పేజ్‌ త్రీ కేళీ.. కామోత్సవ్‌ | Gunturu Seshendra Sharma Book Kamostav Review in Telugu | Sakshi
Sakshi News home page

పేజ్‌ త్రీ కేళీ.. కామోత్సవ్‌

Published Thu, Feb 18 2021 4:32 PM | Last Updated on Tue, Feb 23 2021 8:19 AM

Gunturu Seshendra Sharma Book Kamostav Review in Telugu - Sakshi

విలువలు మధ్యతరగతి జీవితాల వెలలు. ఆ పై తరగతికి సంతోషమే పరమావధి.. కింది తరగతికి బతుకీడ్చమే ప్రధానం. అందుకే ఆ రెండింటి భారాన్ని మధ్యతరగతి మోస్తూ ఉంటుంది. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ‘కామోత్సవ్‌’ ఈ విషయాన్నే వెల్లడిస్తుంది ఉన్నత వర్గపు జీవన శైలిని నవల రూపంలో. కథానాయకుడు జ్ఞాన్‌.. చిత్రకారుడు. చిత్రకళ మీదే కాదు సాహిత్యం, చరిత్ర, సమకాలీన రాజకీయాల మీదా పట్టున్నవాడు. లెఫ్ట్‌ ఐడియాలజీ ప్రేమికుడు. ఎలీట్‌ కుటుంబపు అల్లుడు. ఆ లైఫ్‌స్టయిల్‌లోని సుఖభోగాలన్నిటినీ అనుభవిస్తుంటాడు, ఆస్వాదిస్తుంటాడు. 

పోలీసు నిర్బంధంలో ఉన్న ఓ వ్యక్తిని కలిసి పోలీసులకు పట్టుబడి.. వాళ్ల కన్నుగప్పి పారిపోయి నిందితుడిగా వాళ్ల గాలింపులో ఉంటాడు. భార్య కీర్తి జ్ఞాన్‌ను కాపాడుకునే ప్రయత్నంతో ముంబై తీసుకెళ్తుంది. అక్కడ స్టార్‌ హోటల బస, సినిమా, వ్యాపార, రాజకీయవేత్తల, కళాకారుల పార్టీలతో కాలం వెలిబుచ్చుతుంటారు. అది ఏ మలుపు తీసుకొని ఎక్కడికి వెళ్తుందనే గమనం ఆసక్తిగా సాగుతుంది. ఈ క్రమంలో ఉన్నత వర్గాల జీవితాలను, సంబంధాలను, చట్టాలకతీతమైన వాళ్ల వెసులుబాటునూ చెప్తుందీ నవల. 1987లో అప్పటి ఆంధ్రజ్యోతిలో సీరియల్‌గా వచ్చిన కామోత్సవ్‌ను ఈ యేడు నవలగా తీసుకొచ్చారు.  కాలతీతం కాని రచన. వర్తమానాన్నే ప్రతిబింబిస్తుందేమో అనిపిస్తుంటుంది పాఠకులకు. 

అప్పట్లో ఈ సీరియల్‌ ఒక సంచలనం. అశ్లీల రచనగా కోర్ట్‌ దాకా వెళ్లింది. కాని ఆ కేసును కోర్ట్‌ కొట్టిపారేసింది. ఇప్పటి సాహిత్యమే కాదు, సినిమాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోని కథాంశాలు, చిత్రీకరణలతో పోల్చుకుంటే కామెత్సవ్‌ మీద అశ్లీల రచన ముద్ర హాస్యాస్పదం అనిపిస్తుంది. ‘పేజ్‌ త్రీ’ సినిమా కంటే ఎన్నో ఏళ్ల ముందే తెలుగులో ఆ కల్చర్‌ మీద ఈ రచన వచ్చింది. పేజ్‌ త్రీ కల్చర్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న పాఠకులకు ఆ కుతూహలాన్ని తీర్చే నవల కామోత్సవ్‌. 
  

కామోత్సవ్‌
రచయిత.. గుంటూరు శేషేంద్ర శర్మ
ప్రచురణ: గుంటూరు శేషేంద్ర శర్మ మెమోరియల్‌ ట్రస్ట్‌ 
పేజీలు: 198, వెల.. 200 రూపాయలు
ప్రతులకు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పుస్తక దుకాణాల్లో దొరుకుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement