చేపల చెరువుల వద్ద కలుషిత నీరు తాగినట్లు వెల్లడి
కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 12మంది
కరప: బతుకుదెరువు కోసం కాకినాడ జిల్లాకు వచ్చిన 12మంది పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. వీరు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లా కరప ఎస్‌ఐ టి.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... కరప మండలం యండమూరు శివారు వడ్డిపాలెంలో జంపన కిరణ్‌రాజు, మరో ఇద్దరు యజమానులకు చెందిన రొయ్యల చెరువుల వద్ద పని చేసేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి 12మంది కూలీలు షేక్ సలీం, అజీద్, నియోరుద్దీన్, అమనుల్లా, ఫారూక్, కలిపటి ముండ్, ఫ్రాడాస్, సాంతూల్, ఫైజప్, అన్వర్, సలుద్దీన్, మీనుదీన్ వచ్చారు. వారంతా రెండు వారాలుగా చెరువుల వద్దే ఉంటూ పని చేస్తున్నారు.
పెద్ద డ్రమ్ముల్లో మంచి నీరు నిల్వ చేసుకుని, వాటినే తాగడానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. కూలీలు శనివారం ఉదయం డ్రమ్ములో ఉంచిన నీటిని తాగడంతో వాంతులయ్యాయి. దీనిపై చెరువుల వద్ద పని చేస్తున్న గుమస్తా వెంటనే యజమాని కిరణ్‌రాజుకు సమాచారం అందించడంతో ఆయన వచ్చి ఆరా తీయగా, గడ్డి మందు కలిపిన డ్రమ్ములోని నీటిని తాగినట్టు కూలీలు తెలిపారు. గడ్డి మందు కలిపిన డ్రమ్ము నీరు లేకుండా ఖాళీగా ఉంది. దీనిపై ప్రశ్నించగా, ఆ నీటిని పారబోసి కడిగేశామని కూలీలు తెలిపారు.
వాంతులు చేసుకుని, అస్వస్థతకు గురైన కూలీలందరినీ వెంటనే చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం వీరిలో ఇద్దరికి ఎక్కువగా వాంతులు అవుతున్నాయని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు కిరణ్‌రాజు కరప పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ రామకృష్ణ వడ్డిపాలెంలోని చెరువుల వద్దకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు.
బెంగాలీ కూలీలు నెల రోజులు పని చేయడానికి వచ్చారని, మధ్యలో పని మానేసి వెళ్లిపోవడానికి ఇటువంటి ఎత్తుగడలు వేస్తుంటారని, గతంలో కాండ్రేగుల చెరువుల వద్ద కూడా ఇలాగే జరిగిందని కిరణ్‌రాజు వివరించారు. నిజంగా గడ్డిమందు కలిపిన నీరు తాగారా, విష ప్రభావం ఏమైనా ఉందా.. అని తేల్చేందుకు కూలీలకు వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment