Vishwa Mahila Navala: తొలి నవలా రచయిత్రులకు పూమాల | Vishwa Mahila Navala Telugu Book Review by P Satyavathi | Sakshi
Sakshi News home page

Vishwa Mahila Navala: తొలి నవలా రచయిత్రులకు పూమాల

Published Tue, Dec 27 2022 1:08 PM | Last Updated on Tue, Dec 27 2022 3:03 PM

Vishwa Mahila Navala Telugu Book Review by P Satyavathi - Sakshi

మహిళా సృజనకారుల గురించీ, వారి జీవించిన సమాజం గురించీ, వారి రచనా స్వేచ్ఛ గురించి పరిశోధించి పాఠకుల చేతిలో పండు వలిచి పెట్టినట్లు రాయడంలో ఎంత శ్రమ, శ్రద్ధ, ఆసక్తీ అవసరమో కదా. అటువంటి ఆసక్తీ, శ్రమా శ్రద్ధల సమ్మేళనమే మృణాళిని ‘విశ్వమహిళా నవల’.

ఇందులో జాపనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లిష్, రష్యన్‌ భాషలలో తొలి నవలా రచయిత్రుల పరిచయం, వారి జీవించిన కాలంలో స్త్రీలకుండే పరిమితులూ, రచయిత్రుల జీవన శైలీ, రచనా శైలీ, వస్తువూ అన్నిటినీ విస్తృతంగా చర్చించారు మృణాళిని. ప్రపంచ సాహిత్యంలోనే మొదటి నవల రాసిన జాపనీస్‌ రచయిత్రి లేడీ మూరసాకీ (978–1014) నుంచి ఫ్రెంచ్‌ రచయిత్రి జార్జ్‌ సాండ్‌ (1804 –1876) వరకూ పదముగ్గురు రచయిత్రుల పరిచయం స్త్రీల సాహిత్య చరిత్రను మనముందు ఉంచుతుంది.

లేడీ మూరసాకి వ్రాసిన ‘ది టేల్‌ ఆఫ్‌ గెన్జి’ ప్రపంచ భాషల్లోనే తొలి నవల అని విమర్శకులు గుర్తించారు. వెయ్యి పేజీల ఈ వచన రచన అప్పటికింకా ప్రాచుర్యంలో లేని నవలా ప్రక్రియను అవలంబించింది. 1వ శతాబ్దం మొదలు 19వ శతాబ్దం వరకూ ఆయా దేశాలలో ఉండే మహిళా రచయిత్రులు అక్కడి రాజకీయ పరిస్థితులు, సామాజిక  నియమ నిబంధనలు, పితృస్వామ్యం... వీటన్నిటినీ తట్టుకుని నవలలు రాశారని ఈ పుస్తకం వల్ల తెలుస్తుంది. కొంతమంది రచయిత్రుల కృషి వారి జీవిత కాలంలో గుర్తింపబడకపోయినా... తరువాత కొంతమంది సద్విమర్శకుల వలన, స్త్రీవాదుల వలన గుర్తించబడింది.

స్త్రీలు తమ స్వంత పేర్లతో రాయడానికి జంకి పురుషుల పేర్లతో రాయడం లేదా అనామకంగా రాయడం, ఎప్పుడైనా ధైర్యంగా రాయడం, రాజకీయాలను గురించి రాయడం, ప్రభుత్వాలను ప్రశ్నించడం... చివరకు నెపోలియన్‌నే నిలదీసి ఆయన ఆగ్రహానికి గురి కావడం ఈ పుస్తకంలో చూస్తాం. త్రికోణ ప్రేమ కథలు, హారర్‌ కథలు రాసిన తొలి రచయిత్రులు కూడా వీరు అయ్యారు. పల్లె సీమల అందాలని రొమాంటిసైజ్‌ చేయడం కాక అక్కడి ప్రజా జీవనాన్ని చిత్రించారు. కొందరు రచయిత్రులు ప్రఖ్యాత పురుష రచయితలకు ప్రేరణ కూడా అయ్యారు. సమాజం విమర్శించే జీవన శైలులు కూడా అవలంబించారు.

ఈ పుస్తకానికి ఓల్గా కూలంకషమైన పరిచయం రాశారు. రచయిత్రుల జీవన కాలం, రచనా కాలం, వారి జీవిత విశేషాలు, అనుభవాలు... ఏదీ వదలకుండా ఒక సంపూర్ణ చరిత్రను... అందులోనూ ప్రపంచ మహిళా రచయితల చరిత్రను ఇష్టంగా మనకు అందించిన మృణాళినికి అభినందలు లేదా కృతజ్ఞతలు అనేవి చాలా పేలవమైన మాటలు. ప్రస్తుతం అన్ని విశ్వ విద్యాలయాల్లో స్త్రీ అధ్యయన కేంద్రాలు ఉంటున్నాయి. ఆ కేంద్రాలలో ఈ పుస్తకం తప్పనిసరిగా ఉండాలి. (చదవండి: కళ్లు తెరిపించే కథా రచయిత్రి)

ఇటువంటి వ్యాస సంపుటులు ఇంగ్లిష్‌లో ఉంటాయి కానీ తెలుగులో ఇదే మొదటిది అని అనుకుంటున్నాను. ఇంగ్లిష్‌కన్నా తెలుగులో చదువుకోవడం సులభం కనుక యిది సాహితీ ప్రేమికులకూ చరిత్ర అభిమానులకూ మంచి కానుక. మరొక విషయమేమిటంటే ఇందులో మృణాళిని ప్రతి విదేశీ పదానికీ సరి అయిన ఉచ్ఛారణ ఇచ్చారు. ధృతి పబ్లికేషన్స్‌ ప్రచురించిన ‘విశ్వ మహిళా నవల’ హైదరాబాద్‌లోని నవోదయలో కొనుక్కోవచ్చు. చదువుతూ నాణ్యమైన సమయం గడపవచ్చు.


- పి. సత్యవతి 
ప్రముఖ రచయిత్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement