వేమన చెప్పిందే వేదం
- ప్రజాకవిగా, మానవతావాదిగా చిరస్మరణీయుడు వేమన
- నేడు వేమన సాహితీ సమాలోచన సమితి రాష్ట్ర సదస్సు ప్రారంభం
అనంతపురం కల్చరల్ : యోగివేమనను కవిత్వంలో సామాజిక చైతన్యం తీసుకొచ్చిన గొప్ప విప్లవకారునిగా, దైవాంశ సంభూతుడిగా భావించిన నాటి జనం ‘వేమన చెప్పిందే వేదం’ అనుకునేవారు. యవ్వనంలో అన్ని భోగాలనూ అనుభవించి ఆ తర్వాత విరాగిగా మారి ఊరూరా తిరిగి ప్రజలకు సత్యమార్గాన్ని చూపెట్టిన ఆయన జీవితంపై ఎన్నో చిత్రాలు వచ్చాయి. వేమన స్మృత్యర్థం కేంద్ర ప్రభుత్వం ఓ స్టాంపును కూడా విడుదల చేసింది. అలాంటి ఆయన పేరిట అనంతపురంలో శనివారం నుంచి రెండురోజులపాటు సాహితీ సమాలోచన రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
సరళీకృత భాషతో సమాజ చైతన్యం
ప్రజా కవిగా.. సంస్కరణాభిలాషిగా.. కులాన్ని నిరసించిన మానవతా వాదిగా.. మీదు మిక్కిలి పరభాషా ఆధిపత్యాన్ని ప్రశ్నించి తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన మహనీయుడిగా.. తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడైన వేమన గురించి తెలియని ఆంధ్రుడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకనాడు పండితులకు మాత్రమే అర్థమయ్యే సాహితీ సౌందర్యాలను తనదైన అద్భుత ప్రజ్ఞతో సరళీకృతమైన భాషలో అందించి సమాజాన్నంతటినీ ప్రభావితం చేసిన ప్రజాకవి వేమారెడ్డి. యోగి వేమనగా సుప్రసిద్ధులైన ఆయన పామరుడి నుంచి మహా పండితుల వరకు అందరికీ అర్థమయ్యేలా కవితా శక్తిని క్రోడికరించుకుని జీవిత సత్యాలను, మానవతా విలువలను తెలుగు వారందరికీ అందించి ప్రజాకవిగా ప్రఖ్యాతి పొందారు.
దుష్ట సంప్రదాయాలను, మూఢాచారాలను, విగ్రహారాధనలను, కుల వివక్షను, మత మౌఢ్యాలను, స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను... ఇలా ఒకటేమిటి సమాజానికి హాని కలిగించే అన్నింటినీ సూటిగా, ఘాటుగా విమర్శించి ప్రజలను ఉత్తేజితులను చేశారు. ఆటవెలదులనే తూటాలుగా మార్చి మూఢాచారాలపై చైతన్య బావుటా ఎగురేసిన గురజాడ, కందుకూరి, జ్యోతిరావుపూలే, పెరియార్ వంటి సంస్కరణవాదులకు పూర్వ రంగం సిద్ధం చేసింది వేమనే. ‘ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడ వేరు.. పురుషులందు పుణ్యపురుషులు వేరయా..’, ‘పేదవాని ఇంట పెండ్లయిన ఎరుగరు..’ వంటి జీవిత సత్యాలను తెలిపే తెలుగు పద్యాలతో సంఘంలోని ఆర్థిక అవినీతిని మధ్యయుగం నాడే ఖండించిన మహానుభావుడు ఆయన.
వేమన జీవితం జిల్లాతో మమేకం
వర్షంలో తడవని వారుంటారేమో కానీ వేమన పద్యాలు వినని తెలుగువారుండరని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు వేమన పద్యాలు అంతగా జగత్‌ప్రసిద్ధాలయ్యాయి. గండికోటను పాలించే గడ్డంరెడ్డి మూడవ సంతానంగా వేమారెడ్డి 1652లో జన్మించారని చరిత్ర చెబుతోంది. జన్మస్థలంపై కచ్చితమైన సమాచారం లేకున్నా ఆయన 1730లో కదిరి ప్రాంతంలో సమాధి అయిన మాట వాస్తవం. ఇప్పటికీ ఆయన సమాధి అయిన కదిరి మండలంలోని కటారుపల్లె పర్యాటక క్షేత్రంగా భాసిల్లుతోంది.
వేమన ప్రపంచ కవి
అశాస్త్రీయమైన సమాజాన్ని సమూలంగా మార్చడానికి ప్రయత్నం చేసిన యోగి వేమన సాహిత్యాన్ని సుప్రసిద్ధం చేయడానికి అనంత వేదిక అవుతోంది. ప్రజాకవి వేమన సాహితీ సమాలోచన రాష్ట్ర సదస్సుకు ఆహ్వాన కమిటీ అధ్యక్షునిగా ఉండటం నా బాధ్యతను మరింత పెంచింది. ఆయన రచించిన పద్యాలు చాలావరకు కనుమరుగైపోయినా లభించిన వాటితోనే అద్భుతాలు ఆవిష్కారమవుతున్నాయంటే అన్నీ దొరికితే మరెంత బావుంటుందో చెప్పలేము. ‘ద వర్సెస్ ఆఫ్ వేమన’ అంటూ ఓ ఆంగ్లేయుడు ఆయన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించి తెలుగు భాషకు గొప్ప సేవ చేశారు. వేమన తెలుగుకు పరిమితమైన కవి మాత్రమే కాదు ప్రపంచ కవి. వేమన పద్యాలతో జీవితాన్ని సరిదిద్దుకోవచ్చు. ఉత్తమ సమాజాన్ని నిర్మించుకోవచ్చు.
- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
రెండురోజులపాటు సాహిత్య సంబరాలు
ప్రజాకవి వేమన సాహితీ సమాలోచన రాష్ట్ర సదస్సు పేరిట రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. శనివారం సాయంత్రం రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన కళాకారులు మునిసిపల్ కార్యాలయం వద్ద వేమన సాహిత్య ప్రాధాన్యతను తెలిపే నృత్యరూపకాలు ప్రదర్శిస్తారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక పద్మావతి ఫంక‌్షన్ హాలులో ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర సదస్సుకు వివిధ జిల్లాల నుంచి సాహితీవేత్తలు, కవులు, రచయితలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వేమన సాహిత్యంపై జాలు వారిన సుమారు 14 పుస్తకాలను ఆవిష్కరిస్తారు. సాహితీ అభిమానులు విరివిగా విచ్చేయాలి.
- కుమారస్వామి, ఆహ్వాన కమిటీ కార్యదర్శి