వేమన పద్యం ఒకటైనా రాని తెలుగువారు ఉండరు. తెలుగు జాతి ఉన్నంతకాలం వేమన పద్యాలు ప్రజల నాలుకలపై నిలిచే ఉంటాయి. తెలుగు నేలపై నడయాడిన వేమన తెలుగు సాహిత్యానికి ఒక కొండగుర్తుగా నిలుస్తారు. భాషలో, భావంలో ప్రజలకు సాహిత్యాన్ని చేరువ చేసిన ఘనత వేమనది. సమాజంలోని అన్ని అసమానతలు పోయి మనుషులు మానవీయంగా ఎదగాలని వేమన కోరు కున్నారు. ఉన్న స్థితి నుండి సమాజం మరో అడుగు ముందుకు సాగాలని తపించారు. ఆటవెలదులనే ఈటెలతో సమాజ సంస్కరణకు పూనుకొన్నారు. ఆ తర్వాత అనేక తరాల కవులకు మార్గ దర్శకంగా నిలిచారు. దేశ విదేశాల పండితులను సైతం వేమన పద్యాలు ఆకర్షించాయి. పాశ్చాత్య భాషలలోనూ అనువాదమయ్యాయి.
తెలుగు సమాజానికి వెలుగులు నింపిన వేమనకు కొండంత వెలుగును ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 19న వేమన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్ణయించింది. డిసెంబర్ 30న ఈ విషయమై జీఓ 164ను విడుదల చేసింది. కర్ణాటక ప్రాంతంలో తెలుగువారు స్వచ్ఛందంగా వేమన జయంతిని జరుపుకొనే సంప్రదాయం ఉంది. వందేళ్ళ నాడే కట్టమంచి రామలింగారెడ్డి తదితరుల ప్రోత్సాహం కూడా అందులో ఉంది. ప్రజల ఆకాంక్ష లను గుర్తించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2017 డిసెంబర్ 22న వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. తాలుకా స్థాయిలో రూ. 25,000, జిల్లా స్థాయిలో 50,000, రాష్ట్ర స్థాయిలో రూ.10 లక్షలు... మొత్తం అరవై తొమ్మిదిలక్షల రూపాయలు ప్రతి ఏడాదీ కేటాయిస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా ఇందులో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ధార్వాడ విశ్వ విద్యాలయంలో 1980లలోనే ‘వేమన పీఠం’ ఏర్పాటు చేసిన విషయం కూడా గమనించాలి.
ఆంధ్రప్రదేశ్‌లోనూ సాంస్కృతిక శాఖ వేమన జయంతిని కర్ణాటక రాష్ట్రంలో లాగా నిర్వహించాలని 2018 లోనే వేమన సంఘాలు, అభిమానులు కోరడమైంది. అప్పటి మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడమయింది. వేమన సమాధి ప్రాంతమైన కటారుపల్లి గ్రామం సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉంది. స్థానికుల ఒత్తిడితో అప్పటి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాష వేమన జయంతి విషయమై 10 సెప్టెంబరు 2019న అసెంబ్లీలో ప్రశ్నించారు. కనీస చర్చ కూడా జరగడానికి సభాపతి అవకాశం ఇవ్వలేదు. సాంస్కృతిక శాఖ కోట్లకు కోట్లు వేరు వేరు సాహిత్య, సాంస్కృతిక ప్రచార కార్యక్రమాలు ఆ రోజులలో చేసింది. అనేకమంది కవుల కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించింది. వేమనపై కనీసం ఒక సదస్సు నిర్వహించమని కోరినా పట్టించుకోలేదు.
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సాంస్కృతిక శాఖ పక్షాన వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు రావాలని వేమన సంఘాలు కోరుతూ వచ్చాయి. 2019 నుండి ఈ ప్రక్రియ మొదలై నేడు అది సాకార మైంది. వేమన రాష్ట్ర స్థాయి పండుగ నిర్వహించబోతున్న ఈ సందర్భంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం. సత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గంలోని కటారుపల్లి గ్రామంలోని వేమన సమాధి ప్రాంతంలో ప్రారంభ రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించాలి. రాష్ట్రంలోని వివిధ జోన్‌లలో ఒకో సంవత్సరం ఒకోచోట కార్యక్రమం ఉండేలా చేయాలి. జిల్లా, నియోజక వర్గ, మండల, గ్రామ స్థాయి వరకూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 19న కార్యక్రమాలు చేయాలి. విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకంగా వేమన పద్యపోటీలు, సదస్సులు నిర్వహించాలి.
మాజీ డీజీపీ పర్యాటకశాఖ సంస్థ ఛైర్మన్ చెన్నూరు అంజనేయరెడ్డి 2003లో ప్రత్యేక శ్రద్ధతో కటారుపల్లిలో వేమన సమాధిప్రాంతం, పరిసరాలలో అభివృద్ధి కోసం 3 కోట్లు కేటాయించారు. కోటిన్నర రూపాయల దాకా ఖర్చు జరిగింది. మిగతా నిధులు పూర్తి స్థాయిలో వినియోగించలేదు. తక్షణం నిధులు కేటాయించి పూర్తి స్థాయి పనులు చేపట్టాలి. వేమన సాహిత్యంపై అధ్యయనానికీ, విస్తరణకూ ఒక ప్రత్యేక పరిశోధనా సంస్థనూ, గ్రంథాలయాన్నీ నెలకొల్పాలి. ఆధునిక తరానికి వేమన గురించి తెలిసేలా ప్రత్యేక వెబ్‌సైట్ నడపాలి. ప్రామాణిక వేమన పద్యప్రతిని రూపొందించడానికి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలి. పాఠ్య పుస్తకాలలో వేమన పద్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేమనతో ముడిపడిన కొండవీడు, గండికోట, నల్లచెరువు, పామూరు తదితర స్థలాలకు గుర్తింపు తీసుకురావాలి. జాతీయకవిగా వేమన గుర్తింపునకై కృషి జరగాలి. (క్లిక్ చేయండి: ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..)
- డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి
కార్యదర్శి; వేమన ఫౌండేషన్, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment