Vemana: ఆటవెలది ఈటెగా విసిరిన దిట్ట.. ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట | Vemana Birth Anniversary: Vemana Biography, Vemana Padyalu | Sakshi
Sakshi News home page

Vemana: ఆటవెలది ఈటెగా విసిరిన దిట్ట.. ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట

Published Wed, Jan 18 2023 6:29 PM | Last Updated on Wed, Jan 18 2023 7:05 PM

Vemana Birth Anniversary: Vemana Biography, Vemana Padyalu  - Sakshi

‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మాట వినని తెలుగువారు ఉండరు. వానకు తడవనివారు, ఒక వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అంత ప్రఖ్యాతి గాంచిన మహాకవి యోగి వేమనకు  సొంత రాష్ట్రంలో తగిన గౌరవం దక్కటం లేదనే భావన ఇక తొలగిపోనుంది. యోగి వేమన జయంతిని రాష్ట్ర  ప్రభుత్వం ఏటా జనవరి 19న అధికారికంగా   జరపనుంది. ఈ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 164 జీవోను గత నెల 30న విడుదల చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల వేమన అభిమానులు ఆనందించే విషయమిది. 
– గుంటూరు డెస్క్‌ 


తెలుగువారికి ఎంతో సారస్వత సేవ చేసిన బ్రిటిష్‌ అధికారి సీపీ బ్రౌన్‌తోనే వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయేలా పద్యాలు చెప్పి, మెప్పించిన కవి వేమన. ఆటవెలదిలో అద్భుతమైన కవిత్వం, అనంత విలువలు గల సలహాలు, సూచనలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు వేమన. యవ్వనంలో వేశ్యాలోలుడిగా వ్యవహరించినా, కొంతకాలానికి విరక్తి చెంది, తపస్సు చేసి యోగిగా మారారు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పారు. చివరకు కడప దగ్గరి పామూరు కొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామనవమి నాడు సమాధి చెందారు. కదిరి తాలూకాలోని కటారుపల్లెలోని వేమన సమాధి ప్రసిద్ధి చెందినది. వేమన జీవితకాలం 1652–1730గా పరిశోధకులు పేర్కొన్నారు.  

సామాజిక చైతన్య గీతాలు ఆ పద్యాలు... 
వేమన పద్యాలు లోక నీతులు. పద్యాలన్నిటినీ ఆటవెలది చంధస్సులోనే చెప్పాడు. సామాజిక చైతన్యం ఆ పద్యాల లక్షణం. సమాజంలో ఆయన సృజించని అంశం లేదు. అన్ని సమస్యలను భిన్న కోణాల్లోంచి దర్శించి, ఆ దర్శన వైశిష్ట్యాన్ని తన పద్యాలలో ప్రదర్శించారు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట దోపిడీలను ఎలుగెత్తటమే కాకుండా విగ్రహారాధనను నిరసించారు. కుహనా గురువులు, దొంగ సన్యాసుల దోపిడీలు...ఒకటేమిటి? ప్రతి సామాజిక అస్తవ్యస్తతపైన తన కలాన్ని ఝళిపించారాయన. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోనూ నీతిని ప్రతిపాదించి మూడో పాదంలో దానికి తగిన  సామ్యం చూపాడు. 
   
‘అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను/సజ్జనుండు పలుకు చల్లగాను/కంచుమ్రోగినట్లు కనకంబు మ్రోగునా/ విశ్వదాభిరామ వినుర వేమ’ అని చాటారు. మరో పద్యంలో ‘విద్యలేనివాడు విద్వాంసు చేరువ/నుండగానె పండింతుండు కాడు/కొలది హంసల కడ కొక్కెరలున్నట్లు/ విశ్వదాభి రామ వినుర వేమ!’అన్నారు. కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తర్వాత నీతిని చెప్పాడు. అందుకు ‘అనగననగరాగ మతిశయించునుండు/తినగ తినగ వేము తియ్యనుండు/ సాధనమున పనులు సమకూరు ధరలోన/విశ్వదాభిరామ వినుర వేమ’ ఉదాహరణ. పద్యంలో నాలుగో పాదం ‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మకుటం. విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైన వాడని, అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము–అని ఈ మకుటానికి అర్థం చెప్పారు పండితులు. బ్రౌను మహాశయుడు ఇదే అర్థంతో వేమన పద్యాలను ఇంగ్లిష్‌లోకి అనువదించారు.  

వేమన కీర్తిని అజరామరం చేశారు... 
తెలుగువారిలో వేమన కీర్తిని అజరామరం చేయటానికి కృషి చేసినవారు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు, సంఘాల ఏర్పాటును సాధించారు. కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు. ఆరుద్ర ‘మన వేమన’ పుస్తకాన్ని రచించారు. డాక్టర్‌ ఎన్‌.గోపి, బంగోరె వంటి కవులు, రచయితలు వేమన రచనలపై పరిశోధనలు చేశారు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావుచే కేంద్ర సాహిత్య అకాడమీ వేమన జీవిత చరిత్రను రాయించి 14 భాషల్లోకి అనువదింపజేసింది. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషల్లోకి వేమన పద్యాలు అనువాదమయ్యాయి. 

వేమనకు లభించిన గౌరవం మరే తెలుగు కవికీ లభించలేదు. ఐక్యరాజ్యసమితి–యునెస్కో విభాగం, ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకుని, ఆ రచనలను పలు భాషల్లోకి అనువదింపజేశారు. వేమన జీవిచరిత్ర, యోగి వేమన (1947), యోగి వేమన (1988), శ్రీవేమన చరిత్ర (1986) పేర్లతో సినిమాలుగా ప్రజలను ఆలరించాయి. పౌరాణిక నటుడు గుమ్మడి గోపాలకృష్ణ రూపొందించిన ‘యోగి వేమన’ సీరియల్‌ టీవీ ఛానల్‌లో ప్రసారమైంది. ఇంతటి కీర్తిని పొందిన వేమన జయంతికి పొరుగునున్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏటా తగిన నిధులను కేటాయిస్తూ, తాలూకా, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తోంది. 

మైసూర్‌ మహారాజ సంస్థాన్‌ ఏనాడో వేమన ప్రాశస్త్యాన్ని గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో వేమనకు, ఆయన సాహిత్యానికి తగిన ప్రచారం, గౌరవాన్ని కల్పించటం లేదనేది నిష్ఠురసత్యం. దీనిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై 1929 నుంచి వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న తెనాలి సమీపంలోని మోదుకూరు గ్రామంలోని వేమన జయంతి ఉత్సవ కమిటీ హర్షం తెలియజేసింది. 

నాడే సాహసోపేత హేతువాది... 
ఆ కాలం పరిస్థితుల ప్రకారం వేమనను గొప్ప హేతువాదిగా ప్రశసించింది సాహితీలోకం. సమాజంలో ప్రబలంగా పాతుకుపోయిన ఆచారాలు, మూఢనమ్మకాలను ఆ రోజుల్లో అంత నిశితంగా  ఎత్తిచూపటానికి ఎంతటి ఆత్మస్థైర్యం, అవగాహన కావాలి. విగ్రహారాధనను విమర్శిస్తూ...‘పలుగు రాళ్లు దెచ్చి/ పరగ గుడులు కట్టి/ చెలగి శిలల సేవ జేయనేల?/ శిలల సేవ జేయ ఫలమేమి కలుగురా?’అని ప్రశ్నించారు. కుల విచక్షణలోని డొల్లతనం గురించి... ‘మాలవానినంటి/ మరి నీట మునిగితే/ కాటికేగునపుడు కాల్చు మాల/ అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?...’ అనడిగారు. 

వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్థం కాలేదు. కేవలం సామాన్యుల నాల్కలపైనే నడయాడుతూ వచ్చాయి. 1731లో ఫాదర్‌ లెగాక్‌ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకుల భావన. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తర్వాత ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌లు వేమన పద్యాలెన్నింటినో సేకరించారు. తాను వేమనను కనుగొన్నాని బ్రౌన్‌ సాధికారికంగా ప్రకటించుకొన్నారు. 
    
వందలాది పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఇంగ్లిష్‌ భాషల్లోకి అనువదించారు. అలాగే హెన్నీ బ్లూచాంస్‌ (1897), విలియమ్‌ హోవర్డ్‌ కాంబెల్‌ (1920), జీయూ పోప్, సీఈ గోవర్‌ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు, వేమనను లోకకవిగా కీర్తించారు. 

మహాకవి పేరిట విశ్వవిద్యాలయం.. 
ఆ మహాకవి పేరిట దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని నిర్మించి అనేక కోర్సులతో విద్యను అందించడంతోపాటు వేమన జీవితం మరుగున పడకుండా భావితరాలకు అందించడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement