వైవీయూ(వైఎస్సార్ జిల్లా): విశ్వదాభిరామ.. వినురవేమ.. అనేమాట వినని తెలుగువారు ఉండరు.. ‘‘వానకు తడవని వారు, ఒక వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరు’’ అని లోకోక్తి. ఆ మహాకవికి రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. యోగివేమన జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహించాలని గతనెలలో జీఓ నెంబర్ 164ను విడుదల చేసింది. దీంతో ప్రతియేటా జనవరి 19న వేమన జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.
∙ప్రజాకవి, తాత్వికవేత్త అయిన వేమన పేరుతో దేశంలో ఏర్పాటైన ఏకైక విశ్వవిద్యాలయం యోగివేమన విశ్వవిద్యాలయం. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయంలో 2014లో వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి యేటా జనవరి 18వ తేదీన వేమన జయంతి వేడుకలు నిర్వహిస్తూ వచ్చారు. వేమన జయంతి జనవరి 18 అనేందుకు చారిత్రక ఆధారాలు ఎక్కడా లేకపోవడంతో సాహితీవేత్తలు, చరిత్రకారుల అభిప్రాయాల మేరకు అప్పటి వీసీ ఆచార్య మునగల సూర్యకళావతి ఆదేశాల మేరకు గత రెండు సంవత్సరాలుగా వైవీయూలో జనవరి 19న నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు జనవరి 19న రాష్ట్రవేడుకగా నిర్వహించేందుకు విశ్వవిద్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ప్రాంగణంలో వేమన పద్యాలు..
వేమన పద్యాలు ఎంత సరళంగా స్పష్టంగా, అర్థవంతంగా ఉంటాయో.. ఆ పద్యాలకు ఉన్న ఆదరణే తెలియజేస్తుంది. అయితే వేమన పేరుతో ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో ఆయన నోటి నుంచి జాలువారిన పద్యాలను ఎంపిక చేసుకుని విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయంలో ‘వేమన మాట’ పేరుతో వేమన పద్యాలను రాసి క్యాంపస్‌లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
నేడు వైవీయూలో..
యోగివేమన విశ్వవిద్యాలయంలో గురువారం వేమన జయంతి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు తెలుగుశాఖ విభాగాధిపతి ఆచార్య జి. పార్వతి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె. హేమచంద్రారెడ్డి, సభాధ్యక్షులుగా వైస్ చాన్సలర్ ఆచార్య రంగ జనార్ధన, ప్రత్యేక ఆహ్వానితులుగా రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపాల్ ఆచార్య కె. కృష్ణారెడ్డి హాజరవుతారని తెలిపారు. ప్రధానవక్తగా మైసూరులోని కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం పీఠాధిపతి ఆచార్య ఎం. రామనాథంనాయుడు హాజరై కీలకోపన్యాసం చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అతిథులు చేతుల మీదుగా వేమన విగ్రహానికి పుష్పమాలలతో అలంకరణ, వేమన చైతన్య యాత్ర, వేమన నాటికప్రదర్శన, పద్యగానం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment