cp brown
-
బ్రౌన్ అన్వేషణలో మరువరాని డాక్టర్
‘‘మీరు సిపి బ్రౌన్ ఫొటో సంపా యించాలి. మన దేశంలో ఇప్పటి వరకూ ఎక్కడా దొరకలేదు. ఫొటో సంపాయిస్తే మీకు ఒక లక్ష రూపా యలు కానుకగా ఇస్తా.’’ 1965లో ఇంగ్లాండుకు ప్రయాణమవుతున్న డాక్టర్ పసుమర్తి సత్యనారాయణ మూర్తితో ‘భారతి’ మాసపత్రిక సంపాదకులు శివలెంక శంభుప్రసాద్ అన్న మాటలు ఇవి. శంభు ప్రసాద్ ఐదుగురి సంతానంలో మూడవ సంతానంగా అమ్మాయి పుట్టింది. ఆమె కాశీనాథుని నాగేశ్వరరావు మరణించిన రోజున (1938లో) జన్మించింది. తాతగారి గుర్తుగా ఆ అమ్మాయికి నాగేశ్వరమ్మ అని నామ కరణం చేశారు. ఈమె భర్తే డా‘‘ శ్యామ్ పసుమర్తిగా పిలువ బడిన డా‘‘ పి.ఎస్.ఎన్. మూర్తి. డాక్టర్ మూర్తి వృద్ధాప్య కార ణాలతో తలెత్తిన స్వల్ప అనారోగ్య కారణంగా 88 ఏళ్ళ వయస్సులో హైదరాబాదులో ఏప్రిల్ 9న మరణించారు. మూర్తి ఛలోక్తులతో గలగలా నవ్వే నిత్య ఉత్సాహి,మంచి చదువరి. అలవోకగా రాయగల ఆంగ్ల రచయిత! ‘అన్ టచ్బుల్ నిర్భయాస్ ఆఫ్ ఇండియా అండ్ వన్ బిలియన్ రైజింగ్’ అనే సెమీ–ఫిక్షనల్ ఆంగ్ల నవల ఈయనదే. ఉత్తరాంధ్రలోని యలమంచిలి గ్రామంలో స్వాతంత్య్ర యోధుల కుటుంబంలో 1934లో జన్మించిన ఈ మెడికల్ డాక్టర్ చేసిన ఈ రచనలో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో పాటు టాయిలెట్లు శుభ్రం చేసే ఓ యువతి కథా ఉంది. పి.ఎస్.ఎన్. మూర్తి పేరు తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుంది. వైద్యశాస్త్రానికి సంబంధించిన ఉన్నత చదువు ఎఫ్.ఆర్.సి.ఎస్. కోసం ఎడిన్‌బరో వెళ్ళిన మూర్తి... సి.పి. బ్రౌన్ అంతిమదశలో లండన్‌లో గడిపిన జీవి తంపై విలువైన పరిశోధన చేశారు. 1965లో బ్రౌన్ ఫొటో అన్వేషణలో తెలిసిన వివరాలను 2019లో వెలువరించిన ‘సి.పి. బ్రౌన్స్ లైఫ్ ఇన్ లండన్ ఆఫ్టర్ హి లెఫ్ట్ ఇండియా’ అనే పుస్తకంలో నిక్షిప్తం చేశారు. 1934లో విశాఖ పట్టణంలో మూర్తి జన్మించారు. శంభు ప్రసాద్ కుమార్తెతో వివాహం అయిన పిమ్మట లండన్ వెళ్ళి 10 సంవత్సరాల తర్వాత తండ్రి మరణం కారణంగా యలమంచిలి వచ్చేశారు. బ్రౌన్ ఫొటోపై అన్వేషణలో భాగంగా గూటాల కృష్ణ మూర్తిని కలిసిన తర్వాత... మొదట జనన, మరణ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి బ్రౌన్ జనన, మరణ తేదీల రికార్డుల ఎంట్రీలను జిరాక్స్ తీయించారు. ఆ వివరాలతో ‘లండన్ టైమ్స్’ దినపత్రిక కార్యాలయానికి వెళ్ళి, బ్రౌన్ గురించి వివరాలు చెప్పి సాయం చెయ్యమని అడిగారు. వారు ఫొటో లేని ‘శ్రద్ధాంజలి’ విశేషాల జిరాక్సు ఇచ్చారు. వారి సలహాపైనే నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీ, బ్రిటిష్ మ్యూజియం, ఇండియా ఆఫీసు లైబ్రరీలను గాలించారు. అక్కడా ఫొటో లభించలేదు. ప్రొఫెసర్‌గా బ్రౌన్ చివరిదశలో లండన్ యూని వర్సిటీలో పనిచేశారు కనుక యూనివర్సిటీ ఆర్కైవ్స్ వెళ్ళారు. లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ ఉద్యోగానికి బ్రౌన్ అప్లికేషన్ కారణంగా అక్కడ చాలా చర్చ జరిగింది. అప్పట్లో ఐ.సి.ఎస్. అధికారులకు భారతీయ భాషలైన సంస్కృతం, హిందీ, గుజరాతీ, బెంగాలీ, తెలుగు, తమిళం, కన్నడంలో శిక్షణ ఇవ్వడానికి తెల్లదొరలు పాఠాలు చెప్పేవారు. సి.పి. బ్రౌన్ అర్హుడే అయినా విద్యార్థులు లేని కారణంగా ఉద్యోగం ఎందుకు ఇవ్వాలని చర్చ జరిగింది. చివరికి బ్రౌన్ నియామకం జరిగింది. బ్రౌన్ తరువాత ఈ ఉద్యోగానికి ఇద్దరు ఇంగ్లీషు వారు పోటీపడినా తెలుగు బిడ్డ పి.వి. కుమార స్వామి రాజాకు లభించింది. ఇలాంటి వివరాలు చాలా లభించినా బ్రౌన్ ఫొటో దొరకలేదు. లండన్‌లోని కిల్డేర్ గార్డెన్స్‌లో బ్రౌన్ నివాసమున్న ఇంటి ఫొటోలు కూడా లభించాయి. ఇంటి దగ్గరున్న çశ్మశానాలలో బ్రౌన్ వివరాలు లభించలేదు. చివరికి ప్రముఖులకు అంత్యక్రియలు జరిపే ‘కెన్సాల్ గ్రీన్ సిమెట్రీ’లో అన్వేషిస్తే ఆయన సమాధి కనబడింది. గడ్డీ గాదంతో నిండిపోయిన ఆ సమాధిని ఇటీవల కాలంలో చూసిన తొలి ఏకైక వ్యక్తి డా‘‘ మూర్తి. తొలిసారి సమాధి 1984 డిసెంబర్ 12 చూసినప్పుడు డాక్టర్ గూటాల కృష్ణమూర్తి కూడా మూర్తితో ఉన్నారు. గ్రేవ్ డిగ్గర్కి కొంత పైకమిచ్చి ఆ సమాధి చుట్టూ శుభ్రం చేయించారు మూర్తి. అయితే బ్రౌన్ ఫొటో ఇంతవరకు లభించలేదు. ఇప్పుడు చలామణీలో ఉన్నది ఊహాజనిత పెయింటింగ్ మాత్రమే. 1999లో ‘ఇదే సి.పి. బ్రౌన్ ఫొటో’ అని ఓ వార్త సంచలనంగా వచ్చింది కానీ... తర్వాత అది ఆధారరహిత మని తేలింది. అలాగే తామే మొదట సి.పి. బ్రౌన్ సమాధి కనుగొన్నట్లు కొందరు చేసిన ప్రకటన 2009లో తెలుగు దినపత్రికల్లో హడావిడి చేసింది. నిజానికి, ఆ ఘనత దక్కా ల్సింది మూర్తికి. అయితే బ్రౌన్ ఫొటో లభించలేదనే అసంతృప్తి ఆయనకు ఉండేది. సంచలనాల కారణంగా అప్పుడు... మళ్ళీ మూర్తి మరణం కారణంగా ఇప్పుడు సి.పి. బ్రౌన్ గురించి మాట్లాడుకుంటున్నాం. డా‘‘ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త పాపులర్ సైన్సు రచయిత 99407 32392 -
Vemana: ఆటవెలది ఈటెగా విసిరిన దిట్ట.. ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట
‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మాట వినని తెలుగువారు ఉండరు. వానకు తడవనివారు, ఒక వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అంత ప్రఖ్యాతి గాంచిన మహాకవి యోగి వేమనకు సొంత రాష్ట్రంలో తగిన గౌరవం దక్కటం లేదనే భావన ఇక తొలగిపోనుంది. యోగి వేమన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఏటా జనవరి 19న అధికారికంగా జరపనుంది. ఈ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 164 జీవోను గత నెల 30న విడుదల చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల వేమన అభిమానులు ఆనందించే విషయమిది. – గుంటూరు డెస్క్ తెలుగువారికి ఎంతో సారస్వత సేవ చేసిన బ్రిటిష్ అధికారి సీపీ బ్రౌన్తోనే వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయేలా పద్యాలు చెప్పి, మెప్పించిన కవి వేమన. ఆటవెలదిలో అద్భుతమైన కవిత్వం, అనంత విలువలు గల సలహాలు, సూచనలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు వేమన. యవ్వనంలో వేశ్యాలోలుడిగా వ్యవహరించినా, కొంతకాలానికి విరక్తి చెంది, తపస్సు చేసి యోగిగా మారారు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పారు. చివరకు కడప దగ్గరి పామూరు కొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామనవమి నాడు సమాధి చెందారు. కదిరి తాలూకాలోని కటారుపల్లెలోని వేమన సమాధి ప్రసిద్ధి చెందినది. వేమన జీవితకాలం 1652–1730గా పరిశోధకులు పేర్కొన్నారు. సామాజిక చైతన్య గీతాలు ఆ పద్యాలు... వేమన పద్యాలు లోక నీతులు. పద్యాలన్నిటినీ ఆటవెలది చంధస్సులోనే చెప్పాడు. సామాజిక చైతన్యం ఆ పద్యాల లక్షణం. సమాజంలో ఆయన సృజించని అంశం లేదు. అన్ని సమస్యలను భిన్న కోణాల్లోంచి దర్శించి, ఆ దర్శన వైశిష్ట్యాన్ని తన పద్యాలలో ప్రదర్శించారు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట దోపిడీలను ఎలుగెత్తటమే కాకుండా విగ్రహారాధనను నిరసించారు. కుహనా గురువులు, దొంగ సన్యాసుల దోపిడీలు...ఒకటేమిటి? ప్రతి సామాజిక అస్తవ్యస్తతపైన తన కలాన్ని ఝళిపించారాయన. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోనూ నీతిని ప్రతిపాదించి మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపాడు. ‘అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను/సజ్జనుండు పలుకు చల్లగాను/కంచుమ్రోగినట్లు కనకంబు మ్రోగునా/ విశ్వదాభిరామ వినుర వేమ’ అని చాటారు. మరో పద్యంలో ‘విద్యలేనివాడు విద్వాంసు చేరువ/నుండగానె పండింతుండు కాడు/కొలది హంసల కడ కొక్కెరలున్నట్లు/ విశ్వదాభి రామ వినుర వేమ!’అన్నారు. కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తర్వాత నీతిని చెప్పాడు. అందుకు ‘అనగననగరాగ మతిశయించునుండు/తినగ తినగ వేము తియ్యనుండు/ సాధనమున పనులు సమకూరు ధరలోన/విశ్వదాభిరామ వినుర వేమ’ ఉదాహరణ. పద్యంలో నాలుగో పాదం ‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మకుటం. విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైన వాడని, అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము–అని ఈ మకుటానికి అర్థం చెప్పారు పండితులు. బ్రౌను మహాశయుడు ఇదే అర్థంతో వేమన పద్యాలను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. వేమన కీర్తిని అజరామరం చేశారు... తెలుగువారిలో వేమన కీర్తిని అజరామరం చేయటానికి కృషి చేసినవారు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు, సంఘాల ఏర్పాటును సాధించారు. కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు. ఆరుద్ర ‘మన వేమన’ పుస్తకాన్ని రచించారు. డాక్టర్ ఎన్.గోపి, బంగోరె వంటి కవులు, రచయితలు వేమన రచనలపై పరిశోధనలు చేశారు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావుచే కేంద్ర సాహిత్య అకాడమీ వేమన జీవిత చరిత్రను రాయించి 14 భాషల్లోకి అనువదింపజేసింది. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషల్లోకి వేమన పద్యాలు అనువాదమయ్యాయి. వేమనకు లభించిన గౌరవం మరే తెలుగు కవికీ లభించలేదు. ఐక్యరాజ్యసమితి–యునెస్కో విభాగం, ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకుని, ఆ రచనలను పలు భాషల్లోకి అనువదింపజేశారు. వేమన జీవిచరిత్ర, యోగి వేమన (1947), యోగి వేమన (1988), శ్రీవేమన చరిత్ర (1986) పేర్లతో సినిమాలుగా ప్రజలను ఆలరించాయి. పౌరాణిక నటుడు గుమ్మడి గోపాలకృష్ణ రూపొందించిన ‘యోగి వేమన’ సీరియల్ టీవీ ఛానల్లో ప్రసారమైంది. ఇంతటి కీర్తిని పొందిన వేమన జయంతికి పొరుగునున్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏటా తగిన నిధులను కేటాయిస్తూ, తాలూకా, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తోంది. మైసూర్ మహారాజ సంస్థాన్ ఏనాడో వేమన ప్రాశస్త్యాన్ని గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో వేమనకు, ఆయన సాహిత్యానికి తగిన ప్రచారం, గౌరవాన్ని కల్పించటం లేదనేది నిష్ఠురసత్యం. దీనిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై 1929 నుంచి వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న తెనాలి సమీపంలోని మోదుకూరు గ్రామంలోని వేమన జయంతి ఉత్సవ కమిటీ హర్షం తెలియజేసింది. నాడే సాహసోపేత హేతువాది... ఆ కాలం పరిస్థితుల ప్రకారం వేమనను గొప్ప హేతువాదిగా ప్రశసించింది సాహితీలోకం. సమాజంలో ప్రబలంగా పాతుకుపోయిన ఆచారాలు, మూఢనమ్మకాలను ఆ రోజుల్లో అంత నిశితంగా ఎత్తిచూపటానికి ఎంతటి ఆత్మస్థైర్యం, అవగాహన కావాలి. విగ్రహారాధనను విమర్శిస్తూ...