
రచయిత త్రిపురనేని గోపీచంద్– చదువుకున్న అమ్మాయిలు, ధర్మదేవత, ప్రియురాలు చిత్రాలకు కథ, మాటలు అందించారు; పేరంటాలు, లక్షమ్మ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. గాయకుడు, స్వరకర్త అయిన బాలాంత్రపు రజనీకాంతరావు, గోపీచంద్ మంచి స్నేహితులు. మద్రాసులో ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు. గోపీచంద్ తీయబోతున్న చిత్రానికి బాలాంత్రపు గేయ రచన, సంగీత దర్శకత్వం వహించబోతున్నారు. ఒకానొక ఘట్టంలో కావల్సిన పాటకి కావాల్సిన మాటల కోసం ఆలోచనలో పడ్డారు గోపీచంద్. ఆ పాటకి సంగీతం గురించి ఆలోచిస్తున్న రజనీకి కాలుమీద దురద పుట్టి, పరధ్యానంగా గోక్కోవడం మొదలుపెట్టిన కాసేపటికి గాభరా పడుతూ, ‘‘నా కాలు స్పర్శ కోల్పోయింది. నేను గోక్కుంటుంటే తెలీటం లేదు. అర్జంటుగా డాక్టరు దగ్గరకి వెళ్ళి చూపించుకోవాలి’’ అన్నారు. తలతిప్పి ఆయన వంక చూసిన గోపీచంద్, ‘‘డాక్టరు, గీక్టరు అక్కర్లేదు. ఇందాకటి నుంచి మీరు గోక్కుంటున్నది మీ కాలు కాదు, నా కాలు’’ అన్నారు. దాంతో అసలు విషయం అర్థమై ఇద్దరు మిత్రులు పగలబడి నవ్వుకున్నారు.
- అనిల్ అట్లూరి