తెలుగు సాహిత్య వెలుగు రేఖ వేమన
గాండ్లపెంట (కదిరి): తెలుగు సాహిత్య వెలుగు రేఖ వేమన. సమాజంలోని మంచి చెడుల్ని, జీవిత సత్యాలను తెలియజేసిన మహాయోగి. మట్టిలో పుట్టి మహోన్నతమైన శిఖరాలను అందుకున్న మానవతామూర్తి. మనుషుల మధ్య తిరుగుతూనే మానవ జీవిత సత్యాసత్యాలను నిత్యాన్వేషణతో దర్శించి విమర్శించిన వివేకి. ఈయన రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజాకవి.
గాండ్లపెంట మండలం కటారుపల్లిలో యోగి వేమన బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి మూడు రోజులపాటు వేమన వంశస్తులైన పీఠాధిపతులు ఘనంగా నిర్వహించనున్నారు. తొలిరోజు మహాశక్తిపూజ (కుంభం పోయుట), పదో తేదీన బండ్లమెరవణి, పానకపందేరము, 11న సాయంత్రం ఉట్లతిరునాల, రాత్రి 8 గంటలకు అగ్గిసేవ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు అనంతపురం జిల్లావాసులే కాక వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం వేమన భక్తులు తరలివస్తారు.