‘పలుగు రాళ్లు దెచ్చి/ పరగ గుడులు కట్టి/ చెలగి శిలల సేవ జేయనేల?/ శిలల సేవ జేయ ఫలమేమి కలుగురా?’అని ప్రశ్నించారు. కుల విచక్షణలోని డొల్లతనం గురించి... ‘మాలవానినంటి/ మరి నీట మునిగితే/ కాటికేగునపుడు కాల్చు మాల/ అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?...’ అనడిగారు. వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్థం కాలేదు. కేవలం సామాన్యుల నాల్కలపైనే నడయాడుతూ వచ్చాయి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకుల భావన. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తర్వాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్‌లు వేమన పద్యాలెన్నింటినో సేకరించారు. తాను వేమనను కనుగొన్నాని బ్రౌన్ సాధికారికంగా ప్రకటించుకొన్నారు. వందలాది పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఇంగ్లిష్ భాషల్లోకి అనువదించారు. అలాగే హెన్నీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1920), జీయూ పోప్, సీఈ గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు, వేమనను లోకకవిగా కీర్తించారు. మహాకవి పేరిట విశ్వవిద్యాలయం.. ఆ మహాకవి పేరిట దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని నిర్మించి అనేక కోర్సులతో విద్యను అందించడంతోపాటు వేమన జీవితం మరుగున పడకుండా భావితరాలకు అందించడం గమనార్హం. -
CP Brown: తెలుగు సాహితికి వెలుగు సూరీడు
తెలుగు భాష సాహిత్యం ఈరోజు బతికి బట్టకడుతుందంటే సీపీ బ్రౌన్ నిర్విరామ కృషి, సమర్పణ, తపన, త్యాగం, అంకిత భావమే కారణం. బ్రిటిష్ దంపతులైన డేవిడ్ బ్రౌన్, కౌలీలకు కలకత్తాలో 1798 నవంబర్ 10న బ్రౌన్ జన్మించారు. తండ్రి మతాధికారి. కలకత్తాలోని ఫోర్ట్ విలియం కళాశాలలో బహు భాషాపండితుడు. తండ్రి వద్దే హీబ్రూ, అరబిక్, పర్షియన్, హిందుస్థానీ, సిరియక్, గ్రీకు భాషలు నేర్చారు. బాల్యంలో తండ్రి సేకరించే దేశీయ పుస్తకాలను పరిష్కరించి, శుద్ధ ప్రతులు తయారుచేయటంలో సహాయం చేసేవారు. అది ఉత్తరోత్తరా తెలుగు సాహిత్య ప్రచురణకు దోహదం అయింది. 1817లో మద్రాస్ సివిల్ సర్వీసులో చేరేవరకు ఆయనకు తెలుగు భాష ఒకటి ఉందనే విషయం తెలియదు. మద్రాస్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ కళాశాలలో వెలగపూడి కోదండరామ పంతులు దగ్గర అక్షరాభ్యాసం చేశారు. ఫ్రెంచ్ కాథలిక్ మతగురువు అబెదుబె రాసిన ‘హిందూ మేనర్స్ కస్టమ్స్ అండ్ సెర్మనీస్’ అనే పుస్తకంలో వేమనను గురించిన వివ రాలు తెలుసుకున్నారు. వేమన పద్యంలోని భాష, భావం, వేగం, తీవ్రత, మూఢవిశ్యాసాల వ్యతిరేకత... అన్నీ కలగలిసిన గొప్ప కవి అని బ్రౌన్కు అర్థమైంది. అనంతరం వేమన పద్యాలు 2500 వరకు సేకరించారు. వాటిల్లో ఉత్తమమైన 693 పద్యాలను ఎంపికచేసి పరిష్కరించి, ఇంగ్లిష్‌లోకి అనువదించి ‘వెర్సేస్ ఆఫ్ వేమన’ పేరుతో 1829లో ప్రచురించారు. ఆపై తెలుగులో ఉన్న భారత, భాగవత, రామాయణాలు, కావ్యాలు, చరిత్రలు, జానపద కథలు, శతకాలు మొదలైనవన్నీ సేకరించారు. పరిష్కరణ, శుద్ధప్రతులు తయారు చేయటంకోసం పండితులను, లేఖకులను తన స్వంత డబ్బులతో నియమించుకున్నారు. కడపలో కలెక్టర్‌గా పనిచేసే రోజుల్లో తన బంగళాలోనే తెలుగు గ్రంథ పరిశోధన, పరిష్కరణ చేశారు. అందుకే దాన్ని ‘బ్రౌన్ కాలేజి’ అని పిలిచేవారు. బ్రౌన్ గ్రంథ రచనల్లో తోడ్పడిన పండితుల్లో జూలూరి అప్పయ్య, వఠ్యం అద్వైత బ్రహ్మయ్య, మన్నెం కనకయ్య, గరిమెళ్ల వెంకయ్య, వారణాసి వీరాస్వామి, తిరుపతి తాతాచార్యులు వంటి వారున్నారు. కడప, గుంటూరు, మచిలీ పట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో బ్రౌన్ వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. ఈ క్రమంలోనే పేదపిల్లలు కోసం ధర్మబడు లను ప్రారంభించారు. 1821లో కడపలో రెండు, 1823లో మచి లీపట్నంలో రెండు, 1844లో మద్రాస్‌లో ఒకటి చొప్పున ధర్మ బడులను తెరచి, కేవలం పేద విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్ నేర్చుకునేలా చేశారు. బ్రౌన్ సేకరించిన గ్రంథాల్లో సంస్కృతం, తెలుగు, హిందీ, కన్నడం, మరాఠి, తమిళ భాషలకు సంబంధించిన మొత్తం 5,751 గ్రంథాలున్నాయి. వీటిలో కేవలం తెలుగు భాషకు చెందినవి 2,440 ఉన్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం, భాగవతం, కావ్యాలు, శతకాలు, వ్యాకరణం, తెలుగు–ఇంగ్లిష్–తెలుగు నిఘంటువులు (బ్రౌణ్య నిఘంటువు) అచ్చువేసి తెలుగు భాష సాహిత్యాన్ని సుస్థిరం చేశారు. భాషలో కొన్ని మార్పులూ చేశారు. సాధు–శకట రేఫల వినియోగం, క్రావడి, వట్రుసుడి, ‘చ, జ’ల మార్పులు వంటివి ప్రధా నంగా ఉన్నాయి. తెలుగు భాషలో అంతకుముందు లేని విరామ చిహ్నాలు, పేరాల విభజన, పుటల సంఖ్యలను ప్రవేశపెట్టారు. తెలుగు బైబిలు అనువాదంలో కూడా బ్రౌన్ ముద్ర ఉంది. బాప్టిజం, ఆమెన్, హల్లెలూయ, సబ్బాతు వంటి పదాల ధార్మికార్థం చెడకుండా యథాతథంగా, తత్సమాలుగా చేశారు. అలాగే వైన్ అనేది క్రైస్తవులకు పవిత్రమైనది. అది కేవలం పులియని ద్రాక్షరసం. అందుకే ద్రాక్షరసం అని గౌరవపదంగా అనువదించారు. తెలుగు, బైబిల్ లోనూ క్రైస్తవుల వ్యావహారికంలోనూ పలికే సిలువ, పరిశుద్ధాత్మ, స్తోత్రం, స్తుతి, సువార్త, సన్నుతి, కలుగునుగాక, ప్రభువు నామమునకు, నీకు స్తోత్రం లాంటి పదాలు నేటికీ ప్రామాణికంగా నిలిచాయి. తెలుగు బైబిలు అనువదించి, పరిశీలనార్థం లండన్‌కు పంపించారు. ఆ గ్రంథాన్ని గోర్టిన్, ప్రిబెట్ అనేవాళ్లు 1857లోనూ, వార్ట్లా, జాన్హే అనేవాళ్లు 1860లో తమ పేర్లతో ముద్రించుకున్నారు. ఎక్కడా బ్రౌన్ పేరును ప్రస్తావించనే లేదు. భారతదేశంలో ఉన్న నలభై ఏళ్లలో తాను పరిష్కరించి, ప్రచురించిన పుస్తకాలను బ్రౌన్ మద్రాస్ గ్రంథాలయానికి ఇచ్చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం లండన్‌లో కొంతకాలం తెలుగు ఆచార్యుడిగా పని చేసిన కాలంలోనూ పరిష్కరించిన గ్రంథాలను ఇండియా ఆఫీస్ లైబ్రరీకి బహూకరించారు. బ్రౌన్ రచనలన్నీ రెవరెండ్ టైలర్ 1857, 1860, 1862 సంవత్సరాల్లో మూడు సంపుటాలుగా తయారుచేసి, ఫోర్ట్ సెయింట్ జార్జ్ గెజిట్ ప్రెస్‌లో ముద్రించారు. ఈ తెలుగు వెలుగుల సూరీడు 1884 డిసెంబరు 12న వెస్ట్‌బార్న్ గ్రోవ్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన జన్మించి నేటికి 225 సంవత్సరాలు. ఆయన ఒక్క చేతిమీదుగా తెలుగు సాహిత్య సంపద అంతా రెక్కలు విప్పి విహరించింది... మనకు కీర్తిప్రతిష్ఠలను తీసుకొచ్చింది. తెలుగు ప్రజలకు ఆయన ప్రాతఃస్మరణీయులు. (క్లిక్ చేయండి: రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధానిగా చేయడం వెనుక..) - ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి ప్రముఖ సాహితీ పరిశోధకులు (సీపీ బ్రౌన్ 225వ జయంతి సంవత్సరం) -
సీపీ బ్రౌన్ బాషా పరిశోధన కేంద్రానికి వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు
-
పాతికేళ్ల బ్రౌన్ కేంద్రం
సి.పి.బ్రౌన్ (1798–1884) సుమారు 1827లో కడపలోని ఎర్రముక్కలపల్లెలో 15 ఎకరాల తోటను, ఓ పెద్ద బంగళాను వెయ్యి వరహాలకు (3500 రూపాయలకు) కొని రెండేళ్లపాటు ఆ భవనంలోనే వుండి సంస్కృతాంధ్ర పండితుల్ని సమకూర్చుకుని, తెలుగు కావ్య సముద్ధరణకు కంకణబద్దులయ్యారు. ఆ జిల్లావాడే అయిన అయోధ్యాపురం కృష్ణారెడ్డి(1800–44) ఆజమాయిషీలో ఆ పండిత కూటమి, కార్యాలయం ‘బ్రౌన్ కాలీజా’గా పేరు మోసింది. పరిశోధక సాహసి బంగోరె(బండి గోపాలరెడ్డి) మాటల్లో చెప్పాలంటే, సి.పి.బ్రౌన్ ‘‘నిలవనీడ లేకుండా పోయిన తెలుగు కావ్యసరస్వతిని ఆహ్వానించి, తన బంగళాలో వొక సాహిత్య పర్ణశాల యేర్పరచి, ఆ వాగ్దేవి నిండు ముత్తయిదువులాగా నడయాడేలా’’ చేశారు. 20 సెంట్ల ప్రదేశంలో ఎర్రముక్కలపల్లెలో స్థాపించబడి, రెండు మూడు దశాబ్దాలపాటు సరస్వతీ నిలయంగా విరాజిల్లిన బ్రౌన్ కాలేజీ నేడు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంగా యోగి వేమన విశ్వవిద్యాలయం ఆశ్రయంలో వెలుగు జిలుగులు నింపుతోంది. బ్రౌనుకు నమ్మకస్తుడైన చెలికాడైన అయోధ్యాపురం కృష్ణారెడ్డి అకాలమరణం తర్వాత ‘బ్రౌన్ కాలీజా’ గతి ఏమైందో, 1855లో బ్రౌన్ స్వదేశానికి వెళ్లేదాకా వుండిందో లేదో ఆ పెరుమాళ్లకే ఎరుక! బ్రౌన్ దొర బంగళా, తోట ప్రాంతాన్ని కడప కోర్టువారు వేలం వేయగా కడపలో పేరు మోసిన చార్టర్డ్ అకౌంటెంట్ సి.ఆర్.కృష్ణస్వామి రెండు వేల రూపాయలకు కొన్నారు. అప్పటికే శిథిలమై ఉండిన ఆ బంగళా కాలక్రమంలో మరింత శిథిలం కాగా, 1987లో సి.ఆర్.కృష్ణస్వామి సుపుత్రులు సి.కె.సంపత్‌కుమార్, కడప కలెక్టర్ జంధ్యాల హరినారాయణ నేతృత్వంలో, జానమద్ది హనుమచ్ఛాస్త్రి సారథ్యంలో ఏర్పడిన సి.పి.బ్రౌన్ మెమోరియల్ ట్రస్టుకు ధారాదత్తం చేశారు. హరినారాయణ గ్రామీణ క్రాంతి పథకం కింద మూడున్నర లక్షల మ్యాచింగ్ నిధి విడుదల చేసి, 1987 జనవరి 22వ తేదీన సి.పి.బ్రౌన్ స్మారక భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయగా సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు సభాధ్యక్షులుగా ఆశీర్వదించారు. ‘ఇంటికొక పువ్వయితే, దేవుడికో దండం’ అని పెద్దల మాట. మధ్యప్రదేశ్ బస్తర్‌లోని ఓ తెలుగుబిడ్డ డి.వి.ప్రసాద్ లాంటి సామాన్యుడు 10 రూపాయలు పంపగా, ఎంతోమంది వదాన్యులు వేలాది రూపాయలు సంతోషంగా గుమ్మరించారు. కడప కలెక్టర్లు పలు తడవలుగా నిధులు ఇచ్చారు. 1995 నవంబర్ 29న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. గ్రంథాలయమేమో ప్రారంభమయింది. మరి పుస్తకాలో? పోతేపల్లి వెంకన్న శ్రేష్ఠి 2500, బిరుదురాజు రామరాజు 2800, కోడూరి పుల్లారెడ్డి, ఇంకా ఎందరో మహానుభావులు ఎంతో విలువైన తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, కన్నడ పుస్తకాల్ని కానుకగా ఇచ్చారు. 1998 నవంబర్ 14, 15 తేదీల్లో బ్రౌన్ ద్విశత జయంతి మహోత్సవం జరిగింది. సి.నారాయణరెడ్డి ఆ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2003లో రాజ్యసభ సభ్యుడిగా పది లక్షలు మంజూరు చేశారు. గ్రంథాలయ సమితి వారు రెండవ అంతస్థు భవనానికి సినారె పరిశోధన కేంద్రం అని నామకరణం చేసి ఆయన ఔదార్యానికి కృతజ్ఞతలు ప్రకటించుకొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి 2005 జనవరి 27న గ్రంథాలయాన్ని సందర్శించి, నిర్వహణకు 15 లక్షల గ్రాంటు మంజూరు చేయడమే కాకుండా, దాన్ని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అప్పగించేలా ఆజ్ఞ జారీ చేశారు. అదే సంవత్సరం అక్టోబర్ 1 నుంచి గ్రంథాలయం పరిశోధనా కేంద్రంగా రూపొందింది. 2006 నవంబర్ 1 నుంచి యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థగా మారింది. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలోని గ్రంథాలయంలో మెకంజీ కైఫియత్తుల 42 సంపుటాల జిరాక్స్ ప్రతులు, బ్రౌన్ లేఖల 17 సంపుటాల నకళ్లు ఉన్నాయి. 66 వేలకు పైగా వివిధ భాషల పుస్తకాలు ఉన్నాయి. మూడువేల పత్రికల ప్రత్యేక సంచికలు, తెలుగు ఎంఫిల్, పీహెచ్డీ సిద్ధాంత గ్రంథాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఈ కేంద్రం తరఫున మెకంజీ కడప జిల్లా కైఫియత్తుల 7 సంపుటాల్ని, బ్రౌన్పై రెండు వ్యాస సంకలనాల్ని, నన్నెచోడుడు, నాచన సోమన, అన్నమాచార్యులు, అల్లసాని పెద్దన మొదలైన రాయలసీమ ప్రాచీన కవులపై వ్యాససంకలనాల్ని ప్రచురించారు. నెలనెలా సాహిత్య ప్రసంగాల్ని ఏర్పాటు చేసి, వాటిని కాలక్రమంలో ముద్రిస్తూవున్నారు. మూల మల్లికార్జునరెడ్డి సారథ్యంలో రజత జయంతి సందర్భంలో కడపజిల్లా సర్వస్వం, రజత జయంతి ప్రత్యేక సంచిక, తాళ్లపాక తిమ్మక్క వ్యాససంకలనం వగైరా విడుదల కానున్నాయి. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం పరిశోధకుల పాలిట కల్పవృక్షమై వర్ధిల్లుగాక! - ఘట్టమరాజు 9964082076 -
రాష్ట్రేతర తెలుగు సలహా మండలి ఏర్పాటుచేయాలి
బెంగళూరు: సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ఎంతోమంది తెలుగువారు స్థిరపడి జీవిస్తున్నారని బెంగళూరు సీపీబ్రౌన్ సేవాసమితి అధ్యక్షులు ఇడమకంటి లక్ష్మిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడి 67 ఏళ్లు దాటిన సందర్భంగా సీపీబ్రౌన్ సమితి వారు నిర్వహించిన కార్యక్రమంలో ఆ సమితి అధ్యక్షులు లక్ష్మిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాలతో పాటు ఢిల్లీ , ఛతీస్ఘడ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో కూడా తెలుగు వారు గణనీయంగా వున్నారన్నారు. కాలక్రమేనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపార రీత్యా వలస వెళ్లిన వారు, నిర్మాణ రంగంతో పాటు విద్యా -వైద్య రంగాలలో కూడా తెలుగువారు తమ ముద్రను వేసుకున్నారన్నారు. వీరంతా అక్కడ తమ తెలుగువారి సంస్కృతీ సాంప్రదాయాలతో బాటు భాషా సంప్రదాయాలను కాపాడుకొంటూ వస్తున్నారన్నారు. మిత్ర రాష్ట్రాలలో ఉన్నతెలుగువారి బాగోగులను, భాషా సంప్రదాయాలను కాపాడవలసిన భాద్యత తెలుగు ప్రభుత్వాల మీద వుందని ఆయన అన్నారు. తెలుగు వారంటే తమ యేలుబడిలో వున్న ప్రజలే కాదని, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల చిరునామాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, దేశాలకు కూడా వలస వెళ్లిన తెలుగు వారి క్షేమాన్ని కూడా చూడవలసిన కనీస కనీస భాద్యత తెలుగు ప్రభుత్వాల మీద ఉందని అక్ష్మిరెడ్డి పేర్కొన్నారు. అంతేగాక ‘ఒక్కో రాష్ట్రంలో వుండే సమస్యలు పరిస్థితులు ఒక్కో రకంగా ఉంటాయి. వాటన్నిటి పరిష్కారం ఒకే రకంగా ఉండవు. వాటిని ప్రత్యేకంగా అధ్యయనం చేసి పరిష్కారాలు కనిపెట్టాలి. అలాగే వీటన్నిటి పరిష్కారానికి తెలుగు ప్రభుత్వాలు ప్రత్యేకంగా రాష్ట్రేతర సలహా మండలిని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాలి. ప్రతి రాష్ట్రం నుంచి ఒకరు ఇద్దరు చొప్పున సభ్యులను ఈ సలహా మండలిలోకి తీసుకోవాలి భాషా పరమైన సమస్యలున్నా ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నా. ఆయా ప్రభుత్వాలతో చర్చించి మన తెలుగువారికి మేలు కలిగేలా చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు కర్ణాటకలో తెలుగు బడుల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు పదవీవిరమణ పొందితే ఖాళీ అయిన ఉద్యోగానికి ఆ ప్రభుత్వం తిరిగి ఎవరిని నియమించటం లేదు. కారణం మన తెలుగు వారిలోనే సఖ్యత లేకపోవడం. కర్ణాటకలోని అల్పసంఖ్యాకుల మాధ్యమాలలో ఒక్క తెలుగుకే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి ఏ ఇతర భాషలైన తమిళం, మలయాళం, మరాఠి భాషలకు ఈ ఇబ్బదులు లేవు ఆయా భాషల పెద్దలు సంఘటితంగా వుండి వారి వారి భాషలకు అండగా నిలుస్తున్నారు. వారికి వారి వారి రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం ఇస్తున్నాయి’ అని అయన అన్నారు. ‘‘కర్ణాటక ప్రభుత్వాలతో మాట్లాడి వారి పిల్లలకు ఇబ్బందులు లేకుండా చేసుకుంటున్నారు. తెలుగువారికి ప్రస్తుతం ఉన్న పరిస్థితి త్రిశంకు స్వర్గంలా ఉంది. తెలుగు రాష్ట్రం రెండుగా అయ్యాక. ఇతర రాష్ట్రాల సమస్యలను ఏ ప్రభుత్వానికి చెప్పుకోవాలి, ఎవరి వద్దకు వెళ్లాలని అనేది పెద్ద సమస్యగా మారింది’ ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పథకాలు దేశంలోనే చాల గొప్ప పథకాలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మఒడి, జగనన్న విద్యా కానుక వంటి పథకాలను ఇతర రాష్ట్రాలలో తెలుగు మాధ్యమాలలో చదువుకుంటున్న ప్రవాస తెలుగు వారి పిల్లలకు కూడా వర్తించేలా చూడాలన్నారు. అంతేగాక తెలుగు వారి పండుగలైన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం ఇంకా ఎందరో తెలుగు తేజాల అధికారిక ప్రకటిత పండుగలు జరుపుకోడానికి ఆర్ధిక సహాయాన్ని కూడా చేయవలసిన అవసరం ఎంతైనా తెలుగు ప్రభుత్వాలపైన ఉందన్నారు. కాబట్టి సగటు రాష్ట్రేతర తెలుగు వారి సమస్యలను ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అటు తెలంగాణ ప్రభుత్వం కానీ రాష్ట్రేతరులకు అనుకూలంగా సత్వరమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞపి చేశారు. -
తాతాచార్ల కథలు
తాళపత్రాల్లో అగ్గిపురుగులకు ఆహుతౌతున్న తెలుగు సాహిత్యాన్ని పరిష్కరించి, పునరుద్ధరించిన మహనీయుడు సి.పి.బ్రౌన్. ఆయన వెలుగులోకి తెచ్చిన పుస్తకాల్లో ‘తాతాచార్ల కథలు’ ఒకటి.తాతాచార్యులు తెలుగు బ్రాహ్మణుడు, ‘50 ఏళ్ల’ వయసు కలవాడు, పొడగరి, దృఢకాయుడు, హాస్యప్రియుడు, సంస్కృతం బాగా చదువుకున్నవాడు. వైద్య గ్రంథాలు, జ్యోతిష గ్రంథాలు ఈయన వద్దనే బ్రౌన్ చదువుకున్నట్లు తెలుస్తోంది. ఈయనను నెల్లూరు వాసిగా బ్రౌన్ స్వయంగా తన పరిచయ వాక్యాల్లో రాశాడు. ఈయన చెప్పిన కథలు తాతాచార్ల కథలు. వీటికి వినోద కథలని పేరు. తాతాచారి చెప్పిన కథలను విన్న బ్రౌన్ 1855లో ఇండియా వదిలి లండన్‌కు వెళ్లేముందు ప్రచురించాడు. అదే సంవత్సరం వీటి ఆంగ్లానువాదం ‘పాపులర్ తెలుగు టేల్స్’ పేరుతో ప్రచురితమైంది. 1916లో వావిళ్ల వారు తాతాచారి కథలను ‘ఎడిటెడ్ బై గురజాడ అప్పారావు, ద ఆథర్ ఆఫ్ కన్యాశుల్కం’ అని అట్టపై వేసి పునర్ముద్రించారు. ఇవే 1926లో ఒకసారి, 1951లో మరోసారి పునర్ముద్రణ పొందాయి. ‘సి.పి.బ్రౌన్ సంతరించిన తాతాచార్ల కథలు’ పేరుతో 1974లో బంగోరె సంపాదకుడిగా చతుర్థ ముద్రణ వచ్చింది. ‘గుడిని మసీదుగా మార్చిన రాయీజీ’ కథలో రాయీజీ ఒక నవాబు దగ్గర దివానుగా పనిచేస్తూ విశ్వాసపాత్రుడిగా మెలుగుతూ ఒక పేటలో గుడిని నిర్మాణం చేస్తూవుంటాడు. ఆ విషయం నవాబుకు తెలియడంతో గుడి నిర్మాణం పూర్తయ్యేసరికి దాన్ని మసీదుగా రూపుదిద్దుకునేలా చేసి నవాబు మన్ననలు పొందుతాడు. ‘దుగ్గిశెట్టి కొడుకులు’ కథలో నెల్లూరులోని వెంకటగిరి కోటపైకి పిండారి దళం(ఊర్లు దోచుకుని జీవించేవారు) దండెత్తి రాకుండా కోట చుట్టూ వున్న మట్టిగోడలు బలంగా ఏర్పాటుచేసినట్లు ఉంది. ఆనాడు జరిగిన సంఘటననే చారిత్రక నేపథ్యంలో కథగా వివరించాడు. ఈ పిండారి దళం తరువాత గుంటూరు, మచిలీపట్నం, కడప జిల్లాల్లో దండెత్తి నష్టపరిచినట్లు తెలుస్తోంది. ‘నవాబు రూపాయిలు– రాణి ముద్రలు’ కథలో కుంఫిణీ ప్రభుత్వం పాత నాణేలను మాయం చేసి కొత్త నాణేలను ప్రవేశపెట్టిన ప్రస్తావన ఉంది. 1780–90 ప్రాంతాల్లో కుంఫిణీ వారు ‘అర్కాటు రూపాయిలు’ ముద్రించినట్లు తెలుస్తోంది. ఈ కథల ద్వారా రెండు శతాబ్దాల కాలం నాటి నవాబు పరిపాలన, సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులతోపాటు కులవృత్తులు, వ్యవసాయం లో రైతుల శిస్తుభారం వంటి చారిత్రకాంశాలెన్నో తెలుస్తాయి. బిల్మక్తా (= ఒక పనిని నిర్ణయించుకున్న కాంట్రాక్టు మొత్తం), ఇద్దుము (= రెండు తూములు; ధాన్యం కొలత), ముంగోరు (=పంటను ఆసామి రెండు భాగాలూ, సాగుచేసిన రైతు ఒక భాగమూ పంచుకొనే పద్ధతి) వంటి ఆనాడు వ్యవహారంలో ఉన్న మాండలిక పదాలెన్నో ఈ కథల్లో ఉన్నాయి. డాక్టర్ చింతకుంట శివారెడ్డి -
మాండలికంతో ప్రజలకు చేరువైన కథ
కడప కల్చరల్: కథల్లో మాండలికం చేరినప్పటి నుంచి అది ప్రజలకు దగ్గరవుతోందని కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత, ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుభాష మిత్రమండలి, కేంద్ర సాహిత్య అకాడమి బెంగుళూరు శాఖ సహకారంతో శనివారం స్థానిక సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో సాహితీ సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆచార్య రాచపాలెం మాట్లాడుతూ 'సీమ' కథకుల్లో నేడు ప్రజల భాష చోటుచేసుకుంది గనుకనే ప్రజలకు దగ్గరవుతోందన్నారు. మునుపటి కంటే ప్రాచుర్యం పొందుతోందని తెలిపారు. మాండలికాల వల్లే ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. నేటి రచయితలు ఎక్కువగా ప్రాంతీయకతకు ప్రాధాన్యత ఇస్తుండడం శుభ పరిణామమమన్నారు. చిత్తూరు జిల్లా కథానిక–భాష అంశంపై మాట్లాడిన ఆచార్య రాజేశ్వరమ్మ తమ జిల్లాలోని కథల్లో ఎక్కువగా జాతీయాలు, పద బంధాలు, నుడికారాలు, సామెతలు ఉంటాయని సోదాహరణంగా వివరించారు. అనంతపురం జిల్లాకు సంబంధించి ప్రముఖ కథా రచయిత బండి నారాయణస్వామి మాట్లాడుతూ నేటితరం రచయితల్లో మాండలిక ప్రయోగం పుష్కలంగా ఉందని ఆయన వివరించారు. కర్నూలుజిల్లాకు సంబంధించి డాక్టర్ ఎం.హరికిషన్ మాట్లాడుతూ తమ జిల్లాలోని రచయితలు మాండలికాన్ని తక్కువగా ఉపయోగిస్తారని, శిష్ట వ్యవహారికమే ఎక్కువగా వాడతారని తెలిపారు. వైఎస్సార్ జిల్లాకు సంబంధించి డాక్టర్ జీవీ సాయిప్రసాద్ మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లోని రచయితలు వాడే భాషతో వారి కథలు విశేష ప్రాచుర్యం పొందుతున్నాయన్నారు. సరిహద్దుల్లో మాండలికం బలంగా కనిపిస్తోందని, పాత్రోచితంగా దాన్ని వాడడంతోనే కథలు మంచి పేరు పొందుతున్నాయన్నారు. సదస్సు సంచాలకులు డాక్టర్ అణుగూరి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 'సీమ' భాష, పరిణామం, ప్రస్తుత పరిస్థితులను వివరించారు. భాషాభివృద్ధికి సాహిత్య అకాడమి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పలువురు సాహితీ వేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. -
తెలుగుకు పూర్వ వైభవం కోసమే ‘పాఠశాల’
– డాక్టర్ ఎన్.ఈశ్వర్ రెడ్డి కడప కల్చరల్: తెలుగుభాషకు పూర్వ వైభవం కల్పించేందుకు ప్రత్యేకించి ‘తెలుగు పాఠశాల’ కార్యక్రమాల ద్వారా తన వంతుగా ప్రయత్నిస్తున్నామని సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం బాధ్యులు డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఆదివారం బ్రౌన్ గ్రంథాలయంలో బాలల కోసం నిర్వహిస్తున్న తెలుగు పాఠశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. నానాటికి తెలుగుభాష, సంస్కృతి తీసికట్టు అవుతున్న విధం తెలుగు వారందరినీ బాధిస్తోందని, తెలుగుభాషాభిమానిగా బ్రౌన్ గ్రంథాలయ బాధ్యునిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీనికి చిన్నారుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. భాషాభిమానుల సహకారం ఉంటే దీన్ని మరింత శోభతో ముందుకు తీసుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులు నీలవేణి పురాణాలు, ఇతిహాసాల నుంచి నీతి కథలను సోదాహరణంగా చిన్నారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపాలకృష్ణశాస్త్రి, డాక్టర్ శివారెడ్డి, బ్రౌన్ గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బ్రౌన్ సేవలను భావితరాలకు తెలియజెప్పాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు భాషకు సీపీ బ్రౌన్ అందించిన సేవలను యువతకు, భావితరాలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. సీపీ బ్రౌన్కు ప్రాచుర్యం కల్పించడం ద్వారా ఆంగ్ల భాషా వ్యామోహంలో కొట్టుకుపోతున్న వారికి కనువిప్పు కలిగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. లండన్‌లోని కెన్సల్ గ్రీన్ సిమెట్రీలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరించిన సీపీ బ్రౌన్ సమాధిని కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్తో కలసి జస్టిస్ చలమేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంగ్ల భాషను అవసరం మేరకు నేర్చుకోవాలని, మాతృభాషను మాత్రం విస్మరించకూడదని సూచించారు. బ్రౌన్ సమాధికి ప్రాచుర్యం కల్పించే ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైన ఆర్థిక వనరులను తాను సమకూరుస్తానని జస్టిస్ చలమేశ్వర్ హామీ ఇచ్చారు. -
ఏఈఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సీపీ బ్రౌన్ జయంతి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రసాద్‌నగర్‌లోని డాక్టర్ బీవీ నాథ్ అండ్ టి. ఆర్. రావ్ మెమోరియల్ ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ సీనియర్ సెకండరీ స్కూలు(ఏఈఎస్)లో సోమవారం సీపీ బ్రౌన్ 216 జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ, హైదరాబాద్‌కు చెందిన లావణ్య సాంస్కృతికసంస్థ సంయుక్తంగా నిర్వహించాయి. రాజమండ్రికి చెందిన సన్నిధానం నరసింహ శర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం లావణ్య సాంస్కతిక సంస్థ అందించే సి.పి. బ్రౌన్ పురస్కారాన్ని తెలుగు భాష,సంస్కృతులకు విశేష సేవలందించిన సన్నిధానం నరసింహశర్మకు అందజేశారు. ఢిల్లీలో ఈ పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందని ఆయన చెప్పారు. తెలుగులోని వివిధ సాహిత్య ప్రక్రియలను విద్యార్థులకు వివరించారు. తెలుగుభాష తీయదనాన్ని తెలిపారు. తెలుగుభాషకు బ్రౌన్ అందించిన సేవలను వివరించారు. లావణ్య సాంస్కతిక సంస్థ కార్యదర్శి కామేశ్వర రావు మాట్లాడుతూ తెలుగు పద్య ప్రక్రియ సౌందర్యాన్ని వివరించారు. తెలుగు భాషకు సీపీ భ్రౌన్ చేసిన సేవలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ధనలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ ఉమాపతినాయుడు, ఆంధ్ర విద్యాసంఘానికి చెందిన ఐటీఓ జనక్‌పురి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఏఈఎస్ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
బ్రౌన్ శాస్త్రి!
నివాళి డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (20.10.1925-28.02.2014) ఇవాళ ఒక లెజెండ్ మాత్రమే కాదు సెలబ్రిటీ కూడా. ఈ రెండు నిర్వచనాలకు ఆయన తగిన వారనడంలో కొంచెమైనా అతిశయోక్తి లేదు. వేమనను సీపీ బ్రౌన్ వెలుగులోకి తెస్తే, సీపీ బ్రౌన్‌ను జానమద్ది వెలుగులోకి తెచ్చారు. కడపలోని తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగిగా వచ్చిన బ్రౌన్ తెలుగు సాహిత్యానికి సేవ చేసి తెలుగు సూర్యుడిగా ప్రసిద్ధుడైతే బ్రౌన్‌ను వెలుగులోకి తెచ్చిన జానమద్ది సాహితీ సూర్యుడిగా ప్రసిద్ధి చెందాడు. సీపీ బ్రౌన్ జీవితం, కృషి ఆయనకు కొట్టిన పిండి. బ్రౌన్కు సంబంధించినంత వరకు ఆయన అధికార ప్రతినిధి అంటే అబద్ధం కాదు. అందుకే ఆచార్య సి.నారాయణరెడ్డి జానమద్దిని బ్రౌన్ శాస్త్రి అని కీర్తించారు. సీపీ బ్రౌన్ కడపలో నివసించిన స్థలాన్ని బ్రౌన్ కాలేజీ అంటారు. అది శిథిలావస్థలో ఉండగా గుర్తించిన జానమద్ది బంగోరే, ఆరుద్రల స్నేహంతో ఆ స్థలంలో సీపీ బ్రౌన్ స్మారక ట్రస్టీని ప్రారంభించారు. 1986లో దానికి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి క్రమంగా దానిని సీపీ బ్రౌన్ స్మారక గ్రంథాలయంగా, ఆ పైన సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంగా ఎదిగించడంలో జానమద్ది కృషి అసమానమైనది. ఇవాళ సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో 75 వేల గ్రంథాలు, 250 తాళపత్ర గ్రంథాలు, విలువైన మెకంజీ కైఫీయత్తులు, బ్రౌన్ రచనలు, బ్రౌన్ లేఖలు ఉన్నాయి. అయితే ఇదంత సులువుగా జరగలేదు. మొండి గోడలున్న స్థానంలో మూడంతస్తుల మహా సౌధాన్ని నిర్మించి రాష్ట్ర స్థాయిలో దానికి గుర్తింపు తేవడానికి జానమద్ది పడిన శ్రమ అంతా ఇంతా కాదు. పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులను కలుసుకుని నిధులను సేకరించారు. రెండు రూపాయల నుండి ఎవరు ఎంత ఇచ్చినా స్వీకరించారు. ఇటుక ఇటుక పేర్చి మూండతస్తులు నిర్మింపజేశారు. దానిని శాశ్వతంగా తన అధీనంలో ఉంచుకుందామనే స్వార్థానికి లోను కాకుండా 2005లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి, ఆ తర్వాత యోగి వేమన విశ్వవిద్యాలయానికి అప్పగించారు. అంతేకాదు సీపీ బ్రౌన్ ద్విశత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ప్రత్యేక సంచికను తీసుకొచ్చారు. అనంతపురంజిల్లా రాయదుర్గంలో సామాన్య కుటుంబంలో జన్మించిన జానమద్ది పొట్ట చేతపట్టుకుని ఉద్యోగ రీత్యా కడపజిల్లాకు వచ్చి ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అయితే ఆయన కేవలం ఉద్యోగిగా మిగిలిపోయి ఉంటే ఆయన్ను గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. ఆయన ఉద్యోగాన్ని జీవితానుసారంగా మాత్రమే చేసుకుని జీవితాన్ని సమాజానికి అంకితం చేశారు. తనకు మంచి జీవితాన్ని ఇచ్చిన సమాజానికి తాను ఏం చేయగలనోనని తలచుకుని తన చేతనైనంత రూపంలో ఈ సమాజం రుణం తీర్చుకున్నారు. డాక్టర్ జానమద్ది జీవితంలో మూడు తరాలుగా వికసించింది. ఒకటి రచనా జీవితం, రెండు జిల్లా రచయితల సంఘం, మూడు సీపీ బ్రౌన్ గ్రంథాలయం. జానమద్ది రచయిత. ప్రధానంగా జీవిత చరిత్రకారుడు. దేశ విదేశాల్లో గొప్ప వ్యక్తుల జీవితాలను ఆయన వందల కొలది వ్యాసాలతో, నేటి తరానికి పరిచయం చేశారు. ‘ఎందరో మహానుభావులు’, ‘భారత మహిళ’, ‘సుప్రసిద్దుల జీవిత విశేషాలు’, ‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య’, ‘బళ్లారి రాఘవ’, ‘శంకరంబాడి సుందరాచారి’ వంటి గ్రంథాలు ఆయన జీవిత చరిత్ర రచనా సామర్థ్యానికి సంకేతాలు. ‘కన్నడ కస్తూరి’, ‘మా సీమ కవులు’ వంటి గ్రంథాలు ఆయన సాహిత్యాభిరుచికి నిదర్శనాలు. కడపజిల్లా రచయితల సంఘాన్ని 1973లో స్థాపించి దాని కార్యదర్శిగా 20 ఏళ్లు పనిచేశారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ రచయితలను కడపజిల్లాకు పరిచయం చేసిన ఘనత ఆయనదే. రెండు మూడు రోజులపాటు జరిగే మహాసభలను ఎనిమిదింటిని నిర్వహించారు. ప్రతి మహాసభకు ప్రత్యేక సంచికను తీసుకు వచ్చారు. బెజవాడ గోపాల్‌రెడ్డి, అరుద్ర, దాశరథి, కుందుర్తి, పురిపండ అప్పలస్వామి, శ్రీశ్రీ, సినారె, ఎమ్మెస్ రెడ్డి, దేవులపల్లి రామానుజరావు, దివాకర్ల వెంకట అవధాని వంటి రచయితలను, విద్వాంసులను రప్పించి అద్భుతమైన సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. అనేక సంస్థలు, లోక నాయక ఫౌండేషన్ వంటివి ఆయనకు పురస్కారాలను అందించి తమను తాము గౌరవించుకున్నాయి. ఆయన పేరు మీదనే జానమద్ది సాహితీపీఠం మూడేళ్ల క్రితం మొదలై కళారంగంలో కృషి చేసిన వారిని ప్రోత్సహిస్తోంది. మలినం లేని హృదయం, మల్లెపువ్వు వంటి, తెలుగుతనం ఉట్టిపడే వేషం, అందమైన వాక్కు, మృదువైన కంఠం, మందస్మిత వదనారవిందం చూపరులను ఆకర్షించే జానమద్ది మూర్తి. వయోభేదం లేకుండా కులమతాలతో సంబంధం లేకుండా ఎవరితోనైనా స్నేహం చేయగల సహృదయతకు ప్రతీక జానమద్ది. నైరాశ్యం ఎరుగని ఉత్సాహం, పారుష్యం ఎరుగని సంభాషణం ఆయన జీవిత లక్షణాలు. ఒకసారి మాట్లాడితే మళ్లీ మాట్లాడాలనిపించే వ్యక్తిత్వం ఆయనది. సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఆయన శ్వాస, ఆయన ధ్యాస. తాను మరణిస్తే తన పార్థివదేహాన్ని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ప్రజల కోసం కొన్ని గంటలు ఉంచాలని ఉబలాటపడిన డాక్టర్ జానమద్ది స్వార్థ రాహిత్యానికి మారుపేరు. అందుకే 2014 ఫిబ్రవరి 28 ఉదయం 6.00 గంటలకు తుది శ్వాస విడిచిన ఆయన పార్థివ దేహాన్ని 8.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల మధ్య సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో అభిమానులు, ప్రజల సందర్శనార్థం పెట్టారు. ‘ఎందరో మహానీయులు’ గ్రంథాన్ని రచించిన జానమద్ది హనుమచ్ఛాస్త్రి రాయదుర్గం నుండి బ్రౌన్ దుర్గం దాక పయనించిన మహానీయుడు. - రాచపాళెం చంద్రశేఖర రెడ్డి తొంభై ఏళ్ల జీవితంలో అరవై ఏళ్లు సమాజానికి అంకితం చేసిన డాక్టర్ జానమద్ది జీవితం అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారులతో నిండిపోయిన నేటి సమాజాన్ని సంస్కరించాలనుకునే వాళ్లకు నిస్సందేహంగా దీపధారి.