Tripuraneni Gopichand
-
Tripuraneni Gopichand: ఆయన ఎవ్వరినీ నొప్పించేవారు కాదు..
త్రిపురనేని గోపీచంద్.. లక్ష్మమ్మ, పేరంటాలు, ప్రియురాలు చిత్రాలకు దర్శకత్వం వహించారు... పలు చిత్రాలకు సంభాషణలు రచించారు.. అసమర్థుని జీవయాత్ర, పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా... వంటి నవలల ద్వారా సాహితీ లోకానికి సుపరిచితులు... త్రిపురనేని రామస్వామి కుమారుడిగా కాకుండా... త్రిపురనేని గోపీచంద్‌గా ప్రసిద్ధులయ్యారు.. తండ్రిగా పిల్లలతో ఎలా ఉండేవారో వారి రెండో కుమార్తె రజని సాక్షికి వివరించారు.. నాన్నగారు 1910, సెప్టెంబరు 8 వినాయక చవితి రోజున చౌటుపల్లిలో పుట్టారు. త్రిపురనేని రామస్వామి, పున్నమాంబలు తల్లిదండ్రులు. నాన్నగారికి ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. తాతగారు విప్లవ రచయిత, నాన్నగారు అభ్యుదయ రచయిత. ఇంకా చెప్పాలంటే నాన్నగారి రచనలలో మనోవిశ్లేషణ ఎక్కువగా ఉంటుంది. నాన్నగారి 22వ ఏట శకుంతలాదేవితో వివాహమైంది. అమ్మ ఉన్నవ లక్ష్మీ నారాయణ పంతులు గారి ‘శారదా నికేతనం’లో.. తెలుగులో విద్వాన్ , హిందీలో విశారద చదువుకున్నారు. అమ్మను బాగా చదువుకున్నవారికి ఇవ్వాలనుకున్నారు. అందువల్ల నాన్నగారి చదువు చూసి వివాహం నిశ్చయించారు. నాన్నగారు చాలా ఇష్టపడి ఈ వివాహం చేసుకున్నారు. ఇద్దరిదీ ఇంటలెక్చువల్ కంపానియన్ షిప్. అనుకూలమైన దాంపత్యం. నాన్నగారు అమ్మకు ఇంగ్లీషు పాఠాలు చెప్పారు. అమ్మనాన్నలకు మేం ఆరుగురం పిల్లలం. ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. ప్రమీలా దేవి, రమేశ్‌బాబు, రజని (నేను), రామ్‌గోపాల్, నళిని, సాయిచంద్ (సినిమా నటుడు). మా చదువుల గురించి బాగా శ్రద్ధ తీసుకున్నారు. పెద్ద అన్నయ్య రమేశ్ డాక్టరు చదివాడు. ఇంగ్లండ్ కూడా వెళ్లాడు. నాన్నగారు పోయేనాటికి మా చిన్నతమ్ముడు సాయి చంద్ వయస్సు ఆరు సంవత్సరాలు. వాడిని చూస్తుంటే, తన బాల్యం గుర్తుకు వస్తోందనేవారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో కానీ, మా ఇంట్లో సాయి ఒక్కడే నాన్నగారి సినిమా వారసత్వం అందుకున్నాడు. సినిమాలు – ఆకాశవాణి నాన్నగారు గూడవల్లి రామబ్రహ్మం గారి ఆహ్వానం మీద మద్రాసు వెళ్లి, రైతుబిడ్డ చిత్రానికి రచయిత, సహకార దర్శకుడిగా పనిచేశారు. మాయాలోకం, చిత్రానికి కూడా వారి దగ్గరే రచయితగా పనిచేశారు. ఆ తరవాత వచ్చిన గృహప్రవేశం చిత్రానికి కథమాటలుస్క్రీన్ప్లే సమకూర్చారు. ఆ రోజుల్లో ఆ చిత్రం కొత్త తరహాలో రూపొందింది. లక్ష్మమ్మ, పేరంటాలు, ప్రియురాలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. జగ్గయ్యగారిని ప్రియురాలు చిత్రంలో హీరోగా పరిచయం చేశారు. ఆ తరవాత పి.పుల్లయ్యగారు, కె. వి. రెడ్డిగారు నాన్నగారు కలిసి ధర్మదేవత చిత్రానికి స్క్రీన్‌ప్లే చేశారు. అది పెద్ద హిట్. అక్కడ సినిమాలకు పనిచేస్తున్న రోజుల్లోనే బెజవాడ గోపాలరెడ్డిగారి ఆహ్వానం మీద ‘సినిమాలు వదిలేసి, ఆంధ్ర రాజధానిగా కొత్తగా ఏర్పడిన కర్నూలుకి ఇన్ఫర్మేషన్ డైరెక్టర్‌గా వచ్చారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాక, ఆలిండియా రేడియోలో గ్రామస్థుల కార్యక్రమం నిర్వహించారు. అదే సమయంలో ‘కలిమి లేములు’, దుక్కిపాటి మధుసూదనరావు గారి చదువుకున్న అమ్మాయిలు చిత్రాలకు... సంభాషణలు రాశారు. మల్లెపువ్వులా ఉండేవారు.. ఉదయం నాలుగు గంటలకు లేచి, కాఫీ తాగేసి, తన పనిలో నిమగ్నమైపోయే వారు. ఎంత పనిలో ఉన్నా కుటుంబాన్ని మాత్రం నిర్లక్ష్యం చేసేవారు కాదు. తెల్లటి పట్టు పంచె, లాల్చీలో నాన్న గారు మల్లెపువ్వులా ఉండేవారు. కర్నూలులో ఉన్న రోజుల్లో షేర్వాణీ వేసుకునేవారు. అప్పుడప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకునేవారు. వస్త్ర ధారణ విషయంలో శ్రద్ధ ఉండేది. ఎక్కడకు వెళ్లినా అమ్మకు, అక్కకు మైసూర్ క్రేప్ సిల్క్ చీరలు తెచ్చేవారు. మేం వేసుకున్న దుస్తులు గమనించేవారు. ఒకసారి అమ్మ మాటల మధ్యలో నాన్నగారితో నా గురించి, ‘రజనికి మీ అందం రాలేదు’ అంది. అందుకు, ‘దానికి జుట్టు, పాదాలు నావే వచ్చాయి కదా’ అన్నారు, ఎంతో ఆప్యాయంగా నా వైపు చూస్తూ. ఆయనకు ఎవ్వరి మనసు నొప్పించటం ఇష్టం ఉండదు. మాతో సన్నిహితంగా... ఎప్పుడైనా మేం ఆడుకుంటే పడిపోతే ఆయనకు నచ్చేది కాదు. చిన్న దెబ్బ వేసి, ‘ఎందుకు పడిపోతూ దెబ్బలు తగిలించుకుంటారు’ అని సున్నితంగా మందలించేవారు. ఆయన మాటల్లో ఎంతో తాత్త్వికత ఉండేది. నాన్నగారితో క్యారమ్ బోర్డు ఆడటం మాకు సరదాగా ఉండేది. నాన్నగారి స్ట్రయికింగ్ చూడాలనిపించేది. ఆడుకునేటప్పుడు తగవులు, అల్లరిచిల్లరిగా కొట్టుకోవటం తెలీదు. వాకింగ్ చేస్తూ, మా వయసుకి తగ్గట్టుగా కథలు, మాటలు చెప్పేవారు. అప్పుడప్పుడు షాపింగ్‌కి తీసుకువెళ్లేవారు. రాత్రి పూట భోజనాలయ్యాక కాసేపు బయటికి తీసుకువెళ్లి నడిపిస్తూ.. పల్లీలు, పండ్లు కొనేవారు. నాన్నగారి మీద ఆత్మీయతతో కూడిన గౌరవం ఉండేది. మాతో ఎంతో ప్రేమగా ఉండేవారు. శాకాహారులే... తాతగారు శాకాహారులు కావటం వల్ల ఇంట్లో అందరూ శాకాహారమే తినేవారు. నాన్నగారు కొన్నాళ్లు మాంసాహారం తినేవారు. సాయిబాబా భక్తులయ్యాక వెజిటేరియన్ అయిపోయారు. అమ్మ శారదా నికేతనంలో పెరగటం వల్ల ఇంట్లో వంటకాలన్నీ ఇంగువ వాసన వచ్చేవి. చేకోడీలు, మురుకులు వంటివి అమ్మ చాలా బాగా చేసేది. నాన్న తిండి ప్రియులే కానీ, మితంగా తినేవారు. ఒక్కోసారి చేతిలో ఉన్న టిఫిన్ నోటి దాకా కూడా వెళ్లేది కాదు. పెన్నులో నీళ్ళు పొయ్యమనేవారు ఒకరోజున ఒక సంఘటన జరిగింది. ఆ జ్ఞాపకం ఇప్పటికీ మా హృదయంలో తడి ఆరకుండానే ఉంది. చేతితో పెన్ను పట్టుకుని, వంటగదిలోకి వచ్చి, ‘అమ్మా! ఈ పెన్నులో నీళ్లు పొయ్యి’ అన్నారు. ‘నీళ్లా’ అని నవ్వుతుంటే, ‘చాల్లే, ఇంకు ఇవ్వు!’ అన్నారు. నిరంతరం ఏదో ఒకటి రాసుకుంటూ ఉండేవారు. నాన్నగారు రాస్తున్నప్పుడే చదివేస్తూ ఉండేదాన్ని. మేం కొత్త పెన్ను కొనుక్కుని నాన్నగారికి ఇచ్చేవాళ్లం. ఆయన రోజంతా రాసుకుని పాళీ బాగా స్మూత్ అయ్యాక మాకు ఇచ్చేవారు. అప్పుడు ఆ పెన్ను మేం వాడేవాళ్లం. ఇల్లు నిరంతరం కళాకారులు, రచయితలతో సరస్వతీ పీఠంలా ఉండేది. అతిథి మర్యాదలు ఘనంగా జరుగుతుండేవి. మృదుహృదయ సంస్కారం.. ఉద్యోగరీత్యా మేం కర్నూలులో ఉంటున్న రోజుల్లో జరిగిన సంఘటన ఇప్పటికీ మేం మర్చిపోలేం. మా పొరుగు వాళ్లింట్లో ఒక పెద్దాయన గతించారు. ఆయన భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకురావటానికి ఇంటివారు ఒప్పుకోకపోతే, నాన్నగారు ‘మా ఇంటికి తీసుకువచ్చి కార్యక్రమం చేసుకోండి’ అన్నారు. చైనా యుద్ధం జరుగుతున్న సమయంలో నాన్నగారు ఒక నెల జీతం విరాళంగా ఇచ్చేశారు. రావూరి భరద్వాజ నాన్నగారిని ‘అన్నదాత’ అన్నారు. ఆయనకు ఆకాశవాణిలో ఉద్యోగం నాన్నగారే వేయించారు. ఆయనకు ఆ కృతజ్ఞత ఉండిపోయింది. అరుదైన గౌరవం.. తెలుగు సాహిత్య చరిత్రలో నాన్నగారు అందుకున్న అరుదైన గౌరవం ఒకటి ఉంది. నాన్నగారు రాసిన ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’ నవలకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఒక తెలుగు నవలకు ఈ అవార్డు దక్కటం అదే మొదలు. అలాగే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తెలుగు వారి స్టాంపులు విడుదల కావటం కూడా విశేషమే. తాతగారిది, నాన్నగారిది... ఇద్దరివీ విడుదల చేశారు. రచయిత విహారి, నాన్నగారి నవలల గురించి, ‘సాధారణంగా కనిపించే అసాధారణ జ్ఞాన గంగ’ అన్నారు. బాధపడేవారు... అమ్మ నాన్నగారితో సమానంగా సాహితీవేత్త. అమ్మ పరిజ్ఞానమంతా నిరుపయోగం అయిపోతున్నందుకు నాన్న గారు బాధపడినట్లు ఒకచోట రాసుకున్నారు. నాన్నగారు బిఏబియల్ చదివారు. తాతగారు కూడా లా చదివారు. ఇద్దరూ న్యాయవాద వృత్తిలోకి వెళ్లలేదు. తాతగారు 56 సంవత్సరాలకే గతించారు. తాతగారి సాహితీ వారసత్వంతో పాటు జీవన వారసత్వం కూడా వచ్చిందేమో!! నాన్నగారు 52 సంవత్సరాలకే మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. ఆయనకు తెలుసేమో... నాన్నగారు పోవటానికి ముందు రోజు అంటే నవంబరు 1న ‘భార్యా విలాపం’ నవల మొదలు పెడతానన్నారు. మరుసటి రోజు అంటే నవంబరు 2 న రమేశ్ అన్నయ్య మందులు తీసుకుని వచ్చాడు. అప్పుడు నాన్నగారు చేత్తో ఛాతీ మీద రాసుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇస్తున్నారు. నాన్నగారికి ఏదో తెలిసినట్లుగా, ‘ఈ మధ్యనే మా స్నేహితుడు కృష్ణారావు ఇంజక్షన్ ఇవ్వగానే పోయారు’ అన్నారు.నాన్నగారి మాటలు వింటూనే, డాక్టర్‌గారు నాన్నగారికి ఇంజక్షన్ ఇచ్చారు. అదేం చిత్రమో తెలియదు కానీ, ఇంజక్షన్ చేసిన ఐదు నిమిషాలకే నాన్న కన్ను మూశారు. అమ్మ ఒంటరిగా విలపించింది. నాన్నగారి మీద బెంగ పెట్టుకుని, ఆయన పోయిన నాలుగు సంవత్సరాలకే అమ్మ కూడా తనువు చాలించింది. మేం కర్నూలులో ఉండగా ఒక జ్యోతిష్కుడు వచ్చి నాన్నగారితో ‘మీకు ఆయుష్షు తక్కువ. మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది’ అని చెప్పారు. ఆ రోజు వరకు జరిగిన సంఘటనలన్నీ యాదృచ్చికమే కావొచ్చు. కాని నాన్నగారి విషయంలో అన్నీ వాస్తవం అయ్యాయి. అందువల్లే ఈ విషయాలు మాకు పదేపదే గుర్తుకు వస్తుంటాయి. మా జీవితాలు ప్రారంభిస్తున్న రోజుల్లోనే అంత గొప్ప తండ్రిని పోగొట్టుకున్నామన్న బాధ ఇప్పటికీ మా మనసులను వెంటాడుతూనే ఉంది. ఇప్పటివరకు మమ్మల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నది నాన్నగారి సాహిత్యమే. ఏ సమస్య వచ్చినా నాన్నగారి పుస్తకాలే మాకు పరిష్కారం చూపిస్తున్నాయి. ఆయనకు పిల్లలుగా పుట్టడం మా అదృష్టంగా భావిస్తాం. గోపీచంద్రుడు అనేవారు... విశ్వనాథ సత్యనారాయణ గారికి నాన్నగారి మీద పుత్ర వాత్సల్యం ఉండేది. ఎంతో ప్రేమగా ‘గోపీచంద్రుడు’ అని పిలిచేవారు. నాన్నగారు పోయినప్పుడు, ‘అతని అకాల మరణమునకు నేను పొందుచున్న దుఃఖమునకు చిహ్నముగా’ అని ఆయన రచించిన ‘గంగూలీ ప్రేమకథ’ నవలను నాన్నగారికి అంకితం చేశారు. నాన్నగారు పోయేటప్పటికి... యమపాశం, చీకటి గదులు, ప్రేమోపహతులు.. మూడు రచనలు అసంపూర్ణంగా ఉండిపోయాయి. అవి అసంపూర్ణంగానే ముద్రితమయ్యాయి. -
కాలును మీటిన రాగం
రచయిత త్రిపురనేని గోపీచంద్– చదువుకున్న అమ్మాయిలు, ధర్మదేవత, ప్రియురాలు చిత్రాలకు కథ, మాటలు అందించారు; పేరంటాలు, లక్షమ్మ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. గాయకుడు, స్వరకర్త అయిన బాలాంత్రపు రజనీకాంతరావు, గోపీచంద్ మంచి స్నేహితులు. మద్రాసులో ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు. గోపీచంద్ తీయబోతున్న చిత్రానికి బాలాంత్రపు గేయ రచన, సంగీత దర్శకత్వం వహించబోతున్నారు. ఒకానొక ఘట్టంలో కావల్సిన పాటకి కావాల్సిన మాటల కోసం ఆలోచనలో పడ్డారు గోపీచంద్. ఆ పాటకి సంగీతం గురించి ఆలోచిస్తున్న రజనీకి కాలుమీద దురద పుట్టి, పరధ్యానంగా గోక్కోవడం మొదలుపెట్టిన కాసేపటికి గాభరా పడుతూ, ‘‘నా కాలు స్పర్శ కోల్పోయింది. నేను గోక్కుంటుంటే తెలీటం లేదు. అర్జంటుగా డాక్టరు దగ్గరకి వెళ్ళి చూపించుకోవాలి’’ అన్నారు. తలతిప్పి ఆయన వంక చూసిన గోపీచంద్, ‘‘డాక్టరు, గీక్టరు అక్కర్లేదు. ఇందాకటి నుంచి మీరు గోక్కుంటున్నది మీ కాలు కాదు, నా కాలు’’ అన్నారు. దాంతో అసలు విషయం అర్థమై ఇద్దరు మిత్రులు పగలబడి నవ్వుకున్నారు. - అనిల్ అట్లూరి -
అసమర్థుని జీవయాత్ర
ప్రతిధ్వనించే పుస్తకం త్రిపురనేని గోపీచంద్ ‘సీతారామారావు జీవితం విచిత్రమైంది. ఉన్నత శిఖరాగ్రం నుంచి స్వచ్ఛమైన జలంతో భూమిమీద పడి మలినాన్ని కలుపుకొని, మురికి రూపంలోకి ప్రవహించే సెలయేటిని జ్ఞప్తికి తెస్తుంది. తనలో వచ్చిన మార్పు ఆ సెలయేటికి తెలుసో తెలియదో మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే తనలో వచ్చిన మార్పుకి ఆ సెలయేరు బాధపడుతూ వుందో మనకు తెలియదు,’ అంటూ ప్రారంభమవుతుంది త్రిపురనేని గోపీచంద్ నవల ‘అసమర్థుడి జీవయాత్ర’. ఊహాత్మక ఆదర్శాలకూ వాస్తవ జీవితానికీ మధ్య సమన్వయం కుదుర్చుకోలేని మనిషి సీతారామరావు. దాంపత్యానికి కొత్త అర్థాన్ని కల్పిస్తానని ఇందిరను వివాహం చేసుకుంటాడు. ఆమెను సాధించడం మినహా మరేమీ చేయడు. మళ్లీ సాధిస్తున్నానని తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. పక్కనున్న పేదవాళ్లతో కలిసి ఆడుకొమ్మని పాపకు చెబుతాడు. ఆడుకున్నందుకూ, అందులో భాగంగా పోట్లాడి వచ్చినందుకూ అదే కూతురిని దండిస్తాడు. దీర్ఘంగా ఆలోచించడమే తన బాధలకు మూలకారణం అనుకుంటాడు. అలాగని ఆలోచనను రద్దు చేసుకోలేకపోతాడు. ఈ ప్రపంచం అజ్ఞానుల కోసమే ఉద్దేశించినది అనుకుంటాడు. తాను జ్ఞానంగా భావించే ఏ పనినీ చేయడు. అసలు జ్ఞానమంటే ఏమిటో మాత్రం తెలుసా? జీవించడం మినహాయించి, జీవితానికి మరే సిద్ధాంతమూ లేదని గుర్తించడంలో విఫలమవుతాడు. బతికినన్నాళ్లూ ఏదో రకంగా జీవితంలో పాల్గొనవలసిందే అని చెప్పిన రామయ్య తాతను హేళన చేస్తాడు. అటు ఏమీ తెలియని శీనయ్యలానో, ఇటు అన్నీ తెలిసిన రామయ్య లానో ఉండలేకపోతాడు. తండ్రి కాపాడమన్న కుటుంబ మర్యాద అనే బరువును నెత్తిన మోపుకుని, ఉన్న ఆస్తినంతా కరిగిస్తాడు. తననూ అందర్ని చూచినట్టు చూస్తే మనసు నొచ్చుకుని, జనంలో స్వేచ్ఛగా కలిసిపోలేక తనకు తానే ఒక ద్వీపకల్పంగా తయారవుతాడు. జీవితపు పరమార్థాన్ని అందుకోలేక, తలెక్కడో తోకెక్కడో తెలియని సంఘంతో ఘర్షణపడతాడు. చివరకు పిచ్చివాడిగా ముద్రపడి ఆత్మహత్య చేసుకుంటాడు. హేతువాది త్రిపురనేని రామస్వామి కొడుకుగా పుట్టిన గోపీచంద్ తనకు ఎదురైన జీవితానుభవాల నేపథ్యంలో ధార్మిక చింతనలోకి మరలిపోయారు. తన జీవితకాలం మోసిన హేతువాదపు బరువును దింపుకోవడానికి కూడా గోపీచంద్ ఈ నవల రాశాడంటారు. ‘ఎక్కడో ఒకచోట ఈ ఎందుకు? ఆగవలసిందేరా తండ్రుల్లారా’ అని ఓచోట సీతారామరావు వ్యాఖ్యానిస్తాడు కూడా. ‘ఎందుకు? అన్న ప్రశ్న నేర్పినందుకు ‘నాన్నగారికి’ అంకితం చేసిన ఈ పుస్తకం రాయడం ద్వారా అదే నాన్న నుంచి సంక్రమించిన హేతుభావం నుంచి విముక్తుడయ్యారు. తెలుగులో వచ్చిన తొలి మనో వైజ్ఞానిక నవలగానూ, మానసిక స్థితిని చిత్రించడానికి బొమ్మలను వాడిన ప్రయోగాత్మక నవలగానూ దీనికి పేరుంది. తెలుగులో వచ్చిన అత్యుత్తమ నవలల్లో ఒకటి. గోపీచంద్ అత్యుత్తమ పనితనం కనబడే పుస్తకమూ ఇదే! -
తొలి తెలుగు మనోవైజ్ఞానిక నవలకు 70!
అసమర్థుని జీవయాత్రకు 70 యేళ్లు జీవితం జీవించటం కోసమే తప్ప సిద్ధాంతాల కోసం కాదన్న ఒక ప్రాథమిక సత్యాన్ని ఈ నవల ఆవిష్కరిస్తుంది. తెలుగు నవలా సాహిత్యంలో ఆధునిక యుగం పందొమ్మిది వందల నలబైలలో ప్రారంభమయ్యిందని విమర్శకులు నిర్ణయించారు. 1946లో వెలువడిన త్రిపురనేని గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’తో ఈ ఆధునిక యుగం మొదలైందన్నారు. దీనికి ముందు వెలువడిన నవలల్లో సంఘ సంస్కరణ దృష్టి ప్రధానంగా కనిపించేది. మానవుల కష్టసుఖాలకు సంఘమే ప్రధాన కారణమనీ, సంఘం మారితే తప్ప వ్యక్తులు సుఖంగా జీవించలేరనీ ఆనాటి నవలాకారులు భావించేవారు. కానీ మానవుల కష్టాలకు గానీ, సుఖాలకు గానీ ఆయా వ్యక్తుల మనస్తత్వమే కారణమౌతుందని గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’లోనూ, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’లోనూ ప్రతిపాదించారు. సిగ్మండ్ ఫ్రాయిడ్, యూంగ్, అడ్లర్ మొదలైన మనస్తత్వ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన మనోవిశ్లేషణా సూత్రాల ప్రభావంతో పందొమ్మిది వందల ఇరవైలలో పాశ్చాత్య సాహిత్యంలో డి.హెచ్.లారెన్స్, జేమ్స్ జాయిస్, వర్జీనియా ఉల్ఫ్ మొదలైనవారు నవలలు రచించారు. ఈ తరహా మనస్తాత్విక నవలలను ‘మనోవైజ్ఞానిక నవలలు’ అన్నారు. ‘అసమర్థుని జీవయాత్ర’ను తెలుగులో వెలువడిన మొట్టమొదటి మనోవైజ్ఞానిక నవల అని చెప్పొచ్చు. ఈ నవలలోని వస్తువు సీతారామారావులోని మానసిక సంఘర్షణను చిత్రించటం! సీతారామారావు మీద అతని తండ్రి ప్రభావం బలంగా ఉంది. సీతారామారావులో ‘గోపీచంద్’ కనిపిస్తాడు. ఒక రకంగా గోపీచంద్ ‘ఆత్మకథాత్మక’ నవల అనొచ్చు. గోపీచంద్ తండ్రి త్రిపురనేని రామస్వామి చౌదరి హేతువాదాన్ని ప్రచారం చేశాడు. ఈ హేతువాదం ప్రభావం బాల్యంలోనే గోపీచంద్ మీద పడింది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనకు కారణమేమిటి?– ప్రతి సమస్య ‘ఎందుకు?’ ఉత్పన్నమైందని ప్రశ్నించుకోవటం హేతువాదుల ప్రధాన లక్షణం. అయితే, ఎవరి జీవితం కూడా హేతువాదం ప్రకారం జరగదు. తండ్రి ప్రభావంతో హేతువాదాన్ని వంటపట్టించుకున్న గోపీచంద్ తన జీవితాన్ని హేతువాదం ప్రకారం మలుచుకోబోయి ఎదురుదెబ్బలు తిన్నాడు. ఆర్.ఎస్.సుదర్శనం అన్నట్టు, ‘‘తెలుగుదేశంలో హేతువాదాన్ని ప్రచారంలోకి తెచ్చిన తండ్రి రామస్వామి చౌదరి మరణించాక గోపీచంద్ అనుభవించిన మనోవైకల్యానికి ప్రతిబింబమే ఈ నవల. ఈ మనోవైకల్యం సామాన్యమైనది కాదు. మృత్యువుతో హుటాహుటి పోరాటం. నవలలో నాయకుడైన సీతారామారావు మృత్యువు చేతిలో ఓడిపోయాడు. కానీ ఈ నవల రాయడం ద్వారా తనలోని సీతారామారావు మృతి చెందడం ద్వారా, గోపీచంద్ వ్యక్తిగతంగా పునర్జన్మ వంటి అనుభూతిని పొంది, కొత్త దృక్పథంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు’’. సీతారామారావు ఎదుర్కొన్న తీవ్ర విషాదానికి కారణం అతడు జయించలేని మానసిక శక్తులే. ‘‘ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది వంశ గౌరవమే’’ అన్న భావాన్ని తండ్రి పెకిలించటానికి సాధ్యం కానంత శక్తిమంతంగా నాటిపోయాడు. తండ్రి సంపాదించి పోయిన ఆస్తి ఉన్నంత కాలం సీతారామారావు వంశ గౌరవాన్ని నిలుపగల్గాడు. అయితే, ఆస్తిపోతే వంశ గౌరవం కూడా పోతుందన్న ప్రాథమిక సత్యం అతని అవగాహనలో లేదు. వేలకు వేల ఆస్తిని మంచినీళ్ళలా ఖర్చు చేసిన సీతారామారావుకు తన భార్యాబిడ్డల్ని కూడా పోషించుకోలేని దుస్థితి యేర్పడటంతో నైతికంగా పతనమైపోతాడు. అయినా తన పతనానికి కారణం తాను కాదనీ, తన భార్యాపిల్లలు, మామ, మేనమామ మొదలైనవాళ్ళనే భ్రమలో బతుకుతాడు. తన పతనానికి కారణం తండ్రే అయినా, తండ్రి నేర్పిన పాఠాలను తన జీవితానుభవాల ద్వారా మార్చుకోలేకపోయిన తన అసమర్థతే తన పతనానికి కారణమనే జ్ఞానోదయం కల్గటంతో తన పట్ల తనకే విపరీతమైన ద్వేషం, కసి జనించి, తనను తాను నిర్దాక్షిణ్యంగా హతమార్చుకోవటంతో ‘అసమర్థుని జీవయాత్ర’ పరిసమాప్తమౌతుంది. త్రిపురనేని గోపీచంద్ సీతారామారావు మనస్తత్వం భార్యమీద చెయ్యి చేసుకునే సన్నివేశంలో చక్కగా అర్థమవుతుంది. అతనికి భార్యమీద కోపం వొచ్చింది. తన్ను అనవసరంగా ఎంత క్షోభ పెట్టింది. దొడ్లో నుంచి తన భార్య వస్తూవుంది. ఆమె కంటపడేటప్పటికి వొళ్ళు చురచురా మండిపోయింది. తన్నింత కష్టపెట్టి, ఏమీ ఎరగనట్లు నంగనాచికిమల్లే, అడుగులో అడుగు వేసుకుంటూ వొస్తూంది. ఇంట్లోనే ఉంది, చెక్కుచెదరకుండా వుండి తన్నెంత వేదన పెట్టింది. పాప వెంట వస్తూంది. ఎదురుగా వెళ్ళాడు– ‘‘ఏ ం చేస్తున్నావిక్కడ?’’ అని అడిగాడు. ఆమె మాట్లాడలేదు ‘‘చెప్పవేం?’’ అన్నాడు. ‘‘ఏముంది చెప్పటానికి? ఇంట్లోకి వెళ్తున్నాను’’ అంది. అతన్ని నఖశిఖ పర్యంతం చూస్తూ నిలబడింది. ఆ చూపులు అతనికి తను పెంచిన కుక్కను జ్ఞప్తికి తెచ్చినయి. ఆ కుక్క అలాగే చూసేది. చూపుల్లో అర్థం వుండేది కాదు. తన్నేదో పరీక్షిస్తున్నట్టూ, తన హృదయంలో వున్న రహస్యాలు తెలుసుకోటానికి ప్రయత్నిస్తున్నట్టూ చూసేది. ‘‘ఎందుకట్లా చూస్తావు?’’ అని అడిగాడు. పాప గజగజలాడుతూ తల్లి వెనక నక్కింది. ఆమె మాట్లాడలేదు. తన కుక్క కూడా ఇంతే! కసిరినా తన్ను విడిచి పెట్టేది కాదు. చూపులు మానేది కాదు. ‘‘నీ సంగతి నాకు తెలుసులే’’ అన్నట్టు చూసేది. కొడితే ‘‘కుయ్యో–కుయ్యో’’ అనేది. మళ్ళా అట్లాగే చూసేది. ‘‘ఏం కొడతావా?’’ అన్నాడు. ‘‘నేనేం కొడతాను’’ అంది. ఎందుకంత నిస్పృహ– తన కుక్కా అంతే. అతనికి వొళ్ళు మండింది. ‘‘అయితే నేను కొడతాను’’ అని చెంపమీద ఛెడేలున కొట్టాడు. పాప కెవ్వుమన్నది. కాని ఆమె అలాగే చూస్తూ నిలబడిపోయింది. అతను కొట్టాడు, తన భార్యను కొట్టాడు. అతని శరీరం భయంతో వణికిపోయింది. ఆయాసం ఎక్కువై వగర్పు పుట్టింది. తను కొట్టాడు. చుట్టూ వున్న వస్తువులు ఏవీ అతనికి కనపట్టంలేదు. అంతా అయోమయం అయింది. లోపల నరాలు చిటేలు చిటేలున విరుగుతున్నట్టు అనిపించింది. సీతారామారావుకు భార్య మీద కోపం రావటం, తనకు కోపం వచ్చినా ఆమె యేమీ చలించకుండా ఉండటం వల్ల అతని కోపం ఎక్కువ కావడం, తీరా కొట్టాక ఒకప్పటి తన ఆదర్శ భావాల నుండి పతనమైపోయాననే జిజ్ఞాస కల్గటం, అది విపరీతమైన పశ్చాత్తాపాన్ని సృష్టించటం– ఇవీ ఈ దృశ్యంలో గోపీచంద్ చిత్రించిన సీతారామారావులోని మానసిక సంఘర్షణతో కూడిన సన్నివేశాలు. సీతారామారావుకు చివర్లో అతని తండ్రిమీద కూడా ద్వేషం జనిస్తుంది. తండ్రి తనను వాస్తవ జీవితం నుండి దూరం చేశాడనే జ్ఞానోదయం కల్గుతుంది. ఒరేయి మనం పుట్టటం నిజం, చావటం నిజం, మధ్యన బ్రతకటం నిజం. పుట్టటం, చావటం మన చేతుల్లో లేదురా. ఇక బ్రతకటం ఒకటేరా మిగిలింది. బతకటానికి మనకు కావలసింది అన్నమే గదరా, మరి దీనికింత గొడవెందుకురా! నలుగురం కూడబలుక్కుని బతకలేమంటారా? ఈ ప్రపంచంలో ఏమో వుందని మభ్యపెట్టి దానికోసం పోట్లాడుకు చచ్చేటట్టు చేస్తున్నార్రా! అంతకంటే ఏమీ లేదురా తండ్రుల్లారా, మనం కొన్నాళ్లు ఇక్కడ బతకాలి. యెవరైనా అంతే. దీనికి కలహాలూ, రక్తపాతాలూ ఎందుకురా. ఎవరు కట్టుకుపోయేది ఏముందిరా. బతకండ్రా తండ్రుల్లారా, చచ్చేదాకా బతకండి. ఇది చివరకు సీతారామారావులో కల్గిన వాస్తవిక దృష్టి. ఆర్.ఎస్.సుదర్శనం అన్నట్టు– ‘‘సీతారామారావు పాత్రను సృష్టించటం ద్వారా గోపీచంద్ సాధించిన విజయం: సాంఘికదృష్టికీ, ఆదర్శాలకూ అతీతమైన జీవితం పట్ల విశ్వాసం. జీవితం ఎందుకు అన్న ప్రశ్నకు జీవితం జీవించటానికే అన్నదే సమాధానం’’. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కాక, ఓ సిద్ధాంతానికి కట్టుబడాలని ప్రయత్నించే వాళ్ళ జీవితాలు ఎలా ఛిద్రమైపోతాయో ఈ నవల మనకు చెబుతుంది. జీవితం జీవించటం కోసమే తప్ప సిద్ధాంతాల కోసం కాదన్న ఒక ప్రాథమిక సత్యాన్ని ఈ నవల మనలో ఆవిష్కరిస్తుంది. అంపశయ్య నవీన్ -
జిలానీబానోకు గోపీచంద్ పురస్కారం
సాహితీ వార్త 2014 సంవత్సరానికి త్రిపురనేని గోపీచంద్ జాతీయ పురస్కారాన్ని సుప్రసిద్ధ ఉర్దూ రచయిత్రి జిలానీబానోకు ప్రకటించారు. 2007 నుంచి ప్రకటితమవుతున్న ఈ అవార్డును ఇప్పటి వరకూ డా.శివశంకరి (తమిళం), డా.ప్రతిభారాయ్ (ఒరియా), రావూరి భరద్వాజ, అంపశయ్య నవీన్ అందుకున్నారు. ఈ సంవత్సరం జిలానీబానోకు అందించనున్నట్టు త్రిపురనేని సాయిచంద్ తెలిపారు. అవార్డు కింద 25,000 రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం ఉంటాయి. నవంబర్ 2న హైదరాబాద్‌లోని లామకాన్‌లో జరిగే ఒక కార్యక్రమంలో ఈ పురస్కారం అందజేస్తారు. జిలానీబానో స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని బదయూన్ అయినా చాలాకాలం క్రితమే వారి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. ఆమె తండ్రి హైరత్ బదయూని కవి. అయితే తల్లి జిలానీబానోని ఈ సాహిత్య విషయాల్లోకి దూరకుండా జాగ్రత్త పడేది. ముఖ్యంగా ఇస్మత్ చుగ్తాయ్ పుస్తకాలు కంటపడకుండా చూసేది. అయినప్పటికీ దొరికిన పుస్తకమల్లా చదివి జిలానీబానో రచయిత్రిగా మారారు. ఆమె తొలి కథ ‘మోమ్ కి మరియమ్’ ప్రచురితమైనప్పుడు ఇంటా బయటా చాలా గొడవ జరిగిందనీ ఒక ఆడపిల్ల కథ రాయడం ఏమిటనే నిరసన ఎదురైందని ఆమె చెప్తారు. అయితే ఆ కథను ప్రఖ్యాత కవి మగ్దూమ్ మొహియుద్దీన్ చూసి ఇంత చిన్న వయసులో ఇంతమంచి కథ రాశావా అని మెచ్చుకోవడంతో ఆ తర్వాత ఎవరూ జిలానీబానోకు అడ్డురాలేదు. ఆమె దాదాపు 22 పుస్తకాలు రాసినా వాటిలో కథలు ప్రసిద్ధం. ముఖ్యంగా ఆమె రాసిన ‘నర్సయ్యా కీ బావ్డీ’ (నర్సయ్య బావి) చాలా ప్రసిద్ధమైనది. ఇటీవలే శ్యామ్ బెనగళ్ ఆ కథను ‘వెలడన్ అబ్బా’ పేరుతో చలన చిత్రంగా రూపొందించారు.