yogi vemana
-
యోగి వేమనకు సీఎం జగన్ నివాళులు అర్పించారు
-
యోగి వేమన చిత్రపటానికి సీఎం జగన్ పుష్పాంజలి
-
Yogi Vemana: సీఎం జగన్ పుష్పాంజలి
సాక్షి, గుంటూరు: సమాజంలో రుగ్మతలను చీల్చి చెండాడిన సంఘసంస్కర్త, కవి మహాయోగి వేమన. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. -
Vemana: లోకకవి మన వేమన!
వానకు తడవని వారూ, ఒక్క వేమన పద్యం కూడా వినని తెలుగువారూ ఉండరని లోకోక్తి. అలతి పదాలతో సమాజంలోని రుగ్మతలను తూర్పార బట్టిన మనో వైజ్ఞానికుడు వేమన. సమకాలీన వ్యవస్థలపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంఘసంస్కర్త, విప్లవకారుడు వేమన. 1839లో తొలిసారిగా బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు పుస్తక రూపంలో వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత అనేకమంది ఆయనపై పరిశోధన చేశారు. ప్రముఖ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు కేంద్ర సాహిత్య అకాడమీ వారి సహకారంతో వేమన జీవిత చరిత్రను 14 భాషలలోకి అనువదించడానికి కారకులయ్యారు. ఆంగ్ల, ఐరోపా భాషల్లోకీ; అన్ని ద్రవిడ భాషల్లోకీ వేమన పద్యాలు అనువాదమయ్యాయి. సి.ఇ. గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమన సాహిత్యానికి ముగ్ధులై ఆయనను లోక కవిగా కీర్తించారు. వేమన 1602–1730 మధ్య కాలానికి చెందిన వాడనీ కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వాడనీ అంటారు. జనబాహుళ్యంలో ఉన్న వివరాల ప్రకారం, వేమన అసలు పేరు బెధమ కోమటి చినవేమారెడ్డి. ఈయన అన్న పేరు బెధమ కోమటి పెదవేమారెడ్డి. వేమన జన్మించిన ప్రాంతంపై అనేక రకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ చివ రిగా ఆయన అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న కటారు పల్లె ప్రాంతానికి చెందిన వారని నిర్ధారించారు. అందుకే ఆ ప్రాంతంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వేమన జయంతి ఉత్సవాలను జరపడానికి నిర్ణయించుకుంది. వేమన భోగలాలసుడుగా తిరుగుతూ ఒకానొక దశకు వచ్చేటప్పటికి ఓ సాధువు ద్వారా ఆత్మ జ్ఞానం పొంది అన్నింటినీ త్యజించి యోగిలా మారిపోయాడని అంటారు. సంసార బాధలనుండి ఉపశమనం పొందడానికి తనను ఆశ్రయించే అభాగ్యులకు తన పద్యాల ద్వారా తత్వాన్ని బోధించడం మొదలు పెట్టాడు. తన మాటల ద్వారా తనలో జ్ఞానజ్యోతిని మొట్ట మొదటగా వెలిగించిన తన ప్రేయసి విశ్వద పేరును, తనకు కష్ట కాలంలో అండగా నిలిచిన మిత్రుడు అభిరాముడి పేరును తన పద్యాలకు మకుటంలో చేర్చి వారికి శాశ్వత కీర్తిని ప్రసాదించాడు వేమన అనేది కొందరి అభిప్రాయం. అయితే అసలు ఇవన్నీ కూడా ప్రక్షిప్తాలనీ... వేమన చిన్న నాటి నుంచే జ్ఞానశీలి అనీ, తదనంతరం స్నేహితుల ప్రభావంవల్ల దారితప్పి, ఆపై పరివర్తన వచ్చి యోగిగా మారాడనీ అంటారు. ఆయన పద్యమకుటానికి ‘సృష్టి కర్తకు ప్రియమైన వేమా వినుము’ అని పండితులు మరో అర్థాన్ని చెప్పారు. బ్రౌన్ ఈ అర్థాన్నే తీసుకొని వేమన పద్యాలను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. వేమన పద్యాలలో ఎక్కువగా లోక నీతులు, సామాజిక రీతులు, సామాజిక చైతన్యానికి సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఆయన కవిత్వంలో స్పృశించని అంశమే లేదు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు; మతం పేరిట జరుగుతున్న అరాచకాలు, దోపిడీలు, విగ్రహారాధనలోని మౌఢ్యం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు... ఒకటే మిటి? కనిపించిన ప్రతి సామాజిక రుగ్మత మీద వేమన తనకలం ఝుళిపించాడు. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకునేట్లు వారికి పరిచితమైన భాషలో స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా శక్తిమంతంగా వ్యక్తీకరించారు. వేమన పద్యా లన్నీ ఆటవెలది చందస్సులోనే చెప్పాడు. కవిత్రయం అంటే తిక్కన, వేమన, గుర జాడ అంటాడు శ్రీశ్రీ. ‘వేమన కవిత్వం గాయానికి మందు రాసినట్లు కాక, ఆ గాయం చేసిన కత్తికే ముందు మందు పూసినట్లుంటుంది’ అంటారు రాళ్ల పల్లి అనంత కృష్ణ శర్మ. తన పద్యాలలో సామ్యవాద సిద్ధాంతాన్ని ఎప్పుడో ఎలిగెత్తి చాటిన సామ్యవాద ప్రజా కవి వేమన. (క్లిక్ చేయండి: ఆటవెలది ఈటెగా విసిరిన దిట్ట.. ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట) - పి. విజయబాబు అధికార భాషా సంఘం అధ్యక్షులు, ఏపీ (జనవరి 19 వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా) -
వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
యోగి వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: యోగి వేమన జయంతి సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. కాగా, యోగి వేమన జయంతిని ప్రతి ఏటా జనవరి 19న అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల జీవో కూడా జారీ చేసింది. చదవండి: (ఆ పదవి నాకు ఇవ్వాలి.. అప్పుడు పోలీసుల సంగతి చెప్తా: అయ్యన్న) -
యోగి వేమనా.. నీకు వందనం
వైవీయూ(వైఎస్సార్ జిల్లా): విశ్వదాభిరామ.. వినురవేమ.. అనేమాట వినని తెలుగువారు ఉండరు.. ‘‘వానకు తడవని వారు, ఒక వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరు’’ అని లోకోక్తి. ఆ మహాకవికి రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. యోగివేమన జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహించాలని గతనెలలో జీఓ నెంబర్ 164ను విడుదల చేసింది. దీంతో ప్రతియేటా జనవరి 19న వేమన జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. ∙ప్రజాకవి, తాత్వికవేత్త అయిన వేమన పేరుతో దేశంలో ఏర్పాటైన ఏకైక విశ్వవిద్యాలయం యోగివేమన విశ్వవిద్యాలయం. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయంలో 2014లో వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి యేటా జనవరి 18వ తేదీన వేమన జయంతి వేడుకలు నిర్వహిస్తూ వచ్చారు. వేమన జయంతి జనవరి 18 అనేందుకు చారిత్రక ఆధారాలు ఎక్కడా లేకపోవడంతో సాహితీవేత్తలు, చరిత్రకారుల అభిప్రాయాల మేరకు అప్పటి వీసీ ఆచార్య మునగల సూర్యకళావతి ఆదేశాల మేరకు గత రెండు సంవత్సరాలుగా వైవీయూలో జనవరి 19న నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు జనవరి 19న రాష్ట్రవేడుకగా నిర్వహించేందుకు విశ్వవిద్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రాంగణంలో వేమన పద్యాలు.. వేమన పద్యాలు ఎంత సరళంగా స్పష్టంగా, అర్థవంతంగా ఉంటాయో.. ఆ పద్యాలకు ఉన్న ఆదరణే తెలియజేస్తుంది. అయితే వేమన పేరుతో ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో ఆయన నోటి నుంచి జాలువారిన పద్యాలను ఎంపిక చేసుకుని విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయంలో ‘వేమన మాట’ పేరుతో వేమన పద్యాలను రాసి క్యాంపస్‌లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. నేడు వైవీయూలో.. యోగివేమన విశ్వవిద్యాలయంలో గురువారం వేమన జయంతి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు తెలుగుశాఖ విభాగాధిపతి ఆచార్య జి. పార్వతి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె. హేమచంద్రారెడ్డి, సభాధ్యక్షులుగా వైస్ చాన్సలర్ ఆచార్య రంగ జనార్ధన, ప్రత్యేక ఆహ్వానితులుగా రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపాల్ ఆచార్య కె. కృష్ణారెడ్డి హాజరవుతారని తెలిపారు. ప్రధానవక్తగా మైసూరులోని కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం పీఠాధిపతి ఆచార్య ఎం. రామనాథంనాయుడు హాజరై కీలకోపన్యాసం చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అతిథులు చేతుల మీదుగా వేమన విగ్రహానికి పుష్పమాలలతో అలంకరణ, వేమన చైతన్య యాత్ర, వేమన నాటికప్రదర్శన, పద్యగానం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. -
Vemana: ఆటవెలది ఈటెగా విసిరిన దిట్ట.. ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట
‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మాట వినని తెలుగువారు ఉండరు. వానకు తడవనివారు, ఒక వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అంత ప్రఖ్యాతి గాంచిన మహాకవి యోగి వేమనకు సొంత రాష్ట్రంలో తగిన గౌరవం దక్కటం లేదనే భావన ఇక తొలగిపోనుంది. యోగి వేమన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఏటా జనవరి 19న అధికారికంగా జరపనుంది. ఈ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 164 జీవోను గత నెల 30న విడుదల చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల వేమన అభిమానులు ఆనందించే విషయమిది. – గుంటూరు డెస్క్ తెలుగువారికి ఎంతో సారస్వత సేవ చేసిన బ్రిటిష్ అధికారి సీపీ బ్రౌన్తోనే వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయేలా పద్యాలు చెప్పి, మెప్పించిన కవి వేమన. ఆటవెలదిలో అద్భుతమైన కవిత్వం, అనంత విలువలు గల సలహాలు, సూచనలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు వేమన. యవ్వనంలో వేశ్యాలోలుడిగా వ్యవహరించినా, కొంతకాలానికి విరక్తి చెంది, తపస్సు చేసి యోగిగా మారారు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పారు. చివరకు కడప దగ్గరి పామూరు కొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామనవమి నాడు సమాధి చెందారు. కదిరి తాలూకాలోని కటారుపల్లెలోని వేమన సమాధి ప్రసిద్ధి చెందినది. వేమన జీవితకాలం 1652–1730గా పరిశోధకులు పేర్కొన్నారు. సామాజిక చైతన్య గీతాలు ఆ పద్యాలు... వేమన పద్యాలు లోక నీతులు. పద్యాలన్నిటినీ ఆటవెలది చంధస్సులోనే చెప్పాడు. సామాజిక చైతన్యం ఆ పద్యాల లక్షణం. సమాజంలో ఆయన సృజించని అంశం లేదు. అన్ని సమస్యలను భిన్న కోణాల్లోంచి దర్శించి, ఆ దర్శన వైశిష్ట్యాన్ని తన పద్యాలలో ప్రదర్శించారు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట దోపిడీలను ఎలుగెత్తటమే కాకుండా విగ్రహారాధనను నిరసించారు. కుహనా గురువులు, దొంగ సన్యాసుల దోపిడీలు...ఒకటేమిటి? ప్రతి సామాజిక అస్తవ్యస్తతపైన తన కలాన్ని ఝళిపించారాయన. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోనూ నీతిని ప్రతిపాదించి మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపాడు. ‘అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను/సజ్జనుండు పలుకు చల్లగాను/కంచుమ్రోగినట్లు కనకంబు మ్రోగునా/ విశ్వదాభిరామ వినుర వేమ’ అని చాటారు. మరో పద్యంలో ‘విద్యలేనివాడు విద్వాంసు చేరువ/నుండగానె పండింతుండు కాడు/కొలది హంసల కడ కొక్కెరలున్నట్లు/ విశ్వదాభి రామ వినుర వేమ!’అన్నారు. కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తర్వాత నీతిని చెప్పాడు. అందుకు ‘అనగననగరాగ మతిశయించునుండు/తినగ తినగ వేము తియ్యనుండు/ సాధనమున పనులు సమకూరు ధరలోన/విశ్వదాభిరామ వినుర వేమ’ ఉదాహరణ. పద్యంలో నాలుగో పాదం ‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మకుటం. విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైన వాడని, అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము–అని ఈ మకుటానికి అర్థం చెప్పారు పండితులు. బ్రౌను మహాశయుడు ఇదే అర్థంతో వేమన పద్యాలను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. వేమన కీర్తిని అజరామరం చేశారు... తెలుగువారిలో వేమన కీర్తిని అజరామరం చేయటానికి కృషి చేసినవారు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు, సంఘాల ఏర్పాటును సాధించారు. కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు. ఆరుద్ర ‘మన వేమన’ పుస్తకాన్ని రచించారు. డాక్టర్ ఎన్.గోపి, బంగోరె వంటి కవులు, రచయితలు వేమన రచనలపై పరిశోధనలు చేశారు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావుచే కేంద్ర సాహిత్య అకాడమీ వేమన జీవిత చరిత్రను రాయించి 14 భాషల్లోకి అనువదింపజేసింది. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషల్లోకి వేమన పద్యాలు అనువాదమయ్యాయి. వేమనకు లభించిన గౌరవం మరే తెలుగు కవికీ లభించలేదు. ఐక్యరాజ్యసమితి–యునెస్కో విభాగం, ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకుని, ఆ రచనలను పలు భాషల్లోకి అనువదింపజేశారు. వేమన జీవిచరిత్ర, యోగి వేమన (1947), యోగి వేమన (1988), శ్రీవేమన చరిత్ర (1986) పేర్లతో సినిమాలుగా ప్రజలను ఆలరించాయి. పౌరాణిక నటుడు గుమ్మడి గోపాలకృష్ణ రూపొందించిన ‘యోగి వేమన’ సీరియల్ టీవీ ఛానల్లో ప్రసారమైంది. ఇంతటి కీర్తిని పొందిన వేమన జయంతికి పొరుగునున్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏటా తగిన నిధులను కేటాయిస్తూ, తాలూకా, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తోంది. మైసూర్ మహారాజ సంస్థాన్ ఏనాడో వేమన ప్రాశస్త్యాన్ని గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో వేమనకు, ఆయన సాహిత్యానికి తగిన ప్రచారం, గౌరవాన్ని కల్పించటం లేదనేది నిష్ఠురసత్యం. దీనిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై 1929 నుంచి వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న తెనాలి సమీపంలోని మోదుకూరు గ్రామంలోని వేమన జయంతి ఉత్సవ కమిటీ హర్షం తెలియజేసింది. నాడే సాహసోపేత హేతువాది... ఆ కాలం పరిస్థితుల ప్రకారం వేమనను గొప్ప హేతువాదిగా ప్రశసించింది సాహితీలోకం. సమాజంలో ప్రబలంగా పాతుకుపోయిన ఆచారాలు, మూఢనమ్మకాలను ఆ రోజుల్లో అంత నిశితంగా ఎత్తిచూపటానికి ఎంతటి ఆత్మస్థైర్యం, అవగాహన కావాలి. విగ్రహారాధనను విమర్శిస్తూ...‘పలుగు రాళ్లు దెచ్చి/ పరగ గుడులు కట్టి/ చెలగి శిలల సేవ జేయనేల?/ శిలల సేవ జేయ ఫలమేమి కలుగురా?’అని ప్రశ్నించారు. కుల విచక్షణలోని డొల్లతనం గురించి... ‘మాలవానినంటి/ మరి నీట మునిగితే/ కాటికేగునపుడు కాల్చు మాల/ అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?...’ అనడిగారు. వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్థం కాలేదు. కేవలం సామాన్యుల నాల్కలపైనే నడయాడుతూ వచ్చాయి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకుల భావన. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తర్వాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్‌లు వేమన పద్యాలెన్నింటినో సేకరించారు. తాను వేమనను కనుగొన్నాని బ్రౌన్ సాధికారికంగా ప్రకటించుకొన్నారు. వందలాది పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఇంగ్లిష్ భాషల్లోకి అనువదించారు. అలాగే హెన్నీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1920), జీయూ పోప్, సీఈ గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు, వేమనను లోకకవిగా కీర్తించారు. మహాకవి పేరిట విశ్వవిద్యాలయం.. ఆ మహాకవి పేరిట దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని నిర్మించి అనేక కోర్సులతో విద్యను అందించడంతోపాటు వేమన జీవితం మరుగున పడకుండా భావితరాలకు అందించడం గమనార్హం. -
Vemana: వేమనకు కొండంత వెలుగు
వేమన పద్యం ఒకటైనా రాని తెలుగువారు ఉండరు. తెలుగు జాతి ఉన్నంతకాలం వేమన పద్యాలు ప్రజల నాలుకలపై నిలిచే ఉంటాయి. తెలుగు నేలపై నడయాడిన వేమన తెలుగు సాహిత్యానికి ఒక కొండగుర్తుగా నిలుస్తారు. భాషలో, భావంలో ప్రజలకు సాహిత్యాన్ని చేరువ చేసిన ఘనత వేమనది. సమాజంలోని అన్ని అసమానతలు పోయి మనుషులు మానవీయంగా ఎదగాలని వేమన కోరు కున్నారు. ఉన్న స్థితి నుండి సమాజం మరో అడుగు ముందుకు సాగాలని తపించారు. ఆటవెలదులనే ఈటెలతో సమాజ సంస్కరణకు పూనుకొన్నారు. ఆ తర్వాత అనేక తరాల కవులకు మార్గ దర్శకంగా నిలిచారు. దేశ విదేశాల పండితులను సైతం వేమన పద్యాలు ఆకర్షించాయి. పాశ్చాత్య భాషలలోనూ అనువాదమయ్యాయి. తెలుగు సమాజానికి వెలుగులు నింపిన వేమనకు కొండంత వెలుగును ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 19న వేమన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్ణయించింది. డిసెంబర్ 30న ఈ విషయమై జీఓ 164ను విడుదల చేసింది. కర్ణాటక ప్రాంతంలో తెలుగువారు స్వచ్ఛందంగా వేమన జయంతిని జరుపుకొనే సంప్రదాయం ఉంది. వందేళ్ళ నాడే కట్టమంచి రామలింగారెడ్డి తదితరుల ప్రోత్సాహం కూడా అందులో ఉంది. ప్రజల ఆకాంక్ష లను గుర్తించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2017 డిసెంబర్ 22న వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. తాలుకా స్థాయిలో రూ. 25,000, జిల్లా స్థాయిలో 50,000, రాష్ట్ర స్థాయిలో రూ.10 లక్షలు... మొత్తం అరవై తొమ్మిదిలక్షల రూపాయలు ప్రతి ఏడాదీ కేటాయిస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా ఇందులో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ధార్వాడ విశ్వ విద్యాలయంలో 1980లలోనే ‘వేమన పీఠం’ ఏర్పాటు చేసిన విషయం కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్‌లోనూ సాంస్కృతిక శాఖ వేమన జయంతిని కర్ణాటక రాష్ట్రంలో లాగా నిర్వహించాలని 2018 లోనే వేమన సంఘాలు, అభిమానులు కోరడమైంది. అప్పటి మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడమయింది. వేమన సమాధి ప్రాంతమైన కటారుపల్లి గ్రామం సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉంది. స్థానికుల