కంటే మాన్‌శాంటో ఎంత ప్రమాదకరమో నసీమ్ నికలస్ తాలెబ్ చెప్తున్నాడు. గుల్జార్ తన కవితా విశేషాలను, అనువాదంలో వచ్చిన సమస్యలను చర్చిస్తున్నాడు. సంజయ్ బారు డిమోనిటైజేషన్ గురించీ, దానిలోని రాజకీయాల గురించీ ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఒక యువ నెటిజన్ రచయిత తన ప్రయోగాల గురించి జనరంజకంగా సంభాషిస్తున్నాడు. ఒక్కసారిగా భయం వేసింది. మధ్యాహ్నం మూడు గంటలకు దర్బార్ హాల్లో వాయు నాయుడు, అర్షియా సత్తార్, నేను సీత గురించి మేం ఎందుకు రాశామో, మా ఆలోచనలేమిటో పంచుకోవాలి. వాయు బ్రిటన్ నుంచి వచ్చింది. ‘ఎసెంట్ ఆఫ్ సీత’ పుస్తకం రాసింది. అర్షియా వాల్మీకి రామాయణాన్ని ఇంగ్లిషులోకి అనువదించింది. నేను ‘విముక్త్త’ కథలు రాశాను. నేను విముక్త రాయటంలోని రెండు ప్రధానాంశాలు ‘ఫెమినిస్ట్ సిస్టర్హుడ్’ ప్రతిపాదించటం, ‘అధికారం, ఆధిపత్యం’ అనే భావనలను స్త్రీల జీవితాల్లోంచి అర్థం చేయించటం అంటూ మాట్లాడటం మొదలు పెట్టగానే అర్థమైంది, ప్రేక్షకులు సానుకూలంగా ఉన్నారని. ‘మృణ్మయ నాదం’ గురించి చెబుతుంటే అందరూ థ్రిల్ అయ్యారు. వాయు, సత్తార్ వాల్మీకి రామాయణం గొప్పతనాన్ని గురించి చెప్పారు. సత్తార్ ఆమె రాసిన ‘ఉత్తరకాండ’ పుస్తకం నుంచి కొంత చదివింది. మొత్తానికి జైపూర్‌లో విముక్త కథలకు జయమే దొరికింది. ప్రేక్షకులంతా ఆ ఐదు రోజులూ నన్ను పలకరిస్తూనే ఉన్నారు. తర్వాత నా అనువాద పుస్తకం Liberation of Sita ఉండటంతో రచయిత సంతకాల కోసం పుస్తకాలతో పాఠకులు వచ్చి నిలబడటం, చాలా మంది వచ్చి ‘మీ పుస్తకం Sold out అండీ మాకు కావాలి ఎక్కడ దొరుకుతుంది’ అని అడగటం – ఇదంతా నిజమా, కలా అనిపించింది. బోలెడు ఇంటర్వ్యూలు! హార్పర్ కాలిన్స్ వాళ్లొక ఇంటర్వ్యూ యూట్యూబ్ కోసం రికార్డు చేశారు. ఇలా రాయటం మోడెస్ట్‌గా ఉండదని తెలుస్తున్నా ఈసారి కాస్త మోడెస్టీని పక్కన పెడదాంలే అనిపించింది. క్షమించండి. నేను విన్న అన్ని ఉపన్యాసాలలోనూ బాగా నచ్చింది, ‘రోమన్ సివిలైజేషన్: డిటీరియరేషన్ ఆఫ్ వెస్ట్రన్ కంట్రీస్’. మొత్తం మానవ నాగరికత ఎత్తు పల్లాలను సింపుల్‌గా, వర్తమానానికి కనెక్ట్ చేస్తూ మాట్లాడాడా పండితుడు. అది బ్రెక్జిట్గానీ, చిత్రకళకు సంబంధించినదిగానీ, వ్యవసాయం గురించిగానీ, రాజకీయ ఆర్థికానికి సంబంధించిగానీ ఎవరే విషయం మాట్లాడినా అర్థం చేసుకుని మేధో చైతన్యాన్ని పొందగలగటం – ‘అమ్మయ్య ఇంటలెక్చువల్‌గా నేను బాగానే ఉన్నాను’ అనుకోగలిగే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది జైçపూర్ ఫెస్టివల్. మంచి విందులు, వీనుల విందైన ప్రపంచ సంగీతాలు, కనుల విందైన నృత్యాలు అదనపు విశేషం. ఒక విందులో శ్రీశ్రీ అంతటి రాజస్థానీ మహాకవినీ, మరికొందరు కవులనూ స్నేహితులుగా చేసుకోగలగటం మంచి అనుభవం. అలాగే నేనా జోలికి పోకపోయినా అచ్చంగా గ్లామర్ కావలసిన వాళ్లకోసం రుషీ కపూర్, శశి థరూర్, రాజమౌళి, రానా మొదలైన వాళ్ళు మాట్లాడారు. 2007లో హైదరాబాద్‌లో ఎవరికీ తెలియకుండా సభకు పిల్చినట్లే తస్లీమా నస్రీన్‌ని కూడా పిల్చారు. ఐనా తెలిసిపోయింది. సభాప్రాంగణం బైట ఆందోళనలు సాగాయి. నిర్వాహకులు ఇంకోసారి ఆమెను పిలవమని హామీ యిచ్చాక వాళ్ళు వెళ్ళిపోయారని మర్నాడు పేపర్ వార్తల వల్ల తెలిసింది. లోపల మాత్రం ఏ అలజడీ లేకుండా తస్లీమా మాట్లాడారు. వెంటనే వెళ్ళిపోయారు. రచయితలు విశ్రాంతి తీసుకోటానికీ, పరస్పర పరిచయాలు చేసుకోటానికీ ఏర్పాటు చేసిన ప్రదేశంలో మృణాల్ పాండే, ఊర్వశీ బుటాలియా వంటి పాత మిత్రులనూ, అనేక మంది దేశ విదేశాల కొత్త మిత్రులనూ కలిశాను. యువ రచయితలు, పాఠకులు, ప్రేక్షకులు అసంఖ్యాకంగా కనిపించి ఒక ఆశను కల్పించారు. మన దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించిన విశ్వాసం బలపడింది. జైపూర్ నుంచి చాలా మంది కలకత్తా ఫెస్టివల్‌కు ఆహ్వానితులై వచ్చారు. పెరుమాళ్ మురుగన్, లిత్వేనియా నుంచి వచ్చిన యువ ఫెమినిస్టు రచయిత ఇంగా, జావేద్ అక్తర్, శశీ థరూర్ మళ్ళీ కలకత్తాలో మరింత స్నేహితులయ్యారు. రామచంద్ర గుహతో సి.వి.సుబ్బారావు గురించి మాట్లాడుకోవటం ఎంతో బాగుంది. కలకత్తా ఫెస్టివల్‌ని అనితా దేశాయ్ ప్రారంభించారు. వయసులో, రచయితగా పెద్దావిడ. చిరునవ్వుతో, ప్రశాంతంగా ఆమె మాట్లాడిన మాటలు ఆ ఉత్సవానికి ఒక మూడ్‌ని ఏర్పరచగలిగాయి. ఈ ఉత్సవంలో కూడా ఇంటర్ డిసిప్లినరీ పద్ధతి పాటించారు. వివిధ సామాజిక, రాజకీయ, చారిత్రక, క్రీడా, కళా రంగాల గురించిన ప్రముఖుల ఉపన్యాసాలు, సంభాషణలు రచనతో అనుసంధానమై సమగ్రతను పొందాయి. సునీల్ గవాస్కర్, అభినవ్ బింద్రా, దీపా (పారా ఒలింపిక్స్ విజేత) వంటి క్రీడాకారుల రచనలు, జీవిత చరిత్రలు యువతరానికి ఉత్తేజాన్నిచ్చాయి. ఇక్కడ నవనేత దేవ్ సేన్, వైదేహి, నేను, అనుత్తమ కలిసి మళ్ళీ సీత గురించి సంభాషణ చేశాం. ఇంకో సెషన్లో ఒరియా రచయిత్రి పరోమిత, జయమిత్ర(బెంగాలీ), నేను ఒక ఆసక్తికరమైన సదస్సులో పాల్గొన్నాం. అది, ‘భారత దేశాన్ని ఐక్యం చేసిన స్త్రీ పాత్రలు’. ఈ సదస్సులో నేను సంస్కరణ ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో ఆ ఉద్యమాలకు సానుకూల వాతావరణాన్ని కల్పించటంలో బెంగాలి పాత్రలైన రాజ్యలక్ష్మి, సావిత్రి, కిరణ్మయి, కమల, భారతీ (శరత్చంద్ర), సుచరిత, లలిత (రవీంద్రుడు), కొన్ని ప్రేమ్‌చంద్ పాత్రలు మాత్రమే జోక్యం చేసుకున్నాయనీ అంటూ, ఆ పాత్రలన్నీ మధ్యతరగతి, కులీన, భద్రలోకం నుండి వచ్చి భిన్న జీవితాలు గడిపి మన సానుభూతినీ, ప్రేమనూ పొందాయని చెప్పాను. కానీ ఆ పాత్రలకు బదులు, లేదా వాటితో పాటు మా మధురవాణి (గురజాడ) శశిరేఖ, రాజేశ్వరి, అరుణ, పద్మావతి, లాలస(చలం) అన్ని భాషలలోకి వెళ్ళి భారతదేశాన్ని ఐక్యం చేయగలిగితే మనదేశం మరింత స్త్రీ పురుష సమానత్వంతో ఉండగలిగేదని చెబితే అక్కడున్న యువతీ యువకులు నివ్వెరపోయారు. ఒకప్పుడు ముక్కు, చెవులు కోయించుకుని వికలమై, మళ్ళీ తన జీవితాన్ని అందంగా నిర్మించుకున్నట్లు నేను రాసిన శూర్పణఖ కథ ప్రస్తావించి, ఇవాళ భారతదేశంలో యాసిడ్ దాడులకూ, కత్తిపోట్లకూ, అత్యాచారాలకూ గురి అవుతూ మళ్ళీ తమ జీవితాలను పునర్నిర్మించుకుంటున్న లక్షలాది స్త్రీలను ఐక్యం చేయగలిగేది శూర్పణఖ మాత్రమే అన్న నా మాటలకు యువతరం బాగా స్పందించింది. ఈసారి హైదరాబాద్ ఫెస్టివల్‌కి వెళ్ళలేకపోయినా రెండు మంచి సాహిత్యోత్సవాలలో పాల్గొన్నాననే తృప్తితో 2017 ప్రారంభమైందని సంతోషంగా అనిపించింది. - ఓల్గా 9849038926 -
విముక్తవాదానికి గుర్తింపు
విరూపిగా శూర్పణఖ జీవితాన్ని ఎదుర్కొన్న తీరూ, జీవితాన్ని సౌందర్యభరితం చేసుకున్న వైనమూ, సాఫల్యానికి అర్థం పురుషుని సాహచర్యంలో లేదని గ్రహించడమూ నేటి తరం తెలుసుకోవాల్సివుంది. పురాణాలు రుద్దిన పవిత్రతా భావనలూ పతివ్రతా ధర్మాలూ- స్త్రీల జీవితాల్లో దుఃఖం ఒంపుతున్నాయి. వాళ్ల జీవితాల్ని నియంత్రిస్తున్నాయి. జీవించే హక్కుపై దాడి చేస్తున్నాయి. అదెలాగో తెలియాలంటే ఓల్గా సృష్టించిన కథావరణంలోకి వెళ్లాలి. సీతను సూత్రధారిగా చేసుకుని నాలుగు గాథల్ని స్త్రీవాద కోణం నుంచి ఆమె పునర్నిర్మించారు. వీటితో సహా మొత్తం ఐదు కథల్తో వెలువడిన ‘విముక్త’కు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం దక్కింది. విముక్త భావజాలానికి ఇదొక గుర్తింపు. వాటిని ప్రతిపాదించిన కథలు భారతీయ భాషల్లోకి అనువాదమవుతాయి. స్త్రీవాదం మరింత విస్తరించడానికి దోహదపడతాయి. తనపై రాముని ప్రేమ సత్యమని నమ్మింది సీత. సత్యం ఎప్పుడూ ఒక్కలాగే ఉండబోదన్న అహల్య మాటల్ని తిప్పికొట్టిన సీత... రాముడు శీలపరీక్ష కోరినప్పుడు - అధికారానికి లొంగవద్దన్న ఆమె మాటలు గుర్తు చేసుకుంటుంది. రాముడు అగ్నిపరీక్ష పెట్టినప్పుడూ అరణ్యాలకు పంపినప్పుడూ రేణుక ఇచ్చిన సైకత కుంభం (ఇసుక కుండ) ఆమెకు స్ఫురణకొస్తుంది. తమ పాతివ్రత్యాలు సైకత కుంభాల వంటివి అంటుంది రేణుక. శూర్పణఖను కురూపిగా చేసిన రాముని రాజకీయాన్నీ, వలచిన ఆమెకూ - ప్రేమించిన తనకూ వేదన మిగిల్చిన అతని ఆర్యరాజధర్మాన్నీ సీత నిరసించగలుగుతుంది. లక్ష్మణుడు అరణ్యంలో వదలివెళ్లిపోయాక - ఊర్మిళ మాటలు గుర్తు చేసుకుని ఉపశమనం పొందగలుగుతుంది. ‘అధికారాన్ని తీసుకో. అధికారాన్ని వదులుకో. అప్పుడు నీకు నువ్వు దక్కుతావు. మనకు మనం మిగలాలి’ అంటుంది ఊర్మిళ. వివిధ సందర్భాల్లో పై నలుగుర్నీ కలుస్తుంది సీత. వాళ్ల జీవితాల్ని వింటుంది. వాళ్ల ‘అనుభవాల నుంచి తను నేర్వగలిగింది నేర్చింది’. వారివ్యధాభరిత జీవితంలో తనను తాను చూసుకుంది. స్నేహంతో బలపడింది. ‘నాకు లేనిదేమీ లేదు’ అనుకునే స్థాయికి ఎదిగింది. ఆర్యధర్మాన్ని ధిక్కరించింది. బాధించే సంప్రదాయాల హద్దులు దాటి తమదైన ప్రపంచం నిర్మించుకున్నారు ఈ కథల్లోని స్త్రీలు. తమతో తాము యుద్ధం చేసుకుంటూ - తమను తాము తెలుసుకుంటూ విస్తరించుకున్నారు. విరూపిగా శూర్పణఖ జీవితాన్ని ఎదుర్కొన్న తీరూ, జీవితాన్ని సౌందర్యభరితం చేసుకున్న వైనమూ, సాఫల్యానికి అర్థం పురుషుని సాహచర్యంలో లేదని గ్రహించడమూ నేటి తరం తెలుసుకోవాల్సివుంది. ఇలాంటి కథలు పాఠ్యాంశాలు కావాల్సివుంది. స్నేహ సహకారాలూ, సమూహంలో భాగం కావడాలూ, అనుభవాలు పంచుకోవడాలూ, తమను తాము తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలూ స్త్రీల జీవితాన్ని అర్థవంతంగా మలచుతాయి. ఓల్గా రచనలు అలాంటి దారి చూపుతాయి. అధికారానికి అతీతమైన - స్నేహపూరితమైన స్త్రీ పురుష సంబంధాల గురించి మాట్లాడుతాయి. సమాజంలోని అన్ని దృక్కోణాల్లోనూ ఒక పునరాలోచన, పునర్నిర్మాణం సాధించడం ఫెమినిజం అంతిమ లక్ష్యమన్న ఓల్గా - ఆ దిశగా తన సమకాలికులెవ్వరూ చేయనంత కృషి చేసినందుకూ, చేస్తూనే ఉన్నందుకు అభినందనపూర్వకంగా అందిస్తున్నాం ఈ అక్షరగుచ్ఛం. వి. ఉదయలక్ష్మి -
స్త్రీవాద ఉద్యమ పతాక ఓల్గా
ప్రముఖ రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెనాలి : ఓల్గా అసలు పేరు పోపూరి లలిత కుమారి. 1950 నవంబరు 27న గుంటూరు జిల్లాలోని యడ్లపాడులో జన్మించారు. ఆంధ్రా యూని వర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో ఎంఏ చేశారు. 1973 నుంచి 86 వరకు, ఆ తర్వాత కొంతకాలం తెనాలి లోని వీఎస్ఆర్ కాలేజీలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. మార్క్సిస్టు భావజాలం, రష్యన్ సాహిత్యం, ఫెమినిస్టు రచయితలు కొడవటిగంటి కుటుంబరావు, చలం రచనలు అధ్యయనం చేశారు. వారి ప్రభావంతో ఫెమినిస్టు దృక్పథంతో స్త్రీవాదం, సాహిత్యం అంశాలపై ఓల్గా కలం పేరుతో పత్రికలకు వ్యాసాలు రాయటం ఆరంభించారు. చర్చా వేదికల్లో పాల్గొంటూ వచ్చారు. చలం రచనలు చదవటమే కాదు, చివరి రోజుల్లో అన్నామలైలో ఉంటున్న చలంను ఆమె స్వయంగా కలుసుకున్నారు. అధ్యాపక వృత్తి తర్వాత హైదరాబాద్ వెళ్లి, ఉషాకిరణ్ మూవీస్‌లో స్క్రిప్టు విభాగంలో చేరారు. విమర్శల ప్రశంసలు, అవార్డులు పొందిన పలు సినిమాలకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు. తర్వాత ‘తోడు’, ‘పాతనగరంలో పసివాడు’ సినిమాలకు సహాయ దర్శకత్వం వహించారు. కదంతొక్కిన కలం ... అనంతరం ఆమె పూర్తిస్థాయి రచయిత్రిగా, హక్కుల కార్యకర్తగా ఉద్యమస్థాయిలో పనిచేయడం ఆరంభించారు. ఈ క్రమంలో ప్రముఖ ఫెమినిస్టు వాలంటరీ ఆర్గనైజేషన్ ‘అస్మిత ’లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. మరోవైపు ఆమె కలం కదం తొక్కింది. ‘స్వేచ్ఛ’, ‘సహజ’, ‘మానవి’, ‘కన్నీటి కెరటాల వెన్నెల’, ‘గులాబీలు’ నవలలు రాశారు. చలం రచనల్లోని ఆరు స్త్రీ పాత్రలతో ‘వాళ్లు ఆరుగురు’ నాటకం రచించారు. ఆమె రాసిన కథలతో ‘రాజకీయ కథలు’, ‘ప్రయోగం’ వచ్చాయి. స్త్రీ దేహాన్ని కేంద్రంగా చేసుకొని ఆలోచించటం, రాజకీయం చేయడాన్ని ఈ కథలు ఎండగట్టాయి. ‘ఎవరైనా పురుష రచయిత ఒక ప్రేమకథ రాస్తే, ఎవరూ రంధ్రాన్వేషణ చేయరు...అదే ఒక రచయిత్రి రాస్తే, అది ఆమె సొంత ప్రేమకథేనా...? అందులో హీరో, ఆమె చుట్టూవున్న వ్యక్తుల్లో ఎవరయి ఉంటారు...అనుకుంటూ రచయిత్రి సొంత వ్యక్తిత్వాన్ని కించపరచేలా వ్యవహరిస్తారు’ అని ఓల్గా కుండబద్దలు కొడతారు. స్త్రీవాదం అంటే పురుష వ్యతిరేకం కాదనీ, పురుషుల మైండ్‌సెట్ మారాలనేదిగా చెబుతారు. ఓల్గా రచించిన దాదాపు అన్ని రచనలు, అనువాదాలను ది లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ సేకరించింది. ప్రస్తుతం ఆమె నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు సలహామండలి సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. ‘కేవలం ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళలకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు...చట్టసభల్లో మహిళలు విధాన నిర్ణయకర్తలు అయినపుడే అది సాధ్యపడుతుంది’ అని రచయిత్రి, స్త్రీవాద ఉద్యమకారిణి ఓల్గా స్పష్టంగా చెబుతారు. ఆమె రచించిన కథల సంపుటి ‘విముక్త’కు గురువారం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. విద్యార్థి ఉద్యమాల నుంచి మార్క్సిస్టు భావజాలం, విప్లవ రచనా ఉద్యమం ప్రభావం ఉన్నా, ఆయా ఉద్యమాల్లోని లింగ వివక్ష ధోరణిపై మౌనంగా ఉండలేదు. సమాజంలోని ద్వంద్వ నీతి, ఫెమినిస్టు ఉద్యమంపై విదేశీ ప్రభావాన్ని చూసి, తానే స్వతంత్రంగా మహిళల హక్కుల కోసం పోరాడాలన్న భావనతో కృషిచేస్తున్నారు. ఫెమినిస్టు రచయిత్రిగా, మహిళా హక్కుల కార్యకర్తగా ఎదిగారు. -
తోడు...
ఆ ఫ్లాట్ మీదుగా నడుస్తుంటే గంగాధరానికి వయొలిన్ సవ్వడి వినిపించింది. ఆశ్చర్యపోయాడు. ఈ ఇంట్లో వయొలిన్ వాయించేది ఎవరబ్బా?సంశయిస్తూనే తలుపు తడితే నవ్వుతూ విజయలక్ష్మి కనిపించింది. చేతిలో వయొలిన్. ఆ వేళే బజారుకు వెళ్లి, దానిని కొనుక్కొచ్చి, సాయంత్రం నుంచి సాధన చేస్తోందట. ‘బాగుందా’ అని నవ్వింది. గంగాధరానికి ఇది ఇంకా ఆశ్చర్యం. ఆమె భర్త ఇటీవలే చని పోయాడు. పిల్లలు కర్మాంతరాలు చేసి వెళ్లిపోయారు. వెళ్లే ముందు మాతో వచ్చి ఉండమ్మా.. అని ఎంతఅడిగినా వెళ్లలేదు. సరే.. పెద్ద వయసు.. అలవాటు పడిన ఇల్లు అనుకుంటే ఈ సంగీతం ఏమిటి? ఒక దిగులూ బాధా లేకుండా ఈ నవ్వు ఏమిటి?ఏవో మాటలు చెప్పి తన ఫ్లాట్‌కు వచ్చేశాడు. ఫ్లాటా అది? అడవిలా ఉంది. ఎక్కడి బట్టలు అక్కడే. ఎక్కడి గిన్నెలు అక్కడే. ఒక మూల గుట్టలు పడిన న్యూస్ పేపర్లు. ఇంకో వైపు తుడవని టీ మరకలు. మనిషి కూడా ఒక కళా కాంతీ లేకుండా. అతని భార్య కూడా కొద్ది రోజుల క్రితమే క్యాన్సర్‌తో మరణించింది. ఇన్నాళ్లూ ఆమె అతనికి అన్నీ అమర్చిపెట్టింది. పిలిస్తే పలికి... పిలకపోయినా పలికి... ఇప్పుడు ఒక్కడే చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో తెలియక అవస్థ పడుతున్నాడు. గదులు తెలియడమే ఇల్లు తెలియడం అనుకున్నాడు.గంగాధరం- విజయలక్ష్మి... పక్కపక్కగా ఉండే ఫ్లాట్లు. ఒకేలాంటి కష్టం. కాని విజయలక్ష్మి ఒకలా ఉంది. గంగాధరం మరోలా ఉన్నాడు. ‘మీకు మీవారు పోయారన్న బెంగ లేదా’ అడిగాడొక రోజు. ‘ఎందుకు లేదు?’ ఎదురు ప్రశ్న వేసింది. ‘ఉంటుంది. బాధ ఉంటుంది. బెంగ ఉంటుంది. ఇన్నాళ్లు కలిసి జీవించడం వల్ల జ్ఞాపకాలు ఉంటాయి. అవన్నీ ఎంతవాస్తవమో భర్త పోయాక ఆర్థిక ఇబ్బందులు గనక లేకపోతే స్త్రీ చేసే మొదటి పని రిలాక్స్ కావడమే అనేది కూడా అంతేవాస్తవం. ఇన్నాళ్లూ భర్తే తానై తానే భర్తైబతికి ఉంటుంది కదా. ఇప్పుడన్నా కనీసం కొత్త స్నేహితులతో మాట్లాడవచ్చు. పాత అలవాట్లను నెమరు వేసుకోవచ్చు. తీరిగ్గా పుస్తకాలు చదువుకోవచ్చు. ఇక వంట పని అంటారా... భర్త చనిపోతే భార్యకు ఆ చాకిరీ తగ్గుతుందే తప్ప పెరగదు’... గంగాధరం జవాబు చెప్పలేకపోయాడు. నిజానికి అతడి కష్టం చెప్పనలవిగాకుండా ఉంది. ఎవరి మీదనో తెలియని కోపంగా ఉంది. సాయంత్రమైతే చాలు ఇంట్లో ఉండలేక ఫ్లాట్‌కు తాళం వేసి బయటకు వెళ్లిపోతున్నాడు.తిరిగి తిరిగి ఇంటికి చేరుకుంటే కాస్తయినా పలకరించే విజయలక్ష్మే అతడికిప్పుడు అతి పెద్ద ఓదార్పు. సంవత్సరం గడిచింది. ఇద్దరి మధ్యా పరిచయం పెరిగింది. స్నేహం పెరిగింది. మనసులోని మాట ఏదైనా చెప్పేయవచ్చు అన్న చనువు కూడా పెరిగిందేమోనని గంగాధరానికి అనిపించింది. ‘మనం పెళ్లి చేసుకుందామా’ అడిగాడు.‘ఏంటి?’ నవ్వింది. ‘ఏంటి’.. మళ్లీ నవ్వింది. పడీ పడీ నవ్వింది. ‘నేను మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి?’ ‘తోడు కోసం’‘తోడు కోసమా?’ నవ్వుతూ అంది- ‘నాకు తెలుసు తోడంటే ఏమిటో? మగవాడి దృష్టిలో తోడంటే బట్టలు ఉతకడం, ఇల్లు ఊడ్చడం, అంట్లు తోమడం, వండి వార్చడం... ఇవన్నీ చేసిపెట్టడమే మీకు కావలసిన తోడు. ఇన్నాళ్లు అవి చేసి చేసి విసిగిపోయి ఉన్నాను. ఇప్పుడే వాటి నుంచి బయట పడ్డాను. మళ్లీ తోడు అనే అందమైన ముసుగు వేసి నన్ను ఈ రాద్ధాంతంలోకి లాగకండి’... లేచి ఫ్లాట్‌కు వచ్చేశాడు. ఆ రాత్రి చాలా ఆలోచించాడు. స్త్రీ గౌరవించే, స్త్రీ కోరుకునే, స్త్రీ అభిమానించే మగతోడు ఎలా ఉండాలి? కొంచెం అందినట్టు అనిపించింది. మరుసటి రోజు బజారుకు వెళ్లాడు. ఇంటికి అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకున్నాడు. బూజు కట్టెలు వెతికి బూజు దులుపుకున్నాడు. బట్టలు సర్దుకున్నాడు. తడిబట్ట పెట్టి టీపాయ్‌లు కప్‌బోర్డులు మెరిసేలా తుడుచుకున్నాడు. పని మనిషి ఉండొచ్చు. కాని మన ఇంటి మీద శ్రద్ధ ఉండాల్సింది మనకే కదా. ఇక వంట పని. కొద్దిగా తెలుసు. ఇప్పుడు ఇంకాస్త మనసు పెట్టి వండటం నేర్చుకున్నాడు. చూడటానికే కాదు, తినడానికి కూడా ఆకర్షణీయంగా ఉండే పదార్థాలు చేయడం ఇప్పుడు తనకు వచ్చు. ఒకరోజు ఆమెను భోజనానికి పిలిచాడు. కుదురుగా ఉన్న ఇంట్లో ముచ్చట గొలిపే డైనింగ్ టేబుల్ మీద రుచికరమైన భోజనం. ‘తోడంటే ఏమిటో నాకు తెలిసింది’ అన్నాడు. నవ్వుతూ చూసింది. ‘అవును. తోడంటే బాధ్యతలో సగం. బరువులో సగం. బంధంలో సగం.సంతోషంలో సగం. కన్నీటిలో సగం. ఒక సంపూర్ణమైన అనుబంధానికి మనిద్దరం చెరో సగం’... చెప్తూ ఆమె వైపు చూశాడు. ఆమె కోసం చూశాడు.యాభై ఏళ్ల స్త్రీ ఆమె. సగం జీవితాన్ని దాటేసిన స్త్రీ. కాని తన ఎదురుగా ఉన్న మగవాణ్ణి, తనను తాను మార్చుకున్న మగవాణ్ణి, స్త్రీ గౌరవించి ప్రేమించేలా సిద్ధమైన ఆ మగవాణ్ణి చూసి పదహారేళ్ల అమ్మాయిలా ముచ్చట పడింది. తుళ్లి పడింది.హృదయంలో ప్రేమ ఉప్పొంగగా దగ్గరగా వచ్చి చేతిని అందుకుని మనస్ఫూర్తిగా ముద్దాడింది. ఒక కొత్త ప్రయాణం- అర్థవంతంగా మొదలైంది. ఓల్గా -
1 క్యూ 84
‘1 క్యూ 84’. జపాన్ కవిత్వమైనా కొద్దిగా చదివాను గానీ వర్తమాన జపాన్ నవలలతో అసలు పరిచయం లేదు. పది రోజుల క్రితం నాకు మంచి స్నేహితుడు, అంతర్జాతీయంగా సినిమాటోగ్రఫీలో ప్రసిద్ధుడు అయిన మధు అంబట్... హారుకి మురకామి గురించి చెప్పాడు. మధు సాహిత్యాభిరుచి తెలుసు. అందుకని వెంటనే హారుకి 2011లో రాసిన ‘1 క్యూ 84’ చూడాలనిపించింది. తీరా పుస్తకం ‘ఫ్లిప్‌కార్ట్’లో వచ్చాక చూస్తే 1,318 పేజీలుంది. సాహసంతో మొదలుపెట్టాను రెండు రోజుల క్రితం, రోజుకి వంద పేజీలైతే 13 రోజుల్లో పూర్తవుతుందిలే అనే ధీమాతో! మూడు వందల పేజీలు చదివాను. రచన సరళంగా, సూటిగా అదే సమయంలో సాంద్రంగా ఉంది. ప్రతి చిన్న వివరమూ రాస్తున్నాడు. అలా రాయటం పేజీలు నింపటానికి కాకుండా పాత్ర పోషణకు ఉపయోగపడుతున్నదని క్రమంగా తెలిసివస్తోంది. మూడు వందల పేజీల్లో ఐదారు పాత్రలే ప్రవేశించాయి. ఒక హత్య జరిగింది. హత్య చేసింది ‘అయెమామె’ అనే ముప్పై ఏళ్ల యువతి. హత్య చాలా సున్నితంగా జరిగింది. నాకేం జరిగిందని ఆ చనిపోయిన వ్యాపారి కళ్లు ఆశ్చర్యంతో నిండి ఉండగానే అతని ప్రాణం పోయింది. అతని భార్యే చంపించినట్లనిపిస్తోంది. అప్పుడప్పుడే రాస్తున్న ఒక యువ రచయిత, పెద్ద పబ్లిషింగ్ హౌస్ సంపాదకుడు ఈ నవలలోని మరో రెండు పాత్రలు. ఆ సంపాదకుడు ఒక పదిహేడేళ్ల అమ్మాయిని స్టార్ రైటర్ని చేయటానికి ఈ యువ రచయితని వాడుకుందామని చూస్తాడు. జపాన్‌లో పబ్లిషింగ్ రంగం, సాహిత్య రంగం ఎంత పెద్దవో ఎలా ఉన్నాయో మనకు కొంత అర్థమవుతుంది. అతను ఈ సాహిత్య స్కామ్ చేయటానికి చెప్పిన కారణాలు సరదాగా ఉన్నాయి. అతనికి పెద్ద పెద్ద రచయితలంటే కోపం. చిరాకు. అసహ్యం. వాళ్ల అహంకారాలను భరించలేడు. ‘‘నేనీ పని డబ్బుకోసం చేయటం లేదు. ఈ సాహిత్య ప్రపంచాన్ని గందరగోళం చెయ్యటం కోసం చేస్తున్నాను. వాళ్లంతా ఒక గుంపు. ఒకచోట చేరి నానా ఛండాలం చేస్తారు. ఒకరి గాయాలొకరు నాకుతారు. అదంతా సాహిత్య సేవ అంటారు. వాళ్లని చూసి పగలబడి నవ్వుకోవాలని ఈ పని చేస్తున్నాను. ఈ సాహిత్య వ్యవస్థ తెల్లబోయేటట్లు, ఆ గుంపునంతా ఒట్టి ఇడియట్లని చూపించటానికి నేనీ పని చేస్తున్నాను.’’ అంటాడు (ఇది స్వేచ్ఛానువాదం. అసలు మాటలు నేను రాయలేనట్లున్నాయి). కొన్ని నవలలు చదువుతుంటే ‘ప్లాట్’ విషయంలో తెలుగు నవలా రచయితలు చాలా వెనకబడి ఉన్నారని అనిపిస్తుంది. ఈ నవల చదువుతుంటే అదే అనిపిస్తోంది. 80 దశాబ్దపు జపాన్ ఈ నవలలో పరిచయమవుతోంది. జపాన్ సినిమాలెంత గొప్పవో నవలలూ అంత గొప్పవని ఈ నవల పూర్తయ్యేసరికి అనుకోగలుగుతానని ఆశపడుతున్నాను. ఈ రచయితకు మిలన్ కుందేరా, వి.ఎస్.నయ్పాల్లకు వచ్చిన ప్రతిష్టాత్మకమైన ‘జెరూసలెమ్ ప్రైజ్’ వచ్చింది. ఇతని రాబోయే నవల రాకముందే ఇప్పటికి ఇరవై లక్షల కాపీలు అమ్ముడుపోయిందట. - ఓల్గా -
మగ మహారోజు!
ఏం తక్కువైంది ఈ మగమహారాజులకు?! ఏం మునిగిందని వీళ్లకో ‘ఇంటర్నేషనల్ మెన్స్‌డే’?! జెంట్స్ సీట్లో కూర్చొని, లేడీస్ ఎవరైనా లేవట్లేదా? ఆఫీస్‌లో ‘ముద్దారగా నేర్పిస్తాం’ అని చెప్పి... ఫిమేల్ స్టాఫ్ వచ్చి మీద మీద పడుతున్నారా?! క్యాబ్స్‌లో ప్రయాణిస్తున్న మగవాళ్లపై... లేట్ నైట్ అఘాయిత్యాలు జరుగుతున్నాయా?! ఆడవాళ్లకు ‘మహిళా దినోత్సవం’ ఉన్నట్లే... మగవాళ్లకు ‘మెన్స్‌డే’ ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనిపై మన స్త్రీవాదులు, మానవవాదులు ఏమంటున్నారు? ఇదే ఈవారం మన ‘ప్రజాంశం’ నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. 1999లో ట్రినిడాడ్ టొబాగో దేశంలో మొదటిసారి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరవై దేశాల్లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్న కొందరు సుప్రసిద్ధ మహిళల అభిప్రాయాలివి. ఇద్దరూ అభివృద్ధి చేతి పావులే ప్రకృతిపరంగా ఆడ, మగ తేడాలేమీ ఉండవు. జీవులన్నీ ఒక్కటే. సమాజంలో మనుషులు కృత్రిమంగా సృష్టించిన అంతరాలలో కులం, వర్గం, జాతి, మతం వంటి అణచివేతల్లో జెండర్ కూడా ఒకటి. ఆడ, మగ అనే జెండర్ వ్యత్యాసం కూడా నిర్మాణాత్మకమైనదే. స్త్రీలు, బలహీన పురుషులు బలమైన పురుషాహంకార బాధితులే. ఎక్కువ క్రూరంగా ఉండమని రాజ్యాల్ని, మరింత మగవాడిగా ఉండమని పురుషుల్ని అభివృద్ధి నిర్దేశిస్తుంది. ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రపంచీకరణ, కులస్వామ్యాలన్నీ పురుషస్వామ్య రక్తమాంసాలతో నిర్మిస్తున్నవే. ఈ నిర్మాణాలు స్త్రీలనే కాదు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలహీనులైన మగవాళ్లను కూడా నిర్ధేశిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి నుంచి రాజకీయ ఎన్జీవోల వరకూ స్త్రీల సాధికారం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా... మహిళలు మానవహక్కులు లేకుండా విధ్వంసమవుతున్నారంటే పితృస్వామ్యంలో నిజాయితీ లేకపోవడం వల్లనే. పురుషుల్లో మార్పు రావాలి. ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకంలో మగవారి పాత్ర పెరగాలి. ఆధునిక ఉత్పాదక రంగంలో, వ్యవసాయక రంగంలో, రాజకీయాల్లో మహిళల నాయకత్వాన్ని అంగీకరించాలి. వాళ్ల ప్రాతినిధ్యాన్ని, ప్రవేశాల్ని ప్రోత్సహించాలి. మన దేశంలో 22 నిమిషాలకొక లైంగికదాడి జరుగుతోంది. ఇది మానవ నాగరికతకు సిగ్గుచేటు. కాని... ప్రతి 22 గంటలకూ కనీసం 22 రోజులకు ఒక బాలికను పాఠశాలలో చేర్పించగలిగితే, ఒక మహిళకు ఉపాధి అవకాశాన్ని అందించగలిగితే ఈ దేశంలోనే సమానత్వం సిద్ధిస్తుంది. - జూపాక సుభద్ర, రచయిత్రి రెండు దినోత్సవాలెందుకు? ‘మగవాళ్లు’ అనగానే పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్న వేమన గుర్తుకొస్తాడు నాకు. నిజంగానే పురుషులు అనేకరకాలు. నా మటుకు నాకు కొందరిని చూస్తే గౌరవం, కొందరిని తలుచుకుంటేనే అసహ్యం, కొందరిని చూస్తే జాలి, ఇంకా కొందరంటే ఇష్టం. ఏమైనా... ఈ రోజుల్లో పురుషులు కొంత అయోమయంలో ఉన్నారనిపిస్తుంది. వాళ్లకు పాత తరాలవారి కంటే తాము ఉన్నతం (వారి భాషలో ఆదర్శప్రాయం) గా ఉండాలని ఉంటుంది. కానీ తరతరాలుగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన పురుషత్వం ఆ ఉదాత్తతను నీరుగార్చేస్తుంటుంది. ఈ రెండింటి మధ్య ఇరుక్కుని నేటి పురుషులు (20 -50 మధ్య వయస్కులు) తికమకపడిపోతున్నారు. తను స్త్రీలను గౌరవంగా, తనతో సమానంగా చూస్తే గౌరవించబడతాడో లేక చులకనకు గురౌతాడో సగటు పురుషుడికి అర్థం కావడం లేదు. మొత్తానికి ఈనాటి స్త్రీలకు తమ వ్యక్తిత్వాల పట్ల, జీవనవిధానం పట్ల, పురుషులతో సంబంధాల పట్ల ఉన్నంత స్పష్టత ఇంకా ఈనాటి పురుషులకు రాలేదు. అంతేనా, పురుషులు అబలలు. (వ్యాకరణం మాట చిన్నయసూరి ఎరుగు) - ఎందుకంటే స్త్రీల కంటే ఎక్కువగా వాళ్లు సమాజానికి భయపడతారు. సంప్రదాయానికి వెరుస్తారు. స్త్రీ పురుష సంబంధాల్లో తెగింపు అన్నది ఎప్పుడైనా మనకు కనిపిస్తే అది స్త్రీ చొరవ తీసుకున్నప్పుడే, స్త్రీ సమాజాన్ని లెక్కచేయనపుడే సాధ్యం. మగవాళ్లకు సంబంధించి ప్రచారంలో ఉన్న సామెత ‘ఏడ్చే మగవాడిని నమ్మకు’ అన్నదాన్ని నేను నమ్మను. మగవాళ్లకు కూడా ఏడ్చే హక్కు ఉంది. దొంగ ఏడుపు అంటారా? అది ఆడవాళ్లు కూడా ఏడవగలరు కనక, కన్నీళ్లలోని నిజాయితీని గుర్తించాలి తప్ప, ఏడ్చింది పురుషుడా, స్త్రీనా అన్నది కాదు. పురుషుల దినోత్సవం సందర్భంగా తోటి పురుషులకు చిన్న సూచన: స్త్రీలను మీతో సరిసమానంగా చూడడం వల్ల మీ ఔన్నత్యం పెరుగుతుందే తప్ప, తరగదు. స్త్రీపురుషుల మధ్య అధికార సంబంధాల వల్ల స్త్రీలు మాత్రమే కాదు నష్టపోయేది, పురుషులు కూడ ఎంతో జీవితానందాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే అసమ సంబంధాల్లో ఇరుపక్షాలూ బాధే తప్ప ఆనందాన్ని పొందలేవు. ఆ స్పష్టత స్త్రీపురుషులిద్దరిలోనూ వస్తే, ఇక స్త్రీల దినోత్సవాలూ, పురుష దినోత్సవాలూ అని రెండూ వేర్వేరుగా జరుపుకోవలసిన అవసరం ఉండదు. - ప్రొఫెసర్ మృణాళిని, కేంద్రసాహిత్య అకాడెమీ జనరల్ కౌన్సెల్ సభ్యురాలు అర్థం చేసుకొనేలా ఎదగాలి అంతర్జాతీయ పురుష దినోత్సవం సందర్భంగా వారిలో మానవ త్వం మేలుకోవాల ని కోరుకుంటున్నా ను. మగవాళ్లకు తరతరాలుగా సమాజం ఇచ్చిన అనవసరమైన, అన్యాయమైన అహంకారాన్ని పెంచే అవకాశాలను వాళ్లు ఐచ్ఛికంగా వదులుకుని సమానత్వం వైపుగా అడుగులు వేయడం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. తమలో పేరుకుపోయిన వివక్షాపూరితమై న ఆలోచనలను, హింసాత్మక ఆచరణను అమానుష వైఖరిని కడిగి వేసుకుని స్త్రీల స్వేచ్ఛా కాంక్షను అర్థం చేసుకునేలా ఎదగాలని కాంక్షిస్తున్నాను. యుద్ధాన్ని వదిలి శాంతిని, ద్వేషాన్ని వదిలి స్నేహాన్ని మనసులో నింపుకుని ప్రపంచాన్ని... శాంతి, సమానత్వం దిశగా అభివృద్ధి చేయడంలో స్త్రీలతోపాటు భాగస్వామ్యం పంచుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే ఈ పనులు చేస్తున్న సంస్కారవంతులైన కొందరు పురుషులకు నా అభినందనలు. - ఓల్గా, స్త్రీవాద రచయిత్రి Olga ఆధిపత్యం అడగడం లేదు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా పురుషులకు కొన్ని విషయాలు చెప్పదలచుకున్నాను. స్త్రీపురుష వివక్ష మొదట్నించీ ఉన్నది కాదు. ఆదిమ వ్యవస్థలో ఆహారాన్ని కనిపెట్టింది స్త్రీ. కానీ సమాజం పురోగమనంలో మాతృస్వామిక వ్యవస్థ దాటి పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. అప్పటినుంచి స్త్రీ అణచివేత ప్రారంభమైంది. తర్వాత నాగరిక సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం ఒక హక్కుగా రాజ్యాంగం ఇచ్చింది. ఈనాటికీ ఆ సమానత్వాన్ని గుర్తించలేకపోవడం బాధాకరం. స్త్రీలు తమ హక్కుల గురించి మాట్లాడినప్పుడల్లా ఆధిపత్యం కోరుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. కాని స్త్రీకి కావాల్సింది పురుషులపై ఆధిపత్యం కాదు, కేవలం సమానత్వం మాత్రమే. సమాజంలో పురుషాధిపత్య భావజాలం భారంగా మారితే పురుషులు కూడా బాధితులవుతారు. చాలామంది ఒంటరిస్త్రీలు, వితంతువులు... భర్త తోడు లేకుండా కుటుంబాల్ని నెట్టుకొస్తున్నారు. ఎవరి అండా లేకుండానే పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేస్తున్నారు. పురుషులు ఆ పని చేయలేకపోతున్నారు, ఎవరో ఒకరిద్దరు తప్ప. స్త్రీ తోడు లేకుండా బతకగలిగే పురుషులెందరు? కనీసం ఈ వాస్తవాైన్నైనా ఎందుకు గుర్తించరు? సమాజంలో హింసలేని జీవితాన్ని మనుషులందరూ కోరుకుంటున్నారు. అది మానవహక్కు కూడా. కాని స్త్రీలు, పిల్లలు హింసలేని జీవితాన్ని తమ హక్కుగా గుర్తించలేకపోతున్నారు. సమాజంలో శాంతియుత కుటుంబాలు కావాలి. అది ఆధిపత్య సంబంధాలు రద్దయినపుడే సాధ్యమవుతాయి. ఆడవాళ్లయినా, మగవాళ్లయినా ఆధిపత్యం కోరుకోకూడదు. బాధ్యతాయుతమైన మానవ సంబంధాలు మాత్రమే ఉండాలి. మానవజాతి మనుగడ కోసం త్యాగాలు చేసిన పురుషులు, స్త్రీలు ఉన్నారు. పురుష వ్యతిరేకత కాకుండా పురుషాధిపత్య భావజాలాన్ని తొలగించినపుడు మిగిలేది స్త్రీ, పురుషులు. ఎక్కువ తక్కువలు కాదు. - సంధ్య, ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు Sandhya రెండుముఖాలు వద్దు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా మనదేశంలోని పురుషులందరికీ నా అభినందనలు. ఈరోజైనా పురుషులందరూ ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. ‘మీరూ మేము సగం సగం... మీరూ మేము సమం సమం’ అనే మహిళల మాటతో పురుషులందరూ గొంతు కలపాలని ఊరుకుంటే సరిపోదు, ఆచరించాలి. మన సమాజంలో రెండుముఖాలున్న మగవారి సంఖ్య బాగా ఎక్కువ. కొందరు మగవాళ్లు బయటికి స్త్రీవాద కబుర్లు చెప్పి ఇంటికెళ్లి భార్యల్ని హింసిస్తారు. మనసా వాచా మహిళల్ని గౌరవించే మగవారి సంఖ్య చాలా తక్కువ. దీనికి అనాదిగా వస్తున్న పురుష ప్రాధాన్య కట్టుబాట్లే కారణం కాదు, మహిళ తమని మించిపోతోందన్న అభద్రతా భావం కూడా. చదువుల్లో, ఉద్యోగాల్లో, తెలివితేటల్లో మహిళలు రోజురోజుకీ మెరుగవుతున్నారు. కాని మగవారి ఆలోచనలు మాత్రం ఏ కాలంలోనో ఆగిపోయాయి. మహిళల్లో వస్తున్న మార్పుకు తగ్గట్టు మగవారి ఆలోచనతీరు మెరుగవడం లేదు. కొందరిలో మైండ్‌సెట్ మారుతోంది కాని మనసు మారడం లేదు. బిడ్డగా స్త్రీ ఎదుగుదలను కోరుకుంటున్న మగవాళ్లే, భార్యగా ఎదిగితే మాత్రం అడ్డుపడుతున్నారు. మగవారి హృదయం మారడం లేదనడానికి ఇలాంటి ధోరణులే ఉదాహరణలు. వారి అభద్రతాభావం ఏస్థాయికి చేరిందంటే.. స్త్రీల కోసం కొత్త చట్టాలు వచ్చినప్పుడల్లా వాటిని పురుష వ్యతిరేక చట్టంగా భావిస్తున్నారు. అవి కేవలం స్త్రీలను రక్షించడానికి వచ్చిన చట్టాలు కాని పురుషుల్ని వ్యతిరేకించేవి కావు. ఆ మధ్య ఢిల్లీలో నిర్భయ ఘటన సందర్భంగా చాలామంది మగవాళ్లు ‘తాము మగవాళ్లుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం’ అంటూ తమ సానుభూతిని వ్యక్తం చేశారు. అలాంటి సందర్భాల్లో పురుషుల నుంచి స్త్రీలు ఆశించేది సానుభూతి కాదు, తిరుగుబాటు. పురుషుడిగా తోటి పురుషులలో మార్పు తేవాలి. దాని కోసం ఎంతటి పోరాటాలైనా చేయాలి. లేదంటే స్త్రీల రక్షణకోసం పోరాడుతున్నవారికి సాయంగానైనా ఉండాలి. దాన్నే సమానత్వం అంటారు. స్త్రీలకు అన్యాయం జరిగితే తోటి స్త్రీలు స్పందించడం, పురుషులకు అన్యాయం జరిగితే పురుషులు స్పందించడం సమానత్వంలోకి రాదు. దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా లింగభేదం లేకుండా అంతా అండగా నిలబడాలి. అప్పుడే ఆడ, మగ అనే భేదం పోయి అందరం ఒక్కటేనన్న భావం వస్తుంది. - కొండవీటి సత్యవతి, కోఆర్డినేటర్ ‘భూమిక’ హెల్ప్‌లైన్ Kondaveeti Satyavati