brahmothsavas start
-
తెలుగు సాహిత్య వెలుగు రేఖ వేమన
గాండ్లపెంట (కదిరి): తెలుగు సాహిత్య వెలుగు రేఖ వేమన. సమాజంలోని మంచి చెడుల్ని, జీవిత సత్యాలను తెలియజేసిన మహాయోగి. మట్టిలో పుట్టి మహోన్నతమైన శిఖరాలను అందుకున్న మానవతామూర్తి. మనుషుల మధ్య తిరుగుతూనే మానవ జీవిత సత్యాసత్యాలను నిత్యాన్వేషణతో దర్శించి విమర్శించిన వివేకి. ఈయన రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజాకవి. గాండ్లపెంట మండలం కటారుపల్లిలో యోగి వేమన బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి మూడు రోజులపాటు వేమన వంశస్తులైన పీఠాధిపతులు ఘనంగా నిర్వహించనున్నారు. తొలిరోజు మహాశక్తిపూజ (కుంభం పోయుట), పదో తేదీన బండ్లమెరవణి, పానకపందేరము, 11న సాయంత్రం ఉట్లతిరునాల, రాత్రి 8 గంటలకు అగ్గిసేవ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు అనంతపురం జిల్లావాసులే కాక వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం వేమన భక్తులు తరలివస్తారు. -
నేటి నుంచి ‘రత్నగిరి’ బ్రహ్మోత్సవాలు
రొళ్ల (మడకశిర) : రొళ్ల మండలం రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్లాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయశాఖ కార్యనిర్వాహణాధికారి కె.శ్రీనివాసులు, ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 9న జలధి ఉత్సవం, కలశ స్థాపన, 10న బ్రహ్మ రథోత్సవం, 11న కలశ ఉత్సవం, గంగ పూజ, 12 నుంచి 15 వరకు భక్తులచే హారతి ఉత్సవాలు, 16న రాత్రి ఆర్డీటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, 17న పోతులరాజు బండార కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఉత్సవం సందర్భంగా రోజూ ఓ కార్యక్రమం చొప్పున నాటిక, హరికథలు ఉంటాయన్నారు. భక్తులకు మడకశిర ఆర్టీసీ డిపో నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం మధుగిరి, శిరా, పావగడ నుంచి బస్సు సౌకర్యం కల్పించామన్నారు.