సాక్షి,తెనాలి : తెలుగునాట స్త్రీవాద సాహిత్యాన్ని ఉద్యమ స్థాయికి తీసుకెళ్లేందుకు జీవితాన్ని అంకితం చేసిన ఆచరణశీలి ఓల్గా. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సాధికారికంగా ఉపన్యసించగల వక్త. కొత్త ఆలోచనలపై జరిగే దాడులను నిబ్బరంగా ఎదుర్కోగల సాహసి. మగవారికి మాత్రమే పరిమితమైన తాత్విక సైద్ధాంతిక రంగాల్లో ఒక స్త్రీగా ధీమాతో తిరుగాడిన మేధావి. ఈ సాహిత్య, సామాజిక, వ్యక్తిత్వ ప్రస్థానానికి నేటితో అర్ధ శతాబ్దం నిండింది. ఇదేరోజు ఏడు పదుల వయసులోకి ప్రవేశించటం మరో విశేషం!
ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని ఓల్గా మిత్రులు ‘సాహిత్య సాన్నిహిత్య ఓల్గా ఎట్ 50’ సభను డిసెంబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. నారాయణగూడలోని రెడ్డి ఉమెన్స్ కాలేజీలో జరిగే సభలో కేఎన్ మల్లీశ్వరి సంపాదకత్వంలో తీసుకొచ్చిన ‘సాహిత్య సాన్నిహిత్య ఓల్గా’, ఓల్గా రచించిన ‘చలం–నేను’, ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్నిచ్చిన ‘విముక’ కన్నడ అనువాద పుస్తకాలను ఆవిష్కరించనున్నారు.
కలాన్ని కదం తొక్కించి..
ప్రముఖ స్త్రీవాద స్వచ్ఛంద సంస్థ ‘అస్మిత’లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఓల్గా తన కలాన్ని కదం తొక్కించారు. ‘సహజ’, ‘మానవి’, ‘కన్నీటి కెరటాల వెన్నెల’, ‘ఆకాశంలోసగం’, ‘గులాబీలు’, ‘గమనమే గమ్యం’, ‘యశోబుద’ నవలలు రాశారు. చలం రచనల్లోని ఆరు స్త్రీ పాత్రలతో ‘వాళ్లు ఆరుగురు’ నాటకం రచించారు. ఆమె రాసిన ‘రాజకీయ కథలు’, ‘ప్రయోగం’ సంపుటాలు, స్త్రీ దేహాన్ని కేంద్రంగా చేసుకొని ఆలోచించటం, రాజకీయం చేయటాన్ని ఎండగట్టాయి. భిన్న సందర్భాలు, మృణ్మయనాథం, విముక్త, కథలు లేని కాలం.. వంటివి మరికొన్ని కథా సంపుటాలు.
వీటిలో విముక్తకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. పలు అనువాద రచనలు, నృత్యరూపకాలు, సిద్ధాంతవ్యాసాలు రాశారు. అనేక పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. రచనల్లో సీత, అహల్య, శూర్పణఖ వంటి పురాణపాత్రల పేర్లను చేర్చటం, సందేశంతో కూడిన నృత్యరూపకాలను రాయటం, ప్రజలకు దగ్గరయే అంశాలతో స్త్రీవాదాన్ని వారి దగ్గరకు చేర్చటానికే అంటారామె. స్త్రీవాదం అంటే పురుషులకు వ్యతిరేకం కాదని, వారి మైండ్‌సెట్ మారాలనేది ఓల్గా చెప్పే మాట.
సినిమా రంగంలోనూ..
అధ్యాపక వృత్తి తర్వాత హైదరాబాద్ వెళ్లిన ఓల్గా ‘భద్రం కొడుకో’, ‘తోడు’, ‘గాంధీ’ (డబ్బింగ్), ‘పాతనగరంలో పసివాడు’, ‘గులాబీలు’, ‘అమూల్యం’ సినిమాలకు స్క్రిప్టు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా, పాటల రచన, సహాయ దర్శకురాలిగా రకరకాల బాధ్యతలు నిర్వర్తించారు. పలు టెలీఫిలింలు, టీవీ సీరియల్స్‌కూ పనిచేశారు. బీజింగ్‌లో జరిగిన మహిళల సదస్సు, అమెరికాలో ప్రపంచ మానవహక్కుల కాంగ్రెస్ సదస్సుకు హాజరయ్యారు. బంగ్లాదేశ్, బ్యాంకాక్‌లోనూ పర్యటించారు.
పాటకు జాతీయ అవార్డులు
ఆమె పాటలు రాసిన ‘భద్రం కొడుకో’ సినిమాకు రెండు జాతీయ అవార్డులొచ్చాయి. ‘తోడు’ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు దక్కింది. తనదైన సొంత నిబంధనలు, సిద్ధాంతాలతో వ్యక్తిగత స్వేచ్ఛ, సాధికారత కోసం కృషిచేస్తూ ఎందరో మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తున్నారు. అందుకే ఓల్గా మిత్రులు సాహితీ సాన్నిహిత్య సభను ఏర్పాటు చేసి ఓల్గా తన రచనల్లో పదే పదే ప్రస్తావించిన ‘సిస్టర్‌హుడ్ రిలేషన్‌షిప్’ స్త్రీల మధ్య నిలిచి ఉందని రుజువు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment