telugu novel
-
Vishwa Mahila Navala: తొలి నవలా రచయిత్రులకు పూమాల
మహిళా సృజనకారుల గురించీ, వారి జీవించిన సమాజం గురించీ, వారి రచనా స్వేచ్ఛ గురించి పరిశోధించి పాఠకుల చేతిలో పండు వలిచి పెట్టినట్లు రాయడంలో ఎంత శ్రమ, శ్రద్ధ, ఆసక్తీ అవసరమో కదా. అటువంటి ఆసక్తీ, శ్రమా శ్రద్ధల సమ్మేళనమే మృణాళిని ‘విశ్వమహిళా నవల’. ఇందులో జాపనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లిష్, రష్యన్ భాషలలో తొలి నవలా రచయిత్రుల పరిచయం, వారి జీవించిన కాలంలో స్త్రీలకుండే పరిమితులూ, రచయిత్రుల జీవన శైలీ, రచనా శైలీ, వస్తువూ అన్నిటినీ విస్తృతంగా చర్చించారు మృణాళిని. ప్రపంచ సాహిత్యంలోనే మొదటి నవల రాసిన జాపనీస్ రచయిత్రి లేడీ మూరసాకీ (978–1014) నుంచి ఫ్రెంచ్ రచయిత్రి జార్జ్ సాండ్ (1804 –1876) వరకూ పదముగ్గురు రచయిత్రుల పరిచయం స్త్రీల సాహిత్య చరిత్రను మనముందు ఉంచుతుంది. లేడీ మూరసాకి వ్రాసిన ‘ది టేల్ ఆఫ్ గెన్జి’ ప్రపంచ భాషల్లోనే తొలి నవల అని విమర్శకులు గుర్తించారు. వెయ్యి పేజీల ఈ వచన రచన అప్పటికింకా ప్రాచుర్యంలో లేని నవలా ప్రక్రియను అవలంబించింది. 1వ శతాబ్దం మొదలు 19వ శతాబ్దం వరకూ ఆయా దేశాలలో ఉండే మహిళా రచయిత్రులు అక్కడి రాజకీయ పరిస్థితులు, సామాజిక నియమ నిబంధనలు, పితృస్వామ్యం... వీటన్నిటినీ తట్టుకుని నవలలు రాశారని ఈ పుస్తకం వల్ల తెలుస్తుంది. కొంతమంది రచయిత్రుల కృషి వారి జీవిత కాలంలో గుర్తింపబడకపోయినా... తరువాత కొంతమంది సద్విమర్శకుల వలన, స్త్రీవాదుల వలన గుర్తించబడింది. స్త్రీలు తమ స్వంత పేర్లతో రాయడానికి జంకి పురుషుల పేర్లతో రాయడం లేదా అనామకంగా రాయడం, ఎప్పుడైనా ధైర్యంగా రాయడం, రాజకీయాలను గురించి రాయడం, ప్రభుత్వాలను ప్రశ్నించడం... చివరకు నెపోలియన్నే నిలదీసి ఆయన ఆగ్రహానికి గురి కావడం ఈ పుస్తకంలో చూస్తాం. త్రికోణ ప్రేమ కథలు, హారర్ కథలు రాసిన తొలి రచయిత్రులు కూడా వీరు అయ్యారు. పల్లె సీమల అందాలని రొమాంటిసైజ్ చేయడం కాక అక్కడి ప్రజా జీవనాన్ని చిత్రించారు. కొందరు రచయిత్రులు ప్రఖ్యాత పురుష రచయితలకు ప్రేరణ కూడా అయ్యారు. సమాజం విమర్శించే జీవన శైలులు కూడా అవలంబించారు. ఈ పుస్తకానికి ఓల్గా కూలంకషమైన పరిచయం రాశారు. రచయిత్రుల జీవన కాలం, రచనా కాలం, వారి జీవిత విశేషాలు, అనుభవాలు... ఏదీ వదలకుండా ఒక సంపూర్ణ చరిత్రను... అందులోనూ ప్రపంచ మహిళా రచయితల చరిత్రను ఇష్టంగా మనకు అందించిన మృణాళినికి అభినందలు లేదా కృతజ్ఞతలు అనేవి చాలా పేలవమైన మాటలు. ప్రస్తుతం అన్ని విశ్వ విద్యాలయాల్లో స్త్రీ అధ్యయన కేంద్రాలు ఉంటున్నాయి. ఆ కేంద్రాలలో ఈ పుస్తకం తప్పనిసరిగా ఉండాలి. (చదవండి: కళ్లు తెరిపించే కథా రచయిత్రి) ఇటువంటి వ్యాస సంపుటులు ఇంగ్లిష్‌లో ఉంటాయి కానీ తెలుగులో ఇదే మొదటిది అని అనుకుంటున్నాను. ఇంగ్లిష్‌కన్నా తెలుగులో చదువుకోవడం సులభం కనుక యిది సాహితీ ప్రేమికులకూ చరిత్ర అభిమానులకూ మంచి కానుక. మరొక విషయమేమిటంటే ఇందులో మృణాళిని ప్రతి విదేశీ పదానికీ సరి అయిన ఉచ్ఛారణ ఇచ్చారు. ధృతి పబ్లికేషన్స్ ప్రచురించిన ‘విశ్వ మహిళా నవల’ హైదరాబాద్‌లోని నవోదయలో కొనుక్కోవచ్చు. చదువుతూ నాణ్యమైన సమయం గడపవచ్చు. - పి. సత్యవతి ప్రముఖ రచయిత్రి -
వీరే ‘ఆటా’ నవలల పోటీ విజేతలు
తెలుగు భాషా, సాహిత్యంపైన మక్కువతో అమెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్వహించిన నవలల పోటీకి ప్రపంచం నలుమూలల నుండి దాదాపుగా 70 వరకూ నవలలు వచ్చాయి. అనేక పరిశీలనలూ, వడ పోతల తర్వాత ఈ దిగువ నవలలకు బహుమతి మొత్తాన్ని సమానంగా పంచాలని న్యాయనిర్ణేతలు నిర్ణయించారు. బహుమతి పొందిన నవలలు పగులు (తాడికొండ శివకుమార శర్మ, వర్జీనియా), కొంతమంది... కొన్నిచోట్ల... (వివిన మూర్తి, బెంగళూరు)గా ఉన్నాయి. విజేతలకు చెరి లక్ష రూపాయలు బహుమతిగా అందివ్వనున్నారు. ఈ రెండు నవలలను ‘ఆటా’ త్వరలో ప్రచురిస్తుంది. ఈ పోటీలో పాల్గొన్న ప్రతీ రచయితకీ, రచయిత్రికీ మా ఆటా కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ పోటీ నిర్వహణలో మాకు ఎంతో సహకరించి, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన రమణమూర్తి, స్వాతికుమారి, అనిల్ రాయల్, పద్మవల్లి గార్లకు ప్రత్యేక ధన్యవాదాలని ఆటా పేర్కొంది. -
పేజ్ త్రీ కేళీ.. కామోత్సవ్
విలువలు మధ్యతరగతి జీవితాల వెలలు. ఆ పై తరగతికి సంతోషమే పరమావధి.. కింది తరగతికి బతుకీడ్చమే ప్రధానం. అందుకే ఆ రెండింటి భారాన్ని మధ్యతరగతి మోస్తూ ఉంటుంది. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ‘కామోత్సవ్’ ఈ విషయాన్నే వెల్లడిస్తుంది ఉన్నత వర్గపు జీవన శైలిని నవల రూపంలో. కథానాయకుడు జ్ఞాన్.. చిత్రకారుడు. చిత్రకళ మీదే కాదు సాహిత్యం, చరిత్ర, సమకాలీన రాజకీయాల మీదా పట్టున్నవాడు. లెఫ్ట్ ఐడియాలజీ ప్రేమికుడు. ఎలీట్ కుటుంబపు అల్లుడు. ఆ లైఫ్‌స్టయిల్‌లోని సుఖభోగాలన్నిటినీ అనుభవిస్తుంటాడు, ఆస్వాదిస్తుంటాడు. పోలీసు నిర్బంధంలో ఉన్న ఓ వ్యక్తిని కలిసి పోలీసులకు పట్టుబడి.. వాళ్ల కన్నుగప్పి పారిపోయి నిందితుడిగా వాళ్ల గాలింపులో ఉంటాడు. భార్య కీర్తి జ్ఞాన్‌ను కాపాడుకునే ప్రయత్నంతో ముంబై తీసుకెళ్తుంది. అక్కడ స్టార్ హోటల బస, సినిమా, వ్యాపార, రాజకీయవేత్తల, కళాకారుల పార్టీలతో కాలం వెలిబుచ్చుతుంటారు. అది ఏ మలుపు తీసుకొని ఎక్కడికి వెళ్తుందనే గమనం ఆసక్తిగా సాగుతుంది. ఈ క్రమంలో ఉన్నత వర్గాల జీవితాలను, సంబంధాలను, చట్టాలకతీతమైన వాళ్ల వెసులుబాటునూ చెప్తుందీ నవల. 1987లో అప్పటి ఆంధ్రజ్యోతిలో సీరియల్‌గా వచ్చిన కామోత్సవ్‌ను ఈ యేడు నవలగా తీసుకొచ్చారు. కాలతీతం కాని రచన. వర్తమానాన్నే ప్రతిబింబిస్తుందేమో అనిపిస్తుంటుంది పాఠకులకు. అప్పట్లో ఈ సీరియల్ ఒక సంచలనం. అశ్లీల రచనగా కోర్ట్ దాకా వెళ్లింది. కాని ఆ కేసును కోర్ట్ కొట్టిపారేసింది. ఇప్పటి సాహిత్యమే కాదు, సినిమాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోని కథాంశాలు, చిత్రీకరణలతో పోల్చుకుంటే కామెత్సవ్ మీద అశ్లీల రచన ముద్ర హాస్యాస్పదం అనిపిస్తుంది. ‘పేజ్ త్రీ’ సినిమా కంటే ఎన్నో ఏళ్ల ముందే తెలుగులో ఆ కల్చర్ మీద ఈ రచన వచ్చింది. పేజ్ త్రీ కల్చర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న పాఠకులకు ఆ కుతూహలాన్ని తీర్చే నవల కామోత్సవ్. కామోత్సవ్ రచయిత.. గుంటూరు శేషేంద్ర శర్మ ప్రచురణ: గుంటూరు శేషేంద్ర శర్మ మెమోరియల్ ట్రస్ట్ పేజీలు: 198, వెల.. 200 రూపాయలు ప్రతులకు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పుస్తక దుకాణాల్లో దొరుకుతుంది. -
ఆవ పువ్వుల తివాసీ
తెలుగు నవలే అనుకునేంతగా తెలుగు పాఠకులు సొంతం చేసుకున్న బెంగాలీ నవల ‘వనవాసి’. ఈ బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ రచనను సూరంపూడి సీతారాం అనువదించారు. అందులోంచి కొంత భాగం ఇక్కడ. సౌజన్యం: హైదరాబాద్ బుక్ ట్రస్ట్. ఫూల్కియా అరణ్యం దాటగానే, ఎదురుగా పువ్వుతొడిగిన ఆవచేలు కనబడ్డాయి. దృష్టి ఎంతదూరం సారిస్తే అంత దూరమూ కుడివైపునా, ఎడమవైపునా, ఎదుటా, అంతా ఒకే పసుపు పచ్చని పువ్వుల తివాసీ. చక్రవాల రేఖవరకూ పరచిన బ్రహ్మాండమైన తివాసీ, ఎక్కడా అడ్డులేదు, విరామం లేదు. అడవి ఈ చివర నుంచి, అటు బహుదూరంలో ఉన్న శైలశ్రేణి ఒడిలో లీనమైపోయింది. పైన శీతాకాలపు నిర్మేఘపు నీలాకాశం, కింద ఈ పసుపు పచ్చని తివాసీ. అపూర్వమైన ఈ సస్యక్షేత్రంలో మధ్య మధ్య రెల్లు కప్పిన కుటీరాలు మాత్రం కొద్దిగా కనబడతాయి. దుస్సహమైన ఈ చలిలో భార్యాపిల్లలను పెట్టుకుని, చుట్టూ రెల్లు తడికలు మాత్రం కట్టిన ఈ గుడిసెలలో ఈ ఆరుబయలు ప్రాంతంలో, వాళ్లు ఎలా ఉంటున్నారో తెలియలేదు. కోతల రోజులలో పొలాలలోనే మకాంవేసి శిస్తులు వసూలు చెయ్యడం ఈ దేశంలో పరిపాటి. పంట కళ్లంలో ఉండగానే శిస్తు వసూలు చెయ్యకపోతే ఇంత నిరుపేదలు మళ్లీ ఎన్నడూ చెల్లించలేరు.‘‘అయితే ఇక్కడొక డేరా వేయించమంటారా?’’ అని తహసీల్దారు అడిగాడు. ‘‘ఒక్కపూటలో ఒక చిన్న రెల్లు గుడిసె వేయించకూడదూ?’’ అన్నాను. అదే జరిగింది. దగ్గర దగ్గరలో మూడు నాలుగు చిన్న గుడిసెలు కట్టారు. ఒకటి నేను పడుకునేటందుకు. ఒకటి వంటయిల్లు, ఒకదానిలో ఇద్దరు సిపాయిలు, పట్వారీ ఉండడానికి ఏర్పాటయినాయి. వీటికి గుమ్మాలకీ కిటికీలకీ రెల్లు తడికలే కడతారు. అవి సరిగా ముయ్యడానికి వీలుండదు. రాత్రివేళ గాలి లోపలికి రయ్యిన వీస్తుంది. చలి గజగజ వణికిస్తుంది. దాదాపు మోకాళ్లపై వంగి మరీ లోపలికి ప్రవేశించాలి; అవి అంత పొట్టివి. గది మధ్యలో ఒత్తుగా కొమ్మలూ రెమ్మలూ ఆకులూ వేసి వాటిపైన ఒక జంపకానా పరిచి, ఆ పైన పరుపూ దుప్పటీ వేసి పడక తయారు చేశారు. ఈ పడక గది ఏడడుగులు పొడుగు, మూడడుగులు వెడల్పు. అందులో లేచి నిలబడడం అసంభవం. దాని ఎత్తు మూడడుగులు మాత్రం. అయినా చక్కగా ఉంది పూరి గుడిసె. ఇంత విశ్రాంతి, ఇటువంటి ఆనందం, కలకత్తా నగరంలో నాలుగంతస్థుల మేడలో ఉన్నప్పటికీ లభ్యం కాదు. అయితే, నేను చాలారోజులబట్టి ఇక్కడే ఉంటున్నందువల్ల, అరణ్యవాసినై పోయినట్టున్నాను. నా ఆసక్తీ, అభిరుచీ, దృష్టీ ఈ అరణ్య జీవితానుభవం ప్రభావం వల్ల మారిపోయి ఉండాలి. కుటీరంలో ప్రవేశించగానే పచ్చికొమ్మల కొత్తవాసన ఆహ్లాదకరంగా వచ్చింది. ఇందులో ఇంకొకటి నాకు ఎంతో నచ్చింది. పడకపైన అర్ధశయనంగా పడుకుంటే, తల దిక్కున అడుగు వెడల్పూ అంతే పొడగూ ఉన్న కిటికీవంటి కంతలో నుంచి చూస్తూ, సరిగ్గా కంటికి సమరేఖలో పసుపు పచ్చని ఆవ పువ్వుల తివాసీ కనబడుతుంది. ఇటువంటి దృశ్యం అపూర్వం. ఇదొక నూతన అనుభవం. పృథ్వి అంతా పచ్చని తివాసీగా మారిపోయినట్లు, ఈ జగత్తులో నేను ఒంటరిగా ఆ తివాసీపైన పడుకున్నట్లు అనిపించింది. -
తొలి తెలుగు మనోవైజ్ఞానిక నవలకు 70!
అసమర్థుని జీవయాత్రకు 70 యేళ్లు జీవితం జీవించటం కోసమే తప్ప సిద్ధాంతాల కోసం కాదన్న ఒక ప్రాథమిక సత్యాన్ని ఈ నవల ఆవిష్కరిస్తుంది. తెలుగు నవలా సాహిత్యంలో ఆధునిక యుగం పందొమ్మిది వందల నలబైలలో ప్రారంభమయ్యిందని విమర్శకులు నిర్ణయించారు. 1946లో వెలువడిన త్రిపురనేని గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’తో ఈ ఆధునిక యుగం మొదలైందన్నారు. దీనికి ముందు వెలువడిన నవలల్లో సంఘ సంస్కరణ దృష్టి ప్రధానంగా కనిపించేది. మానవుల కష్టసుఖాలకు సంఘమే ప్రధాన కారణమనీ, సంఘం మారితే తప్ప వ్యక్తులు సుఖంగా జీవించలేరనీ ఆనాటి నవలాకారులు భావించేవారు. కానీ మానవుల కష్టాలకు గానీ, సుఖాలకు గానీ ఆయా వ్యక్తుల మనస్తత్వమే కారణమౌతుందని గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’లోనూ, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’లోనూ ప్రతిపాదించారు. సిగ్మండ్ ఫ్రాయిడ్, యూంగ్, అడ్లర్ మొదలైన మనస్తత్వ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన మనోవిశ్లేషణా సూత్రాల ప్రభావంతో పందొమ్మిది వందల ఇరవైలలో పాశ్చాత్య సాహిత్యంలో డి.హెచ్.లారెన్స్, జేమ్స్ జాయిస్, వర్జీనియా ఉల్ఫ్ మొదలైనవారు నవలలు రచించారు. ఈ తరహా మనస్తాత్విక నవలలను ‘మనోవైజ్ఞానిక నవలలు’ అన్నారు. ‘అసమర్థుని జీవయాత్ర’ను తెలుగులో వెలువడిన మొట్టమొదటి మనోవైజ్ఞానిక నవల అని చెప్పొచ్చు. ఈ నవలలోని వస్తువు సీతారామారావులోని మానసిక సంఘర్షణను చిత్రించటం! సీతారామారావు మీద అతని తండ్రి ప్రభావం బలంగా ఉంది. సీతారామారావులో ‘గోపీచంద్’ కనిపిస్తాడు. ఒక రకంగా గోపీచంద్ ‘ఆత్మకథాత్మక’ నవల అనొచ్చు. గోపీచంద్ తండ్రి త్రిపురనేని రామస్వామి చౌదరి హేతువాదాన్ని ప్రచారం చేశాడు. ఈ హేతువాదం ప్రభావం బాల్యంలోనే గోపీచంద్ మీద పడింది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనకు కారణమేమిటి?– ప్రతి సమస్య ‘ఎందుకు?’ ఉత్పన్నమైందని ప్రశ్నించుకోవటం హేతువాదుల ప్రధాన లక్షణం. అయితే, ఎవరి జీవితం కూడా హేతువాదం ప్రకారం జరగదు. తండ్రి ప్రభావంతో హేతువాదాన్ని వంటపట్టించుకున్న గోపీచంద్ తన జీవితాన్ని హేతువాదం ప్రకారం మలుచుకోబోయి ఎదురుదెబ్బలు తిన్నాడు. ఆర్.ఎస్.సుదర్శనం అన్నట్టు, ‘‘తెలుగుదేశంలో హేతువాదాన్ని ప్రచారంలోకి తెచ్చిన తండ్రి రామస్వామి చౌదరి మరణించాక గోపీచంద్ అనుభవించిన మనోవైకల్యానికి ప్రతిబింబమే ఈ నవల. ఈ మనోవైకల్యం సామాన్యమైనది కాదు. మృత్యువుతో హుటాహుటి పోరాటం. నవలలో నాయకుడైన సీతారామారావు మృత్యువు చేతిలో ఓడిపోయాడు. కానీ ఈ నవల రాయడం ద్వారా తనలోని సీతారామారావు మృతి చెందడం ద్వారా, గోపీచంద్ వ్యక్తిగతంగా పునర్జన్మ వంటి అనుభూతిని పొంది, కొత్త దృక్పథంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు’’. సీతారామారావు ఎదుర్కొన్న తీవ్ర విషాదానికి కారణం అతడు జయించలేని మానసిక శక్తులే. ‘‘ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది వంశ గౌరవమే’’ అన్న భావాన్ని తండ్రి పెకిలించటానికి సాధ్యం కానంత శక్తిమంతంగా నాటిపోయాడు. తండ్రి సంపాదించి పోయిన ఆస్తి ఉన్నంత కాలం సీతారామారావు వంశ గౌరవాన్ని నిలుపగల్గాడు. అయితే, ఆస్తిపోతే వంశ గౌరవం కూడా పోతుందన్న ప్రాథమిక సత్యం అతని అవగాహనలో లేదు. వేలకు వేల ఆస్తిని మంచినీళ్ళలా ఖర్చు చేసిన సీతారామారావుకు తన భార్యాబిడ్డల్ని కూడా పోషించుకోలేని దుస్థితి యేర్పడటంతో నైతికంగా పతనమైపోతాడు. అయినా తన పతనానికి కారణం తాను కాదనీ, తన భార్యాపిల్లలు, మామ, మేనమామ మొదలైనవాళ్ళనే భ్రమలో బతుకుతాడు. తన పతనానికి కారణం తండ్రే అయినా, తండ్రి నేర్పిన పాఠాలను తన జీవితానుభవాల ద్వారా మార్చుకోలేకపోయిన తన అసమర్థతే తన పతనానికి కారణమనే జ్ఞానోదయం కల్గటంతో తన పట్ల తనకే విపరీతమైన ద్వేషం, కసి జనించి, తనను తాను నిర్దాక్షిణ్యంగా హతమార్చుకోవటంతో ‘అసమర్థుని జీవయాత్ర’ పరిసమాప్తమౌతుంది. త్రిపురనేని గోపీచంద్ సీతారామారావు మనస్తత్వం భార్యమీద చెయ్యి చేసుకునే సన్నివేశంలో చక్కగా అర్థమవుతుంది. అతనికి భార్యమీద కోపం వొచ్చింది. తన్ను అనవసరంగా ఎంత క్షోభ పెట్టింది. దొడ్లో నుంచి తన భార్య వస్తూవుంది. ఆమె కంటపడేటప్పటికి వొళ్ళు చురచురా మండిపోయింది. తన్నింత కష్టపెట్టి, ఏమీ ఎరగనట్లు నంగనాచికిమల్లే, అడుగులో అడుగు వేసుకుంటూ వొస్తూంది. ఇంట్లోనే ఉంది, చెక్కుచెదరకుండా వుండి తన్నెంత వేదన పెట్టింది. పాప వెంట వస్తూంది. ఎదురుగా వెళ్ళాడు– ‘‘ఏ ం చేస్తున్నావిక్కడ?’’ అని అడిగాడు. ఆమె మాట్లాడలేదు ‘‘చెప్పవేం?’’ అన్నాడు. ‘‘ఏముంది చెప్పటానికి? ఇంట్లోకి వెళ్తున్నాను’’ అంది. అతన్ని నఖశిఖ పర్యంతం చూస్తూ నిలబడింది. ఆ చూపులు అతనికి తను పెంచిన కుక్కను జ్ఞప్తికి తెచ్చినయి. ఆ కుక్క అలాగే చూసేది. చూపుల్లో అర్థం వుండేది కాదు. తన్నేదో పరీక్షిస్తున్నట్టూ, తన హృదయంలో వున్న రహస్యాలు తెలుసుకోటానికి ప్రయత్నిస్తున్నట్టూ చూసేది. ‘‘ఎందుకట్లా చూస్తావు?’’ అని అడిగాడు. పాప గజగజలాడుతూ తల్లి వెనక నక్కింది. ఆమె మాట్లాడలేదు. తన కుక్క కూడా ఇంతే! కసిరినా తన్ను విడిచి పెట్టేది కాదు. చూపులు మానేది కాదు. ‘‘నీ సంగతి నాకు తెలుసులే’’ అన్నట్టు చూసేది. కొడితే ‘‘కుయ్యో–కుయ్యో’’ అనేది. మళ్ళా అట్లాగే చూసేది. ‘‘ఏం కొడతావా?’’ అన్నాడు. ‘‘నేనేం కొడతాను’’ అంది. ఎందుకంత నిస్పృహ– తన కుక్కా అంతే. అతనికి వొళ్ళు మండింది. ‘‘అయితే నేను కొడతాను’’ అని చెంపమీద ఛెడేలున కొట్టాడు. పాప కెవ్వుమన్నది. కాని ఆమె అలాగే చూస్తూ నిలబడిపోయింది. అతను కొట్టాడు, తన భార్యను కొట్టాడు. అతని శరీరం భయంతో వణికిపోయింది. ఆయాసం ఎక్కువై వగర్పు పుట్టింది. తను కొట్టాడు. చుట్టూ వున్న వస్తువులు ఏవీ అతనికి కనపట్టంలేదు. అంతా అయోమయం అయింది. లోపల నరాలు చిటేలు చిటేలున విరుగుతున్నట్టు అనిపించింది. సీతారామారావుకు భార్య మీద కోపం రావటం, తనకు కోపం వచ్చినా ఆమె యేమీ చలించకుండా ఉండటం వల్ల అతని కోపం ఎక్కువ కావడం, తీరా కొట్టాక ఒకప్పటి తన ఆదర్శ భావాల నుండి పతనమైపోయాననే జిజ్ఞాస కల్గటం, అది విపరీతమైన పశ్చాత్తాపాన్ని సృష్టించటం– ఇవీ ఈ దృశ్యంలో గోపీచంద్ చిత్రించిన సీతారామారావులోని మానసిక సంఘర్షణతో కూడిన సన్నివేశాలు. సీతారామారావుకు చివర్లో అతని తండ్రిమీద కూడా ద్వేషం జనిస్తుంది. తండ్రి తనను వాస్తవ జీవితం నుండి దూరం చేశాడనే జ్ఞానోదయం కల్గుతుంది. ఒరేయి మనం పుట్టటం నిజం, చావటం నిజం, మధ్యన బ్రతకటం నిజం. పుట్టటం, చావటం మన చేతుల్లో లేదురా. ఇక బ్రతకటం ఒకటేరా మిగిలింది. బతకటానికి మనకు కావలసింది అన్నమే గదరా, మరి దీనికింత గొడవెందుకురా! నలుగురం కూడబలుక్కుని బతకలేమంటారా? ఈ ప్రపంచంలో ఏమో వుందని మభ్యపెట్టి దానికోసం పోట్లాడుకు చచ్చేటట్టు చేస్తున్నార్రా! అంతకంటే ఏమీ లేదురా తండ్రుల్లారా, మనం కొన్నాళ్లు ఇక్కడ బతకాలి. యెవరైనా అంతే. దీనికి కలహాలూ, రక్తపాతాలూ ఎందుకురా. ఎవరు కట్టుకుపోయేది ఏముందిరా. బతకండ్రా తండ్రుల్లారా, చచ్చేదాకా బతకండి. ఇది చివరకు సీతారామారావులో కల్గిన వాస్తవిక దృష్టి. ఆర్.ఎస్.సుదర్శనం అన్నట్టు– ‘‘సీతారామారావు పాత్రను సృష్టించటం ద్వారా గోపీచంద్ సాధించిన విజయం: సాంఘికదృష్టికీ, ఆదర్శాలకూ అతీతమైన జీవితం పట్ల విశ్వాసం. జీవితం ఎందుకు అన్న ప్రశ్నకు జీవితం జీవించటానికే అన్నదే సమాధానం’’. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కాక, ఓ సిద్ధాంతానికి కట్టుబడాలని ప్రయత్నించే వాళ్ళ జీవితాలు ఎలా ఛిద్రమైపోతాయో ఈ నవల మనకు చెబుతుంది. జీవితం జీవించటం కోసమే తప్ప సిద్ధాంతాల కోసం కాదన్న ఒక ప్రాథమిక సత్యాన్ని ఈ నవల మనలో ఆవిష్కరిస్తుంది. అంపశయ్య నవీన్