రెండు సాహిత్య ఉత్సవాలు | olga writes on jaipur literary festival | Sakshi
Sakshi News home page

రెండు సాహిత్య ఉత్సవాలు

Published Mon, Feb 6 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

రెండు సాహిత్య ఉత్సవాలు

రెండు సాహిత్య ఉత్సవాలు

జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌ గురించి గత ఏడెనిమిదేళ్లుగా వింటున్నా, ప్రతిసారీ ఏదో ఒక వివాదం వస్తుందనే విషయమే మనకు వార్తల్లో ప్రముఖంగా తెలుస్తుంటుంది. కానీ జైççపూర్‌లో నిజంగానే సాహిత్యోత్సవం పెద్ద ఉత్సవంలాగా జరుగుతుందని ప్రత్యక్షంగా చూస్తేనే తెలుస్తుంది. జైçపూర్‌ ఫెస్టివల్‌ నుండి ఆహ్వానం అందినపుడు ‘అబ్బా! జనవరిలో జైççపూర్‌ చలి ఎలా భరించాలి’ అనుకున్నాను. పైగా డిసెంబరంతా కుటుంబరావు అనారోగ్యం చలి వల్ల వచ్చిందే. ఐనా మృణాళిని ఇచ్చిన ధైర్యంతో కుటుంబరావూ, నేనూ కాస్త ఒణుకు తగ్గించుకుని వెళ్లాం. చలి ఉంది. కానీ ప్రపంచమంతటి నుంచీ వచ్చిన వేలాది సాహిత్యాభిమానులు, ముఖ్యంగా యువతీ యువకులు ఆ చలిని తమ ఉత్సాహంతో వెచ్చగా చేసేశారు!

మేం వెళ్ళిన రోజే పెరుమాళ్‌ మురుగన్‌ కనిపించటం, పరిచయం, స్నేహం సంతోషకరమైన అనుభవం. ఆయన సాదాసీదాగానూ, ఆత్మీయంగానూ. గంభీరంగానూ అనిపించారు. పర్వ రచయిత భైరప్ప గారిని కలిసి మాట్లాడటంతో ఆయన సీత గురించి కొత్త పుస్తకం రాశారని తెలిసింది. వెళ్ళిన రోజే మా ఇద్దరి సదస్సులూ ఒకే సమయంలో ఉన్నాయి. డిగ్గీ ప్యాలెస్‌ ఒకే సమయంలో ఏడు సదస్సులు జరిగేంత పెద్దది. అందులో మూడింట్లో వెయ్యి మంది దాకా కూర్చోవచ్చు.

మరో నాలుగింటిలో ఆరేడు వందల మంది కూర్చోవచ్చు. ఒక్క సాహిత్యమే కాదు, సామాజిక విషయాలన్నిటి మీదా సదస్సులు జరుగుతున్నాయి. ఒక గంట అన్నిటినీ తిరిగి వచ్చాం. విలియం డెరిలింపుల్‌ కోహినూర్‌ వజ్ర ప్రయాణాన్ని వివరిస్తున్నాడు. ట్రంప్‌ కంటే మాన్‌శాంటో ఎంత ప్రమాదకరమో నసీమ్‌ నికలస్‌ తాలెబ్‌ చెప్తున్నాడు. గుల్జార్‌ తన కవితా విశేషాలను, అనువాదంలో వచ్చిన సమస్యలను చర్చిస్తున్నాడు. సంజయ్‌ బారు డిమోనిటైజేషన్‌ గురించీ, దానిలోని రాజకీయాల గురించీ ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఒక యువ నెటిజన్‌ రచయిత తన ప్రయోగాల గురించి జనరంజకంగా సంభాషిస్తున్నాడు. ఒక్కసారిగా భయం వేసింది.

మధ్యాహ్నం మూడు గంటలకు దర్బార్‌ హాల్లో వాయు నాయుడు, అర్షియా సత్తార్, నేను సీత గురించి మేం ఎందుకు రాశామో, మా ఆలోచనలేమిటో పంచుకోవాలి. వాయు బ్రిటన్‌ నుంచి వచ్చింది. ‘ఎసెంట్‌ ఆఫ్‌ సీత’  పుస్తకం రాసింది. అర్షియా వాల్మీకి రామాయణాన్ని ఇంగ్లిషులోకి అనువదించింది. నేను ‘విముక్త్త’ కథలు రాశాను. నేను విముక్త రాయటంలోని రెండు ప్రధానాంశాలు ‘ఫెమినిస్ట్‌ సిస్టర్‌హుడ్‌’ ప్రతిపాదించటం, ‘అధికారం, ఆధిపత్యం’ అనే భావనలను స్త్రీల జీవితాల్లోంచి అర్థం చేయించటం అంటూ మాట్లాడటం మొదలు పెట్టగానే అర్థమైంది, ప్రేక్షకులు సానుకూలంగా ఉన్నారని. ‘మృణ్మయ నాదం’ గురించి చెబుతుంటే అందరూ థ్రిల్‌ అయ్యారు.

వాయు, సత్తార్‌ వాల్మీకి రామాయణం గొప్పతనాన్ని గురించి చెప్పారు. సత్తార్‌ ఆమె రాసిన ‘ఉత్తరకాండ’ పుస్తకం నుంచి కొంత చదివింది. మొత్తానికి జైపూర్‌లో విముక్త కథలకు జయమే దొరికింది. ప్రేక్షకులంతా ఆ ఐదు రోజులూ నన్ను పలకరిస్తూనే ఉన్నారు. తర్వాత నా అనువాద పుస్తకం  Liberation of Sita ఉండటంతో రచయిత సంతకాల కోసం పుస్తకాలతో పాఠకులు వచ్చి నిలబడటం, చాలా మంది వచ్చి ‘మీ పుస్తకం Sold out అండీ మాకు కావాలి ఎక్కడ దొరుకుతుంది’ అని అడగటం – ఇదంతా నిజమా, కలా అనిపించింది. బోలెడు ఇంటర్వ్యూలు! హార్పర్‌ కాలిన్స్‌ వాళ్లొక ఇంటర్వ్యూ యూట్యూబ్‌ కోసం రికార్డు చేశారు. ఇలా రాయటం మోడెస్ట్‌గా ఉండదని తెలుస్తున్నా ఈసారి కాస్త మోడెస్టీని పక్కన పెడదాంలే అనిపించింది. క్షమించండి.

నేను విన్న అన్ని ఉపన్యాసాలలోనూ బాగా నచ్చింది, ‘రోమన్‌ సివిలైజేషన్‌: డిటీరియరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ కంట్రీస్‌’. మొత్తం మానవ నాగరికత ఎత్తు పల్లాలను సింపుల్‌గా, వర్తమానానికి కనెక్ట్‌ చేస్తూ మాట్లాడాడా పండితుడు. అది బ్రెక్జిట్‌గానీ, చిత్రకళకు సంబంధించినదిగానీ, వ్యవసాయం గురించిగానీ, రాజకీయ ఆర్థికానికి సంబంధించిగానీ ఎవరే విషయం మాట్లాడినా అర్థం చేసుకుని మేధో చైతన్యాన్ని పొందగలగటం – ‘అమ్మయ్య ఇంటలెక్చువల్‌గా నేను బాగానే ఉన్నాను’ అనుకోగలిగే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది జైçపూర్‌ ఫెస్టివల్‌. మంచి విందులు, వీనుల విందైన ప్రపంచ సంగీతాలు, కనుల విందైన నృత్యాలు అదనపు విశేషం.

ఒక విందులో శ్రీశ్రీ అంతటి రాజస్థానీ మహాకవినీ, మరికొందరు కవులనూ స్నేహితులుగా చేసుకోగలగటం మంచి అనుభవం. అలాగే నేనా జోలికి పోకపోయినా అచ్చంగా గ్లామర్‌ కావలసిన వాళ్లకోసం రుషీ కపూర్, శశి థరూర్, రాజమౌళి, రానా మొదలైన వాళ్ళు మాట్లాడారు. 2007లో హైదరాబాద్‌లో ఎవరికీ తెలియకుండా సభకు పిల్చినట్లే తస్లీమా నస్రీన్‌ని కూడా పిల్చారు. ఐనా తెలిసిపోయింది. సభాప్రాంగణం బైట ఆందోళనలు సాగాయి. నిర్వాహకులు ఇంకోసారి ఆమెను పిలవమని హామీ యిచ్చాక వాళ్ళు వెళ్ళిపోయారని మర్నాడు పేపర్‌ వార్తల వల్ల తెలిసింది. లోపల మాత్రం ఏ అలజడీ లేకుండా తస్లీమా మాట్లాడారు. వెంటనే వెళ్ళిపోయారు.

రచయితలు విశ్రాంతి తీసుకోటానికీ, పరస్పర పరిచయాలు చేసుకోటానికీ ఏర్పాటు చేసిన ప్రదేశంలో మృణాల్‌ పాండే, ఊర్వశీ బుటాలియా వంటి పాత మిత్రులనూ, అనేక మంది దేశ విదేశాల కొత్త మిత్రులనూ కలిశాను. యువ రచయితలు, పాఠకులు, ప్రేక్షకులు అసంఖ్యాకంగా కనిపించి ఒక ఆశను కల్పించారు. మన దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించిన విశ్వాసం బలపడింది. జైపూర్‌ నుంచి చాలా మంది కలకత్తా ఫెస్టివల్‌కు ఆహ్వానితులై వచ్చారు. పెరుమాళ్‌ మురుగన్, లిత్వేనియా నుంచి వచ్చిన యువ ఫెమినిస్టు రచయిత ఇంగా, జావేద్‌ అక్తర్, శశీ థరూర్‌ మళ్ళీ కలకత్తాలో మరింత స్నేహితులయ్యారు. రామచంద్ర గుహతో సి.వి.సుబ్బారావు గురించి మాట్లాడుకోవటం ఎంతో బాగుంది.  

కలకత్తా ఫెస్టివల్‌ని అనితా దేశాయ్‌ ప్రారంభించారు. వయసులో, రచయితగా పెద్దావిడ. చిరునవ్వుతో, ప్రశాంతంగా ఆమె మాట్లాడిన మాటలు ఆ ఉత్సవానికి ఒక మూడ్‌ని ఏర్పరచగలిగాయి. ఈ ఉత్సవంలో కూడా ఇంటర్‌ డిసిప్లినరీ పద్ధతి పాటించారు. వివిధ సామాజిక, రాజకీయ, చారిత్రక, క్రీడా, కళా రంగాల గురించిన ప్రముఖుల ఉపన్యాసాలు, సంభాషణలు రచనతో అనుసంధానమై సమగ్రతను పొందాయి. సునీల్‌ గవాస్కర్, అభినవ్‌ బింద్రా, దీపా (పారా ఒలింపిక్స్‌ విజేత) వంటి క్రీడాకారుల రచనలు, జీవిత చరిత్రలు యువతరానికి ఉత్తేజాన్నిచ్చాయి. ఇక్కడ నవనేత దేవ్‌ సేన్, వైదేహి, నేను, అనుత్తమ కలిసి మళ్ళీ సీత గురించి సంభాషణ చేశాం. ఇంకో సెషన్‌లో ఒరియా రచయిత్రి పరోమిత, జయమిత్ర(బెంగాలీ), నేను ఒక ఆసక్తికరమైన సదస్సులో పాల్గొన్నాం.

అది, ‘భారత దేశాన్ని ఐక్యం చేసిన స్త్రీ పాత్రలు’. ఈ సదస్సులో నేను సంస్కరణ ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో ఆ ఉద్యమాలకు సానుకూల వాతావరణాన్ని కల్పించటంలో బెంగాలి పాత్రలైన రాజ్యలక్ష్మి, సావిత్రి, కిరణ్మయి, కమల, భారతీ (శరత్‌చంద్ర), సుచరిత, లలిత (రవీంద్రుడు), కొన్ని ప్రేమ్‌చంద్‌ పాత్రలు మాత్రమే జోక్యం చేసుకున్నాయనీ అంటూ, ఆ పాత్రలన్నీ మధ్యతరగతి, కులీన, భద్రలోకం నుండి వచ్చి భిన్న జీవితాలు గడిపి మన సానుభూతినీ, ప్రేమనూ పొందాయని చెప్పాను. కానీ ఆ పాత్రలకు బదులు, లేదా వాటితో పాటు మా మధురవాణి (గురజాడ) శశిరేఖ, రాజేశ్వరి, అరుణ, పద్మావతి, లాలస(చలం) అన్ని భాషలలోకి వెళ్ళి భారతదేశాన్ని ఐక్యం చేయగలిగితే మనదేశం మరింత స్త్రీ పురుష సమానత్వంతో ఉండగలిగేదని చెబితే అక్కడున్న యువతీ యువకులు నివ్వెరపోయారు.

ఒకప్పుడు ముక్కు, చెవులు కోయించుకుని వికలమై, మళ్ళీ తన జీవితాన్ని అందంగా నిర్మించుకున్నట్లు నేను రాసిన శూర్పణఖ కథ ప్రస్తావించి, ఇవాళ భారతదేశంలో యాసిడ్‌ దాడులకూ, కత్తిపోట్లకూ, అత్యాచారాలకూ గురి అవుతూ మళ్ళీ తమ జీవితాలను పునర్‌నిర్మించుకుంటున్న లక్షలాది స్త్రీలను ఐక్యం చేయగలిగేది శూర్పణఖ మాత్రమే అన్న నా మాటలకు యువతరం బాగా స్పందించింది. ఈసారి హైదరాబాద్‌ ఫెస్టివల్‌కి వెళ్ళలేకపోయినా రెండు మంచి సాహిత్యోత్సవాలలో పాల్గొన్నాననే తృప్తితో 2017 ప్రారంభమైందని సంతోషంగా అనిపించింది.
- ఓల్గా
9849038926

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement