తొలి తెలుగు మనోవైజ్ఞానిక నవలకు 70!
అసమర్థుని జీవయాత్రకు 70 యేళ్లు
జీవితం జీవించటం కోసమే తప్ప సిద్ధాంతాల కోసం కాదన్న ఒక ప్రాథమిక సత్యాన్ని ఈ నవల ఆవిష్కరిస్తుంది.
తెలుగు నవలా సాహిత్యంలో ఆధునిక యుగం పందొమ్మిది వందల నలబైలలో ప్రారంభమయ్యిందని విమర్శకులు నిర్ణయించారు. 1946లో వెలువడిన త్రిపురనేని గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’తో ఈ ఆధునిక యుగం మొదలైందన్నారు. దీనికి ముందు వెలువడిన నవలల్లో సంఘ సంస్కరణ దృష్టి ప్రధానంగా కనిపించేది. మానవుల కష్టసుఖాలకు సంఘమే ప్రధాన కారణమనీ, సంఘం మారితే తప్ప వ్యక్తులు సుఖంగా జీవించలేరనీ ఆనాటి నవలాకారులు భావించేవారు. కానీ మానవుల కష్టాలకు గానీ, సుఖాలకు గానీ ఆయా వ్యక్తుల మనస్తత్వమే కారణమౌతుందని గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’లోనూ, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’లోనూ ప్రతిపాదించారు. సిగ్మండ్ ఫ్రాయిడ్, యూంగ్, అడ్లర్ మొదలైన మనస్తత్వ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన మనోవిశ్లేషణా సూత్రాల ప్రభావంతో పందొమ్మిది వందల ఇరవైలలో పాశ్చాత్య సాహిత్యంలో డి.హెచ్.లారెన్స్, జేమ్స్ జాయిస్, వర్జీనియా ఉల్ఫ్ మొదలైనవారు నవలలు రచించారు. ఈ తరహా మనస్తాత్విక నవలలను ‘మనోవైజ్ఞానిక నవలలు’ అన్నారు. ‘అసమర్థుని జీవయాత్ర’ను తెలుగులో వెలువడిన మొట్టమొదటి మనోవైజ్ఞానిక నవల అని చెప్పొచ్చు.
ఈ నవలలోని వస్తువు సీతారామారావులోని మానసిక సంఘర్షణను చిత్రించటం! సీతారామారావు మీద అతని తండ్రి ప్రభావం బలంగా ఉంది. సీతారామారావులో ‘గోపీచంద్’ కనిపిస్తాడు. ఒక రకంగా గోపీచంద్ ‘ఆత్మకథాత్మక’ నవల అనొచ్చు.
గోపీచంద్ తండ్రి త్రిపురనేని రామస్వామి చౌదరి హేతువాదాన్ని ప్రచారం చేశాడు. ఈ హేతువాదం ప్రభావం బాల్యంలోనే గోపీచంద్ మీద పడింది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనకు కారణమేమిటి?– ప్రతి సమస్య ‘ఎందుకు?’ ఉత్పన్నమైందని ప్రశ్నించుకోవటం హేతువాదుల ప్రధాన లక్షణం. అయితే, ఎవరి జీవితం కూడా హేతువాదం ప్రకారం జరగదు. తండ్రి ప్రభావంతో హేతువాదాన్ని వంటపట్టించుకున్న గోపీచంద్ తన జీవితాన్ని హేతువాదం ప్రకారం మలుచుకోబోయి ఎదురుదెబ్బలు తిన్నాడు. ఆర్.ఎస్.సుదర్శనం అన్నట్టు, ‘‘తెలుగుదేశంలో హేతువాదాన్ని ప్రచారంలోకి తెచ్చిన తండ్రి రామస్వామి చౌదరి మరణించాక గోపీచంద్ అనుభవించిన మనోవైకల్యానికి ప్రతిబింబమే ఈ నవల. ఈ మనోవైకల్యం సామాన్యమైనది కాదు.
మృత్యువుతో హుటాహుటి పోరాటం. నవలలో నాయకుడైన సీతారామారావు మృత్యువు చేతిలో ఓడిపోయాడు. కానీ ఈ నవల రాయడం ద్వారా తనలోని సీతారామారావు మృతి చెందడం ద్వారా, గోపీచంద్ వ్యక్తిగతంగా పునర్జన్మ వంటి అనుభూతిని పొంది, కొత్త దృక్పథంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు’’. సీతారామారావు ఎదుర్కొన్న తీవ్ర విషాదానికి కారణం అతడు జయించలేని మానసిక శక్తులే. ‘‘ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది వంశ గౌరవమే’’ అన్న భావాన్ని తండ్రి పెకిలించటానికి సాధ్యం కానంత శక్తిమంతంగా నాటిపోయాడు. తండ్రి
సంపాదించి పోయిన ఆస్తి ఉన్నంత కాలం సీతారామారావు వంశ గౌరవాన్ని నిలుపగల్గాడు. అయితే, ఆస్తిపోతే వంశ గౌరవం కూడా పోతుందన్న ప్రాథమిక సత్యం అతని అవగాహనలో లేదు. వేలకు వేల ఆస్తిని మంచినీళ్ళలా ఖర్చు చేసిన సీతారామారావుకు తన భార్యాబిడ్డల్ని కూడా పోషించుకోలేని దుస్థితి యేర్పడటంతో నైతికంగా పతనమైపోతాడు. అయినా తన పతనానికి కారణం తాను కాదనీ, తన భార్యాపిల్లలు, మామ, మేనమామ మొదలైనవాళ్ళనే భ్రమలో బతుకుతాడు. తన పతనానికి కారణం తండ్రే అయినా, తండ్రి నేర్పిన పాఠాలను తన జీవితానుభవాల ద్వారా మార్చుకోలేకపోయిన తన అసమర్థతే తన పతనానికి కారణమనే జ్ఞానోదయం కల్గటంతో తన పట్ల తనకే విపరీతమైన ద్వేషం, కసి జనించి, తనను తాను నిర్దాక్షిణ్యంగా హతమార్చుకోవటంతో ‘అసమర్థుని జీవయాత్ర’ పరిసమాప్తమౌతుంది.
త్రిపురనేని గోపీచంద్
సీతారామారావు మనస్తత్వం భార్యమీద చెయ్యి చేసుకునే సన్నివేశంలో చక్కగా అర్థమవుతుంది. అతనికి భార్యమీద కోపం వొచ్చింది. తన్ను అనవసరంగా ఎంత క్షోభ పెట్టింది. దొడ్లో నుంచి తన భార్య వస్తూవుంది. ఆమె కంటపడేటప్పటికి వొళ్ళు చురచురా మండిపోయింది. తన్నింత కష్టపెట్టి, ఏమీ ఎరగనట్లు నంగనాచికిమల్లే, అడుగులో అడుగు వేసుకుంటూ వొస్తూంది. ఇంట్లోనే ఉంది, చెక్కుచెదరకుండా వుండి తన్నెంత వేదన పెట్టింది. పాప వెంట వస్తూంది. ఎదురుగా వెళ్ళాడు– ‘‘ఏ ం చేస్తున్నావిక్కడ?’’ అని అడిగాడు.
ఆమె మాట్లాడలేదు
‘‘చెప్పవేం?’’ అన్నాడు.
‘‘ఏముంది చెప్పటానికి? ఇంట్లోకి వెళ్తున్నాను’’ అంది. అతన్ని నఖశిఖ పర్యంతం చూస్తూ నిలబడింది. ఆ చూపులు అతనికి తను పెంచిన కుక్కను జ్ఞప్తికి తెచ్చినయి. ఆ కుక్క అలాగే చూసేది. చూపుల్లో అర్థం వుండేది కాదు. తన్నేదో పరీక్షిస్తున్నట్టూ, తన హృదయంలో వున్న రహస్యాలు తెలుసుకోటానికి ప్రయత్నిస్తున్నట్టూ చూసేది.
‘‘ఎందుకట్లా చూస్తావు?’’ అని అడిగాడు. పాప గజగజలాడుతూ తల్లి వెనక నక్కింది. ఆమె మాట్లాడలేదు. తన కుక్క కూడా ఇంతే! కసిరినా తన్ను విడిచి పెట్టేది కాదు. చూపులు మానేది కాదు. ‘‘నీ సంగతి నాకు తెలుసులే’’ అన్నట్టు చూసేది. కొడితే ‘‘కుయ్యో–కుయ్యో’’ అనేది. మళ్ళా అట్లాగే చూసేది. ‘‘ఏం కొడతావా?’’ అన్నాడు. ‘‘నేనేం కొడతాను’’ అంది. ఎందుకంత నిస్పృహ– తన కుక్కా అంతే. అతనికి వొళ్ళు మండింది.
‘‘అయితే నేను కొడతాను’’ అని చెంపమీద ఛెడేలున కొట్టాడు. పాప కెవ్వుమన్నది. కాని ఆమె అలాగే చూస్తూ నిలబడిపోయింది.
అతను కొట్టాడు, తన భార్యను కొట్టాడు. అతని శరీరం భయంతో వణికిపోయింది. ఆయాసం ఎక్కువై వగర్పు పుట్టింది. తను కొట్టాడు. చుట్టూ వున్న వస్తువులు ఏవీ అతనికి కనపట్టంలేదు. అంతా అయోమయం అయింది. లోపల నరాలు చిటేలు చిటేలున విరుగుతున్నట్టు అనిపించింది. సీతారామారావుకు భార్య మీద కోపం రావటం, తనకు కోపం వచ్చినా ఆమె యేమీ చలించకుండా ఉండటం వల్ల అతని కోపం ఎక్కువ కావడం, తీరా కొట్టాక ఒకప్పటి తన ఆదర్శ భావాల నుండి పతనమైపోయాననే జిజ్ఞాస కల్గటం, అది విపరీతమైన పశ్చాత్తాపాన్ని సృష్టించటం– ఇవీ ఈ దృశ్యంలో గోపీచంద్ చిత్రించిన సీతారామారావులోని మానసిక సంఘర్షణతో కూడిన సన్నివేశాలు.
సీతారామారావుకు చివర్లో అతని తండ్రిమీద కూడా ద్వేషం జనిస్తుంది. తండ్రి తనను వాస్తవ జీవితం నుండి దూరం చేశాడనే జ్ఞానోదయం కల్గుతుంది. ఒరేయి మనం పుట్టటం నిజం, చావటం నిజం, మధ్యన బ్రతకటం నిజం. పుట్టటం, చావటం మన చేతుల్లో లేదురా. ఇక బ్రతకటం ఒకటేరా మిగిలింది. బతకటానికి మనకు కావలసింది అన్నమే గదరా, మరి దీనికింత గొడవెందుకురా! నలుగురం కూడబలుక్కుని బతకలేమంటారా? ఈ ప్రపంచంలో ఏమో వుందని మభ్యపెట్టి దానికోసం పోట్లాడుకు చచ్చేటట్టు చేస్తున్నార్రా! అంతకంటే ఏమీ లేదురా తండ్రుల్లారా, మనం కొన్నాళ్లు ఇక్కడ బతకాలి. యెవరైనా అంతే. దీనికి కలహాలూ, రక్తపాతాలూ ఎందుకురా. ఎవరు కట్టుకుపోయేది ఏముందిరా. బతకండ్రా తండ్రుల్లారా, చచ్చేదాకా బతకండి. ఇది చివరకు సీతారామారావులో కల్గిన వాస్తవిక దృష్టి.
ఆర్.ఎస్.సుదర్శనం అన్నట్టు– ‘‘సీతారామారావు పాత్రను సృష్టించటం ద్వారా గోపీచంద్ సాధించిన విజయం: సాంఘికదృష్టికీ, ఆదర్శాలకూ అతీతమైన జీవితం పట్ల విశ్వాసం. జీవితం ఎందుకు అన్న ప్రశ్నకు జీవితం జీవించటానికే అన్నదే సమాధానం’’. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కాక, ఓ సిద్ధాంతానికి కట్టుబడాలని ప్రయత్నించే వాళ్ళ జీవితాలు ఎలా ఛిద్రమైపోతాయో ఈ నవల మనకు చెబుతుంది. జీవితం జీవించటం కోసమే తప్ప సిద్ధాంతాల కోసం కాదన్న ఒక ప్రాథమిక సత్యాన్ని ఈ నవల మనలో ఆవిష్కరిస్తుంది.
అంపశయ్య నవీన్