తెలుగు నవలే అనుకునేంతగా తెలుగు పాఠకులు సొంతం చేసుకున్న బెంగాలీ నవల ‘వనవాసి’. ఈ బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ రచనను సూరంపూడి సీతారాం అనువదించారు. అందులోంచి కొంత భాగం ఇక్కడ. సౌజన్యం: హైదరాబాద్ బుక్ ట్రస్ట్.
ఫూల్కియా అరణ్యం దాటగానే, ఎదురుగా పువ్వుతొడిగిన ఆవచేలు కనబడ్డాయి. దృష్టి ఎంతదూరం సారిస్తే అంత దూరమూ కుడివైపునా, ఎడమవైపునా, ఎదుటా, అంతా ఒకే పసుపు పచ్చని పువ్వుల తివాసీ. చక్రవాల రేఖవరకూ పరచిన బ్రహ్మాండమైన తివాసీ, ఎక్కడా అడ్డులేదు, విరామం లేదు. అడవి ఈ చివర నుంచి, అటు బహుదూరంలో ఉన్న శైలశ్రేణి ఒడిలో లీనమైపోయింది. పైన శీతాకాలపు నిర్మేఘపు నీలాకాశం, కింద ఈ పసుపు పచ్చని తివాసీ. అపూర్వమైన ఈ సస్యక్షేత్రంలో మధ్య మధ్య రెల్లు కప్పిన కుటీరాలు మాత్రం కొద్దిగా కనబడతాయి. దుస్సహమైన ఈ చలిలో భార్యాపిల్లలను పెట్టుకుని, చుట్టూ రెల్లు తడికలు మాత్రం కట్టిన ఈ గుడిసెలలో ఈ ఆరుబయలు ప్రాంతంలో, వాళ్లు ఎలా ఉంటున్నారో తెలియలేదు. కోతల రోజులలో పొలాలలోనే మకాంవేసి శిస్తులు వసూలు చెయ్యడం ఈ దేశంలో పరిపాటి. పంట కళ్లంలో ఉండగానే శిస్తు వసూలు చెయ్యకపోతే ఇంత నిరుపేదలు మళ్లీ ఎన్నడూ చెల్లించలేరు.‘‘అయితే ఇక్కడొక డేరా వేయించమంటారా?’’ అని తహసీల్‌దారు అడిగాడు.
‘‘ఒక్కపూటలో ఒక చిన్న రెల్లు గుడిసె వేయించకూడదూ?’’ అన్నాను. అదే జరిగింది. దగ్గర దగ్గరలో మూడు నాలుగు చిన్న గుడిసెలు కట్టారు. ఒకటి నేను పడుకునేటందుకు. ఒకటి వంటయిల్లు, ఒకదానిలో ఇద్దరు సిపాయిలు, పట్వారీ ఉండడానికి ఏర్పాటయినాయి. వీటికి గుమ్మాలకీ కిటికీలకీ రెల్లు తడికలే కడతారు. అవి సరిగా ముయ్యడానికి వీలుండదు. రాత్రివేళ గాలి లోపలికి రయ్యిన వీస్తుంది. చలి గజగజ వణికిస్తుంది. దాదాపు మోకాళ్లపై వంగి మరీ లోపలికి ప్రవేశించాలి; అవి అంత పొట్టివి. గది మధ్యలో ఒత్తుగా కొమ్మలూ రెమ్మలూ ఆకులూ వేసి వాటిపైన ఒక జంపకానా పరిచి, ఆ పైన పరుపూ దుప్పటీ వేసి పడక తయారు చేశారు. ఈ పడక గది ఏడడుగులు పొడుగు, మూడడుగులు వెడల్పు. అందులో లేచి నిలబడడం అసంభవం. దాని ఎత్తు మూడడుగులు మాత్రం.
అయినా చక్కగా ఉంది పూరి గుడిసె. ఇంత విశ్రాంతి, ఇటువంటి ఆనందం, కలకత్తా నగరంలో నాలుగంతస్థుల మేడలో ఉన్నప్పటికీ లభ్యం కాదు. అయితే, నేను చాలారోజులబట్టి ఇక్కడే ఉంటున్నందువల్ల, అరణ్యవాసినై పోయినట్టున్నాను. నా ఆసక్తీ, అభిరుచీ, దృష్టీ ఈ అరణ్య జీవితానుభవం ప్రభావం వల్ల మారిపోయి ఉండాలి. కుటీరంలో ప్రవేశించగానే పచ్చికొమ్మల కొత్తవాసన ఆహ్లాదకరంగా వచ్చింది. ఇందులో ఇంకొకటి నాకు ఎంతో నచ్చింది. పడకపైన అర్ధశయనంగా పడుకుంటే, తల దిక్కున అడుగు వెడల్పూ అంతే పొడగూ ఉన్న కిటికీవంటి కంతలో నుంచి చూస్తూ, సరిగ్గా కంటికి సమరేఖలో పసుపు పచ్చని ఆవ పువ్వుల తివాసీ కనబడుతుంది. ఇటువంటి దృశ్యం అపూర్వం. ఇదొక నూతన అనుభవం. పృథ్వి అంతా పచ్చని తివాసీగా మారిపోయినట్లు, ఈ జగత్తులో నేను ఒంటరిగా ఆ తివాసీపైన పడుకున్నట్లు అనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment