ప్రతిధ్వనించే పుస్తకం
త్రిపురనేని గోపీచంద్
‘సీతారామారావు జీవితం విచిత్రమైంది. ఉన్నత శిఖరాగ్రం నుంచి స్వచ్ఛమైన జలంతో భూమిమీద పడి మలినాన్ని కలుపుకొని, మురికి రూపంలోకి ప్రవహించే సెలయేటిని జ్ఞప్తికి తెస్తుంది. తనలో వచ్చిన మార్పు ఆ సెలయేటికి తెలుసో తెలియదో మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే తనలో వచ్చిన మార్పుకి ఆ సెలయేరు బాధపడుతూ వుందో మనకు తెలియదు,’ అంటూ ప్రారంభమవుతుంది త్రిపురనేని గోపీచంద్ నవల ‘అసమర్థుడి జీవయాత్ర’.
ఊహాత్మక ఆదర్శాలకూ వాస్తవ జీవితానికీ మధ్య సమన్వయం కుదుర్చుకోలేని మనిషి సీతారామరావు. దాంపత్యానికి కొత్త అర్థాన్ని కల్పిస్తానని ఇందిరను వివాహం చేసుకుంటాడు. ఆమెను సాధించడం మినహా మరేమీ చేయడు. మళ్లీ సాధిస్తున్నానని తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. పక్కనున్న పేదవాళ్లతో కలిసి ఆడుకొమ్మని పాపకు చెబుతాడు. ఆడుకున్నందుకూ, అందులో భాగంగా పోట్లాడి వచ్చినందుకూ అదే కూతురిని దండిస్తాడు. దీర్ఘంగా ఆలోచించడమే తన బాధలకు మూలకారణం అనుకుంటాడు. అలాగని ఆలోచనను రద్దు చేసుకోలేకపోతాడు. ఈ ప్రపంచం అజ్ఞానుల కోసమే ఉద్దేశించినది అనుకుంటాడు. తాను జ్ఞానంగా భావించే ఏ పనినీ చేయడు. అసలు జ్ఞానమంటే ఏమిటో మాత్రం తెలుసా?
జీవించడం మినహాయించి, జీవితానికి మరే సిద్ధాంతమూ లేదని గుర్తించడంలో విఫలమవుతాడు. బతికినన్నాళ్లూ ఏదో రకంగా జీవితంలో పాల్గొనవలసిందే అని చెప్పిన రామయ్య తాతను హేళన చేస్తాడు. అటు ఏమీ తెలియని శీనయ్యలానో, ఇటు అన్నీ తెలిసిన రామయ్య లానో ఉండలేకపోతాడు. తండ్రి కాపాడమన్న కుటుంబ మర్యాద అనే బరువును నెత్తిన మోపుకుని, ఉన్న ఆస్తినంతా కరిగిస్తాడు. తననూ అందర్ని చూచినట్టు చూస్తే మనసు నొచ్చుకుని, జనంలో స్వేచ్ఛగా కలిసిపోలేక తనకు తానే ఒక ద్వీపకల్పంగా తయారవుతాడు. జీవితపు పరమార్థాన్ని అందుకోలేక, తలెక్కడో తోకెక్కడో తెలియని సంఘంతో ఘర్షణపడతాడు. చివరకు పిచ్చివాడిగా ముద్రపడి ఆత్మహత్య చేసుకుంటాడు.
హేతువాది త్రిపురనేని రామస్వామి కొడుకుగా పుట్టిన గోపీచంద్ తనకు ఎదురైన జీవితానుభవాల నేపథ్యంలో ధార్మిక చింతనలోకి మరలిపోయారు. తన జీవితకాలం మోసిన హేతువాదపు బరువును దింపుకోవడానికి కూడా గోపీచంద్ ఈ నవల రాశాడంటారు. ‘ఎక్కడో ఒకచోట ఈ ఎందుకు? ఆగవలసిందేరా తండ్రుల్లారా’ అని ఓచోట సీతారామరావు వ్యాఖ్యానిస్తాడు కూడా. ‘ఎందుకు? అన్న ప్రశ్న నేర్పినందుకు ‘నాన్నగారికి’ అంకితం చేసిన ఈ పుస్తకం రాయడం ద్వారా అదే నాన్న నుంచి సంక్రమించిన హేతుభావం నుంచి విముక్తుడయ్యారు. తెలుగులో వచ్చిన తొలి మనో వైజ్ఞానిక నవలగానూ, మానసిక స్థితిని చిత్రించడానికి బొమ్మలను వాడిన ప్రయోగాత్మక నవలగానూ దీనికి పేరుంది. తెలుగులో వచ్చిన అత్యుత్తమ నవలల్లో ఒకటి. గోపీచంద్ అత్యుత్తమ పనితనం కనబడే పుస్తకమూ ఇదే!
Comments
Please login to add a commentAdd a comment