ఒత్తిడితో అప్పటి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాష వేమన జయంతి విషయమై 10 సెప్టెంబరు 2019న అసెంబ్లీలో ప్రశ్నించారు. కనీస చర్చ కూడా జరగడానికి సభాపతి అవకాశం ఇవ్వలేదు. సాంస్కృతిక శాఖ కోట్లకు కోట్లు వేరు వేరు సాహిత్య, సాంస్కృతిక ప్రచార కార్యక్రమాలు ఆ రోజులలో చేసింది. అనేకమంది కవుల కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించింది. వేమనపై కనీసం ఒక సదస్సు నిర్వహించమని కోరినా పట్టించుకోలేదు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సాంస్కృతిక శాఖ పక్షాన వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు రావాలని వేమన సంఘాలు కోరుతూ వచ్చాయి. 2019 నుండి ఈ ప్రక్రియ మొదలై నేడు అది సాకార మైంది. వేమన రాష్ట్ర స్థాయి పండుగ నిర్వహించబోతున్న ఈ సందర్భంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం. సత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గంలోని కటారుపల్లి గ్రామంలోని వేమన సమాధి ప్రాంతంలో ప్రారంభ రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించాలి. రాష్ట్రంలోని వివిధ జోన్లలో ఒకో సంవత్సరం ఒకోచోట కార్యక్రమం ఉండేలా చేయాలి. జిల్లా, నియోజక వర్గ, మండల, గ్రామ స్థాయి వరకూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 19న కార్యక్రమాలు చేయాలి. విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకంగా వేమన పద్యపోటీలు, సదస్సులు నిర్వహించాలి. మాజీ డీజీపీ పర్యాటకశాఖ సంస్థ ఛైర్మన్ చెన్నూరు అంజనేయరెడ్డి 2003లో ప్రత్యేక శ్రద్ధతో కటారుపల్లిలో వేమన సమాధిప్రాంతం, పరిసరాలలో అభివృద్ధి కోసం 3 కోట్లు కేటాయించారు. కోటిన్నర రూపాయల దాకా ఖర్చు జరిగింది. మిగతా నిధులు పూర్తి స్థాయిలో వినియోగించలేదు. తక్షణం నిధులు కేటాయించి పూర్తి స్థాయి పనులు చేపట్టాలి. వేమన సాహిత్యంపై అధ్యయనానికీ, విస్తరణకూ ఒక ప్రత్యేక పరిశోధనా సంస్థనూ, గ్రంథాలయాన్నీ నెలకొల్పాలి. ఆధునిక తరానికి వేమన గురించి తెలిసేలా ప్రత్యేక వెబ్సైట్ నడపాలి. ప్రామాణిక వేమన పద్యప్రతిని రూపొందించడానికి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలి. పాఠ్య పుస్తకాలలో వేమన పద్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేమనతో ముడిపడిన కొండవీడు, గండికోట, నల్లచెరువు, పామూరు తదితర స్థలాలకు గుర్తింపు తీసుకురావాలి. జాతీయకవిగా వేమన గుర్తింపునకై కృషి జరగాలి. (క్లిక్ చేయండి: ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..) - డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి కార్యదర్శి; వేమన ఫౌండేషన్, అనంతపురం -
వేమన చెప్పిందే వేదం
- ప్రజాకవిగా, మానవతావాదిగా చిరస్మరణీయుడు వేమన - నేడు వేమన సాహితీ సమాలోచన సమితి రాష్ట్ర సదస్సు ప్రారంభం అనంతపురం కల్చరల్ : యోగివేమనను కవిత్వంలో సామాజిక చైతన్యం తీసుకొచ్చిన గొప్ప విప్లవకారునిగా, దైవాంశ సంభూతుడిగా భావించిన నాటి జనం ‘వేమన చెప్పిందే వేదం’ అనుకునేవారు. యవ్వనంలో అన్ని భోగాలనూ అనుభవించి ఆ తర్వాత విరాగిగా మారి ఊరూరా తిరిగి ప్రజలకు సత్యమార్గాన్ని చూపెట్టిన ఆయన జీవితంపై ఎన్నో చిత్రాలు వచ్చాయి. వేమన స్మృత్యర్థం కేంద్ర ప్రభుత్వం ఓ స్టాంపును కూడా విడుదల చేసింది. అలాంటి ఆయన పేరిట అనంతపురంలో శనివారం నుంచి రెండురోజులపాటు సాహితీ సమాలోచన రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. సరళీకృత భాషతో సమాజ చైతన్యం ప్రజా కవిగా.. సంస్కరణాభిలాషిగా.. కులాన్ని నిరసించిన మానవతా వాదిగా.. మీదు మిక్కిలి పరభాషా ఆధిపత్యాన్ని ప్రశ్నించి తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన మహనీయుడిగా.. తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడైన వేమన గురించి తెలియని ఆంధ్రుడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకనాడు పండితులకు మాత్రమే అర్థమయ్యే సాహితీ సౌందర్యాలను తనదైన అద్భుత ప్రజ్ఞతో సరళీకృతమైన భాషలో అందించి సమాజాన్నంతటినీ ప్రభావితం చేసిన ప్రజాకవి వేమారెడ్డి. యోగి వేమనగా సుప్రసిద్ధులైన ఆయన పామరుడి నుంచి మహా పండితుల వరకు అందరికీ అర్థమయ్యేలా కవితా శక్తిని క్రోడికరించుకుని జీవిత సత్యాలను, మానవతా విలువలను తెలుగు వారందరికీ అందించి ప్రజాకవిగా ప్రఖ్యాతి పొందారు. దుష్ట సంప్రదాయాలను, మూఢాచారాలను, విగ్రహారాధనలను, కుల వివక్షను, మత మౌఢ్యాలను, స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను... ఇలా ఒకటేమిటి సమాజానికి హాని కలిగించే అన్నింటినీ సూటిగా, ఘాటుగా విమర్శించి ప్రజలను ఉత్తేజితులను చేశారు. ఆటవెలదులనే తూటాలుగా మార్చి మూఢాచారాలపై చైతన్య బావుటా ఎగురేసిన గురజాడ, కందుకూరి, జ్యోతిరావుపూలే, పెరియార్ వంటి సంస్కరణవాదులకు పూర్వ రంగం సిద్ధం చేసింది వేమనే. ‘ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడ వేరు.. పురుషులందు పుణ్యపురుషులు వేరయా..’, ‘పేదవాని ఇంట పెండ్లయిన ఎరుగరు..’ వంటి జీవిత సత్యాలను తెలిపే తెలుగు పద్యాలతో సంఘంలోని ఆర్థిక అవినీతిని మధ్యయుగం నాడే ఖండించిన మహానుభావుడు ఆయన. వేమన జీవితం జిల్లాతో మమేకం వర్షంలో తడవని వారుంటారేమో కానీ వేమన పద్యాలు వినని తెలుగువారుండరని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు వేమన పద్యాలు అంతగా జగత్ప్రసిద్ధాలయ్యాయి. గండికోటను పాలించే గడ్డంరెడ్డి మూడవ సంతానంగా వేమారెడ్డి 1652లో జన్మించారని చరిత్ర చెబుతోంది. జన్మస్థలంపై కచ్చితమైన సమాచారం లేకున్నా ఆయన 1730లో కదిరి ప్రాంతంలో సమాధి అయిన మాట వాస్తవం. ఇప్పటికీ ఆయన సమాధి అయిన కదిరి మండలంలోని కటారుపల్లె పర్యాటక క్షేత్రంగా భాసిల్లుతోంది. వేమన ప్రపంచ కవి అశాస్త్రీయమైన సమాజాన్ని సమూలంగా మార్చడానికి ప్రయత్నం చేసిన యోగి వేమన సాహిత్యాన్ని సుప్రసిద్ధం చేయడానికి అనంత వేదిక అవుతోంది. ప్రజాకవి వేమన సాహితీ సమాలోచన రాష్ట్ర సదస్సుకు ఆహ్వాన కమిటీ అధ్యక్షునిగా ఉండటం నా బాధ్యతను మరింత పెంచింది. ఆయన రచించిన పద్యాలు చాలావరకు కనుమరుగైపోయినా లభించిన వాటితోనే అద్భుతాలు ఆవిష్కారమవుతున్నాయంటే అన్నీ దొరికితే మరెంత బావుంటుందో చెప్పలేము. ‘ద వర్సెస్ ఆఫ్ వేమన’ అంటూ ఓ ఆంగ్లేయుడు ఆయన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించి తెలుగు భాషకు గొప్ప సేవ చేశారు. వేమన తెలుగుకు పరిమితమైన కవి మాత్రమే కాదు ప్రపంచ కవి. వేమన పద్యాలతో జీవితాన్ని సరిదిద్దుకోవచ్చు. ఉత్తమ సమాజాన్ని నిర్మించుకోవచ్చు. - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రెండురోజులపాటు సాహిత్య సంబరాలు ప్రజాకవి వేమన సాహితీ సమాలోచన రాష్ట్ర సదస్సు పేరిట రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. శనివారం సాయంత్రం రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన కళాకారులు మునిసిపల్ కార్యాలయం వద్ద వేమన సాహిత్య ప్రాధాన్యతను తెలిపే నృత్యరూపకాలు ప్రదర్శిస్తారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక పద్మావతి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర సదస్సుకు వివిధ జిల్లాల నుంచి సాహితీవేత్తలు, కవులు, రచయితలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వేమన సాహిత్యంపై జాలు వారిన సుమారు 14 పుస్తకాలను ఆవిష్కరిస్తారు. సాహితీ అభిమానులు విరివిగా విచ్చేయాలి. - కుమారస్వామి, ఆహ్వాన కమిటీ కార్యదర్శి -
తెలుగు సాహిత్య వెలుగు రేఖ వేమన
గాండ్లపెంట (కదిరి): తెలుగు సాహిత్య వెలుగు రేఖ వేమన. సమాజంలోని మంచి చెడుల్ని, జీవిత సత్యాలను తెలియజేసిన మహాయోగి. మట్టిలో పుట్టి మహోన్నతమైన శిఖరాలను అందుకున్న మానవతామూర్తి. మనుషుల మధ్య తిరుగుతూనే మానవ జీవిత సత్యాసత్యాలను నిత్యాన్వేషణతో దర్శించి విమర్శించిన వివేకి. ఈయన రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజాకవి. గాండ్లపెంట మండలం కటారుపల్లిలో యోగి వేమన బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి మూడు రోజులపాటు వేమన వంశస్తులైన పీఠాధిపతులు ఘనంగా నిర్వహించనున్నారు. తొలిరోజు మహాశక్తిపూజ (కుంభం పోయుట), పదో తేదీన బండ్లమెరవణి, పానకపందేరము, 11న సాయంత్రం ఉట్లతిరునాల, రాత్రి 8 గంటలకు అగ్గిసేవ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు అనంతపురం జిల్లావాసులే కాక వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం వేమన భక్తులు తరలివస్తారు. -
ఐక్యతతోనే రాణింపు
పరిగి (పెనుకొండ రూరల్) : ఐక్యత ఉన్నప్పుడే ఏరంగంలో నైనా రాణించ గలమని మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, గురునాథ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్రజాకవి యోగివేమన శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. యువతరం పోటోలు, సెల్ఫీలపై దృష్టి పెట్టకుండా రాజ్యధికారం కోసం ముందుండి నడిపించాలన్నారు. దీనివల్ల పది మందికి సాయం చేయవచ్చునన్నారు. అనైక్యత అభివృద్ధి నిరోధకమన్నారు. కర్ణాటక డిప్యూటీ స్పీకర్ శివశంకరరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ తోపుదుర్తి కవిత, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ శివశంకరరెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రజల బాధ్యతను సరళ భాషలో విశదీకరించిన మహనీయుడు వేమన అని కొనియాడారు. రెడ్డి వర్గీయులు పార్టీల కతీతంగా భావితరాలకు అభివృద్ధి చిహ్నంగా ఉండాలన్నారు. అంతకుముందు వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రజాకవి యోగివేమన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రెడ్డి సంక్షేమ కమ్యూనిటీ భవనానికి భూమి పూజ చేసి శంకుస్థానన న చేశారు. స్థలదాత ఆదినారాయణరెడ్డి, గౌరిబిదనూర్ మాజీ ఎమ్మెల్యే అశ్వర్థనారాయణరెడ్డి, మడకశిర మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకరరెడ్డి, ఏడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ ఆనందరంగారెడ్డి, ఇండిన్ ఒలిపిక్ అసోషియేసన్ అధ్యక్షులు జేసి పవన్‌కుమార్‌రెడ్డి, పెనుకొండ మార్కెట్ యార్డు చైర్మన్ వెంకటరామిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి మారుతీరెడ్డి తదితర నాయకులు,రెడ్డి సామాజికవర్గంవారు పాల్గొన్నారు.