katarupalli
-
19న వేమన జయంతి
సాక్షి, అమరావతి: తేట తెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తన కవిత్వంతో సమాజాన్ని జాగృతం చేసిన కవి యోగి వేమన జయంతి వేడుకలను ఈ నెల 19వ తేదీన తొలిసారి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. సత్యసాయి జిల్లా కటారుపల్లెలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ భాష, సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు తెలిపారు. మల్లికార్జునరావు స్వయంగా గీసిన వేమన చిత్రపటాన్ని గురువారం ఆవిష్కరించి 19న నిర్వహించనున్న కార్యక్రమం వివరాలను వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా కటారుపల్లెలో నిర్మించిన వేమన విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని వేమన జీవితానికి, ఆయన బోధనలకు, జ్ఞానాన్ని పొందిన విధానానికి రూపం ఇస్తూ తాను చిత్రాన్ని గీశానని, దానిని ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. సమాజంలోని మూఢనమ్మకాలను వేమన తన కవిత్వంతో ఖండించి ప్రజలను చైతన్యం చేశారన్నారు. -
Vemana: వేమనకు కొండంత వెలుగు
వేమన పద్యం ఒకటైనా రాని తెలుగువారు ఉండరు. తెలుగు జాతి ఉన్నంతకాలం వేమన పద్యాలు ప్రజల నాలుకలపై నిలిచే ఉంటాయి. తెలుగు నేలపై నడయాడిన వేమన తెలుగు సాహిత్యానికి ఒక కొండగుర్తుగా నిలుస్తారు. భాషలో, భావంలో ప్రజలకు సాహిత్యాన్ని చేరువ చేసిన ఘనత వేమనది. సమాజంలోని అన్ని అసమానతలు పోయి మనుషులు మానవీయంగా ఎదగాలని వేమన కోరు కున్నారు. ఉన్న స్థితి నుండి సమాజం మరో అడుగు ముందుకు సాగాలని తపించారు. ఆటవెలదులనే ఈటెలతో సమాజ సంస్కరణకు పూనుకొన్నారు. ఆ తర్వాత అనేక తరాల కవులకు మార్గ దర్శకంగా నిలిచారు. దేశ విదేశాల పండితులను సైతం వేమన పద్యాలు ఆకర్షించాయి. పాశ్చాత్య భాషలలోనూ అనువాదమయ్యాయి. తెలుగు సమాజానికి వెలుగులు నింపిన వేమనకు కొండంత వెలుగును ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 19న వేమన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్ణయించింది. డిసెంబర్ 30న ఈ విషయమై జీఓ 164ను విడుదల చేసింది. కర్ణాటక ప్రాంతంలో తెలుగువారు స్వచ్ఛందంగా వేమన జయంతిని జరుపుకొనే సంప్రదాయం ఉంది. వందేళ్ళ నాడే కట్టమంచి రామలింగారెడ్డి తదితరుల ప్రోత్సాహం కూడా అందులో ఉంది. ప్రజల ఆకాంక్ష లను గుర్తించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2017 డిసెంబర్ 22న వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. తాలుకా స్థాయిలో రూ. 25,000, జిల్లా స్థాయిలో 50,000, రాష్ట్ర స్థాయిలో రూ.10 లక్షలు... మొత్తం అరవై తొమ్మిదిలక్షల రూపాయలు ప్రతి ఏడాదీ కేటాయిస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా ఇందులో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ధార్వాడ విశ్వ విద్యాలయంలో 1980లలోనే ‘వేమన పీఠం’ ఏర్పాటు చేసిన విషయం కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్లోనూ సాంస్కృతిక శాఖ వేమన జయంతిని కర్ణాటక రాష్ట్రంలో లాగా నిర్వహించాలని 2018 లోనే వేమన సంఘాలు, అభిమానులు కోరడమైంది. అప్పటి మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడమయింది. వేమన సమాధి ప్రాంతమైన కటారుపల్లి గ్రామం సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉంది. స్థానికుల ఒత్తిడితో అప్పటి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాష వేమన జయంతి విషయమై 10 సెప్టెంబరు 2019న అసెంబ్లీలో ప్రశ్నించారు. కనీస చర్చ కూడా జరగడానికి సభాపతి అవకాశం ఇవ్వలేదు. సాంస్కృతిక శాఖ కోట్లకు కోట్లు వేరు వేరు సాహిత్య, సాంస్కృతిక ప్రచార కార్యక్రమాలు ఆ రోజులలో చేసింది. అనేకమంది కవుల కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించింది. వేమనపై కనీసం ఒక సదస్సు నిర్వహించమని కోరినా పట్టించుకోలేదు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సాంస్కృతిక శాఖ పక్షాన వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు రావాలని వేమన సంఘాలు కోరుతూ వచ్చాయి. 2019 నుండి ఈ ప్రక్రియ మొదలై నేడు అది సాకార మైంది. వేమన రాష్ట్ర స్థాయి పండుగ నిర్వహించబోతున్న ఈ సందర్భంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం. సత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గంలోని కటారుపల్లి గ్రామంలోని వేమన సమాధి ప్రాంతంలో ప్రారంభ రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించాలి. రాష్ట్రంలోని వివిధ జోన్లలో ఒకో సంవత్సరం ఒకోచోట కార్యక్రమం ఉండేలా చేయాలి. జిల్లా, నియోజక వర్గ, మండల, గ్రామ స్థాయి వరకూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 19న కార్యక్రమాలు చేయాలి. విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకంగా వేమన పద్యపోటీలు, సదస్సులు నిర్వహించాలి. మాజీ డీజీపీ పర్యాటకశాఖ సంస్థ ఛైర్మన్ చెన్నూరు అంజనేయరెడ్డి 2003లో ప్రత్యేక శ్రద్ధతో కటారుపల్లిలో వేమన సమాధిప్రాంతం, పరిసరాలలో అభివృద్ధి కోసం 3 కోట్లు కేటాయించారు. కోటిన్నర రూపాయల దాకా ఖర్చు జరిగింది. మిగతా నిధులు పూర్తి స్థాయిలో వినియోగించలేదు. తక్షణం నిధులు కేటాయించి పూర్తి స్థాయి పనులు చేపట్టాలి. వేమన సాహిత్యంపై అధ్యయనానికీ, విస్తరణకూ ఒక ప్రత్యేక పరిశోధనా సంస్థనూ, గ్రంథాలయాన్నీ నెలకొల్పాలి. ఆధునిక తరానికి వేమన గురించి తెలిసేలా ప్రత్యేక వెబ్సైట్ నడపాలి. ప్రామాణిక వేమన పద్యప్రతిని రూపొందించడానికి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలి. పాఠ్య పుస్తకాలలో వేమన పద్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేమనతో ముడిపడిన కొండవీడు, గండికోట, నల్లచెరువు, పామూరు తదితర స్థలాలకు గుర్తింపు తీసుకురావాలి. జాతీయకవిగా వేమన గుర్తింపునకై కృషి జరగాలి. (క్లిక్ చేయండి: ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..) - డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి కార్యదర్శి; వేమన ఫౌండేషన్, అనంతపురం -
వేమన బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కటారుపల్లి(గాండ్లపెంట) : మండల పరిధిలోని కటారుపల్లి యోగివేమన బ్రహ్మోత్సవాలు ఆదివారం స్వామివారి గొడుగుల ప్రదక్షిణతో ప్రారంభమయ్యాయి. భక్తులు వేమన సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం సాయంత్రానికే ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. వచ్చిన భక్తులు తలనీలాలు తీయించుకున్నారు. సేదతీరేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఆలయ ప్రాంగణంలోనే ఉండిపోయారు. ఆలయం వెలుపల గాజులు, బొమ్మలు, మిఠాయి షాపులు వెలిశాయి. సోమవారం తెల్లవారుజామున ఆలయం ఎదుట జొన్నధాన్యాలతో రాసి పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కుంభకూడును(ప్రసాదాన్ని) భక్తులు పెద్ద ఎత్తున పోటీపడి తీసుకుంటారు. నేడు బండ్ల మెరవణి వేమన బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాత్రి బండ్ల మెరవణి, పానక పందేరం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్బంగా భక్తులు ఎండ్లబండ్లను అలంకరించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకుంటారు. -
తెలుగు సాహిత్య వెలుగు రేఖ వేమన
గాండ్లపెంట (కదిరి): తెలుగు సాహిత్య వెలుగు రేఖ వేమన. సమాజంలోని మంచి చెడుల్ని, జీవిత సత్యాలను తెలియజేసిన మహాయోగి. మట్టిలో పుట్టి మహోన్నతమైన శిఖరాలను అందుకున్న మానవతామూర్తి. మనుషుల మధ్య తిరుగుతూనే మానవ జీవిత సత్యాసత్యాలను నిత్యాన్వేషణతో దర్శించి విమర్శించిన వివేకి. ఈయన రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజాకవి. గాండ్లపెంట మండలం కటారుపల్లిలో యోగి వేమన బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి మూడు రోజులపాటు వేమన వంశస్తులైన పీఠాధిపతులు ఘనంగా నిర్వహించనున్నారు. తొలిరోజు మహాశక్తిపూజ (కుంభం పోయుట), పదో తేదీన బండ్లమెరవణి, పానకపందేరము, 11న సాయంత్రం ఉట్లతిరునాల, రాత్రి 8 గంటలకు అగ్గిసేవ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు అనంతపురం జిల్లావాసులే కాక వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం వేమన భక్తులు తరలివస్తారు. -
పుట్టిన బిడ్డను చూసేందుకు వెళ్తూ..
కదిరి అర్బన్ : మండల పరిధిలోని అలీపూర్తండా వద్ద శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొని గాండ్లపెంట మండలం కటారుపల్లికి చెందిన రవికుమార్(27) అనే యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన మేరకు వివరాలిలాఉన్నాయి. కటారుపల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వేమయ్య, పద్మావతిల ఏకైక కుమారుడు రవికుమార్. రెండేళ్లక్రితం కటారుపల్లిక్రాస్కుచెందిన హేమవతితో వివాహం జరిగింది. రవికుమార్ బెంగళూరులో డ్రైవర్పని, భార్య నర్సు ఉద్యోగం చేసుకుంటూ జీవించేవారు. హేమవతి శనివారం ఉదయం కదిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భార్య, కూతురును చూసేందుకు ద్విచక్రవాహనంలో బెంగూళూరు నుంచి రవికుమార్ వస్తున్నాడు. వాహనం అలీపూర్తండావద్దకు రాగానే వెనుక వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీ కొంది. దీంతో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడి మరణవార్త విన్న తండ్రి ఆస్పత్రిలోనే సృహ కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాడిపత్రిలో బాలుడు.. తాడిపత్రి: తాడిపత్రిలోని కంచాని లాడ్జి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని ఏటిగడ్డపాలెంకు చెందిన బాషు కుమారుడు మహమ్మద్గౌస్(16) మరణించినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. సీబీ రోడ్డులో బైక్పై వెళ్తూ కాలినడకన వెళ్తున్న శివారెడ్డి అనే వ్యక్తిని ఢీకొని కిందపడినట్లు చెప్పారు. అదే సమయంలో వచ్చిన ట్రాక్టర్ అతని కాళ్లపై వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు.వెంటనే అనంతపురం ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు వివరించారు. కేసు దర్యాప్తులో ఉంది.